రేవంత్ రెడ్డి రూటు మార్చకుంటే కష్టమేనా?
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అంశం ఏదైనా మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయా అన్నట్లుగా అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాలో పోల్ వ్యవహారం, ఎమ్మెల్యేల రహస్య మీటింగ్, సీఎంకు తెలియకుండానే కులగణన వివరాలను మీడియాకు లీకవ్వడం, మధ్య మధ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతల వ్యాఖ్యలు.. ఇలా.. రేవంత్ ప్రభుత్వంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి క్యాబినెట్ లోని సీనియర్ మంత్రులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకొనిపోతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా సీనియర్ మంత్రులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయినా.. ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనంతటికీ రేవంత్ రెడ్డి అతి మంచితనమే కారణమన్న వాదన పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. కొందరు మంత్రులకు అతి మర్యాద ఇస్తుండటంతో దాన్ని వారు అలుసుగా తీసుకొని ప్రభుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారన్న వాదనను కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు వినిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మేలుచేసేలా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. అయితే, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ క్యాడర్ విఫలమవుతోంది. రైతు రుణమాఫీకి సరైన ప్రచారం కల్పించకపోవటంతో ప్రభుత్వంపై విపక్ష పార్టీల నేతలకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాల అమలుపైనా.. ఎవరికి లబ్ధిచేకూరుతుందనే విషయాలపైన స్పష్టంగా గ్రామస్థాయిలో ప్రజలకు వివరించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్న వాదన ఉంది. దీనికి తోడు ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని.. కొందరు మంత్రులు రేవంత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌కు ఇటీవల వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారం రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత నుంచి ఫాంహౌస్ కే పరిమితం అయిన కేసీఆర్ ఒక్కసారిగా అదే ఫామ్ హౌస్ నుంచి సమర గర్జన చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే.. రేవంత్ సర్కార్ కు ఇక దబిడిదిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తరువాత పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావటం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాలమూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే తన ఫాంహౌస్ లో పది మంది ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందులను ఒకరికొకరు చెప్పుకున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు తమను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం నుంచి తమకు సరియైన సహకారం అందడం లేదనీ ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ రహస్య విందు భేటీ వెనుక కేసీఆర్ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విటర్ ఖాతాలో పెట్టిన పోల్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫామ్‌హౌస్ పాలన కావాలా.. ప్రజల వద్దకు పాలన కావాలా..? అంటూ పోల్ పెట్టగా.. ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ అధిక శాతం మంది ఓటు వేశారు. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది అనే చర్చకు దారితీసింది.
కులగణన వివరాల విషయంలో కొందరు మంత్రులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. మరో వైపు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పథకాల విషయంలో అనవసరపు వ్యాఖ్యలు చేస్తుండటం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగ్గారెడ్డి కావాలనే రేవంత్ పేరు మర్చిపోయారా అన్న అనుమానాలను కొందరు కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్నవిషయమే అయినా, సీఎం రేవంత్ పట్ల కాంగ్రెస్ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, తద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్రభుత్వాన్ని సీరియస్ గా నడిపించాలంటే రేవంత్ రెడ్డి రూటు మార్చాలన్న వాదనను కొందరు కాంగ్రెస్ నేతలు గట్టిగా వినిపిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహారలో లైన్ దాటిని వారిపై కొరడాఝుళిపించాలన్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది.