ఏపీలో ఫలితాల వెల్లడిలో జాప్యం తప్పదా? పోస్టల్ బ్యాలెట్లే కారణమా?
posted on May 29, 2024 @ 2:48PM
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్ల కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగాభారీగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ తెలుగుదేశం కూటమి నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన ఈసీ, ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది. ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని వైసీపీ అంటోంది. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తోంది. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని చెబుతోంది.
సాధారణంగా ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, కంట్రోల్ యూనిట్ లెక్కింపునకు 30 నిమిషాల సమయం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను వేర్వేరుగా లెక్కించినా ఫలితాలు లెక్కింపు వేగంగా చేపట్టడం అంత సులువు కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఈవీఎంలు ఒక్కో రౌండు లెక్కించడానికి సగటున 25 నిమషాల సమయం పట్టవచ్చు. ఒక్కో నియోజకవర్గం ఈవీఎంల లెక్కింపునకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజన విరామం ఒక గంట సమయం తీసివేస్తే సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కంట్రోల్ యూనిట్ల లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు మరో రెండు నుంచి మూడు గంటలు సమయం పడితే రాత్రి 11 గంటలకు కూడా లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు లేవు. కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉండడంతో వాటిలో చివరి రౌండు ముగిసే వరకు ఫలితం తేలని పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది.