జగన్ ‘పులి’ వెందుల గట్టెక్కేనా?

సరిగ్గా వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలిపోతుంది. వైసీపీ మరో సారి అధికారపగ్గాలు అందుకుంటుందా? లేక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న ఉత్కంఠకు వచ్చే నెల 4న తెరపడుతుంది. ఈ లోగా ఎవరి అంచాలు వారివి. ఎవరి గెలుపు ధీమా వారిది. అయితే పరిశీలకులు, సెఫాలజిస్టులు మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అన్నదానిపై ఎవరి అంచనాలు వారు వెల్లడించారు. 

వాటన్నిటిలోనూ పులివెందుల నియోజకవర్గం విషయంలో సెఫాలజిస్టుల అంచనాలు అందరిలోనూ తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి. పులివెందుల అంటే జగన్ అడ్డా. ఆయన సొంత నియోజకవర్గం. అటువంటి పులివెందులలో జగన్ కు ఈ సారి అంత వీజీగా విజయం లభించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన పులివెందుల గట్టెక్కినా నామమాత్రం మెజారిటీయే వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సారి పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ భారీగా జరిగింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిథిలోకి వచ్చే ఈ నియోజకవర్గంపై షర్మిల ప్రచారం ప్రభావం తీవ్రంగా పడిందని అంటున్నారు. ఆ కారణంగా వైసీపీ ఓట్లలో భారీ చీలిక వచ్చిందనీ, దీంతో తెలుగుదేశం లబ్ధి పొందిందనీ విశ్లేషణలు చేస్తున్నారు. పులివెందుల నుంచి ఇంత వరకూ జగన్ భారీ మెజారిటీలతో గెలిచారు. రాష్ట్రంలోనే జగన్ మెజారిటీ టాప్ గా ఉండేది. అయితే ఈ సారి మాత్రం ఆ పరిస్థితి లేదంటున్నారు.

విజయం సాధిస్తే మెజారిటీ చాలా స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. అంటే జగన్ పులివెందుల నుంచి గట్టెక్కినా అత్తెసరు మార్కులతోనే అని చెబుతున్నారు. మరో వైపు ఈ సారి పులివెందుల కోటను బద్దలు కొట్టేశామని తెలుగుదేశం వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. పోలింగ్ రోజు సాయంత్రమే పులివెందుల పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసేసుకున్నాయి. ఈ నేపథ్యంలో  పులివెందుల ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. 

Teluguone gnews banner