పవన్ విజయం ఖాయం.. ఆస్తి మొత్తం బెట్టింగ్ ఎవరైనా రెడీయా.. ఎస్వీఎస్సెన్ వర్మ
posted on May 29, 2024 @ 5:57PM
ఆంధ్ర ప్రదేశ్ లో హాట్ సీట్లలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటలో ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ సారి మాత్రం విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గ ఫలితంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది.
అదే సమయంలో పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా జగన్ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆయన సలహా సూచనల మేరకు పవన్ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజే లక్ష్యంగా ముంద్రగడ పద్మనాభం వంటి నేతలు తమ శక్తికి మించి పని చేశారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాత తెలుగుదేశం నాయకుడు, ఆ పార్టీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఎస్వీఎస్సెన్ వర్మ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్ గా బరిలోకి దిగడానికి సైతం సిద్ధ పడ్డారు. అదే సమయంలో ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు వైసీపీ శతథా ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఎస్వీఎస్సెన్ వర్మను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడిన తరువాత అంతా సర్దుకుంది. చంద్రబాబుతో భేటీ అయిన తరువాత నుంచి పవన్ కల్యాణ్ విజయం కోసం ఎస్వీఎస్సెన్ వర్మ శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ప్రచార భారాన్నంతా భుజాన వేసుకుని మోశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే స్వయంగా అంగీకరించారు. మే 13న పోలింగ్ పూర్తయిన తరువాత పవన్ ప్రత్యేకంగా ఎస్వీఎస్సెన్ వర్మకు కృతజ్ణతలు తెలిపారు.
పోలింగ్ పూర్తయిన తరువాత పిఠాపురంలో పవన్ విజయంపై కాకుండా మెజారిటీపై పందేలు సాగుతున్నాయంటే.. ఆక్కడ ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఇట్టే అర్ధమైపోతుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తాజాగా పిఠాపురంలో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశలు పుష్కలంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై పందెం కాయడానికి ఎస్వీఎస్సెన్ వర్మ ముందుకు వచ్చారు. పిఠాపురంలో పవన్ విజయంపై తన ఆస్తి మొత్తాన్ని పందెం ఒడ్డుతానని పందె కాయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని సవాల్ చేశారు. ఆ సవాలే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ విజయంపై వర్మకు ఉన్న నమ్మకాన్ని చూపుతోంది. ఆ సవాలే పవన్ విజయం తథ్యమని చాటుతోంది.