వల్లభనేని వంశీ అరెస్టు.. స్వయంకృతమేనంటున్న వైసీపీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం టికెట్ పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి..  ఆ తరువాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీ.. పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు.  తెలుగుదేశం నాయకులు, క్యాడర్ లక్ష్యంగా దాడులు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాల్లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందే వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పవచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలూ చేశారు. అవేమీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయనను ఛీ కొట్టారు.  సరే ఆ ఎన్నికలలో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయి..కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది.  పార్టీ ఓటమి పాలైన క్షణం నుంచీ వంశీ దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో నక్కినక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైనా కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించి, అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయలేదు కానీ, ఆయన పిటిషన్ విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇలా ఉండగా ఇక్కడే వల్లభనేని వంశీ తన కుట్రలకు తెరతీశారు.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారును కిడ్నాప్ చేసి, బెదరించి కేసు ఉపసంహరణకు అఫడివిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడే రివర్స్ అయ్యే సరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్లు.. అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన కిడ్నాప్, బెదరింపు కేసులో అరెస్టయ్యారు. దీంతో ఇప్పుడిక ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.  ఇక ఇప్పుడు వైసీపీ నుంచీ వల్లభనేని వంశీకి ఎటువంటి మద్దతూ లభించడం లేదని పరిశీలకులు అంటున్నారు. కిడ్నాప్ చేసి బెదరించి గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు, వైసీపీ కార్యాలయ డీటీపీ ఆపరేటర్ చేత కేసు వెనక్కు తీసుకునేలా చేయడం ద్వారా వంశీ గీత దాటేశారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.  

పిల్ల సజ్జలకు ముందస్తు బెయిలు దక్కేనా?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారించనుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన సజ్జల భార్గవ్ రెడ్డి  ఇష్టారీతిగా చెలరేగి పోయారు. సోషల్ మీడియా బాధ్యతలు చేతికి వచ్చీ రావడంతోనే  సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా వ్యవహరించారు.   తెలుగుదేశం పార్టీ,   ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. సరే వైసీపీ ఘోర పరాజయంలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా గణనీయంగానే ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ పరాజయం తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని కేసుల నుంచి తప్పించేందుకు ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చేయగలిగినంతా చేశారు. పార్టీ ఓటమి పాలు కాగానే చడీ చప్పుడూ లేకుండా ఆయనను సోషల్ మీడియా పదవి నుంచి తప్పించి.. రాష్ట్రం దాటించేశారు. ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా చేశారు.  ఎన్ని చేసినా చేసిన పాపం వదలదుగా. సజ్జల భార్గవ్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందుస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. సజ్జల భార్గవ్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పై హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 13) విచారించనుంది. దీంతో ఇప్పుడు సజ్జలకు కోర్టు మందస్తు బెయిలు ఇస్తుందా? ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. పిల్ల సజ్జలకు బెయిలా? జెయిలా అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఇటీవల కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పిల్ల సజ్జలకు యాంటిసిపేటరీ బెయిలు అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్.. క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా

ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది.  ఇంగ్లాండ్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న చివరి మూడో వన్డేలో టీమ్ ఇండియా బ్యాటర్ శుభమన్ గిల్ సెంచరీ కొట్టాడు. 13 ఫోర్లు 2 సిక్సర్లతో 95 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు. వన్డేల్లో గిల్ కు ఇది ఏడో సెంచరీ. చివరకు 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  112 పరుగులు చేసిన శుబమన్ గిల్  రషీద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. టాస్ గెలిచి ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు మంచి ఆరంభం ఏమీ దక్కలేదు. రెండో వన్డేలో అద్భుత సెంచరీతో రాణించిన స్కిప్పర్ రోహిత్ శర్మ ఈ సారి మాత్రం తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన రోహిత్ శర్మ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ సాధికారికంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెలెత్తించారు. ఒక వైపు శుభమన్ గిల్, మరో వైపు కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలో  55 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాధికారికంగా ఆడిన కోహ్లీని చూస్తే ఈ వన్డేలో కోహ్లీ తన ఖాతాలో సెంచరీ వేసుకోవడం ఖాయమనిపించింది. అయితే ఒక అద్భుత బంతికి కోహ్లీ ఔటయ్యాడు. ఆ తరువాత కోహ్లీ స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆరంభం నుంచే ఫోర్లతో విరుచుకుపడి తన ఉద్దేశాన్ని చాటాడు. శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో  8 ఫోర్లు, 2 సిక్సర్లతో  రషీద్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా  వేగంగా పరుగులు చేసే క్రమంలో 9 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తరువాత 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రూట్ బౌలింగ్ లో బేంటన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  తరువాత 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మహమూద్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత పది బంతుల్లో ఇక ఫోర్ ఇక సిక్స్ తో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరి వికెట్ గా కులదీప్ ఔటయ్యాడు. దీంతో టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో  356 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో 357 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ లక్ష్య సాధన దిశగా సాగలేదు. ఇంగ్లండ్   34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. అర్షదీప్ సింగ్ 2, హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.  

వల్లభనేని వంశీ అరెస్టు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నిందితుడైన వల్లభనేని వంశీని ఆ కేసులో కాకుండా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు తనను కులం పేరుతో దూషించి, కార్యాలయంపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఆ తరువాత ఈ కేసుకూ తనకూ ఎటువంటి సంబంధం లేదనీ చెప్పారు. సత్యవర్ధన్ తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో అఫడవిట్ కూడా దాఖలు చేయడంతో ఈ కేసు వీగిపోయినట్లేనని అంతా భావించారు. అయితే పోలీసులు సత్యవర్ధన్ ను విచారించి..వల్లభనేని వంశీ ఆయనను కిడ్నాప్ చేసి బెదరించినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. వల్లభనేని వంశీని గన్నవరం పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గన్నవరం పోలీసు స్టేషన్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిలు పిటిషన్ పై ఈ నెల 20న తీర్పు వెలువడనుంది. అయితే ఇప్పుడు వంశీని ఆ కేసులో కాకుండా కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు.  

కోడి కత్తి.. కొంపకి నిప్పు.. కాదేదీ సానుభూతికి అనర్హం

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచుకునేందుకు ఎంత‌కైనా తెగిస్తార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. జగన్ గ‌తంలో త‌న‌పై తానే దాడులు చేయించుకొని  అధికారంలోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో సొంత బాబాయ్ హ‌త్య‌ను టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు, ఆ పార్టీ నేత‌ల‌పై నెట్టేసిన జ‌గ‌న్.. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో విజ‌య‌వంతం అయ్యారు. అదే క్ర‌మంలో కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని అమాంతం పెంచేసుకొని ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించాడు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్‌ అస‌లు రూపాన్ని ప్ర‌జ‌లు క‌ళ్లారా చూశారు. బాబాయ్ హ‌త్య‌కేసు, కోడిక‌త్తి డ్రామా అన్నీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయ‌ని ఏపీ ప్ర‌జ‌లు తెలుసుకొని కంగుతిన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ గులక రాయి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పెంచుకోవాల‌ని జ‌గ‌న్‌ చూశారు. కానీ, అప్ప‌టికే జ‌గ‌న్ నిజ‌స్వ‌రూపాన్ని చూసిన  ప్ర‌జ‌లు ఓటు ద్వారా ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌కుండా ఓడించారు. ఓడిపోయిన త‌రువాత‌కూడా జ‌గ‌న్ తీరులో మార్పు రావ‌డం లేదు. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లో సానుభూతికోసం స‌రికొత్త‌ డ్రామాల‌కు తెర‌లేపాడు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ప్యాలెస్ ను దాదాపు వ‌దిలి పెట్టేశారు. ఏదో చుట్టపు చూపుగా రావడం తప్ప ఎక్కువగా   బెంగ‌ళూరులోని ప్యాలెస్ లోనే ఉంటున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్ మీద ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పదేపదే దాడి చేస్తున్నట్లుగా వైసీపీ నేత‌లు  ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అంతకు ముందు జరిగిన చిన్నచిన్న సంఘటనల గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇటీవల జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరగడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పారు. ఈ ఘ‌ట‌న ఈ నెల 5వ తేదీన జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ను వైసీపీ సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేసుకున్నారు. జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు కూట‌మి పార్టీల్లోని నేత‌లు ప‌దేప‌దే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తారనే భ‌యంతో ఆయ‌న్ను ఇబ్బంది ప‌ట్టేందుకు కూట‌మి నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద‌ భద్రతను పెంచింది.  జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఆయ‌న‌ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడగ్గా.. అటు వైపు నుంచి సరైన సమాధానం రాలేదు. జగన్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకునే వ్యక్తులు.. ఇంటి బయట పెట్టినవి డమ్మీ సీసీటీవీ కెమెరాలనీ.. వాటి విజువల్స్ లేవనీ సమాధానం ఇస్తున్నారట. జగన్ ఎనిమిది నెలల ముందు వరకు ముఖ్యమంత్రి. ఆయన ఇంటి ముందు ఇలా డమ్మీ కెమెరాలు పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, జ‌గ‌న్ ప్యాలెస్ సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీల‌ను ఇచ్చేందుకు వెనుకాడుతుండ‌టంతో జ‌గ‌న్ ఇంటి ప‌రిస‌రాల్లో అగ్ని ప్రమా దం విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్ర‌జ‌ల్లో సానుభూతి కోస‌మే అగ్ని ప్రమాదం డ్రామా నడిపారని.. ఇది ఐప్యాక్ స్క్రిప్టే అని.. లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి   ఇబ్బంది ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.  త‌న‌పై తానే దాడి చేయించుకొని ప్ర‌జ‌ల నుంచి సానుభూతి పొంద‌డంలో జ‌గ‌న్ దిట్ట‌. అయిన జగన్ గ‌తంలో అనేక సార్లు ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసి విజ‌యం సాధించారు కూడా. ఇప్పుడు ప్రజలలో సానుభూతి కోసం మళ్లీ అదే విధానాన్ని జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.  గ‌త ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను అనేక ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు. దీంతో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో ఇప్పట్లో ఆయన ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వైసీపీ నేతలే ఈ విషయాన్ని జగన్ కు తేల్చి చెప్పేశారు.  ఇప్పుడు ప్రజలలోకి వెఢితే పరాభవం తప్పదన్న విషయాన్ని జగన్ కూడా గ్రహించారు.  అందుకే తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. కానీ ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం కొనసాగితే.. ఉనికి మాత్రంగా కూడా వైసీపీ మిగిలే అవకాశం లేదన్న భావనతో   జ‌గ‌న్ స‌రి కొత్త డ్రామాకు తెర‌ లేపారు. తాడేప‌ల్లిలోని త‌న ఇంటి ప‌రిస‌రాల్లో, అవ‌స‌ర‌మైతే త‌న ఇంటిపై దాడులు చేయించుకోని ఆ నెపాన్ని కూట‌మి నేత‌ల‌పైకి నెట్టాల‌ని, తద్వారా ప్రజలలో సానుభూతి సంపాదించుకోవాలన్నదే ఆ కొత్త డ్రామాగా పరిశీలకులు విశ్లేషి స్తున్నారు. జ‌గ‌న్‌, వైసీపీ నేతల క్రూర‌మైన ఆలోచ‌న‌ల గురించి తెలిసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం వ‌ద్ద సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయించారు. మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పా టు చేయించ‌డంతోపాటు. అక్కడ పోలీసు భ‌ద్ర‌త‌ను పెంచారు. మ‌రోవైపు జ‌గ‌న్ నివాసం వ‌ద్ద అగ్నిప్ర‌మాదం కేసును సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. మంటలు చెలరేగిన ప్రాంతంలో మట్టి, బూడిద నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపారు. మొత్తానికి జ‌గ‌న్ నివాసంపై కూట‌మి నేత‌లు దాడుల‌కు దిగుతున్నారంటూ వైసీపీ నేత‌ల అస‌త్య‌ప్ర‌చారంతో ఆడుతున్న‌ డ్రామాలకు పోలీసులు చెక్ పెట్టారు. సానుభూతి కోసం జగన్ అడిన డ్రామా నిగ్గు తేల్చేందుకు రెడీ అవుతున్నారు. 

కాకతీయ కళాఖండాలను కాపాడుకోవాలి

నాగర్ కర్నూల్ కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీపురం రంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలోని కాకతీయ కళాఖండాలు అలనా పాలనా లేక నిరాదరణకు గురౌతున్నయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఇఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం స్థానిక రంగనాథ ఆలయ ప్రాంగణంలోని  చెట్టు కింద ఆలనా  పాలనా లేక పడి ఉన్న కీ.శ 13వ శతాబ్దానికి చెందిన నాలుగు స్తంభాలు, వజ్ర డిజైన్లున్న దూలాలను పరిశీలించారు. 800 సంవత్సరాల నాటి ఈ అపురూప శిల్పకళాఖండాలు పీటలపై నిలబెట్టి భద్రపర్చు కోవాలని ఆయన ఆలయ అధికారులకు, ధర్మకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, బడే సాయి కిరణ్ రెడ్డి, తెలుగు ఎల్లయ్య లు పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

 సమ్మక్క సారలమ్మ మినీ జాతర షురూ

 తెలంగాణలోని ములుగు జిల్లాలో  ప్రతీ  రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. మండమెలిగె పండుగతో ఈ జాతర ప్రారంభమైంది. ఈ మినీ జాతరకు తెలంగాణా ప్రభుత్వం 5 కోట్ల 30 లక్షలు ఖర్చుచేయనుంది.  రేపు మండమెలిగే పూజలు, ఎల్లుండి భక్తులకు మొక్కులు చెల్లింపు, చివరి రోజైన శనివారం మినీ  జాతర ముగుస్తుంది. ఈ మినీ జాతరకు తెలుగురాష్ట్రాలతో బాటు చత్తీస్ ఘడ్ ,  మహారాష్ట్ర , ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం ఆర్టీసీ  200 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మినీ జాతర ముగిసిన మరుసటి రోజు వనదేవతల దర్శనం ఆదివారం ఉండటంతో ఈ సారి భక్తులు ఎక్కుద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

మహాకుంభ్ పై పూల వర్షం..

మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 45 కోట్ల మందికి పైగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. బుధవారం (ఫిబ్రవరి 12) మాఘ పౌర్ణిమ  కావడంతో భక్తులు అంచనాలకు మించి పోటెత్తారు. దీంతో ప్రయాగ్ రాజ్ ను  నో వెహికిల్ జోన్ గా ప్రకటించిన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురు కాకుండా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచే పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే  త్రివేణి సంగమంలో   లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించడం మొదలైంది. మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభమేళాలో  పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై అధికారులు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.   

పవన్ ఆలయాల సందర్శన షురూ!.. వెంట తనయుడు అకీరా కూడా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌  తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కరళ, తమిళనాడులలోని పలు ఆలయాలను సందర్శించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 12) కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్‌ , టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు. అనంతరం  తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని పవన్‌ సందర్శించారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో  ఆయన అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణ కోసమంటూ పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో  ఆలయాల సందర్శన వెనుక భారీ వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ ఎజెండాను అందిపుచ్చుకుని సనాతన ధర్మ పరిరక్షణ,  హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించేందుకే ఈ పర్యటన చేపట్టారని అంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం ... పడిపోయిన బ్రాయిలర్ ధరలు 

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో పౌల్ట్రి పరిశ్రమ కుదేలైంది. వేలాది కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా పాతి పెట్టాలని వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంది. కృష్ణాజిల్లా నుంచి తెలంగాణలో కోళ్లు రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నట్టు సమాచారం. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు అయిన రామాపురం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో తనిఖీలు చేసి కోళ్లను తీసుకొచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. బర్డ్ ప్లూ కారణంగా బ్రాయిలర్ కోళ్ల ధరలు అమాంతం పడిపోయాయి. 

మహిళలంటే అంత చులకనా.. చిరుపై నెటిజన్ల ఫైర్

ఓ సినీ ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి  యధాలాపంగా చేసిన సరదా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాధారణంగా చిరంజీవి వివాదాలుకు దూరంగా ఉంటారు. ఆయన ప్రసంగాలు కూడా ఆచి తూచినట్లు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా పద్ధతిగా మాట్లాడతారు. అటువంటి చిరంజీవి బ్రహ్మా ఆనందం సినీమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో  చేసిన కొన్ని వ్యాఖ్యలపై మహిళా సంఘాల నుంచి తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అవుతోంది. మెగా లెగసీ కంటిన్యూ అవ్వడానికి తన కుమారుడు రామ్ చరణ్ ఒక మగపిల్లవాడికి తండ్రి  అయితే బాగుంటుంది అని చిరంజీవి అన్నారు.  ఈ ఫంక్షన్ లో  ఆయన తన మనవరాళ్లందరితో తన ఇళ్లు ఒక లేడీస్ హాస్టల్ లా, తాను ఆ హాస్టల్ వార్డెన్ గా మారిపోయామని వ్యాఖ్యానించారు.  ఒక చరణ్ కైనా మగపిల్లవాడు పుడతాడనుకుంటే ఆడపిల్లే పుట్టిందని, దీంతో  ఈసారైనా రామ్ చరణ్ తనకి ఒక మనవడిని ఇస్తాడని ఆశిస్తున్నానన్నారు.  మెగా వారసత్వాన్ని కొనసాగించాలని ఉందన్నారు. అక్కడితో ఆగకుండా చరణ్ కు మళ్లీ అమ్మాయే పుడుతుందేమోనన్న భయం వేస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. నెటిజనులు ఓ రేంజ్ లో చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా చిరు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  చిరంజీవికి మహిళలంటే అంత చులకనా అని నిలదీస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మెగాస్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మెగాస్టార్   మహిళలాలను చాలా తక్కువ చేసి మాట్లాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాటల ద్వారా సమజాజంలో ఆడపిల్లలు వద్దు అన్న సందేశాన్ని ఇచ్చారా అని  ప్రశ్నిస్తున్నారు.

లావణ్య  మస్తాన్ సాయి వివాదంలో కొత్త ట్విస్ట్ ...డిఐ శ్రీనివాస్ పై వేటు

డ్రగ్  పెడలర్ లావణ్య సినీ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదం కొనసాగుతుండ గానే మరో డ్రగ్ పెడలర్ మస్తాన్ సాయి ఎంటరయ్యారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య అప్పగించింది. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తో లావణ్య మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో లావణ్య శ్రీనివాస్ తో మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలడంతో శ్రీనివాస్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.చాలాకాలంగా వీరువురు ఫోన్ లో తరచూ మాట్లాడేవారు. లావణ్య కేసుకు సంబంధించిన సమాచారం శ్రీనివాస్ అందించే వాడని తెలుస్తోంది.  శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఏ కేసు విషయంలో వీరిరువురు మాట్లాడినట్టు  అనేది తెలియరాలేదు. 

వైసీపీ నుంచి పోయిన వాళ్లు పోగా.. ఉన్నవాళ్లని జగన్ తరిమేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆ పార్టీలోని సీనియర్లను తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలే  గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. దీంతో వైసీపీ నేతలు, క్యాడర్ లో నైతిక స్థైర్యం బాగా దెబ్బతింది. అధికారంలో ఉన్నంత కాలం నోటికొచ్చిన బూతులతో ప్రత్యర్థులపై రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు నోరు తెరవాలంటేనే భయపడుతున్న పరిస్థితి. వైసీపీ కోలుకుని రాజకీయంగా చురుకుగా మారడం కష్టమని భావించిన ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే తమ దారి తాము చూసుకున్నారు. కూటమి పార్టీలలో సర్దుకున్నారు. మరి కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మిగిలిన వారిని జగన్ స్వయంగా పార్టీ నుంచి తరిమేసే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారా? అంటూ అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతున్నాయి.  సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికలలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్న తరువాత.. పొరపాటు ఎక్కడ జరిగింది, ప్రజా విశ్వాసాన్ని ఎందుకు కోల్పోయాం. తిరిగి ప్రజల నమ్మకాన్ని పొందడం ఎలా అని ఆలోచిస్తుంది.  ఘోర ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుంటుంది. పార్టీని మళ్లీ గాడి లోకి పెట్టడానికి ఏం చేయాలన్నదానిపై సమాలోచనలు చేస్తుంది. కానీ వైసీపీలో ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమంటూ కొన్ని రోజులు, తెలుగుదేశం అధినేత ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగానే ఓటమి పాలయ్యామంటూ కొన్ని రోజులు గడిపేసింది. ఎంత సేపూ తాము బ్రహ్మాండమైన పాలన అందించాం. సంక్షేమాన్ని దండిగా ఇచ్చాం.. అని చెప్పుకోవడమే కాకుండా క్రమం తప్పకుండా బటన్ నొక్కి సొమ్ము పందేరం చేసినా దానిని తీసుకుని కూడా జనం తమకు ఓట్లేయలేదని నెపాన్ని ప్రజల మీదకు నెట్టేయడంతోనే వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతలూ ఈ ఎనిమిది నెలలూ గడిపేశారు. దీంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని పలువురు నేతలు జగన్ కు బైబై చెప్పేశారు. అలా వెళ్లిపోవడం అన్నది పార్టీలో అత్యంత కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడు అయిన విజయసాయి వరకూ సాగింది. దీంతో ఇక పార్టీలో మిగిలిన వారిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభిస్తారని అంతా భావించారు. అంటే పార్టీ పదవులలో మిగిలి ఉన్న సీనియర్లను నియమించి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తారని అంతా భావించారు. అయితే జగన్ తీరు మాత్రం పార్టీలో ఇంకా మిగిలి ఉన్న సీనియర్లను తరిమేసేలా ఉందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రోజాను పార్టీ నుంచి తరిమేయడానికి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  గతంలో మాజీ మంత్రి బాలినేని విషయంలో కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆయనంతట ఆయనే పార్టీ వదిలి వెళ్లిపోయేలా చేసిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సరే విషయానికి వస్తే.. నగరి నియోజకవర్గ ఇన్ చార్జిగా రోజాను కాకుండా.. ఇప్పుడు కొత్తగా వైసీపీలో చేరడానికి సిద్ధమైన నాయకుడిని నియమించాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన రోజాపై భారీ మెజారిటీతో గెలుపోందారు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమ రెండవ కుమారుడు   గాలి జగదీశ్ వైసీపీ గూటికి చేరనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆయన బుధవారం వైసీపీ కండువా కప్పుకుంటారు. ఆయననను పార్టీలో చేర్చుకుని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రోజాకు పార్టీ నుంచి బయటకు వెళ్లమని మర్యాదగా చెప్పినట్లేనని అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో గాలి జగదీశ్ ను వైసీపీలో చేర్చుకోవడంపై రోజా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అబ్యంతరాన్ని ఆమె నేరుగా జగన్ కే తెలియజేశారని అంటున్నారు. దీంతో గాలి జగదీశ్ వైసీపీ చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  మొత్తం మీద జగన్ వ్యవహార శైలి పార్టీలోని సీనియర్లకు కాళ్ల కింద కుంపటి పెడుతున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాజకీయాలకు చిరంజీవి మాత్రమే దూరం.. ఆయనకు రాజకీయాలు కాదు!

చిరంజీవి ఇటీవలి కాలంలో ఏం మాట్లాడినా అది రాజకీయ చర్చకు దారి తీస్తున్నది. తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనకు దూరం కాలేదు. ఆయన ఏం మాట్లాడినా, ఎవరిని కలిసినా అది రాజకీయ రంగు పులుముకుంటోంది.  ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి అన్న మాటలు, జై జనసేన అంటూ చేసిన నినాదం రాజకీయ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాను జనసేనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారని పరిశీలకులు విశ్లేషించారు.   ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి చేరువ అవుతున్నారనీ, ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అది కొంచం సద్దుమణిగే సరికి లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన జనసేనకు అనుకూలంగా మాట్లాడిన మాటలు మరోసారి చిరంజీవి రాజకీయాలలో యాక్టివ్ కానున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి తన రాజకీయాలపై మనసులో మాట చెప్పారు. బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు పూర్తిగా దూరం అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ తన తమ్ముడు, జనసేన అధినేత పవర్ కల్యాణ్ సాధిస్తారని చెప్పారు. తాను పూర్తిగా సినిమాలకు పరిమితం అని చెప్పేశారు. అలా చెబుతూనే తాన ఆకాంక్షలు, ఆశయాలు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారనడం ద్వారా తన అభిమానులకు మాససికంగా తాను జనసేనవైపు ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇక రాజకీయంగా తాను సాధించాలనుకున్నవన్నీ పవన్ సాధిస్తారు అనడం వెనుక ఉద్దేశమేమిటన్న చర్చ మొదలైంది.  దీంతో చిరంజీవి స్వయంగా తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించినా, రాజకీయం మాత్రం ఆయన చుట్టూనే తిరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో చిరంజీవి గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమేషన్లలో భాగంగా చెప్పిన ఓ డైలాగ్ ‘నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీతో సంబంధం లేకుండా ఆయన చుట్టూ రాజకీయాలు ప్రదక్షణం చుస్తున్నాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడి కన్నుమూత

ఆయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న ఆయన  ఆదివారం లక్నోలోని ఎసీపీజీటీలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ బుధవారం (ఫిబ్రవరి 12) తుదిశ్వాస విడిచారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత   సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహ రించారు.  సత్యేంద్ర దాస్ 34 సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమిలో ప్రధాన పూజారిగా పనిచే స్తున్నారు. ఆయన 1945 మే 20న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 ఏళ్లు. సత్యేంద్ర దాస్ తన గురువు అభిరామ్ దాస్ జీ ప్రభావంతో   1958లో  అంటే 13 ఏళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించారు. అప్పటి నుంచీ ఆయన తన ఇంటిని వదిలి ఆశ్రమంలో నివసించారు. సత్యేంద్రదాస్ మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్రం విచారణ.. లోక్ సభలో ఎంపీ సీఎం రమేష్!

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం పది రెట్లు పెద్దదని బీజేపీ సీనియర్  నాయకుడు, అనకాపల్లి పార్లమెంట్  సభ్యుడు సీఎం రమేష్ లోక్ సభ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేద్ లో మద్యం కుంభకోణం అంశాన్ని ఆయన మంగళవారం (ఫిబ్రవరి 11)  లోక్‌సభలో జీరో అవర్‌లో లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నగదు లావాదే వీలతోనే సాగిన మద్యం అమ్మకాలలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని సీఎం రమేష్ ఆరోపించారు. అసలు మద్యం విక్రయాలన్నీ నగదుతోనే జరిగాయనీ,  ఏదీ డిజిటల్‌ ఫార్మాట్‌లో లేదని సీఎం రమేష్ లోక్ సభలో చెప్పారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో మద్యం విధానాన్ని మార్చారనీ, అప్పటి వరకూ ప్రైవేటు షాపుల ద్వారా జరిగే మద్యం విక్రయాలను జగన్ తన హయాంలో ప్రభుత్వ దుకాణాలకు మార్చేశారనీ వివరించారు. అయితే పని చేసే ఉద్యోగులు మాత్రం  కాంట్రాక్టు కార్మికులని చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదన్నారు.   ఈ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులను ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేసింది. అవసరమైతే సీబీఐ, ఈడీలకు ఈ కేసు అప్పగిస్తామనీ చెప్పింది. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ ఆంధ్ర ప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తి స్థాయి విచారణ జరపాలని లోక్ సభ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.   ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు సిట్ వేసిన సంగతి తెలిసిందే.  క్రితం విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్  ఏర్పాటైన సిట్ లోఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఏపీ సర్కార్ చేర్చింది.  ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై కేంద్రం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని లోక్ సభ సాక్షిగా డిమాండ్ చేయడంతో జాతీయ స్థాయిలో ఏపీ మద్యం కుంభకోణం హైలైట్ అయ్యింది. 

జగన్ బొమ్మ పీకేశారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మ మాయం కానుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో తన ఫొటోల పిచ్చితో ఇష్టారీతిగా ఎక్కడపడితే అక్కడ తన ఫొటోలను ముద్రించుకున్న జగన్.. ఏకంగా సర్వేరాళ్లపైనా, రైతుల ఆస్తికి సంబంధించిన అధికార పత్రమైన పట్టాదారు పాసు పుస్తకాలపైనా కూడా తన బొమ్మలు వేయించుకున్నారు.  ఎన్నికల ప్రచార సమయంలోనే చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించి, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ బొమ్మలను లేపేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంది. రైతుల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటోను తీసేసి రాజముద్ర ఉన్న కొత్త పాసు పుస్తకాలను ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.  జగన్ హయాంలో భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్త పాసు పుస్తకాలను ఇవ్వనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.  అలాగే వచ్చే నెలాఖరు నాటికి సర్వేరాళ్లపై ఉన్న జగన్ బొమ్మల తొలగింపు కూడా పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.  జగన్ అధికారంలో ఉండగా ఆయనకు ఫొటోల పిచ్చి పీక్స్ లో ఉండేది. ఆయన ఫొటోల పిచ్చిపై నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని ఓ సినిమాలో డైలాగ్ ను ప్రస్తావిస్తూ జగన్ కు పిచ్చి పరాకాష్టకు చేరిందంటూ అప్పట్లో సెటైర్లు కూడా వేసేవారు.   ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జగన్ బొమ్మ ఉండి తీరాల్సిందేనన్నట్లుగా ఆయన హయాంలో పరిస్ధితి ఉండేది. చిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ జగన్ మొహమే కనిపించేది. తన బొమ్మ కనిపించకపోతే జనం తనను మరిచిపోతారేమోనని జగన్ భయపడుతున్నారా అన్నట్లుగా అన్ని చోట్లా ఆయన ఫొటోయే కనిపించేలా ఆయన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఎక్కడ చూసినా తన బొమ్మ మాత్రమే కనపడాలన్నట్లుగా ఆయన పాలన సాగింది.  రాష్ట్ర ప్రభుత్వ సమష్టి బాధ్యతను సాంతం   తన ఖాతాలో వేసి తనను శాశ్వత ఆరాధ్యుడిగా చేసుకునేందుకు జగన్ తహతహలాడారు. అందు కోసం అధికారులను అష్టకష్టాలూ పెట్టారు. జనాలకు ఇష్టం ఉన్నా లేకున్నా తన మొహం చూడకుండా రోజు గడవని ఖర్మ తీసుకొచ్చి పెట్టారు.  ఇందు కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పాసు పుస్తకాలపైనా, సర్వే రాళ్లపైనా జగన్ ఫొటోలను తీసి ఆవల పారేసి రైతులకు ఊరట కలిగిస్తోంది.