మళ్లీ హస్తినకు రేవంత్!
posted on Feb 15, 2025 8:50AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన హడావుడిగా హస్తిన పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ ప్రదేశ్ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.
సుదీర్ఘ కాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఇప్పటికే పలుమార్లు హస్తిన వెళ్లి రేవంత్ అధిష్ఠానంతో చర్చించిన సంగతి తెలిసిందే. ప్రతి సారీ రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లడం, ఆశావహులు ఇహనో ఇప్పుడో కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ ఖాయమని భావించడం ఆ తరువాత అంతా మామూలే అన్నట్లు మారడం జరుగుతూనే వస్తున్నది. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా రేవంత్ తరచూ ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్దలతో భేటీ అవుతూనే ఉన్నారు.
ఇప్పుడు తాజాగా రేవంత్ పర్యటన మాత్రం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మార్పు నేపథ్యంలో ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ, కేబినెట్ విస్తరణలతో పాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ కూర్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.