కర్నూలు హైకోర్టు బెంచ్ వద్దంటూ పిటిషన్.. ఎవరిపనో తెలుసా?
posted on Feb 14, 2025 6:43AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కుళ్లు రాజకీయాలు అంతం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి పొడగిట్టదన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలే లేకుండా చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా అడుగడుగునా అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోంది.
అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన వైసీపీ కర్నూలును న్యాయరాజధాని చేస్తామంటూ హడావుడి చేసింది. కానీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. అమరావతి నిర్మాణం పూర్తయితే తెలుగుదేశంకు ఆ క్రెడిట్ దక్కేస్తుందన్న దుగ్ధతోనే అలా వ్యవహరించిందనడంలో సందేహం లేదు.
సరే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాలను ఒక్కటొక్కటిగా సరిదిద్దుతూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతోంది. రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ దిశగా చకచకా అడుగులు వేస్తోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి అందుబాటులో ఉన్న భవనాల వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇప్పటికే అందజేసింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ మరో నాలుగైదు నెలలలో సాకారం అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలకు వైసీపీ తెరతీసింది. అమరాతి ఏపీ ఏకైక రాజధాని అని హైకోర్టు ధర్మాసనం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అధికారం లేదంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కర్నాలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో కోరారు. తాండవ యోగేష్, తురాగా సాయిసూర్య అనే ఇద్లరు న్యాయవాదులు వేసిన ఆ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీయే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రం మొత్తం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును స్వాగతిస్తున్నది. రాయలసీమ వాసులు తమ చిరకాల ఆకాంక్ష సాకారమౌతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో ఆ ప్రక్రియను నిలిపివేయాలంటూ పిటిసన్ దాఖలు కావడంతో సర్వత్రా వైసీపీ కుళ్లు రాజకీయాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తమ హయాంలో న్యాయరాజధానిగా కర్నూలు అంటూ ఊదరగొట్టి ఆ దిశగా ఒక్క అడుగుకూడా వేయని వైసీపీ, ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే తెలుగుదేశం సర్కార్ కు క్రెడిట్ దక్కుతుందనీ, రాయల సీమలో తమ ప్రతిష్ట దిగజారిపోతుందన్న భయంతోనే ఆ ప్రక్రయిను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. తమకు దక్కని క్రెడిట్ తెలుగుదేశంకు దక్కడానికి వీల్లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ద్వారా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా వేస్తున్న అడుగులకు బ్రేక్ వేయాలన్నదే వైసీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది.