చికెన్ ప్రియులకు వైద్యుల హెచ్చరిక!
posted on Feb 13, 2025 @ 12:49PM
తెలుగు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి వేగం ప్రజలను వణికించేస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అందులోనూ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రాతి తీవ్రంగా ఉంది. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్లు, పక్షులకే కాకుండా మనుషులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ నేపథ్యంలో వైద్యులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక హెచ్చరిక చేశారు. బర్డ్ ఫ్లూ ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ చికెన్ కు దూరంగా ఉండాలన్నదే ఆ హెచ్చరిక సారాంశం. బర్డ్ ఫ్లూ కోళ్లకే కాదు, మననుషులకూ ప్రమాదకారేనని పేర్కొన్నారు. అలాగే బర్డ్ ఫ్లూ అనేది కేవలం ఫారం కోళ్లకే పరిమితం అన్నది అపప్రద మాత్రమేననీ, ఇది నాటుకోళ్లకూ సోకుందని పేర్కొన్నారు. కనుక కొంత కాలం పాటు చికెన్, గుడ్లకు దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించారు.
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను తాకడం, చంపడం, బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసం తినడం ద్వారా ఈ వైరస్ మనుషులకూ సోకే ప్రమాదం ఉంది. బర్డ్ ఫ్లూ సోకిన మనుషులలో కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన 3-5 రోజులలో లక్షణాలు బయటపడతాయి. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.