బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్ గుడ్ బై?
posted on Feb 14, 2025 @ 2:10PM
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన ఏకంగా పార్టీ అధిష్టాపంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిల్చిన బిజెపిలో తిరుగు బాటు జెండా ఎగరడం చర్చనీయాంశమైంది. రాజాసింగ్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బిజెపి జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను, తాజాగా గురువారం నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియామకం చేసింది. ఈ నలుగురి పేర్లలో తాను సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కేంద్రబిందువయ్యింది. గోల్కొడ బిజెపి అధ్యక్షుడు ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడాన్ని రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో ఉమా మహేశ్ సహకరించలేదు. ఇది రాజాసింగ్ ఆరోపణ. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్ముక్కయినట్లు రాజాసింగ్ అంటున్నారు. తాను సూచించిన పేరు కాకుండా ఉమా మహేశ్ పేరు పదిరోజుల క్రితమే పార్టీ అధిష్టనానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్ లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడుగా ఉమా మహేశ్ పేరును అధిష్టానం మరో మారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు. నా అవసరం లేదంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కారస్వరం వినిపించారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాజాసింగ్ 2009లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి కార్పోరేటర్ గా ఆయన మంగళ్ హాట్ డివిజన్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఆయన బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. హిందుత్వ వాదాన్ని బలపరిచే పార్టీలతో బాటు వివిధ సంస్థల ద్వారా తన వాదాన్ని బలంగా వినిపించేవారు ఆయన. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పదవ్యాఖ్యలతో బిజెపి ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్లు ఆయన సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిజెపి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం జరిగింది. చివరిక్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బిజెపి ఎత్తేసింది.మూడోసారి బిజెపి టిక్కెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. బిజెపి నుంచి మూడోసారి గెలిచి హట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ బిజెపి ఆయనకు పెద్ద పీట వేయలేదు. హైద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయలనుకున్న రాజాసింగ్ కు ఆదిలోనే హంసపాదుపడింది. రాజాసింగ్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని కొందరు వ్యతిరేకించారు. అప్పటివరకు బిజెపి సభ్యత్వం కూడా లేని మాధవిలత పేరును అధిష్టానం ప్రకటించింది. పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ ధిక్కారస్వరం వినిపించారు. మాధవిలత ఎన్నికల ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు.
హిందుత్వ వాదిగా ముద్ర ఉన్న రాజా సింగ్ హైద్రాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ప్రతీ బహిరంగ సభలో ముస్లింలను దూషించడంతో ఆయనకు వివాదాలు చుట్టుముట్టాయి. ఫేస్ బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ముస్లిం తీవ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆయనకు అనేక సార్లు అరెస్ట్ వారెంట్లు పట్టుకుని హైద్రాబాద్ వచ్చేవారు. అక్కడి కోర్టుల్లో రాజాసింగ్ విచారణ ఎదుర్కొనేవారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు స్వంత పార్టీలో పరాభవం చెందడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
రాజాసింగ్ మాతృసంస్థ టిడిపిలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.