మోహన్ బాబుకు సుప్రీంలో భారీ ఊరట
posted on Feb 13, 2025 @ 1:35PM
నటుడు మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయన సుప్రీం కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. తెలుగు సినీ పరిశ్రమతో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న మోహన్ బాబు ఈ ఐదు దశాబ్దాలలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఒక దశలో వరుస హిట్ చిత్రాలతో అలరించిన మోహన్ బాబును పరిశ్రమ కలెక్షన్ కింగ్ గా పేర్కొంది. విలక్షణమైన డైలాగ్ డెలివరీతో మోహన్ బాబు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పెద్దాయన నందమూరి తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో డైలాగ్ చెప్పగల నటుడు మోహన్ బాబు మాత్రమే అని దర్శకరత్న దాసరి నారాయణరావు అంతటి వ్యక్తి చెప్పాడంటే మోహన్ బాబు స్టామినాని అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇటీవలి కాలంలో ఆయన తరచూ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. సొంత కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్ శివారులోని జల్లేపల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఆయన రెండో కుమారుడు మనోజ్ తో గొడవపడ్డారు. ఆ సమయంలో కవరేజ్ కి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించారు.ఆ సందర్భంగా మోహన్ బాబు ఒక జర్నలిస్టుపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ గురువారం (ఫిబ్రవరి 13) ఉత్తర్వులు జారీ చేసింది.