జగన్ పార్టీ ముద్దు.. జగనే వద్దు!
posted on Feb 13, 2025 @ 3:27PM
ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పిన శైలజానాథ్, ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీ పగ్గాలు జగన్ చేతిలో కాదు విజయమ్మ చేతిలో ఉండాలని అన్నారు.
తాను వైఎస్సార్ కు వీరాభిమానినని చెప్పుకున్న ఆయన.. జగన్ భావాలు, ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందునే తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరానన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పగ్గాలను జగన్ నుంచి విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి కేవలం ఆరు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయన జగన్ నాయకత్వంపై అపనమ్మకాన్ని, అయిష్టతను వ్యక్తం చేసి విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనడం వైసీపీలో సంచలనం సృష్టించింది. జగన్ సీటు కింద శైలజానాథ్ బాంబు పెట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.
పార్టీ పగ్గాలు విజయమ్మకు అప్పగిస్తే పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరతారన్న సంకేతాలను శైలజానాథ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. వైఎస్సార్ కు రాష్ట్రంలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారనీ, వారంతా కూడా ఆయన కుటుంబంలో ఆస్తుల తగాదా పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పిన శైలజానాథ్.. వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తో జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ఓకే కానీ జగన్ నాయకత్వం మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పారు. అది కూడా విజయమ్మ తన కుమారుడు, కోడలు అబద్ధాలు చెబుతున్నారంటూ బహిరంగంగా చెప్పిన రెండు రోజులకే పార్టీ నాయకత్వం విజయమ్మకు ఇస్తేనే వైపీపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్, భారతి అబద్ధాలు చెప్పారని విజయమ్మ కుండబద్దలు కొట్టిన తరుణంలో శైలజానాథ్ వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలడం సంచలనం సృష్టించింది. శైలజానాథ్ వ్యాఖ్యల పట్ల వైసీపీలో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కోరి తెచ్చుకున్న శైలజానాథ్ జగన్ సీటుకే ఎసరు పెట్టారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.