జగన్ కి బాబు సవాల్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

  అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్‌ విసిరారు. అసెంబ్లీ సమావేశాలలో మొదటి రోజు నుండి 'హెరిటేజ్ ఫ్రెష్’ సంస్థ పేరుని ప్రస్తావిస్తూ అధికార పార్టీ చంద్రబాబుపై విమర్శలు చేస్తుండగా.. వాటిని చంద్రబాబు తిప్పికొట్టారు. గుడివాడలో ఉల్లి పంపిణీ క్యూలైన్లో ఒక వ్యక్తి మరణించారని చంద్రబాబు చెప్పినప్పుడు.. హెరిటేజ్‌లో కిలో ఉల్లి రూ.135కు అమ్ముతున్నారని వైసీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ.. హెరిటేజ్ ఫ్రెష్ కి, హెరిటేజ్ ఫుడ్స్ కి తేడా తెలుసుకొని మాట్లాడాలని ఎద్దేవా చేసారు. హెరిటేజ్‌ ఫ్రెష్‌ తమది కాదని దానిని ప్యూచర్‌ గ్రూప్‌ సంస్థకి అమ్మేశామని స్పష్టం చేసారు. అయినా అధికార పార్టీ నుండి విమర్శలు ఆగకపోవడంతో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు.. జగన్ కి సవాల్ విసిరారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదికాదని చెప్పామని.. అయినా హెరిటేజ్ మాదే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ మాదే అని రుజువు చేస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అలా రుజువు చేయలేకపోతే సీఎం జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన సవాల్‌ను సీఎం జగన్, వైసీపీ నేతలు స్వీకరించాలని లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు చంద్రబాబు హితవు పలికారు.

వన్ మోర్... వైసీపీ గూటికి చేరనున్న బాలయ్య ఆప్తమిత్రుడు

ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూ రావు.. తొలి నుంచి టిడిపి నాయకుడుగా, నందమూరి బాలకృష్ణకు మంచి ఆప్తమిత్రుడిగా పేరు సంపాదించుకున్నారు. తనకు సీటు ఇచ్చే విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాదన్నా బాలయ్య దగ్గర చక్రం తిప్పి తాను తలుచుకున్న చోట సీటును సాధించడంలో కదిరి బాబు నేర్పరి కావడంతో టిడిపిలో ఆయనకు తిరుగులేకుండా పోయింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో గానీ వైసిపిలో చేరే ఆలోచనలో ఉన్నారని జనాలు అనుకుంటున్నారు.  15 ఏళ్ల క్రితం 2004 లో టిడిపిలో చేరి నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో టిడిపి అభ్యర్థిగా సీటు సాధించి దర్శి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదిరి బాబూరావు. అనంతరం 2009 లో తన రాజకీయ మకాంని సొంత నియోజకవర్గమైన కనిగిరికి మార్చి 2009 లో మరోసారి బరిలో నిలిచేందుకు ప్రయత్నించారు. ఎన్నికల అఫిడవిట్ లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో డిస్ క్వాలిఫై కావడంతో చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. 2014  లో మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విజయం సాధించి తన చిరకాల కోరికను తీర్చుకున్నారు ఆయన. 2019 లో కనిగిరి నుంచి మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నో చెప్పడంతో దర్శి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికలలో టిడిపి ఘోరపరాజయంపాలైంది.  తాను ఆశించిన కనిగిరి కాకుండా తనకు ఇష్టం లేని పెళ్లి చేసినట్టు దర్శిని కట్టబెట్టడంతో అధినేత చంద్రబాబుపై బాబురావు గుర్రుగా ఉన్నారు. అందుకే అటు బీజేపీ గానీ ఇటు వైసీపీలోకి గాని వెళ్లాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా తాడేపల్లిగూడెంలో తన సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు భేటీ కావడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఏమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు జంక్షన్ లో నిలబడిపోయి దిక్కుల చూస్తున్నారు. అటు బీజేపీ లోకి వెళ్లలేక ఇటు వైసిపి లోకి వెళ్లే ఛాన్స్ లేక పోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేక పోతున్నారు బాబూ రావు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి ఉండగా తాను మనుగడ సాధించడం కష్టమని భావిస్తున్నారు. మరోవైపు టిడిపిలో కూడా తన పదవికి ఎసరు తెచ్చుకొని ఎటెళ్లాలో తెలియక జంక్షన్ లో జామ్ అయిపోయారంటున్నారు. ఇప్పుడు ఉన్న పార్టీ లోనే తన క్లియర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారనే ప్రచారం సాగుతోంది.  పార్టీకి సమాచారం ఇవ్వకుండా తాడేపల్లిగూడెంలో కాపు నాయకులతో భేటీ కావడంతో పార్టీ మార్పుపై చర్చ జరుగుతోంది. ఆయన మీద గుర్రుగా ఉన్న టిడిపి మరోసారి దర్శి బాధ్యతలనూ చూసుకునే బాధ్యతను అనధికారికంగా శిద్ధా రాఘవరావుకూ అప్పగించారు. శిద్దా రాఘవరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండటంతో తన స్థానానికి ఎసరొచ్చేలా ఉందని కదిరి బాబురావు ఆందోళనలో పడ్డారు. నియోజక వర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో తానే ఇన్చార్జినని శిద్దా కాదని చెప్పుకుంటున్నారు. ఇక పై తాను చెప్పినట్లే కార్యకర్తలు నడవాలని తెలుగు తమ్ముళ్లకు హుకుం కూడా జారీ చేశారు. దీంతో ఇప్పుడు దర్శిలో శిద్దా కదిరిల మధ్య వార్ మొదలైందని తమ్ముళ్లు అనుకుంటున్నారు. మొత్తానికి ఇలా కంటిన్యూ అయిపోతూ అవకాశం వచ్చినప్పుడు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించాలనీ కదిరి భావిస్తున్నారు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వంశీ వర్సెస్ విజయనిర్మల.. విశాఖ తూర్పులో వైసీపీ కార్యకర్తల చీలికలు

విశాఖ తూర్పు నియోజక వర్గాల్లో వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఈ నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పరిగణిస్తారు. వరుసగా 3 సార్లు టిడిపి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు అక్కడ విజయం సాధించారు. ఆయనకి ప్రత్యర్థి ఎవరని అడిగితే వంశీకృష్ణ శ్రీనివాస్ అని టక్కున సమాధానం వినిపిస్తుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్నారు. ఒక్కసారి ఆ పార్టీ పక్షాన పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ తరపున పోటీ చేసి కూడా ఓటమి పాలయ్యారు. తర్వాతి కాలంలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ లు వచ్చినా జగన్ కి ఇచ్చిన మాటకు కట్టుబడి వైసిపి లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం వంశీకృష్ణ శ్రీనివాస్ కి షాకిచ్చింది. ఆయనకు కాదని  విజయనిర్మలకు టికెట్ కేటాయించింది వైసీపీ. దీంతో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని హడావుడి చేశారు. చివరకు జగన్ ఇచ్చిన హామీతో ఆ చిటపటలు సద్దుమణిగాయి.  మొన్నటి ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజక వర్గంలో విజయనిర్మలకు టికెట్ కేటాయించినప్పటికీ వంశీలాగానే ఓడిపోయారు. తొలుత విజయనిర్మల భీమిలి నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్నారు. భీమిలి సీటుని అవంతికి కేటాయించడంతో ఆమెను తూర్పు నియోజకవర్గానికి తీసుకువచ్చారు.ఆర్ధికంగా ఆమె బలంగా వుండటం, యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం వంటి అంశాలు కలిసి వస్తాయని వైసిపి అధిష్టానం అంచనావేసుకుంది. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. అయితే విశాఖ తూర్పులో అప్పటికే వెలగపూడి గెలుస్తారంటూ సర్వే రిపోర్టులు వచ్చాయి. ఇదే సమయంలో ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థి అయ్యి ఉండాలని వైసిపి పెద్దల భావించారు. దీంతో విజయనిర్మలను రంగంలోకి దింపారు. అయినా ఓటమి పాలయ్యారు. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ కి మేయర్ లేదా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హైకమాండ్ బుజ్జగించింది. మరోపక్క వంశీకృష్ణకు వైసిపి నగర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం విజయనిర్మల తూర్పు నియోజక వర్గ వైసీపీ ఇన్ చార్జ్ హోదాలో కొనసాగుతున్నారు. వంశీకృష్ణ వర్గీయులు పూర్తిస్థాయిలో సహకరించకపోవటం వల్లే ఓడిపోయినట్టు విజయనిర్మలతో పాటు ఆమె భర్త గట్టిగా భావిస్తున్నారు. ఈ తరుణంలో వీరి మధ్య కోల్డ్ వార్ మొదలయిందంటున్నారు.  ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పట్టు కోసం విజయనిర్మల భర్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వంశీ పేరు రాకుండా ఇక వైసీపీ తూర్పు అంటే ఆమెనే గుర్తుకు రావాలనేలా ప్లాన్లు వేస్తున్నారు. తమకంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారనీ జనాలంటున్నారు. వార్డు అధ్యక్షులు పార్టీ కమిటీల్లో తాము చెప్పిన వారికే అవకాశం ఇవ్వాలంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. నియోజకవర్గాలలో తమకు తెలియకుండా ఏ పనులు చేయవద్దని ఎవరికి ఏం కావాలన్నా తమ వద్దకే రావాలంటూ పెత్తనం చలాయిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ వెనుక నడవాలో లేక విజయనిర్మల వెనుక నడవాలో తెలియక పార్టీ కేడర్ గందరగోళపడుతోంది. పార్టీలో పదవుల విషయంలోనూ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా సొంత జాబితా తయారు చేసుకుంటున్నారు. మంత్రి అవంతి అండదండలు కూడా విజయ నిర్మలకే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన మాట వాస్తవమేనని అంటున్నారు.

వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్... ఫిరాయింపులకు లైన్ క్లియర్..!

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వంశీపై, ఆ తర్వాత టీడీపీ కూడా సస్పెన్షన్ వేటేసింది. అనంతరం చంద్రబాబు, లోకేష్ పై ఘాటు విమర్శలు చేసి, తెలుగుదేశంలో కాక పుట్టించారు. అయితే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నవేళ వంశీ... ఎటువైపు కూర్చుంటారోనన్న ఆసక్తి ఏర్పడింది. వైసీపీలో చేరతానని వల్లభనేని ప్రకటించిన నేపథ్యంలో అధికారపక్షం వైపు కూర్చుంటారేమోనని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, టీడీపీ వైపే... వెనుక పక్కన కూర్చున్న వంశీ... తెలుగుదేశానికి పక్కలో బల్లెం అనే సామెతను మరిపించారు. అయితే, రెండోరోజు వల్లభనేని వంశీ మాట్లాడేందుకు ప్రయత్నించిగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వంశీ మాట్లాడటానికి వీల్లేదంటూ టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. వంశీ అసలు ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడంటూ బాబు నిప్పులు చెరిగారు. అయితే, బాబు కామెంట్స్ పై అంతే ఘాటుగా స్పందించిన వంశీ... తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ను కలిసినంత మాత్రాన తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ బాబును నిలదీశారు. తాను అనేక ప్రజాసమస్యలపై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశానని, కానీ తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. మంచి పనులు ఎవరూ చేసినా తాను అభినందిస్తానన్న వంశీ... అలాగే జగన్ ను కూడా ప్రశంసించానని తెలిపారు. అయితే, పచ్చ బ్యాచ్ తనపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. తాను, ఎమ్మెల్యేనని, తనకూ మాట్లాడే హక్కు ఉందన్న వల్లభనేని వంశీ... ఇకపై తాను టీడీపీతో కొనసాగలేనని, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలంటూ స్పీకర్ ను కోరారు. దాంతో, వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తానంటూ స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ప్రకటనతో పార్టీ ఫిరాయింపులు కొత్త రూటు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం నుంచి బయటికి వచ్చే ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోకుండానే, అసెంబ్లీలో ప్రత్యేక సభ్యులుగా గుర్తించే అవకాశం కనిపిస్తోంది.

మంచిర్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సన్నాహం.. క్రెడిట్ బీజేపీకేనా?

పెద్దపల్లి జిల్లా పరిధిలోని రామగుండం నియోజక వర్గం పరిశ్రమలకు పుట్టినిల్లు. ఇక్కడి కార్మికులు.. ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. రాజకీయ పార్టీల ఎన్నికల హామీల్లో ఇది కూడా ప్రధానమైనదే. కాకపోతే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ వ్యవహారం ఆ ప్రాంత నేతలకు పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఇక్కడ పనిచేసి ఆర్థిక స్తోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వం అందించే వైద్యం పైనే ఆధారపడుతూ ఉంటారు. సింగరేణి, ఎన్టీపీసీ, బసంతనగర్ సిమెంట్ పరిశ్రమలకు అనుబంధంగా ఆసుపత్రులు ఉన్నప్పటికీ ఆయా సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వాటిలో వైద్యం అందిస్తారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకొని మంథని, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలుంటాయి. ఈ ప్రాంతాల నుంచి అత్యవసర కేసులు రామగుండంలోని ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల ఆవశ్యకత పెరిగింది. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 6 నియోజక వర్గాల ప్రజలకు వైద్యాన్ని అందించే వీలుండటంతో ఈ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఆ డిమాండ్ కాస్తా ఇప్పుడు ఎన్నికల హామీగానే మారిపోతోందని జనాలు అనుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత తనదంటూ హామీ ఇవ్వడంతో అంతా సంబరపడ్డారు. రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కావలసిన వసతులు , సౌకర్యాలు ఉన్నాయని సింగరేణి ఎన్టీపీసీ సంస్థల సహకారంతో  స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లారు. సీఎం హామీతో పాటు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందని అనుకుంటున్న తరుణంలోనే ఊహించని పోటీ మొదలయ్యింది. ఇటీవల పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మెడికల్ కళాశాల మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలంటూ కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అనూహ్యంగా మంచిర్యాల జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వివేక్ అడుగుతున్నారని ఇప్పుడు చర్చ మొదలైంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా అని జనాలు ఆలోచనలో పడ్డారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్రమే అనుమతులివ్వాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఆ క్రెడిట్ దక్కకుండా చేయడంతో పాటు తానే సాధించాను అని జనం ముందు చెప్పుకోవచ్చని వివేక్ భావిస్తున్నారని జనాల్లో టాక్. రామగుండం ఎమ్మెల్యే చందర్ మాజీ ఎంపీ వివేక్ లకు తానేమి తక్కువ కాదంటూ పోటీలోకి దిగారు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. తన నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలంటూ సుమన్ విన్నపాలు మొదలుపెట్టారు. రామగుండం, చెన్నూరు నియోజక వర్గాల శివారు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనువైన స్థలం అంటూ సుమన్ తన నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు తలా ఒక చోట మెడికల్ కళాశాలను ప్రతిపాదిస్తూ ఉండడంతో అసలు ఈ పని అవుతుందా లేదా అనే అనుమానంలో జనం పడిపోయారు. ఇలా చందర్, సుమన్, వివేక్ ఎవరికి వారే మెడికల్ కళాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం చెన్నూరు నియోజక వర్గం మంచిర్యాల జిల్లాలోనే ఉంది. అంటే వివేక్ కోరినట్టు మంచిర్యాల జిల్లాలో ఏర్పాటైనట్టు అవుతుంది. అలాగే సుమన్ కోరుకున్నది అయిపోతుంది. కాబట్టి సుమన్ కోరినట్టు చెన్నూరు లోనే చివరకు ఈ కళాశాల ఏర్పాటైన ఆశ్చర్యపోవలసిన పనిలేదు అంటున్నారు. మరి వివేక్ ప్రయత్నం ఫలిస్తుందో సీఎం కేసీఆర్ హామీ నెరవేరుతుందో చూడాలి అని జనాలు అనుకుంటున్నారు.  

పొన్నాల పంతం.. కాంగ్రెస్ అధిష్టానానికి తానేంటో చూపించబోతున్నారు!!

  ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సూత్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఫాలో అవుతున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పొన్నాల లక్ష్మయ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. అయితే వైఎస్ మరణం తర్వాత ఆయన రాజకీయ చరిత్ర అడ్డం తిరిగిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే పరిస్థితులు ఒకప్పుడు టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉండి ఎంతో మందికి తన చేతుల మీదుగా బీఫాంలు అందించిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా మాత్రమే నిలుస్తున్నారు అనే వాదనలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జరిగిన 2014 ఎన్నికలతో పాటు రెండో సారి 2018 లో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం పొన్నాల లక్ష్మయ్య సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తడం ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయ మెట్లెక్కారు. ఒకవేళ ఆయన ప్రభ అలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించేవారేమో. అయితే ఆయన యూటర్న్ తీసుకుని మళ్లీ జనగామ జిల్లా రాజకీయాల పై దృష్టి సారించినట్లుగా ఉందన్న వాదనలు ఉన్నాయి. ముక్కు సూటిగా మాట్లాడే స్వభావిగా పొన్నాలకు పేరుంది. అలాగే ఢిల్లీ రాజకీయాన్ని గల్లీకి తీసుకురావటం ఆయనకే సాధ్యం అయిందనే ప్రశంసలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య రాజకీయ భవితవ్యం ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభావం రాష్ట్రమంతటా రెపరెపలాడుతుండగా ఆయన మాత్రం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేక నినాదాలతో ఏటికి ఎదురీదుతున్నారనే అభిప్రాయాలు ఆయన అనుచర వర్గాలలోనే వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జనగామ నియోజక వర్గం నుండి పొన్నాల లక్ష్మయ్య వరుసగా రెండో సారి ఓటమి పాలు కావడంతో ఆయన చుట్టూ ప్రతికూల వాతావరణం అలుముకుంది. 2014 ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ గా ఆయన అక్కడ పోటీ చేసి ఓడారు. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడి టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి పొన్నాలని తప్పించింది. బీసీ నాయకత్వం కంటే రెడ్డి నాయకత్వం ముఖ్యమని భావించిందో ఏమో పొన్నాలకు ఉద్వాసన పలికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పట్నుంచే పొన్నాల నిరాశకు లోనైనట్లు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.  అయితే ఇటీవల పొన్నాల లక్ష్మయ్య వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. పార్టీలో తన పట్టు తగ్గుతుందని ఆయన అనుకున్నారో ఏమో ఇటీవల సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాను ఉన్నానని అటు జనాలకు ఇటు రాజకీయ వర్గాలకు తెలిసేలా కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తడం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో గుసగుసులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కార్మికులు చేసిన సుదీర్ఘ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. అయితే ఆందోళనకు ఆయన ఇలా వచ్చి అలా వెళ్లరనే టాక్ వుంది. సకల జనుల సమ్మె తరువాత మళ్లీ అంత పెద్ద స్థాయిలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిల పక్ష నేతలు పాల్గొన్నప్పటికీ పొన్నాల మాత్రం చురుగ్గా వ్యవహరించలేదు. లక్ష్మయ్యకు ఆయన కోడలు వైశాలీల మధ్య రాజకీయ వైరం నెలకొందనే ప్రచారం ఉంది. అయితే పొన్నాల తన కోడలు రాజకీయ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను నెమ్మదిగా రాజకీయాల నుండి తప్పుకుని తన రాజకీయ వారసురాలిగా తన కోడల్ని కొనసాగించాలని ఆయన ముందుండి ప్రయత్నాలు చేస్తున్నారని అవి ఏ మేరకు ఫలిస్తాయోనని కింది స్థాయి నాయకుల్లో చర్చసాగుతోంది. మొత్తం మీద జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజకీయాల్లో తన ఉనికి చాటుకోడానికి పొన్నాల లక్ష్మయ్య తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇక మీదట ఇంట గెలిచిన తర్వాత రచ్చగెలవాలనే కోనలో ఆయన ముందుకు సాగుతున్నారని సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సారి జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం చేకూర్చి పార్టీ అధిష్టానానికి తానేంటో నిరూపించుకుంటానని పొన్నాల లక్ష్మయ్య శపథంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన పంతం ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి.

చెన్నంపల్లి కోటలో నిధుల కోసం తవ్వకాలు.. బాబు&కో ని ఇరికించేందుకు జగన్ సర్కార్ ప్లాన్!

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న సంపదను మించిపోయే స్థాయిలో చెన్నంపల్లి కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయని చాలా ఏళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే 2016 లో చెన్నంపల్లికి ఓ స్వామి వచ్చి కోటలో తవ్వకాలు జరపడానికి సహకరిస్తే గ్రామం లోని ఒక్కింటికి కిలో బంగారం చొప్పున ఇస్తానని ఆశ పెట్టాడు. దీంతో ఆ కోటలో నిజంగానే నిధినిక్షేపాల ఉండొచ్చన్న భావన ప్రజల్లో మరింత బలపడింది. ఈ తరుణం లోనే 2017 డిసెంబర్ లో అధికారికంగా చెన్నంపల్లి కోటలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య తవ్వకాలు చేపట్టారు. నిధుల పేరిట ఎంతో చారిత్రాత్మకమైన చెన్నంపల్లికోటను ధ్వంసం చేయొద్దు అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు ఆందోళనలు చేపట్టారు. అయినా తవ్వకాలు మాత్రం కొనసాగాయి. అప్పటికే చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణలు పేరుతో అనేక మంది రహస్యంగా తవ్వకాలు సాగించిన సందర్బాలున్నాయి. గుప్త నిధుల అన్వేషణ పై అనేకసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపధ్యంలో గుప్త నిధుల గుట్టు రట్టు చేసేందుకు నాటి ప్రభుత్వం ఇక్కడ తవ్వకాలు చేపట్టిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఆరు నెలలకు పైగా సాగిన ఈ తవ్వకాల కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ వ్యవహారం ముగిసింది. ఎంత కష్ట పడి తవ్వకాలు చేపట్టిన కోట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నిధి నిక్షేపాలు బయట పడలేదు. ఏనుగు దంతాలు, గుర్రం ఎముకలు, సీతారాముల విగ్రహాలు వంటివి మాత్రమే దొరికాయి. అనంతరం ఇక్కడ తవ్వకాలకు పూర్తిగా స్వస్తి పలికారు.  సార్వత్రిక ఎన్నికలు రావడంతో అధికారులు కోటలో తవ్వకాల పై దృష్టి కూడా సారించలేదు. చెన్నంపల్లి కోటలో అధికారుల తవ్వకాలు జరిపి అణువణువూ శోధించినా ఏం దొరకకపోవడంతో.. ఇక్కడ ఎలాంటి నిధినిక్షేపాలు లేవన్న భావన ప్రజల్లో ఏర్పడింది. ఈ క్రమం లోనే రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నంపల్లి కోటలో నిధినిక్షేపాల కోసం గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని వెచ్చించి తవ్వకాలు జరిపింది అన్న విషయాన్ని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా తెరపైకి తెచ్చారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విషయం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించినట్టు సమాచారం. సీఎం జగన్ ఈ అంశంపై చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. నాటి తవ్వకాల పై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవి రంగం లోకి దిగారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చెన్నంపల్లి కోటలో జరిపిన తవ్వకాల పై ఆరా తీస్తున్నారు. అవసరమైతే దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.  ప్రజా ధనం వృధా చారిత్రక కట్టడంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి కోటను ధ్వంసం చేశారనే అభియోగాలతో విచారణ జరిపి అందుకు బాధ్యులైన టిడిపి నేతల పై కేసులు పెట్టేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. నాటీ సీఎం చంద్రబాబు సహా ఆయన కుమారుడు లోకేష్, నాటి డిప్యూటీ సీఎం కేయి క్రిష్ణమూర్తిలని ఈ కేసులో ఇరికించివచ్చని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో చెన్నంపల్లి కోటలో తవ్వకాలు మొదలైనప్పుడు అంశం ఎలా చర్చకు దారి తీసిందో ఇప్పుడు ఆ తవ్వకాల పై జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టబోతోందన్న వార్త కూడా అంతే ఆసక్తికరంగా మారింది. దీనికి రాజకీయ అంశాలు కూడా తోడు కావడంతో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపక్ష టిడిపి మధ్య కొత్త సెగ రాజుకునేలా కనిపిస్తోంది. ఈ అంశం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

11మంది రెబల్స్ కు మంత్రి పదవులు... కర్నాటకలో బీజేపీ సేఫ్ గేమ్

కర్నాటక ఉపఎన్నికల్లో ఎలాగైనాసరే గెలిచి... మళ్లీ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్‌-జేడీఎస్ ఆశలు ఆవిరయ్యాయి. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగగా... కాంగ్రెస్ రెండు సీట్లకు మాత్రమే పరిమితమవగా, జేడీఎస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక, ఉపపోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన బీజేపీ.... 12 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అయితే, అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కనీసం ఆరేడు స్థానాలకు కచ్చితంగా గెలవాల్సిన బీజేపీ ఏకంగా 12 సీట్లను దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప పట్టలేని సంతోషాన్ని వ్యక్తపరిచారు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్న యడియూరప్ప... ఉపఎన్నికల్లో గెలిచిన 12మందిలో 11మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్లు యడియూరప్ప తెలిపారు. కర్నాటకలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే 111మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది. ఉపఎన్నికలకు ముందు 105 సీట్లే ఉండగా, మ్యాజిక్ ఫిగర్ కు ఆరు స్థానాలు తక్కువగా ఉన్నాయి. అయితే, ఉపపోరులో బీజేపీ 12 స్థానాలను గెలవడంతో యడియూరప్ప ప్రభుత్వ బలం 117కి చేరింది. దాంతో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండాపోయింది. అయితే, కర్నాటక ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వారంతా ఇంతకుముందు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలే. వీళ్లంతా కలిసి అసమ్మతి ఆట ఆడటం వల్లే బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఈ రెబల్స్ వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి స్పీకర్ వేటేసినా, సుప్రీంను ఆశ్రయించి, ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేశారు. దాంతో, ఉపఎన్నికల్లో బీజేపీ తరపున 12మంది అత్యంత కీలకంగా మారారు. అందుకే, 11మందికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారు.  ఇదిలాఉంటే, కన్నడ ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పారన్న మోడీ... ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీలకు ఇది ఒక హెచ్చరిక లాంటిదన్నారు. త్వరలోనే వాళ్లకు కూడా తగిన సమాధానం లభిస్తుందంటూ పరోక్షంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  

హైదరాబాద్ - కర్నూలు హైవే పై ఉన్న బార్లను మూసేయండి

  44 వ నెంబరు నేషనల్ హైవే పై దిశ దారుణం జరిగింది.  హైదరాబాద్ కు దక్షిణంగా శంషాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు అలంపూర్ టోల్ గేట్ వరకు దాదాపు 200 కిలో మీటర్లు ఈ రహదారి విస్తరించింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో ఈ హైవే ఉంది. ఇక 44 వ నేషనల్ హైవే పరిధిలో షాద్ నగర్, బాదేపల్లి, భూత్పూర్ , కొత్తకోట , పెబ్బేరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీల్లో మద్యం షాపులు లేనప్పటికీ హైవేలకు కాస్త దూరంగా ఉన్న గ్రామాల్లో మద్యం షాపులున్నాయి. హైవే పక్కన ఉన్న వైన్ షాపులన్నీ బార్లుగా మారాయి. వైన్స్ లో లిక్కర్ కొని విచ్చలివిడిగా హైవే పక్కన ఖాళీ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తున్నారు. హైవేల పై ఉన్న వైన్స్ లోనే కాదు, దాబాల్లోనూ లిక్కర్ దొరుకుతోంది. ప్రతి దాబా ఓ బెల్టు షాపులా మారింది. జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకు, కొత్తపేట, పెబ్బేరు, కోదండాపురం ప్రాంతాల్లో ఉన్న దాబాలు అన్నింటిలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో గొడవలు కూడా పెరిగాయి. హైవేల పై నిఘా కరువైందనే ఆరోపణలున్నాయి. ఎక్కడైనా లారీలు, వాహనాల గుంపుగా ఉంటే ఖచ్చితంగా అక్కడికీ హైవే పెట్రోలింగ్ వాహనం వెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో దృష్టి పెట్టాలన్నారు. కానీ అధికారులు పట్టించుకోక పోవడంతో మద్యం బాబుల ఆగడాలు నేరాలు పెరుగుతున్నాయి అంటున్నారు స్థానికులు. హైవేల పై మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు. లిక్కర్ అమ్మకాల విషయంలో చట్టాలు కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కఠిన చట్టాలు తెచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని అంటున్నారు.

ఏపీలో ఉల్లి లొల్లి... అసెంబ్లీలో బాబు వర్సెస్ జగన్

ఏపీలో ఉల్లి లొల్లి కంటిన్యూ అవుతోంది. దిశ ఉదంతం నేపథ్యంలో మొదటిరోజే మహిళల భద్రత కోసం విప్లవాత్మక చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను చేపడితే... ప్రతిపక్ష టీడీపీ మాత్రం ...ముందుగా ఉల్లిపై డిస్కషన్ చేయాలంటూ పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో... తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. ఉల్లిపై చర్చ చేపట్టాల్సిందేనంటూ స్లోగన్స్ తో హోరెత్తించారు. దాంతో, టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే మహిళల భద్రతపై చర్చ కొనసాగించింది. అయితే, ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసి తనపై బురద చల్లడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోందని, సీఎం జగన్ కు కూడా అదే ఆనందంగా ఉందని చంద్రబాబు సెటైర్లు వేశారు.  ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్భాణాలు సంధించారు. జగన్ చేసే మేలు ఉల్లి కూడా చేయదేమో కాబోలు... అందుకే ఉల్లి అవసరం లేదని రేటు పెంచారంటూ ఎద్దేవా చేశారు. రైతుబజార్లలో ప్రజలు బారులు తీరిన ఫొటోను ట్వీట్ చేసిన పవన్... ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమంటూ మండిపడ్డారు. అయితే, విపక్షాల ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొడుతున్నారు. మార్కెట్లో రెండు వందల రూపాయలున్న కిలో ఉల్లిని... తమ ప్రభుత్వం కేవలం 25 రూపాయలకే అందిస్తోందని తెలిపారు. అయినా, చంద్రబాబు తన హెరిటేజ్ సూపర్ మార్కెట్స్ కిలో ఉల్లిని ఎంతకు అమ్ముతున్నారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. హెరిటేజ్ లో కిలో ఉల్లిని రెండొందలకు అమ్ముతుంటే... తాము ఇరవై ఐదు రూపాయలకే అందిస్తున్నామని... ఇంతకంటే ఇంకేం చేయాలని జగన్ ప్రశ్నించారు.  

గర్వం వెనుకే నాశనం... జగన్ వైఖరిపై విమర్శలు

  గర్వం వెనుకే నాశనం కూడా ఉంటుందనే సామెత ఉంది. అంటే గర్వం తలకెక్కితే నాశనం కూడా దానంతట అదే వస్తుందని దాని అర్ధం. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రస్తుతం అలాగే ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ తీరును గమనిస్తే గర్వాన్ని తలకెక్కించుకున్నట్లే కనిపిస్తోందంటున్నారు. కేవలం తన ఒక్కడి వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని... ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా... తన వల్లే గెలిచారని... ప్రజలు కేవలం తనను చూసే ఓట్లేశారనే భావన జగన్ లో కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుందని అంటున్నారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడే తీరును గమనిస్తే ఇతరులకు ఇది స్పష్టంగా కనిపిస్తుందని మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనల్లోనూ... సంక్షేమ పథకాల్లోనూ... కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫొటో మాత్రమే వాడాలని... ఆయా శాఖల మంత్రుల ఫొటోలను వినియోగించొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం వెనుక జగన్ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫొటోతోపాటు... ఆయా శాఖల మంత్రుల ఫొటోలను పెట్టడం ఆనవాయితీ. అయితే, జగన్ మాత్రం అందుకు భిన్నంగా తన ఫొటో ఒక్కటి మాత్రమే ఉండాలని ఆదేశించడం వెనుక ... అంతా తానే అన్నట్లుగా వైఖరి ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ముమ్మాటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణం. వైసీపీ గెలుపులో ప్రధాన వాటా కచ్చితంగా జగన్ దే అయినప్పటికీ... ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచినవాళ్ల పాత్ర అస్సలు లేదనడం పొరపాటే అవుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నట్లుగా దమ్మున్న లీడర్లు వంద మంది గెలిస్తేనే ... జగన్ అయినా... చంద్రబాబు అయినా ముఖ్యమంత్రి కాగలుగుతారు. ఇది మర్చిపోయి మొత్తం అంతా తానే... వందకి వంద శాతం తనకే దక్కాలనుకోవడం సరికాదని అంటున్నారు. ఇలాగైతే ముందుముందు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల ఉనికే ప్రశ్నార్ధకమవుతుందని, చివరికి అది ఎన్నికల్లో గెలుపోటములపై  తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.  నేనే గెలిపించాను... నేనే కనిపించాలనే ధోరణి అస్సలు మంచిది కాదని... కనీసం మంత్రులకైనా పాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించాలనే మాట వినిపిస్తోంది. అయితే, సుప్రీం గైడ్ లైన్స్ పేరుతో మంత్రులకు ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నారని, కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదంటున్నారు. 2015లో ప్రభుత్వ ప్రకటనల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు మాత్రమే ఉండాలని సుప్రీం ఆదేశాలిచ్చినా... ఆ ఉత్తర్వుల్ని సవరిస్తూ 2016లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రుల ఫొటోలకు కూడా అనుమతించిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. కానీ, జగన్ సర్కారు మాత్రం... సుప్రీం ఉత్తర్వుల పేరుతో ప్రభుత్వ యాడ్స్ లో మంత్రుల ఫొటోలు లేకుండా చేస్తోందని, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ యాడ్స్ లో కూడా మంత్రుల ఫొటోలను ముద్రిస్తున్నారని... ఇక చంద్రబాబు కూడా తన హయాంలో మంత్రుల ఫొటోలకు స్థానం కల్పించారని... కానీ జగన్ అందుకు భిన్నంగా... తన సహచర మంత్రుల ఫొటోలను పక్కనబెట్టడం మంచిది కాదని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా... కనీసం మంత్రులకైనా పాలనలో భాగస్వామ్యం కల్పించాలని సూచిస్తున్నారు.

సీనియర్... జగన్ కు నచ్చని పదం అదొక్కటే!!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాల్సిందేనన్న రీతిలో సాగుతున్న జగన్... తాను రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలోనూ అదే పంథాను అనుసరించారు. ఫలితంగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటి నడిచిన సొంత బాబాయి వైఎస్ వివేకాందరెడ్డి అర్థాంతరంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వివేకాకు మంత్రి పదవి దక్కినా అది మూన్నాళ్ల ముచ్చటే అయిన విషయం కూడా తెలిసిందే. సరే... ఇప్పుడు రాజశేఖరరెడ్డి లేరు, వివేకానందరెడ్డి కూడా లేరు. అయినా కూడా జగన్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత 2019 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనన్న భావనతో జగన్... తన పాత వైఖరినే కొనసాగించారని చెప్పక తప్పదు. తాను కేసుల్లో ఇరుక్కుని పార్టీని మూసివేయక తప్పదన్న వాదన వినిపించిన సమయంలో పార్టీకి అండగా నిలిచిన వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు మొన్నటి ఎన్నికల్లో కనీసం టికెట్లు కూడా ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం ఈ వాదనకు నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు.  తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్.. మరి మేకపాటికి కనీసం రాజ్యసభ సభ్యత్వం అయినా ఇవ్వాలి కదా. అయితే సీనియర్ అన్న పదమే తనకు రుచించదు అన్న రీతిలో వ్యవహరిస్తూ ఇప్పుడు మేకపాటికి రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కని రీతిలో జగన్ పావులు కదిపారు. మేకపాటి సొంత జిల్లా నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావును పార్టీలోకి ఆహ్వానించిన జగన్... ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేశారట. నెల్లూరు నుంచి బీదకు రాజ్యసభ ఇస్తే... మేకపాటికి మొండిచేయి చూపినట్టే. ఎందుకంటే.. ఒకే జిల్లా నుంచి ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తే పార్టీకి కష్టమే కదా. ఇక నెల్లూరు జిల్లాకే చెందిన ఆనం రామనారాయణరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా... జగన్ ఆయనను తన కేబినెట్ లోకి తీసుకోలేదు. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న ఆనంను పక్కనపెట్టిన జగన్... పాలనలో ఎంతమాత్రం అనుభవం లేని అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్సిచ్చారు. జగన్ అనుసరించిన ఈ వ్యూహంతో ఇప్పుడు ఆనం రగిలిపోతున్నారనే చెప్పాలి. ఏకంగా పార్టీని వీడేందుకు కూడా ఆయన వెనుకాడటం లేదన్న వాదన కూడా లేకపోలేదు. ఆనంను వదులుకునేందుకు కూడా సిద్ధమేనన్నట్లగా జగన్ సంకేతాలు ఇస్తున్న వైనం కూడా ఆసక్తికరమే. ఈ లెక్కన జగన్ కు సీనియర్లు అవసరం లేదన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది. మరి జగన్ కు అవసరం లేని సీనియర్లు తమ భవిష్యత్తును ఎలా మలచుకుంటారో చూడాలి.

కాంగ్రెస్ వైపు చూస్తోన్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు..!

జాతీయ పార్టీలైనా, ప్రాంతీయ పార్టీలైనా... కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీలో ఉండదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన స్వేచ్ఛను అనుభవించిన నేతలు... తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లో చేరితే... అక్కడ పరిస్థితులకు అడ్జస్ట్ కాలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటికి చెప్పలేరు... ఇండిపెండెంట్ గా వ్యవహరించలేరు... ఏదైనా పార్టీ అధినేత కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుంది. అంత తేడా ఉంటుంది కాంగ్రెస్ కు... ఇతర పార్టీలకు. అయితే, కాంగ్రెస్ ను వదిలి ఇతర పార్టీల్లో చేరిన నేతలు తప్పనిసరి పరిస్థితుల్లోనే అక్కడ కొనసాగుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో గమనించినా... ఆయా నేతల పరిస్థితిని అంచనా వేయొచ్చు. రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షులుగా పనిచేసినా, కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించినా, కాంగ్రెస్ లో అత్యున్నత కీలక పదవులు చేపట్టినా... ఇతర పార్టీల్లో చేరాక మాత్రం వాళ్లంతా సైలెంట్ గా మిగిలిపోతున్నారు. అసలు వాళ్లున్నారో లేదో కూడా తెలియనంతగా మౌనవ్రతం దాల్చుతున్నారు. తెలంగాణలో అయినా, ఏపీలో అయినా... పలువురు నేతల పరిస్థితి ఇదే.  అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అండ్ బీజేపీల్లో చేరిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాము చేరిన పార్టీల్లో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం... కనీసం స్వేచ్ఛ లేకపోవడంతో... తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ముఖ్యంగా ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన సురేష్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి లాంటి సీనియర్ నేతలకు... కనీస ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇబ్బందిపడుతున్నారట. ఎన్నికలకు ముందు సురేష్ రెడ్డికి కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినా... నిజామాబాద్ లో కవిత ఓటమిపాలవడంతో ఆ హామీని పక్కనబెట్టినట్లు చెబుతున్నారు. ఇక, ఐదేళ్ల క్రితం టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సారయ్య పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. కనీసం పట్టించుకున్న పాపాన లేదని అంటున్నారు. ఇక, బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా ఇలాగే ఉందట. దాంతో, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తనకు నామినేటెడ్ పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని డీకే అరుణ వాపోతున్నట్లు తెలిసింది. పైగా తమ అభిప్రాయాలకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీతో పోల్చితేన కాంగ్రెస్ లోనే వాతావరణం బాగుంటుందని, స్వేచ్ఛగా మసలుకోవచ్చని, అలాగే అభిప్రాయాలకు విలువ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీల్లో స్వేచ్ఛగా మసలుకోలేని పరిస్థితులు ఉన్నాయంటోన్న మాజీ కాంగ్రెస్ లీడర్లు... మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ-బీజేపీ మధ్యే పోటీ... వచ్చే ఎన్నికల తర్వాత మూడో స్థానానికి టీడీపీ

  ఏపీ అసెంబ్లీ లాబీల్లో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యంగా ఆనం కామెంట్స్ పై స్పందించాలని పలువురు తెలుగుదేశం నేతలు... వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కోరారు. అయితే, ఆనం వ్యాఖ్యలపై తన భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దాంతో పార్టీ వేదికపైనే తన వెర్షన్ వినిపిస్తానని చెప్పుకొచ్చారు. అయినాసరే పట్టువదలని కొందరు టీడీపీ సభ్యులు.... ఆనం కామెంట్స్ వెనుకున్న మర్మమేమిటో చెప్పాలని కోటంరెడ్డిని విసిగించారు. మంత్రి అనిల్, కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఆరోపణలు చేశారన్న టాక్ రావడంతోనే రియాక్షన్ కోసం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆనం ఇష్యూను పక్కకు తప్పించిన కోటంరెడ్డి.... తెలివిగా తన మాటలను చంద్రబాబు వైపు మళ్లించారు. జగన్మోహన్ రెడ్డి వల్లే చంద్రబాబుకి ఇంకా ప్రతిపక్ష హోదా కొనసాగుతోందని, లేదంటే ఇప్పటికిప్పుడు 13మంది వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. శాసనసభ్యత్వానికి ఇబ్బంది లేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైసీపీలో చేరాలన్న నిబంధనను జగన్ పక్కనబెడితే తెలుగుదేశం మొత్తం ఖాళీ అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం మూడో స్థానానికి పడిపోతుందని జోస్యం చెప్పిన కోటంరెడ్డి... 2025లో పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆనం కామెంట్స్ పై స్పందించాలని కోరితే, తిరిగి తిరిగి చంద్రబాబును టార్గెట్ చేయడంతో కోటంరెడ్డిపై మండిపడ్డ టీడీపీ సభ్యులు... పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలే బీజేపీ, తెలుగుదేశంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ కౌంటరిచ్చారు. అయినా, టీడీపీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించడం మానేసి ముందు మీ ఎంపీలు, ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలని, పైగా మాఫియాలా తయారయ్యారని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలే అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆనం అలక తీర్చి సర్దుబాటు చేసిన పార్టీ హై కమాండ్.. టీ కప్ లో తుఫానే!!

తాజాగా ఆనం చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపాయి. అందుకు తగ్గట్టే అధిష్ఠానం కూడా రామనారాయణరెడ్డి పై మండిపడింది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తూ.. షోకాజ్ నోటీసు జారీ చేయాల్సిందిగా విజయసాయిరెడ్డిని ఆదేశించారు జగన్. నెల్లూరులో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆనం చేసిన కామెంట్లు మంటలు రేపాయి. ఆనం అసంతృప్తి వెనుక చాలానే కారణాలు ఉన్నాయంటున్నారు. పార్టీ గెలిచిన తరువాత చాలా కాలం సైలెంట్ గానే ఉన్న ఆనం ఉన్నట్టుండి పార్టీ నేతల మీద విరుచుకుపడటానికి వివేకా మరణం తరువాత తమ కుటుంబం ప్రాధాన్యత తగ్గడం ఒక కారణమంటున్నారు. ఇన్నాళ్లూ ఆ కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న వెంకటగిరి రాజా కాలేజ్ ఇప్పుడు అధికారుల పర్యవేక్షణ లోకి వెళ్ళింది. మరోవైపున వెంకటగిరి నియోజకవర్గంలో ఆల్తూరుపాడు ప్రాజెక్టు పనులు రద్దయ్యాయి. 260 కోట్ల రూపాయల విలువ చేసే ఈ పనులు రద్దు వెనక మంత్రి అనిల్ ఉన్నారనేది ఆనం వర్గీయుల వాదన. ఇంకోవైపున వెంకటగిరి వేణుగోపాల స్వామి ఆలయానికి ఆనం కుటుంబం నుంచి ఎవరో ఒకరు ట్రస్టీగా వ్యవహరించేవారు. ఇప్పుడు ఈ ఆలయానికి పాలక మండలిని నియమించాలనే ఆలోచనలో ఉంది సర్కార్. సీనియర్ అయినప్పటికీ మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి రాంనారాయణరెడ్డిలో ఉంది. ఇక ఆనం వివేకా చనిపోయిన తరువాత ఆ కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత తగ్గింది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో హవా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ కారణాల వల్ల ఆయన అసంతృప్తితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆనం వ్యాఖ్యలను అధిష్ఠానం సీరియస్ గా తీసుకుని షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే తరువాత ఆ ఊసే వినపడలేదు. అయితే అనంతరం చల్లబడిన అధిష్టానం ఆనం అసంతృప్తి పై దృష్టి పెట్టి ఏదో ఒక హామీ ఇచ్చే ఉంటుందని ఒక టాక్. దీనికి తగినట్లే ఇవాళ అసెంబ్లీలో టీడీపీ పై ఎదురు దాడికి దిగారు ఆనం. మొత్తం మీద ఆనం వివాదం టీ కప్పులో తుపానులా ముగిసి పోతుందేమో చూడాలి.  

కేసీఆర్ కి హ్యాట్సాఫ్‌ చెప్పారు సరే.. మరి మీరెప్పుడు చెప్పించుకుంటారు జగన్

  ఏపీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. మహిళల రక్షణపై జగన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన కలచివేసిందన్నారు. దిశ హంతకులను కాల్చిచంపినా తప్పులేదని తనకు కూడా అనిపించిందని చెప్పారు. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో దాన్నే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. హ్యాట్సాఫ్‌ టూ కేసీఆర్‌, హ్యాట్సాఫ్‌ టూ తెలంగాణ పోలీసులు అని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీలో గత ప్రభుత్వం హయాంలోనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని టీడీపీని ఉద్దేశించి జగన్ ఆరోపించారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరికీ అన్యాయం జరకుండా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు. మహిళల రక్షణపై అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్క రాష్ట్ర సీఎంకి హ్యాట్సాఫ్‌ చెప్పటం కాదని.. మీరు కూడా హ్యాట్సాఫ్‌ చెప్పించుకునేలా పని చేయండని కొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్నారు.. కానీ మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా సుగాలి ప్రీతి కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. తమ పార్టీ వ్యక్తని గత ప్రభుత్వం కేసుని నీరుగార్చింది, ఇప్పుడు ఒకే సామాజికవర్గమని మీరు నీరుగారుస్తున్నారా అని నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఆడవారి భద్రతకై కొత్త చట్టానికి శ్రీకారం చుట్టబోతున్న జగన్...

  ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రస్తావిస్తూ మహిళల పై అత్యాచారం కేసులో 21 రోజులోనే ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. వారం రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా ఆయన ఈ చట్టం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ పై అసెంబ్లీలో జరిగిన చర్చలో కొత్త చట్టం ఎలా ఉంటుందో వివరించారు సీఎం జగన్. ఎల్లుండే ఈ చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆడ వాళ్ల  మరియు చిన్న పిల్లల పై జరిగే నేరాల కోసం వారికి జరిగే అన్యాయాల పై జగన్ సర్కార్ స్పందిస్తూ కొత్త చట్టానికి నాంది పలుకుతోంది. ఇందులో భాగంగా ఆడవాళ్ల పై మానభంగాలు చేయడం గానీ, ఆడవాళ్ళ ప్రొటెక్షన్ కోసం గానీ,ఇటువంటి సంఘటనలు ఏవైన జరిగితే ప్రతి జిల్లా లోనూ ఒక డెడికేటెడ్ కోర్టు కూడబెట్టాల్సిన అవసరం  ఉందని జగన్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.కేవలం ఇటువంటి కేసులను మాత్రమే డీల్ చేసే విధంగా అడుగులు వేసే దిశగా అవసరం  ఉన్న పరిస్థితులు ఉన్నాయని ఆ దిశగా కూడా తమ ప్రభుత్వం  అడుగులు వేస్తుందని జగన్ పేర్కొన్నారు.  అదే విధంగా ఈ రోజు సోషల్ మీడియాల్లో కూడా పలు సంఘటనలు చూస్తున్నామని, నిజంగా ఒకొకసారి ఆ సోషల్ మీడీయాని చూస్తే తనకు చాలా బాధనిపిస్తుందని, భయమేస్తొందని కేవలం వేరే వ్యక్తుల మీద బురదజల్లే దాని కోసం అసలు ఎటువంటి మనస్సాక్షి అనేది లేకుండా ఈ మధ్య కాలంలో సోషల్ మీడయా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో  సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్లను రక్షించే కార్యక్రమం జరగాలని అసెంబ్లీ సాక్షిగా జగన్ కోరారు. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఏదైన పోస్టింగ్ నెగటివ్ గా చేస్తే వాళ్లకు శిక్ష పడుతుందందన్న భయం ఉంటే తప్ప ఇది ఆగిపోదని జగన్ వెల్లడించారు. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని, వెంటనే ఇటువంటి పోస్టింగ్స్ ఏదైన చేస్తే  సెక్షన్ 354 ను ప్రతిపాదించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని జగన్ తెలిపారు.

పెళ్లిలో ఉండాల్సిన వరుడు కటకటాల పాలయ్యాడు...

  కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. కక్కు సంగతేమో కానీ పీటల దాకా వచ్చిన పెళ్లి మాత్రం ఓ ప్రబుద్ధుడు నిర్వాకంతో ఆగిపోయింది. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అతని పేరు మోహన కృష్ణ పేరుకు తగ్గట్టు గానే ఒక పెళ్లి ఒక రాధ చాలదనుకున్నాడేమో ఓ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే నిత్య పెళ్లికొడుకు బండారం కాస్త బయటపడింది. మరో పెళ్లి జరుగుతుండగా నిశ్చితార్థం జరిగిన అమ్మాయి తరపున బంధువులు అడ్డుకోవడంతో పెళ్ళి ఆగిపోయింది. కర్నూలుకు చెందిన మోహన కృష్ణ తిరుపతిలో ఎస్బీఐ అసిస్టెంట్ బ్రాంచి మేనేజర్ గా పని చేస్తున్నాడు. అక్కడి ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. 16 లక్షల క్యాష్ 8 తులాల బంగారం కట్నంగా తీసుకున్నాడు. అయితే కట్నం తీసుకున్నాక ఆమె అవసరం లేదనుకున్నాడో ఏమో తిరిగి నంద్యాలలో మరో అమ్మాయి లక్ష్మీ ప్రియతో వివాహం ఖాయం చేసుకున్నాడు. ఇక్కడ కూడా కట్నకానుకలు పుచ్చుకొని పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే మోహన కృష్ణ నంద్యాలలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు వాళ్ళకు తెలిసింది. తిరుపతి నుంచి అమ్మాయి బంధువులు వచ్చి వరుడి వ్యవహారం పందిట్లో పదిమందికీ చెప్పారు. దీంతో అక్షింతలు వేయాల్సి చేతులతో తలో ఒక దెబ్బ వేసి చితక్కొట్టారు. తమ ఆడపిల్లను మోసం చేసి కట్నం కాజేశాడని  పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు అమ్మాయిల తరపు బంధువులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి కాస్తా పెటాకులైంది.

కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

  కామారెడ్డి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులు నిజామాబాద్ జిల్లా నవీపేట వాసులు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే నలుగురి మృతదేహాలను బయటకు తీశారు సిబ్బంది. వారిని నిజామాబాద్ వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి ముఖ్య కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వారు నిజామాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ లోని తమ బంధువులకి ఏయిర్ పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి నిజామాబాద్ కి బయలు దేరారు. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్లంతా కూడా నిజామాబాద్ వాసులుగా చెప్తున్నారు. డ్రైవర్ ప్రశాంత్ మాత్రం నవీపేట వాసిగా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత హైవే పెట్రోలింగ్ వాళ్ళు చేరుకున్నారు. తరువాత పోలీసులు చేరుకొని గ్యాస్ కటర్ ద్వారా అద్దాలను కట్ చేసి మృతు దేహాలను బయటకి తీశారు. మృతదేహాలు నలుగురిని కూడా పోస్టుమార్టంకు తరలించారు. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యినట్లు పోలీసులు వెల్లడించారు.