రాజ్యసభకు కవిత..! రెండో సీటుపైనే ఉత్కంఠ

  వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఏపీకి నాలుగు, తెలంగాణకి రెండు రానున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం అటు ఏపీలోనూ... ఇటు తెలంగాణలోనూ అధికార పార్టీకే ఆ స్థానాలను దక్కించుకోనున్నాయి. అయితే, తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాల్లో టీఆర్ఎస్ సీనియర్ కె.కేశవరావు సీటు ఒకటి కూడా ఉంది. అయితే, కేకేకు మళ్లీ రెన్యువల్ లభిస్తుందో లేదోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈమధ్య కేసీఆర్ కు కేకేకు మధ్య కొంచెం దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. దాంతో, కేకేకు రెన్యువల్ దక్కకపోవచ్చని అంటున్నారు.  మరోవైపు, రాజ్యసభ సభ్యత్వం కోసం టీఆర్ఎస్ లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ, ముఖ్యంగా కేసీఆర్ తనయురాలు కవిత... అలాగే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, వినోద్ కు ఇఫ్పటికే కేబినెట్ ర్యాంక్ హోదాతో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఉండటంతో... రాజ్యసభకు పంపించకపోవచ్చనే అంటున్నారు. ఇక, కవితను మాత్రం కచ్చితంగా రాజ్యసభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభలో అనేక అంశాలపై ధాటిగా మాట్లాడి ప్రశంసలు పొందిన కవితకు రాష్ట్ర సమస్యలపై పూర్తి అవగాహన ఉండటంతో... రాజ్యసభకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో, టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. అయితే, రెండో సీటు విషయంలోనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని, దాన్ని ఎవరికి కేటాయిస్తారనేది చివరి నిమిషం వరకు సస్పెన్సే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.

ఆయషా రీపోస్ట్ మార్టంకి సీబీఐ రంగం సిద్ధం......

పన్నెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరమీదికొచ్చింది. ఆయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఈ నెల 20 లోగా పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా హత్య కేసు సంచలనం రేపింది.2007 డిసెంబర్ లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేటు కళాశాల హాస్టళ్లు, ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురైంది. హత్య చెయ్యడానికి ముందు ఆమె పై అత్యాచారం చేసినట్టు పోలీసులు నిర్ధరించారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సత్యం బాబు అనే యువకుడిని గుర్తించారు. సత్యంబాబుకి జైలు శిక్ష విధించారు. అయితే ఈ కేసులో సత్యంబాబును న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఆయేషా కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తును సీబీఐ చేపట్టింది. నిజానికి కొద్ది రోజుల క్రితమే ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని సీబీఐ నిర్ణయించుకుంది కానీ అది సాధ్యపడలేదు. సీబీఐ పై నిషేధం ఎత్తివేయడంతో ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో పునర్విచారణను వేగవంతం చేయాలని సిబిఐ నిర్ణయించుకుంది. ఈ కేసులో ఇప్పటికే 12 ఏళ్ళ పాటు జాప్యం జరిగింది ప్రధాన నిందితుడిగా గుర్తించిన సత్యం బాబు నిర్దోషిగా విడుదలయ్యాడు. దీంతో సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికీ గుంటూరు రెవిన్యూ అధికారులతో సిబిఐ మాట్లాడి, తెనాలిలో ఆయేషాను ఖననం చేసిన ప్రాంతానికి సీబీఐ వెళ్లనుంది. ఇప్పటి కైనా ఆయేషా హత్య కేసులో అసలు దోషుల సిబిఐ గుర్తిస్తోందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.  

మోదీ క్షమాపణ చెప్పాలి.. రేప్ ఇన్ ఇండియా వివాదంపై వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యాఖ్యల పై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే క్షమాపణలు చెప్పేదిలేదని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో ఈసీని కలవాలని నిర్ణయించుకుంది బిజెపి, స్మృతి ఇరానీ నేతృత్వంలోని బిజెపి బృందం ఈసీని కలవనుంది. రాహుల్ వ్యాఖ్యల పై లోక్ సభ దద్దరిల్లింది. దేశానికి క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. అయితే క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ బీజేపీ పై ఎదురు దాడి మొదలు పెట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తాను కాదని మోడీనే అని రాహుల్ అన్నారు. గతంలో మోడీ ట్వీట్ చేసిన వీడియోను రాహుల్ రీ ట్వీట్ చేశారు. 2013 ఎన్నికల ప్రచారంలో మోడీ ఢిల్లీని రేప్ క్యాపిటల్ అంటూ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగ్నిగుండంలా మార్చినందుకు దేశ ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చినందుకు ఢిల్లీని రేప్ క్యాపిటల్ అన్నందుకు మోడీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్. లోక్ సభ నిరవధిక వాయిదాకు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం చెలరేగింది. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పాలని బిజెపి మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలతో రాహుల్ దేశ ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. గతంలో ఏ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె విమర్శించారు.

కేంద్రానికి కంప్లైంట్.. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యేపై అమిత్ షా కు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు

  ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం హస్తినకు చేరింది. శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు రాష్ట్ర బిజెపి నాయకులు. నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతల పై విచారణ జరపాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏపీ డీజీపీకి లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాళహస్తిలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ వర్సెస్ బీజేపీ రాజకీయం సరి కొత్త టర్న్ తీసుకుంటోంది. ఇటీవల శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతర వద్దకు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వైసిపి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బిజెపి నాయకులు రాకపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గంగమ్మ జాతర తర్వాత పోలీసుల అండతో తమపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు బనాయించారని బిజెపి నేతలు ఎమ్మెల్యే పై ఆరోపిస్తున్నారు, ఎస్పీకు కూడా ఫిర్యాదు చేశారు. తమ పార్టీ బలపడుతుందన్న కారణం గానే నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు బీజేపీ నాయకులు. శ్రీ కాళహస్తి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే ఆరాచకాలు ఎక్కువయ్యాయని చివరకు పవిత్ర ఆలయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారంటున్నారు బిజెపి నాయకులు. అధికార పార్టీ ఆగడాలను నిలదీస్తే తమపై దాడులు చేయడంతో పాటు కేసులు పెట్టారని నియోజక వర్గ బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ ఆరోపించారు. అందుకే అమిత్ షా కు ఫిర్యాదు చేశామని విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ బలపడుతుందన్న కారణంగా దాడులతో అధికార పార్టీ భయబ్రాంతులకు గురి చేస్తోందని ఏపీ బీజేపీ ఆరోపించింది. ఇటీవల శ్రీకాళహస్తిలో బిజెపి నేతల పై జరిగిన దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు బిజెపి రాష్ట్ర నాయకులు.

కోర్టు ధిక్కరణ కేసుల పై హై కోర్టు తీవ్ర ఆగ్రహం ........

  రోజురోజుకు పెరిగిపోతున్న కోర్టు ధిక్కరణ కేసులపై హై కోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సింగిల్ జడ్జి ముందు సుమారు 800 కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ కోర్టులో 2000 వరకు కోర్టు ధిక్కార కేసులున్నాయి. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోంది అని కోర్టుకు హాజరైన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను నిలదీసింది. కోర్టు ఆదేశాలను అధికారులు పాటించకపోవడం వల్లే కోర్టు ధిక్కార వ్యాజ్యాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు పాటించాలని అధికారులకు మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పమంటారా అని ప్రశ్నించింది. ఇద్దరు అధికారులను జైలుకు పంపితే మిగిలిన అధికారులు దారికొస్తారు అని వ్యాఖ్యానించింది. సంస్థాగతం గా సమస్యలను పరిష్కరించుకునేందుకు స్టేట్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని 7,8 నెలల క్రితమే ప్రభుత్వానికి సూచించామని, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించింది.రెవెన్యూ, మున్సిపల్, రవాణా, హోంశాఖల పై ఎక్కువగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలు వస్తున్నాయని తెలిపింది. కావాలని ఎవరూ ధిక్కరణ వ్యాజ్యాలు వెయ్యరని అబిప్రాయపడింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు జోక్యం చేసుకున్నప్పుడే అధికారుల కళ్లు తెరుస్తున్నారని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలు పాటించేలా అధికారులకు నేర్పాలని లేదంటే కోర్టు ఆదేశాలు ఎలా గౌరవించాలో తామే నేర్పుతామని వ్యాఖ్యానించింది.ఒక వ్యాజ్యంలో అప్పీలు చేయడానికి 466 రోజులు ఆలస్యం కావడం పై మన్నించాలని స్పెషల్ జీపీ హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అంశం పై స్పందించిన ధర్మాసనం కోర్టు లోనే ఉన్న అడ్వకేట్ జనరల్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ శాఖల్లో పరిశీలన కమిటీ ఏర్పాటు చేయాలని సర్వీసు సంబంధిత వివాదా లను కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిం చేలా చర్యలు ఉండాలని తెలిపింది. మరి ఈ చర్యలు అమలు అవుతాయో లేదా ఇంకా ధిక్కరణ కేసులు పెరుగుతూనే ఉంటాయా అన్నది వేచి చూడాలి. 

జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు.. సభను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

సీఎం జగన్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది టిడిపి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడని మాటలను అన్నట్లుగా చెబుతూ సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టించారని ఈ నోటీసుల్లో పేర్కొంది టిడిపి. నిన్న ( డిసెంబర్ 12న ) తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు సభకు వచ్చే సమయంలో జరిగిన ఘర్షణపై ఈరోజు ( డిసెంబర్ 13న ) కూడా సభలో వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ ఘర్షణపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను.. ఆయన వాడిన భాషను తీవ్రంగా తప్పు పట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని కించపరుస్తూ ఏ రకంగా దూషిస్తారని.. దానికి ఏం సమాధానం చెప్తారని  సభలో గట్టిగా నిలదీశారు జగన్. ఇదే సందర్భంలో నిన్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు కూడా అధికారి పార్టీ సభ్యులు స్పీకర్ అనుమతితో వాటిని సభలో ప్లే చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షాలు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని దీనిపై వారు చింతిస్తున్నారనే ప్రకటన చేసినట్లయితే ఈ విషయాన్ని ముగిస్తారని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని కించపరిచే విధంగా చంద్రబాబు నోటి నుంచి అటువంటి పదాలు రాలేదని సభను పక్కదోవ పట్టించటానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, చేయనటువంటి వ్యాఖ్యలను చేశారని, దీనిపై విచారణ చేయాలి, చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ప్రివిలైజ్డ్ నోటీసులు ఇచ్చారు. అయితే సభలో ఉన్న ఇతర సభ్యుల దగ్గర నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకుని తదుపరి ఎటువంటి చర్యలకు వెళ్ళాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

నిర్భయ కేసు... భద్రతా కారణాల వల్ల 18వ తేదీకి వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష పై విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పటియాలా కోర్టు విచారించింది. దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలు చేయాలంటూ పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 29 న అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ ప్రకారం ఇవాళ కోర్టు ముందుకు నిర్భయ దోషులు హాజరు కావాల్సి ఉంది. అయితే తీహార్ జైల్లో ఉన్న దోషులను బయటకు తీసుకు వచ్చే పరిస్థితి లేక పోవడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కోర్టు విచారించింది. సుప్రీం కోర్టు ఇప్పటికే మరణ శిక్ష విధించిందని మెర్సీ పిటిషన్ లు కూడా తిరస్కరించారని ఇక ఆలస్యం చేయకుండా శిక్షను అమలు చేయాలని నిర్భయ పేరెంట్స్ కోర్టుకు విన్నవించారు.  మరోవైపు తనకు విధించిన మరణశిక్ష పై రివ్యూ చేయాలని దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీని పై డిసెంబర్ 17న అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం అక్షయ్ సింగ్ పిటిషన్ పై రివ్యూ చేయనుంది. ఒకవేళ తీర్పు పై రివ్యూ చేసేది లేదని గత తీర్పే ఫైనల్ అని సుప్రీం కోర్టు చెబితే మరణ శిక్షకు రూట్ క్లియర్ అయినట్టే. తీహార్ జైల్లోనే దోషులను ఉరితీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బక్సర్ జైలు నుండి ఉరితాళ్లు కూడా ఆర్డర్ చేశారు. నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చేసే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జైలు నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన 14 రోజుల తరువాతే మరణ శిక్ష విధించాల్సి ఉంటుంది. దోషుల కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉరితీస్తున్నారో సమాచారమివ్వాలి. ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. తమ వస్తువులను కుటుంబ సభ్యులకు అందజేసే చాన్సుంది. ఉరివేసి ఒక రోజు ముందు దోషులు కోరుకున్న ఆహారం అందించాలి. నిబంధనలను బట్టి చూస్తే సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ ను కొట్టివేసినా ఉరిశిక్ష అమలకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఏడేళ్ల నుండి న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని ఇప్పటికీ శిక్ష అమలు చేయడం లేదంటూ నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరణ శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేస్తున్నారు.

నేనేం నేరాలు చేసి జైలుకి వెళ్ళలేదు.. జగన్ పై బాబు ఫైర్

అసంబ్లీలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అడుగడుగునా అడ్డుకున్నా పట్టువీడని విక్రమార్కుడిలా ఆయన లోపలికి వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ముందుకు వెళ్తూ ప్రజల కోసం నిరంతరం పోరాడతామని బాబు స్పష్టం చేసారు. ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించే పరిపాలన ఉండాలే కానీ ఒక ఉన్మాది పరిపాలనలాగా ఉండకూడదని బాబు మండిపడ్డారు. తనని అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ నాన్సెన్స్ అని తప్ప తాను తప్పుగా మాట్లాడలేదని.. తనకు లోపలికి వచ్చే హక్కు లేదా అని గట్టిగా నిలదీశాను తప్ప ఇంకోటి కాదన్నారు బాబు. దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బాబు వెల్లడించారు. తనకు పౌరుషంగా మాట్లాడం తెలుసని.. నేరాలు చేసి జైలుకు వెళ్లడాలు తెలియదని.. అలాంటివి తమకు అలవాటు లేదని బాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం కోసం తానూ జీవితాంతం పని చేశానని చెప్పుకొచ్చారు. తాను గట్టిగా మాట్లాడిన మాట వాస్తవం కానీ.. లోపలకు రానివ్వకుండా అడ్డుపడి లోపలికి రానివ్వకపోతే ఎవరికయినా బాధ ఉంటుందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేస్తున్నారనే బాధ ఎవరికైనా ఉంటుందని.. అందుకే గట్టిగా చెప్పాను తప్ప మరొకటి లేదని బాబు తెలియజేసారు.

రాజ్యసభలో విజయసాయిరెడ్డికి చుక్కెదురు.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించి అబాసుపాలయ్యారు

ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.  దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.

జగన్ సర్కారుకు మరో గట్టి ఎదురుదెబ్బ... 10రోజుల్లో నివేదిక కోరిన హైకోర్టు

సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పాలసీలకు అనుగుణంగా యంత్రాంగం నడుచుకోవడం కామన్. అయితే, తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవడానికి ఆ పార్టీ రంగులను అక్కడక్కడా కనిపించేలా వేయడం కూడా సర్వసాధారణమే. కానీ అది శృతిమించినప్పుడే విమర్శలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. బడి, గుడి అని తేడా లేకుండా అన్నింటినీ వైసీపీ రంగులతో నింపేస్తున్నారు. దాంతో, ఏ ప్రభుత్వ భవనాన్ని చూసినా నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులే కనిపిస్తున్నాయి. చివరికి చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులతో నింపేస్తున్నారు. అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీయే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఈ రంగుల రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.   గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణపై జరిపిన ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.  

భీమిలిలో గంటా వర్గం ఖాళీ... వైసీపీలో కొత్త టెన్షన్!!

విశాఖ జిల్లా భీమిలి నియోజక వర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. అక్కడ టిడిపి తరపున పోటీ చెయ్యడానికి అప్పుడు ఎంపిగా ఉన్న అవంతి శ్రీనివాస్ అదే సమయంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావులు తీవ్రంగా పోటీ పడ్డారు. చివరకు అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరి భీమిలిలో విజయం సాధించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు ఎప్పట్లాగే నియోజకవర్గం మారారు. విశాఖ ఉత్తర నియోజక వర్గం నుంచి అని గెలుపొందారు. భీమిలిలో విజయం సాధించిన అవంతి శ్రీనివాస్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కింది. అప్పటి నుంచి ఆయన మాజీ మంత్రి గంటాపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టారు. కానీ ఆయన మాత్రం మంత్రి అవంతి మాటలకు ఎక్కడ ప్రతిస్పందించడం లేదు. నిజానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో ఉన్నపుడు ఆయన వెనక చాలా మంది నాయకులుండేవారు. అయితే భీమిలి నియోజక వర్గం నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి గంట వెళ్లడంతో ఆయన వెనకున్న కొంతమంది అవంతి వైపు చేరారు. మరికొందరు మాత్రం ఎన్నికల సమయంలో సబ్బం హరి అక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ గంట వర్గీయులుగానే కొనసాగుతున్నారు. ఈనేపధ్యంలో గంటాపై మంత్రి అవంతి వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం వాటికైన స్పందించకపోవటం జరుగుతుంది. ఇక ఇలాగైతే లాభం లేదని మంత్రి అవంతి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలో గంటా వర్గీయులుగా ఉన్న వారిని వైసీపీలో చేర్చుకున్నారు. అవంతి పిలవగానే గంట వర్గీయులు వైసీపీలో చేరడానికి కారణమేంటని ఆరా తీస్తే అసలు సంగతి బయటపడిందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భీమిలిలో గంటా వర్గం లోని ప్రతి నాయకుడికి మంత్రి అవంతినే స్వయంగా ఫోన్ చేశారు అధికారంలో ఉన్న పార్టీ అందులో మంత్రి తమకు అన్నిసార్లు ఫోన్ చేయడంతో భీమిలిలోని గంటా వర్గీయులు ఆగలేకపోయారు. ఇప్పటికే టిడిపి నేతలను వేధించడం ఇబ్బంది పెట్టడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. తమపై వేధింపులు మొదలయ్యే అవకాశం ఉందని భావించి వైసీపీలో చేరారు. కొందరేమో ఇప్పటికే చిన్న చిన్న నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. తాము ఆ పదవుల్లో అలాగే కొనసాగాలంటే అధికార పార్టీ అండదండలు తప్పనిసరని వారు కూడా పార్టీ మారారు. మరికొందరు భీమిలికి టిడిపి ఇంచార్జిగా ఉన్న సబ్బం హరి పార్టీని పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని ఈ క్రమంలో మంత్రే స్వయంగా పిలవడంతో వైసీపీలోకి వెళ్లామని అంటున్నట్లు సమాచారం.  ఇదిలా వుంటే అవంతి శ్రీనివాస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గంట వర్గీయుల చేరిక పై మరోలా చెబుతున్నారు. ఎందుకండీ వాళ్ళని పార్టీలో చేర్చుకున్నారు అని అవంతిని ఎవరైనా అడిగితే ఆ ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు వాళ్ళంతా నా అనుచరులే నా వెనకు తిరిగే వారు నేను చెబితేనే వారంతా గంటా వెనుక నడిచారు నేను మళ్లీ ఈ నియోజకవర్గానికి రావడంతో వారంతా ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారని అంటున్నారు. తాను ఎవరిని పిలవలేదు అని ఆయన బయటకు చెబుతున్నారు. తన మాటలకు గంట నుంచి స్పందన లేకున్నా ఆయన వర్గీయులను తన వైపు తిప్పుకున్నాననే సంతృప్తిలో అవంతి ఉన్నారు. మరోవైపు భీమిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త గుబులు మొదలైంది. ఇక్కడ ఇప్పటికే చాలా చోట్ల ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ క్రమంలో టిడిపి నుంచి వలస వచ్చిన వారిని చూసి ఇప్పుడు మూడో వర్గం కూడా తయారవుతుందని అనుకుంటున్నారు. మొత్తం మీద గంట మీద పై చేయి సాధించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ వేసిన ఎత్తులు మున్ముందు భీమిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సెగలు రేపుతాయో చూడాలి.

తెలంగాణపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న బీజేపీ...

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలన్నది బీజేపీ టార్గెట్. అందుకోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఏపీతో పోల్చితే తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో అధికారం కోసం సకల అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు రకరకాల ప్రయోగాలు చేసిన బీజేపీ... ఇప్పుడు అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తోంది. తెలంగాణ జనాభాలో సగ భాగమున్న బీసీలే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. బీసీలను ఆకట్టుకుంటే చాలు... అధికారం దక్కించుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ... బీసీ అస్త్రాన్ని ప్రయోగించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలనుకుంటోంది.  గతంలో టీడీపీకి బీసీలే వెన్నుముఖగా నిలిచారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం దాదాపు కనుమరుగు కావడంతో బీసీ వర్గాన్ని మొత్తం తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీసీ వర్గంపైనే దృష్టిపెట్టి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో... అంతకు మించిన వ్యూహంతో బలహీనవర్గాలను తనవైపు తిప్పుకునేందుకు కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా బీజేపీలో బీసీలకు కల్పిస్తోన్న ప్రాధాన్యతను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే బీసీ కావడంతో దాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. ఇక, తెలంగాణ గవర్నర్ గా బీసీ అయిన తమిళిసైని నియమించామని, అలాగే, తెలంగాణ బీసీ అయిన దత్తాత్రేయను హిమాచల్‌ గవర్నర్‌గా పంపి... బీజేపీలో బీసీలకు పెద్దపీట వేశామని జనంలోకి వెళ్లనున్నారు. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ అయిన లక్ష్మణ్ నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు పెద్దపీట పేరుతో అధికార టీఆర్ఎస్ తో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులను పెద్దఎత్తున బీజేపీలోకి లాగాలనేది కాషాయదళం వ్యూహం తెలుస్తోంది. అంతేకాదు 2024లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, మున్సిపల్ ఎన్నికల్లోనే ఈ బీసీ మంత్రాన్ని ప్రయోగిస్తారో లేక అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ జపం చేస్తారో... అసలు బీజేపీ బీసీ మంత్రం వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

కరీంనగర్ జిల్లా విభజనతో చీలిన క్యాడర్.. అయోమయంలో తండ్రి కొడుకులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాశించారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ పొలిటీషియన్ కావడంతో సహజంగానే పార్టీ నేతలు ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తన రాజకీయ వారసుడిగా పరిచయమైన ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు అలాంటి ప్రాధాన్యతనే పార్టీ శ్రేణులు ఇచ్చేవారు.   జిల్లాల విభజన తర్వాత సీన్ మారిపోయింది. హుస్నాబాద్ నియోజక వర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్ళిపోవడంతో ఈ తండ్రీ కొడుకులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. వారిని పట్టించుకునే వారే కరువైపోయారు అంటున్నారు. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ వరంగల్ అర్బన్ జిల్లా సిద్దిపేట జిల్లాల పరిధిలోకి హుస్నాబాద్ నియోజక వర్గం వెళ్లింది. కరీంనగర్ జిల్లా పరిధిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే సతీష్ బాబు చెప్పిన వారికే పదవులు వరిస్తూ ఉండగా.. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో మాత్రం భిన్నమైన పరిణామాలు ఎదురవుతున్నాయి. తమ అనుచరులకు పదవులు ఇప్పించుకోవటం కష్టమవుతుందని అంటున్నారు. అంతేకాదు కనీసం సమాచారం లేకుండా నామినేటెడ్ పదవులను ఆ జిల్లా నేతలు భర్తీ చేస్తూ ఉండడంతో వీరికి ఆగ్రహం తెప్పిస్తోందని చెప్తున్నారు. కుడాకు సంబంధించిన పదవుల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఎల్కతుర్తిలో జరిగిన సమావేశంలో బహిరంగంగానే తండ్రీ కొడుకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాళ్లు దగ్గరికి రానివ్వరు, వరంగల్ జిల్లా వాళ్లు పట్టించుకోరంటూ ఎమ్మెల్యే సతీష్ బాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన వారికి డైరెక్టర్ల పదవుల్లో ప్రాధాన్యం కల్పించకపోవడం లక్ష్మీకాంత రావుకు, సతీష్ బాబుకు కోపం తెప్పించిందని పార్టీలో అనుకుంటున్నారు. లోకల్ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం హుస్నాబాద్ నియోజక వర్గ పరిధి లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నేతలకు కల్పించకపోవడం పై లక్ష్మీకాంతరావు చురకలేస్తున్నారు. హుస్నాబాద్ నియోజక వర్గం మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే సతీష్ బాబు మూడు జిల్లాల అధికారులతో పాటు ప్రధాన నేతలతోనూ సంబంధాలను కొనసాగించడం కష్టం గా మారింది. ఒక జిల్లా వైపు రాజకీయ పరిణామాలను సరిదిద్దేలోపే మరో జిల్లా పరిధిలో ఇంకో సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. అసంతృప్తిని తగ్గించేందుకు నేరుగా లక్ష్మీకాంతరావు జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి తగిన ప్రాధాన్యం కల్పించాలంటూ మిగతా జిల్లాల నేతలకు కాస్త గట్టిగానే చెబుతున్నారు. కొడుకు కోసం తండ్రి.. క్యాడర్ కోసం ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి అంటున్నారు జనాలు.  

వైసీపీలో రాజ్యసభ రేస్... ముగ్గురి పేర్లు దాదాపు ఖరారు

వైసీపీలో రాజ్యసభ రేస్ మొదలైంది. వచ్చే ఏడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే, అసెంబ్లీలో పార్టీల బలాబలాల ప్రకారం ఆ నాలుగు సీట్లూ అధికార వైసీపీకే దక్కనున్నాయి. దాంతో, రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. అయితే, ఖాళీ అవుతోన్న ఆ నాలుగు స్థానాల్లో మూడింటికి ఆల్రెడీ అభ్యర్ధులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన బీద మస్తాన్ రావు, అలాగే గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సభ్యత్వాలు దాదాపు ఫైనలైజ్ అయినట్లు చెబుతున్నారు. మూడో అభ్యర్ధిగా అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక, నాలుగో సీటును ఎస్సీలకు కేటాయించాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ సీటు ఒంగోలును వదులుకున్నప్పుడు వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. పైగా వైవీ సుబ్బారెడ్డి స్వయానా జగన్ కు బాబాయ్ కావడం, ఇఫ్పటికే టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఉండటంతో... మళ్లీ రాజ్యసభకు పంపుతారో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే, రెడ్డి కమ్యూనిటీ నుంచి ఒక్కరికే అవకాశమివ్వాలని జగన్ భావిస్తుండటంతో... అయోధ్యరామిరెడ్డి లేదా వైవీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశముందంటున్నారు. ఎందుకంటే, వైసీపీకి ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఉండగా, వాళ్లిద్దరూ రెడ్డి సామాజికవర్గమే. దాంతో, వచ్చే ఏడాది వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని రెడ్డి కమ్యూనిటీ ఇచ్చే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఏడాది రాజ్యసభలో వైసీపీ బలం పెరగనుంది. ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉండగా, మరో నలుగురు జత కలవనున్నారు. దాంతో, రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య ఆరుకి పెరగనుంది. అలాగే, రాజ్యసభలో వైసీపీకి ప్రాధాన్యత దక్కనుంది.

151మంది ఒకవైపు... చంద్రబాబు ఒక్కరే ఒకవైపు...

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. అధికారపక్షం వైపు 151మంది ఎమ్మెల్యేలు ఉంటే... ప్రతిపక్షం వైపు 22మంది మాత్రమే ఉన్నారు. అయితే, ఈ 22మందిలోనూ సగమంది అసలు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంటున్నారు. కొందరైతే అసలు సభకే రావడం లేదు. కొంతమంది వచ్చినా ఏ మూలనో దూరంగా కూర్చుంటున్నారు. దాంతో, చంద్రబాబు దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నారు. అధికారపక్షం అణ్వస్త్రాల్లాంటి బాంబులను విసురుతుంటే... వాటిని తట్టుకుంటూ ధీటుగా తిప్పికొడుతున్నారు. చంద్రబాబు అన్నట్లుగా పాతికేళ్ల యువకుడిలాగే 151మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొంటున్నారు. అయితే అంతోఇంతో అచ్చెన్నాయుడు, రామానాయుడు మాత్రమే చంద్రబాబు సపోర్టుగా నిలబడుతున్నారు. గొంతు కలుపుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడు, రామానాయుడుని కూడా అధికారపక్షం దాదాపు నియంత్రిస్తుండటంతో... చంద్రబాబు ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. అందుకే 50 మంది కాదు... 150మంది ఒకేసారి వచ్చినా తాను ఎదుర్కోగలనంటూ పంచ్ డైలాగులు విసరడమే కాకుండా, తన సామర్ధ్యాన్ని అధికారపక్షానికి రుచిచూపిస్తున్నారు చంద్రబాబు. అయితే, అధికారపక్షం చంద్రబాబునే టార్గెట్ చేయడం... మాటలతో కించపర్చుతుంటే... వాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనపైనా, తనయుడు లోకేష్ పైనా విమర్శలు చేస్తుంటే... ఎప్పటికప్పుడు చంద్రబాబు లేచి తిప్పికొట్టాల్సి వస్తోంది. ప్రతిదానికీ చంద్రబాబే లేవాల్సి వస్తోంది. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరిలు బాబుకి తోడుగా చెలరేగానికి ట్రై చేస్తున్నా... వైసీపీ నేతల దాడిని సమర్ధంగా తిప్పికొట్టలేకపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు మాట్లాడకుండా అధికారపక్షం కంట్రోల్ చేస్తోంది. ఒకవేళ లేచినా, మాటలతో కించపరుస్తూ కూర్చునేలా చేస్తున్నారు. దాంతో, అధికారపక్షాన్ని ధాటిగా ఎదుర్కొనేందుకు వాగ్ధాటి కలిగిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకి కరవయ్యారనే మాట వినిపిస్తోంది. ఇక, వల్లభనేని వంశీ... టీడీపీ నుంచి వేరుపడి ప్రత్యేక సీటును దక్కించుకున్నారు. మిగతా 22మంది ఎమ్మెల్యేల్లో సగం మంది పక్క చూపులు చూస్తుండటంతోనే చంద్రబాబుతో కలిసి ధాటిగా అధికారపక్షంపై విరుచుకుపడటం లేదని అంటున్నారు. అయితే, తన వెనుక ఎంతమంది ఉన్నారనేది పట్టించుకోని చంద్రబాబు వన్ మేన్ ఆర్మీలాగా అధికారపక్షంపై పోరాడుతున్నారు.  

పవన్ పై రాపాక సంచలన వ్యాఖ్యలు.. డౌట్ లేదు.. వైసీపీలో చేరడం ఖాయం!!

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిందే ఒక్క ఎమ్మెల్యే సీటు అంటే... అసలు గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ వైపు ఉన్నాడో లేడో అర్థంగాక అటు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇటు జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తీరు ఆ పార్టీని కలవరపెడుతోంది. ఎమ్మెల్యే రాపాక పేరుకి జనసేనలో ఉన్నా... ఆయన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉంటున్నాయి. ఒకసారి అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ని దేవుడు అని ఆకాశానికెత్తారు. మరోసారెమో జగన్ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ చర్యలతో రాపాక పార్టీ మారతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే రాపాక పార్టీ మారలేదు, ఆయన తీరూ మార్చుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే ఓకే.. కానీ తెలుగు మీడియంని పూర్తిగా తొలగించడం ఏంటని పవన్ మండిపడుతున్నారు. తెలుగు బాషని కాపాడాలంటూ.. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే రాపాక మాత్రం.. అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ  సందర్భంగా.. జగన్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కి మద్దతు ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇక తాజాగా రాపాక చేసిన కామెంట్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ తాజాగా రైతుల కోసం దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే.. అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కాలేదని గతంలో చెప్పిన రాపాక.. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఇతర కారణాల వల్ల పవన్‌ సభకు వెళ్లలేదని చెప్పారు. అంతేకాదు, పవన్‌ ఏ కార్యక్రమం చేసినా.. పదిమంది మాత్రమే వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయానికి ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక సూచించారు. ముందుముందు పవన్‌ సభలకు ఇంకా ఆదరణ తగ్గిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసారు. మొత్తానికి రాపాక తీరు చూస్తుంటే జనసేనకి మరింత దూరం జరుగుతున్నారని అర్థమవుతోంది. వైసీపీలో చేరేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి రాపాక పార్టీ మారతారో లేక తన తీరుని మార్చుకుంటారో చూడాలి.

అన్నదమ్ముల రగడ.. అయ్యన్నపాత్రుడు ఇంటిపై వైసీపీ జెండా

చింతకాయల అయ్యన్న పాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు చింతకాయల సన్యాసిపాత్రుడు. మొన్నటి వరకు అన్నదమ్ములిద్దరూ టిడిపిలో ఉండేవారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుండి పోటీ చేసి అయ్యన్న పాత్రుడు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ఇంట్లో పొలిటికల్ లొల్లి మొదలైంది. అయ్యన్న పాత్రుడు ఇంటిపై ఇంతకు ముందు టిడిపి జెండా ఉండేది. అయితే ఇప్పుడు అదే ఇంటి పై వైసీపీ జెండా ఎగురుతోంది. ఈ జెండాల లొల్లే ఇప్పుడు ఇంట్లో చిచ్చుపెట్టింది.  అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసిపాత్రుడు ఇటీవలై వైసిపిలో చేరారు. అయ్యన్నపాత్రుడు తన కొడుకు విజయ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని సన్యాసిపాత్రుడు తన దారి తాను చూసుకున్నారు. సరిగ్గా అయ్యన్నపాత్రుడి బర్త్ డే రోజే మెడలో కండువా మార్చారు. ఇక్కడ వరకు వివాధం లేదు. కానీ ఇప్పుడు ఇంటి పై జెండా ఎగరడమే ఇంట్లో గొడవకు కారణమైంది. అయ్యన్న పాత్రుడు సన్యాసిపాత్రుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పై ఫ్లోర్ లో సన్యాసిపాత్రుడు ఉంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయ్యన్న పాత్రుడు ఉంటున్నారు. ఇంతకు ముందు టిడిపి జెండా ఇంటి పై ఉండేది. అయితే సన్యాసిపాత్రుడు ఇంటి పై వైసీపీ జెండా కూడా పెట్టటంతో ఇంట్లో వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం పై మాటా మాటా పెరిగి అయ్యన్నపాత్రుడు పిన్ని బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరింది. తమ ఇంటి పై వైసీపీ జెండా ఎలా ఎగుర వేస్తారనేది అయ్యన్న ప్రశ్న. అయితే తన ఇంటి పై తాను తన పార్టీ జెండా ఎగురవేశానని సన్యాసి అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం పోలీసు స్టేషన్ కు చేరింది.  

పవన్ తిడితే.. చిరు ఆలింగనం... జగన్ విషయంలో పొంతనలేని మెగా బ్రదర్స్ ప్రవర్తన

వైసీపీ ప్రభుత్వంపై విపరీతమైన దూకుడుతో ముందుకు వెళ్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. రైతుల సమస్యలు, ఇసుక కొరతపై ఆందోళనలు చేశారు. అసలు సీఎంగా జగన్ ని తాను గుర్తించనంటూ ప్రకటించేశారు. సీఎం అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియం అమలుపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఒక దశలో పవన్ కామెంట్స్ పై స్పందించిన సీఎం జగన్ కూడా పవన్ కల్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించారు. పవన్ మూడు పెళ్లిల్లు చేసుకున్నారని విమర్శించారు. దీంతో సీఎం జగన్ కి పవన్ కల్యాణ్ కు మధ్య వివాదం పీక్ స్టేజ్ కు చేరింది. ఒక దశలో బిజెపి అమిత్ షా అంటే జగన్ కు భయం అంటూ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. ఇంకా ముందుకెళ్లి తాను బిజెపికి ఎప్పుడూ దూరంగా లేనని చెప్పారు.  పవన్ తీరు అలా ఉంటే ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. తనకి తమ్ముడికి అస్సలు సంబంధం లేదన్న ధోరణిలో ఉన్నారు. సైరా సినిమా విడుదలకు సీఎంని కుటుంబ సమేతంగా కలిసిన చిరంజీవి సిఎంను కొనియాడారు. అలాగే చిరంజీవి భార్య సీఎం సతీమణికి చీర పెడితే తిరిగి భారతి కూడా ఆమెకు చీర పెట్టారు. పోనీ అది సినిమా ప్రమోషన్ లో భాగం కదా అనుకుంటే తాజాగా మహిళలపై అత్యాచార నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సీఎం జగన్ చేసిన దిశా చట్టాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేశారు చిరంజీవి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఒక వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సమస్యల పై తమ్ముడు కాకినాడలో దీక్ష చేస్తున్న రోజు అన్న జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. దీంతో చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నారా అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా తమ్ముడు పవన్ వెంటే ఉంటారు. జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి జనసేన వైపు మళ్లించడానికి కృషి చేస్తున్నారు. అయితే మరోవైపు చిరంజీవి జగన్ కి దగ్గరవుతున్నారా లేక తమ్ముడికి జగన్ కి మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద కొణిదెల కుటుంబ కహాని ఎంటో అర్థం కాక మెగా ఫాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

పైసా వసూల్.. బీజేపీలో కార్పొరేటర్ టిక్కెట్ కి కూడా కోట్లు పలుకుతుంది

నిజామాబాద్ కమలంలో వసూళ్ల దందా అంశం కలకలం రేపుతోంది. బల్దియా ఎన్నికల నగారా మోగక ముందే బిజెపిలో టిక్కెట్ల లొల్లి రచ్చకెక్కింది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఊపుమీదున్నారు బీజేపీ నేతలు. నిజామాబాద్ కమలంలో తాజాగా ఓ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేటర్ టికెట్లు, కౌన్సిలర్ టికెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వసూళ్ల దందాకు తెర లేపడం విమర్శలకు దారి తీసింది. నిజామాబాద్ లో జరిగిన బిజెపి నగర కమిటీ సమావేశంలో ఈ వ్యవహారం పై ఫిర్యాదు రావడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమకు రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయని, జాతీయ స్థాయి నేతలు కూడా తెలుసు అని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఆశావహులు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో కార్పొరేటర్, ఆర్మూర్ భీమ్ గల్ మునిసిపాలిటీల్లో కౌన్సిలర్ టిక్కెట్ల కోసం ఆ పార్టీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వారి ఉత్సాహాన్ని కొందరు నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడిపోయారు. బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఈ విషయంలో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లిస్తామని, పదవులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు జిల్లా పార్టీకి ఫిర్యాదులు అందాయి. అలాంటి వ్యక్తులు మీ వద్దకు వస్తే జిల్లా పార్టీకి ఫిర్యాదు చేయండి అంటూ ప్రకటించారు.  బీజేపీలో కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా బహిరంగ ప్రకటన చేయడంతో ఆ వసూల్ రాజాలు ఎవరు అనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. కేవలం నిజామాబాద్ కార్పొరేషన్ లోనే ఈ వ్యవహారం కొనసాగిందా, మిగిలిన మునిసిపాలిటీల్లోనూ ఇలాంటి దందాలు ఏమైనా సాగుతున్నాయా అనే అంశంపై పార్టీ అప్రమత్తమైంది. అమాయక కార్యకర్తలు, నాయకులు నష్టపోవద్దనే ఉద్దేశం తోనే ముందస్తుగా క్యాడర్ ను జిల్లా అంతటా అప్రమత్తం చేసేలా బహిరంగ ప్రకటన చేసినట్టు నేతలు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీ పరువు పోయిందని పార్టీ వర్గాలే అంటున్నాయి.