తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదు.. జగన్ పై బాబు ఫైర్!!

ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని బాబు స్పష్టం చేశారు. జగన్‌ వల్లే ఇంగ్లీష్ మీడియం వచ్చిందనడం సరికాదని అన్నారు. గతంలో మున్సిపల్ పాఠశాలల్లో తమ హయాంలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేసారు. మీరే ఇంగ్లిష్‌ను కనిపెట్టినట్టు మాట్లాడొద్దని ఎద్దేవా చేసారు. తాము మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడితే మీరు వ్యతిరేకించలేదా అని బాబు ప్రశ్నించారు. అంతేకాదు, మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సందర్భంలో సాక్షి పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనాలను బాబు చదివి వినిపించారు. ఇంగ్లీష్ పై రెండు నాలుకల ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని.. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు.  చంద్రబాబు మాటలు.. వైసీపీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా సీఎం జగన్ అసహనానికి గురయ్యారు. సాక్షిలో ఏం రాశారో చర్చించడానికి అసెంబ్లీ లేదని.. మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దామని చెప్పారు. అసలు తాను ఏనాడు ఇంగ్లీష్ ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ ను వ్యతిరేకించానని మీరు నిరూపించగలరా అని సవాల్ చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే… నేను ఇంగ్లీష్ ను వ్యతిరేకించినట్టు నిరూపించమని జగన్ సవాల్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌కు మేలు చేయడం కోసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల విధానాన్ని భ్రష్టు పట్టించిన మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలని బాబుని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు.   జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బాబు.. తాను సిగ్గుతో తలంచుకోవడం కాదని, జగన్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు క్షమాపణ చెప్పి, తాను మోసం చేయలేదని జగన్ చెప్పుకోవాలని బాబు అన్నారు. సాక్షిలో రాస్తే తనకు సంబంధం లేదనట్టుగా జగన్ మాట్లాడుతున్నారని బాబు ఎద్దేవా చేసారు. ఈ సమయంలో అసహనానికి గురైన జగన్.. ఈ మనిషికి ఏమన్నా బుద్ధి, జ్ఞానం ఉందా అని బాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. సాక్షి అనేది ఒక మీడియా వ్యవస్థ అని, ఎవరి అనుకూల ఛానల్స్, పేపర్స్ వాళ్లకుంటాయని.. వాటిలో రాసినవి తీసుకొచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బాబు స్పందిస్తూ.. మీ పేపర్‌కు విశ్వసనీయత లేదా? అని ప్రశ్నించారు. మీ పేపర్ ఒక చెత్త పేపర్ అని బాబు ఫైర్ అయ్యారు. తనను బుద్ధి, జ్ఞానం లేదని సీఎం అన్నారని.. మరి సాక్షికి బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిలదీశారు. తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదని బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

13మంది ఎమ్మెల్యేలుగా రెడీగా ఉన్నారు... జగన్ ఒక్క మాట చెబితే చాలు..!

మీ శాసనసభ్యత్వానికి ఢోకా లేదని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.... 13మంది టీడీపీ ఎమ్మెల్యేలు... తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నారంటూ అసెంబ్లీ లాబీల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్న జగన్ షరతులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆగుతున్నారని, లేదంటే ఎప్పుడు టీడీపీ ఖాళీ అయ్యేదంటూ కోటంరెడ్డి బాంబు పేల్చారు. అయితే, షరతులు పెట్టినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో 8మంది టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటికి రాగా, తనతోపాటు మిగిలిన 22మందితోనే చంద్రబాబు... అసెంబ్లీలో అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 67మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా జగన్ చేయలేనిది... కేవలం 22మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షానికి బాబు చుక్కలు చూపిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తున్నారు. 40ఏళ్ల తన రాజకీయ అనుభవంతో జగన్ అండ్ టీమ్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఒక్కరిని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అన్న సినీ డైలాగ్ మాదిరిగా జగన్ టీమ్ పై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. యాభై మంది కాదు... నూట యాభైమంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొనే దమ్ము... సమాధానం చెప్పే సామర్ధ్యం తనకుందంటూ వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గమనిస్తే... 151మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఒక్కరే ధీటుగా సమాధానం చెబుతుండటం చూస్తుంటే... వన్ మేన్ ఆర్మీలా కనిపిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు.  

రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు... ఢిల్లీ విందు వెనుక రాజకీయం...!

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టినా... తన వైఖరి మారదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని మరోసారి చాటిచెప్పారు. మిగతా వైసీపీ ఎంపీల్లాగా తాను గిరితీసుకుని ఉండలేనని తేల్చిచెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీని, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాను రఘురామకృష్ణంరాజు కలవడం వైసీపీలో కలకలానికి దారి తీసింది. ఇక, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు భారీ విందే ఇచ్చారు రఘురామకృష్ణంరాజు.  సబార్డినేట్ లేజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇచ్చినప్పటికీ... ఇది కూడా వైసీపీ కలవరం పుట్టిస్తోంది. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు, వీవీఐపీలను ఆహ్వానించినా... కేంద్ర మంత్రుల్లో రాజ్ నాథ్ సింగ్ మాత్రమే హాజరయ్యారు. ఇక, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు... టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్రావు... వైసీపీ నుంచి మిథున్ రెడ్డి అటెండ్ అయ్యారు. అయితే, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు  రఘురామకృష్ణంరాజు ఇచ్చిన విందుపై వైసీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అనుమతి లేకుండా మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను రఘురామకృష్ణంరాజు కలవడంపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో... ఈ విందుపై ఎలా స్పందిస్తారోనన్నది చర్చనీయాంశమైంది.  అయితే, కేంద్ర పెద్దలను బుట్టలో వేసుకునేందుకు, అలాగే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకే రఘురామకృష్ణంరాజు ఈ భారీ విందును ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, వైసీపీ ఎంపీల్లో తన దారి సెపరేట్ అని మరోసారి నిరూపించుకున్నారు  రఘురామకృష్ణంరాజు.

ఏపీ అసెంబ్లీలో వివాదాస్పదంగా వంశీ తీరు... వైసీపీకి వంశీ స్లిప్స్

ఏపీ అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా మారుతోంది. టీడీపీతో విభేదించిన వంశీ ...తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ ను కోరారు. వంశీ వినతి మేరకు ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సీటు కేటాయించారు. అయితే, ఇతరులకు కేటాయించిన సీట్లలో ఎక్కడైనా కూర్చోవచ్చని స్పీకర్ చెప్పడంతో... నాలుగో రోజు టీడీపీ సభ్యులు కూర్చునే మొదటి వరుసలోనే  కూర్చున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పక్క సీట్లో కూర్చున్న వల్లభనేని వంశీ... వైసీపీ ఎమ్మెల్యే అంబటికి స్లిప్స్ పంపిస్తూ వివాదాస్పదంగా వ్యవహరించారు. 2430 జీవో, మీడియాపై ఆంక్షలు విధించారంటూ తెలుగుదేశం ఆందోళన చేస్తున్న సమయంలో వంశీ... అంబటికి స్లిప్స్ పంపించడం చర్చనీయాంశమైంది. అయితే, టీడీపీ సభ్యుల పక్కనే కూర్చుంటూ పక్కలో బల్లెంలా వ్యవహరిస్తోన్న వంశీ తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో మహిళలకు అభయం.. కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

దిశ ఘటన తర్వాత మహిళల భద్రత పై ఆందోళనలు పెరుగుతున్నాయి. కఠిన చట్టాలు తీసుకురావాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మహిళలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మహిళల పై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకొస్తుంది. ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఇప్పటికే మహిళా భద్రత పై చర్చకు పెట్టిన ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లు కూడా తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు 2019ని ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ఏపీ స్పెషల్ కోర్ట్ ఫర్ సెట్ స్పెసిఫైడ్ అఫెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019 కి కూడా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా అమల్లో కి వస్తున్న ఈ చట్ట ప్రకారం అత్యాచారానికి పాల్పడితే నిందితులకు మరణ శిక్ష పడుతుంది. నేరాన్ని నిర్థారించే ఆధారాలుంటే 21 రోజుల్లోనే తుది తీర్పు వస్తుంది. వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లోనే కోర్టు విచారణ పూర్తి చేస్తారు. 21 రోజులల్లో శిక్షలు ఖరారు అవుతాయి. అంటే ప్రస్తుతమున్న 4 నెలల విచారణ కాలాన్ని 21 రోజులకు తగ్గించారు. అంతేకాదు మహిళలు చిన్నారులపై నేరాలు విచారించేందుకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తారు.  ఇక సోషల్ మీడియాలో మహిళలను చిన్నారులను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టిన వారిపై సెక్షన్ 354 ఈ కింద చర్యలు తీసుకుంటారు. మొదటి సారి తప్పు చేస్తే రెండేళ్ల, రెండోసారి పోస్టులు పెడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పిల్లల పై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం కేవలం మూడు నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడుతుంది. దీనిని పది నుంచి పద్నాలుగేండ్ల వరకూ పొడిగిస్తూ చట్టంలో చేర్చారు. నేరాల్లో తీవ్రత ఉంటే జీవిత ఖైదు విధిస్తారు. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. మహిళలకు భద్రత పై ఇలాంటి కఠిన చట్టాలు భరోసా కల్పిస్తాయంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠిన చట్టాలు తీసుకు రావాలని కోరుతున్నారు. నిర్భయ చట్టం కంటే మరింత కఠినంగా ఉండే చట్టాలను కేంద్రం కూడా తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.

దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్ పై సుప్రీం కీలక నిర్ణయం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సిర్పూర్‌కర్ తో పాటు వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దిశ ఎన్‌కౌంటర్‌పై అన్నికోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే విధించింది.   తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కమిటీ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్‌కౌంటర్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని వివరించారు. దిశ మొబైల్ ఇస్తామని చెప్పి రాళ్లతో దాడి చేశారని.. ఆ తరువాత తుపాకీ తీసుకొని కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు చనిపోయారని పేర్కొన్నారు. ఘటనపై ఇప్పటికే జాతీయ మావన హక్కలు కమిషన్ విచారణ జరిపిందని రోహత్గి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు జరిపిస్తోందని చెప్పారు. ఈ సమయంలో మరో విచారణ కమిటీ అవసరం లేదని సూచించారు. కానీ సీజేఐ బాబ్డే.. ఈ వాదనలను అంగీకరించలేదు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. తాము ఏర్పాటుచేసిన  విచారణ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. సిట్ దర్యాప్తుతో పాటు సమాంతరంగా విచారణ జరుగుతుందని తెలియజేసింది. సిట్ తన దర్యాప్తు వివరాలను విచారణ కమిటీతో పంచుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.

జగన్ హామీలకే దిక్కు లేదా? మాట తప్పం...మడం తిప్పమనేది ఉత్తుత్తి మాటలేనా?

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇస్తారు... గెలిచాక ముఖం చాటేస్తారు... ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రకటనలను... నేతల హామీలను నమ్మి... ప్రజలు మోసం పోవడం కామన్... అదే, పరిస్థితి రాజకీయ నేతలకు ఎదురైతే... అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో... వైసీపీలో కొందరు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది... తొమ్మిదేళ్లుగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన కొందరిని వివిధ హామీలిస్తూ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని... లేదా నామినేటెడ్ పోస్ట్ కట్టబెడతానని హామీ ఇచ్చారు. ఇక కొందరికైతే ఏకంగా మంత్రి పదవినే ఆఫర్ చేశారు. వీళ్లలో కొందరికి వ్యక్తిగతంగా చెప్పగా, మరికొందరికైతే బహిరంగంగా ప్రజలు ముందే హామీ ఇచ్చారు.  జగన్ అనుకున్నట్లే వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఆర్నెళ్లు కూడా గడిచిపోయాయి. కానీ, జగన్ నుంచి హామీలు పొందినవాళ్ల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. కనీసం వాళ్లకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ఇలాంటి బాధితుల బాధితుల జాబితా వైసీపీలో ఎక్కువగానే ఉంది. ఈ లిస్ట్ లో  గుంటూరు జిల్లా చిలకలూరిపేట నేత మర్రి రాజశేఖర్ ఒకరు. ఎన్నికలకు ముందువరకు మర్రి రాజశేఖరే చిలకలూరిపేట వైసీపీ అభ్యర్ధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఒకసారి పోటీచేసి ఓడిపోయారు. అయితే, ఎన్నికలకు ముందు అనూహ్యంగా మర్రిని తప్పించి ఎన్నారై విడదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా మర్రికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, కేబినెట్ లో చోటు దక్కలేదు. అయితే, రెండున్నరేళ్ల తర్వాత 90శాతం కేబినెట్ ను మార్చేస్తానని జగన్ చెప్పడంతో.. మరి రెండో విడతలో అవకాశమిస్తారో లేక ఆ హామీనే పక్కనబెడతారో చూడాలి.  ఇక, గుంటూరు వెస్ట్ లేళ్ల అప్పిరెడ్డిదీ ఇదే పరిస్థితి. అప్పిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కనీసం జగన్ నుంచి పిలుపే రాలేదు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పంలో పోటీచేసి ఓడిపోయిన చంద్రమౌళి పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. చంద్రబాబుపై పోటీ అంటే ఆశలు వదులుకుని బరిలోకి దిగాల్సిందే. అయితే, వైసీపీ అధిష్టానం చంద్రమౌళిని టెంప్ట్ చేసి పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టించిందని అంటున్నారు. ఎన్టీఆరే ఓడిపోయిన సందర్భాలున్నాయని, నీవు కూడా చంద్రబాబును ఓడిస్తావంటూ భారీగా డబ్బు ఖర్చు పెట్టించారని, దాంతో చంద్రమౌళికి దాదాపు రోడ్డునపడిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఓడిపోయినాసరే, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని చంద్రమౌళికి కూడా జగన్ హామీ ఇచ్చారట. కానీ, ఇప్పుడు జగన్ దర్శన భాగ్యం కూడా దొరకడం లేదని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై అనూహ్య విజయం సాధించిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిదీ ఇదే పరిస్థితి. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ బహిరంగంగా ప్రజల ముందే జగన్ ప్రకటించారు. తీరా చూస్తే కేబినెట్లో ఆర్కేకి చోటు దక్కలేదు. ఇక, ప్రకాశం జిల్లా పర్చూరులో గొట్టపాటి భరత్ దీ కూడా ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకి టికెట్ కేటాయిండంతో... గొట్టిపాటి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తానంటూ హామీ ఇఛ్చారు. అయితే, ఇప్పుడు జగన్ అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదని అంటున్నారు. వీళ్లందరి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు ఉందంటున్నారు. తమకిచ్చిన హామీలపై జగన్ ను నిలదీయలేక... కనీసం తమకు ఎప్పుడు న్యాయం చేస్తారని అడగలేక... తమలో తామే కుమిలిపోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, జగన్ మాటిస్తే తప్పడని, కొంచెం ఆలస్యమైనా, తమకిచ్చిన హామీని నిలబెట్టుకుంటారనే ఆశతో ఎదురుచూస్తూ గడిపేస్తున్నారు. మరి వీళ్ల టైమెప్పుడు వస్తుందో... ఎప్పుడు పదవులు దక్కుతాయో చూడాలి.   

2020 ఫిబ్రవరి నుండి ఆ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

2020 ఫిబ్రవరి నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్ లకు ఇక పై వాట్సప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది సంస్థ. విండోస్ ఫోన్లకైతే పూర్తిగా ఈ సపోర్టు నిలిచిపోనుంది. వీటికి సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో తెలిపింది. అంతేకా కుండా ఆయా స్మార్ట్ ఫోన్లలో కొత్త వాట్సప్ ఖాతాను సృష్టించటం కానీ దాన్ని వెరిఫై చేసే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఏ ఏ స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ నిలిచిపోతుందంటే ఐవోఎస్ 8 లేదా దానికంటే పాత ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేసే ఆపిల్ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్ పనిచేయదు. అప్పటి వరకూ వీరు ఈ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ ను ఉపయోగించుకోవచ్చు.  ఆండ్రాయిడ్ ఫోన్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 2,3,7 అంతకన్నా పాత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం మీద నడిచే అన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఫిబ్రవరి 1,2020 వరకు మాత్రమే ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుందనీ తర్వాత పని చేయదని సంస్థ ప్రకటించింది. ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ల పై మాత్రమే నడిచే స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ వాడాలనుకుంటే ఒకటే దారి, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లలో ఇన్ స్టాల్ అయిన వాట్సాప్ ను అప్ డేట్ చెయ్యకూడదు, అన్ ఇన్ స్టాల్ చేయకూడదు, అప్పుడు మాత్రమే మీరు ఈ ఫోన్లలో వాట్సాప్ ను వాడగలరు. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై నడిచే ఫోన్లన్నింటికీ ఈ సపోర్టు నిలిచిపోనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫిబ్రవరి 1,2020 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తూ వుంటే విండోస్ ఫోన్లకు కాస్త ముందుగానే అంటే 2019 డిసెంబర్ 31 తరువాత వీరికి వాట్సప్ అప్ డేట్స్ రావు. జియో ఫోన్ వినియోగదారులకు ఈ అప్ డేట్స్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టం 251 పైన నడిచే అన్ని మొబైల్స్ లోనూ వాట్సప్ పనిచేయనుంది. వీటిలో జియో ఫోన్ జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి కాబట్టి ఆయా ఫోన్లలో వాట్సప్ ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

జగన్ పై మందకృష్ణ ఫైర్.. రెడ్డి కులానికి ఓ న్యాయం, వేరే కులాలకు ఓ న్యాయమా?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ నిప్పులు చెరిగారు. పైకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... సొంత సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డమ్మీ పదవులు కట్టబెట్టి... ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం రెడ్డి సామాజికవర్గంతో నింపేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ ఎస్సీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగితే పట్టించుకోని సీఎం జగన్.... తన సొంత సామాజికవర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం మీద ప్రమాణంచేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి... న్యాయ వ్యవస్థకు, చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఎన్ కౌంటర్ ను అసెంబ్లీ సాక్షిగా సమర్ధించమేంటని ప్రశ్నించారు. బాధితురాలు దిశ... జగన్ సామాజికవర్గం కాబట్టే నిందితుల ఎన్ కౌంటర్ ను సమర్ధించారని, అలాగే కేసీఆర్ కు హ్యాట్సాప్ చెప్పారని.... మరి హాజీపూర్ లో ముగ్గురు బీసీ బాలికలను హత్యాచారం చేసి మృతదేహాలను బావిలో పూడ్చేసిన శ్రీనివాస్ రెడ్డిని.... అలాగే జడ్చర్లలో బాలికపై అత్యాచారం చేసిన చంపేసిన నవీన్ రెడ్డిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయమని కోరలేదని మందకృష్ణ నిలదీశారు. ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు... నలుగురు అమ్మాయిలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయమని కోరడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక, వైఎస్ హయాంలో 11మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడి చంపేసినా.... ఆయేషామీరాను రేప్ అండ్ మర్డర్ చేసినా... ఇప్పటివరకూ న్యాయం జరగలేదని మందకృష్ణ గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్.... ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇద్దరూ కూడా తమ తమ సొంత సామాజికవర్గాలకు అన్యాయం జరిగితే ఒకలా... ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరిగితే మరోలా స్పందిస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, ఆర్ధిక నేరగాళ్లపై వేగంగా న్యాయ విచారణ జరిపించి, నేరం రుజువైతే ఉరిశిక్ష విధించేవిధంగా వైసీపీ ప్రభుత్వం చట్టం చేయగలదా అంటూ మందకృష్ణ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి చట్టాన్ని కేంద్రం చేస్తే సమర్ధించే దమ్ము జగన్ కి ఉందా అంటూ మందకృష్ణ నిలదీశారు.  

సమావేశాల్లో కనిపించని హరీష్ రావు.. ఆర్ధిక మంత్రి లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ శాఖపై రివ్యూ చేస్తారో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించటం కూడా కష్టంగా మారింది. మెరుపులు లేకుండానే పిడుగుల్లాంటి నిర్ణయాలను గతంలో ఎన్నో ఆయన ప్రకటించారు. ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత శాఖల మంత్రులు తప్పకుండా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయంలో ఆర్ధిక శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం ఆ మంత్రి ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సీఎం ఈ శాఖపై సమీక్ష జరిగేటప్పుడు యాదృచ్చికమో మరేమిటో కాని ఆ శాఖ మంత్రి మాత్రం ఉండటం లేదు. గతంలో ఈటెల రాజేందర్ ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు కూడా ఇలానే జరిగింది. బడ్జెట్ పై రివ్యూలు జరిగినా.. ఆర్థిక పరిస్థితి పై సమీక్ష జరిగినా ఆయన ఉండకపోయేవాడు. కొన్నిసార్లు శాఖకు సంబంధించిన మంత్రికి నిర్ణయాలను చెప్పే వారు కాదని ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఆర్థిక శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎం కేసీఆర్ ఫైనాన్స్ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అంతేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆర్థిక శాఖపై సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. కేంద్ర విధానాలను విమర్శించారు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు.. ఇవన్నీ కూడా హరీశ్ రావు లేకుండానే జరిగాయి. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశమై వారికి వరాల జల్లు కురిపించినప్పుడు కూడా హరీశ్ లేరు. ఇక ఆర్థిక శాఖను ఎవరు నిర్వహించినా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదేమో అనేలా ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చర్చ ఆర్థిక శాఖలోనూ, సెక్రటేరియట్ లోను జోరుగానే నడుస్తోంది. మరి ఆర్ధికశాఖ రివ్యూలకు ఆ శాఖ మంత్రి హాజరు కాకుండా ఉండటం కొనసాగుతుందో.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

మహిళా సంకల్ప దీక్ష.. తెలంగాణ బీజేపీ చీఫ్ గా డీకే అరుణ!! 

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి తమదైన శైలిలో వెళుతున్నారు ఆశావహులు. అధ్యక్ష పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా రెండు రోజుల పాటు మహిళా సంకల్ప దీక్ష చేపట్టనున్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. ఇదే అంశం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తో సంబంధం లేకుండా నేరుగా జాతీయ స్థాయి నాయకుల అండదండలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మహిళల పై జరుగుతున్న అనేక దాడులకు మద్యమే కారణమని భావించి తెలంగాణలో మద్యం నిషేధించాలంటూ రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు.  జాతీయ స్థాయి నేత రాంమాధవ్ ద్వారా బీజేపీలో చేరిన జేజమ్మకు ఆయన ఆశీస్సులు మెండు గానే ఉన్నాయి. దీంతో రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండానే నేరుగా అధిష్టానం ఆదేశాల మేరకు స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు దీక్ష కార్యక్రమం చేపడుతున్నారని బిజెపి పార్టీలో వినిపిస్తున్న మాట. ఒక వైపు లక్ష్మణ్ తనకి మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నప్పటికీ.. డీకే అరుణ అధిష్టానం లోనూ ఇటు ప్రజల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తోంది. ఈ నెల 12,13 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద అరుణ దీక్ష చేయనున్నారు. మద్యపాన నిషేధ ఉద్యమం వెనుక అసలు ఎజెండా ఇదేనా అన్నది హాట్ టాపిక్ అయ్యింది. రామ్ మాధవ్ ఆశీస్సులతోనే.. అధ్యక్ష పదవి డీకే అరుణకు రాబోతున్నదా అన్నది బిజెపి వర్గాల్లో చర్చకు దారితీసింది.  

చంద్రబాబుపై మార్షల్స్ దౌర్జన్యం... ఏపీ అసెంబ్లీలో రణరంగం

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అసెంబ్లీ మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారు. జీవో 2430పై నిరసన తెలుపుతున్న చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారు. అసెంబ్లీ బయట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బాబు, టీడీపీ సభ్యులపై చేయి చేసుకున్నారు. ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా చంద్రబాబును మార్షల్స్ చేయి పట్టుకుని లాగేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చీఫ్ మార్షల్స్ కు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదని... కానీ ప్రతిపక్ష నేతతో ఇంత దురుసుగా వ్యవహరించడం మాత్రం దారుణమన్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇదొక మాయని మచ్చ అన్నారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై మార్షల్స్ చేయి వేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమను అసెంబ్లీ లోపటికి వెళ్లకుండా గేటు దగ్గరే అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్స్, నల్ల బ్యాడ్జీలు వద్దని చెబితే తీసేశామని, కానీ పేపర్స్ కూడా తీసుకెళ్లొద్దని ఆదేశించడమేంటని అచ్చెన్న ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో చిన్న తెల్లకాగితం ఉండటంతో 40 నిమిషాలపాటు బయటే నిలబెట్టారని... ప్రతిపక్ష నేతతో వ్యవహరించే పద్ధతి ఇదేనా అంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే, అచ్చెన్నాయుడు ఆరోపణలను మంత్రి బుగ్గన ఖండించారు. అసెంబ్లీలోకి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురాకూడదని టీడీపీ హయాంలోనే రూల్స్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. అంతేకాదు, టీడీపీ సభ్యులే రౌడీయిజం చేశారని, మార్షల్స్ ను తోసివేశారని బుగ్గన కౌంటరిచ్చారు. తమపై దాడి చేశారని టీడీపీ సభ్యుల తీరుపై మార్షల్స్ ఫిర్యాదు చేశారని బుగ్గన అన్నారు. అసెంబ్లీ సజావుగా సాగుతుంటే... టీడీపీ కావాలనే నానా యాగీ చేస్తోందని మండిపడ్డ బుగ్గన.... తెలుగుదేశం హయాంలో ఒక్క బిల్లుపై కూడా చర్చ జరగలేదని గుర్తుచేశారు. బుగ్గన వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన అచ్చెన్నాయుడు.... రూల్స్ ఎప్పట్నుంచో ఉన్నాయని, కానీ వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకురాలేదా? బెంచీలు ఎక్కి అరవలేదా? అంటూ ప్రశ్నించారు. వైసీసీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని రాలేదని, బెంచీలు ఎక్కలేదని నిరూపిస్తే... ఇప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ అచ్చెన్న సవాలు విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోను, టీడీపీ ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన చీఫ్ మార్షల్ ను సభకు పిలిపించి స్పీకర్ మాట్లాడాలని, లేదంటే తాము సభలో ఉండలేమని అన్నారు. అయితే, స్పీకర్ తమ్మినేని విచిత్రంగా స్పందించారు. ప్రతిపక్షం ఇష్టానికి వదిలేస్తున్నట్లు తెలిపారు.

ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న 2430... బాబుపై మరోసారి జగన్ తీవ్ర వ్యాఖ్యలు

2430 జీవో ద్వారా జగన్ ప్రభుత్వం మీడియాకి సంకెళ్లు వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియాను అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ విషయంలో కొన్ని ఛానళ్లపై ఎందుకు ఆంక్షలు విధించారని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో 2430ను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు.... సచివాలయం ఫైర్ స్టేషన్ దగ్గర నోటికి, చేతులకు, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని ఆందోళన నిర్వహించారు. 2430 జీవో తీసుకొచ్చి మీడియాను బెదిరించడం సరికాదని... ఆంక్షలను ఎత్తివేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. అనంతరం అసెంబ్లీలోనూ జీవో 2430పై తెలుగుదేశం ఆందోళనకు దిగింది. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. దాంతో, అధికార-ప్రతిపక్షాల మధ్య జీవో 2430పై తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. జీవో 2430పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు జీవోను చంద్రబాబు పూర్తిగా చదవారా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ అర్ధంకాక ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. 2430 జీవోను సభలో చదివి వినిపించిన సీఎం జగన్.... నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని.... సంబంధిత శాఖలకు ఇచ్చామన్నారు. అసలు జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. దాంతో, సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

కాక మీదున్న కేసీఆర్... తెలంగాణకు రావాల్సిన కనీస నిధులను అందించని కేంద్రం

తెలంగాణ ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుతూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం పై మండిపడుతూ.. నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు కేసీఆర్. ఆ తరువాత బిజెపికి, టీఆర్ఎస్ కి మధ్య క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలక నిర్ణయాల విషయంలో కేసీఆర్ మోదీకి మద్దతు పలికారు. ఇంకా చెప్పాలంటే ఒకడుగు ముందుకేసి నోట్ల రద్దు సమయంలో రాష్ట్రంలో మొదటిగా స్పందించిన వ్యక్తి కేసీఆర్. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అనేక సవరణ బిల్లులు తీసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్, బిజెపి వైపునే నిలబడింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చాయి. ఈ సెకెండ్ టర్మ్ లో మాత్రం రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ కనబడుతుందనే చెప్పాలి. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలను అందించడం లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. పదేపదే తెలంగాణ సమస్యల పై కేంద్ర మంత్రులను కలుస్తున్నా వారు పెడచెవిన పెడుతున్నారని వినిపిస్తుంది. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులు..పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఇక ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎంత మేరకు కత్తిరింపులు జరిగిందో పేర్కొన్నారు. ఆర్థిక మాన్యం లేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందంటూ మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన నిధులను మంజూరు చేయండి లేదా ఆర్థికమాన్యం ఉందని ఒప్పుకోండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు. రేపు జరుగుతున్న క్యాబినెట్ లో కూడా కేంద్రం వైఖరిపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇతర నిధులపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం. మరోవైపు క్యాబినెట్ సమావేశం తర్వాత రెండు 2,3 రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీని కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్రం వైఖరి పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో పథకాలు బాగున్నాయని మెచ్చుకుంటున్నారు, తెలంగాణలోని సంక్షేమ పథకాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, తెలంగాణ చేస్తున్న విజ్ఞప్తులను మాత్రం పక్కన పెడుతున్నారు. ఈ ధోరణిపై ఖచ్చితంగా నిరసన తెలపాలని కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే రావలసిన నిధుల కోసం పోరాటానికి కూడా దిగాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక పై మోదీ సర్కారుపై మెతక వైఖరి వేడి తాడోపేడో తేల్చుకోపోతోంది కేసీఆర్ సర్కార్.

బై బై బాబు.. టిడిపి నుండి బయటపడటానికి నేతల వ్యూహాలు..బీజేపీలోకేనా ??

  జంప్ అవ్వడం లేటవ్వచ్చేమో కానీ జంపింగ్ మాత్రం పక్కా అనే నినాదంతో ముందుకెళ్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు. అయితే ఆ జంప్ ఎటు చెయ్యాలన్నది తేల్చుకోలేక టిడిపి ఎమ్మెల్యేలు సతమతమైపోతున్నారు. మొదట బీజేపీలో చేరబోతున్నారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బిజెపి వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత మంది ఎమ్మెల్యేలతో త్వరలోనే బిజెపి కండువా కప్పు కుంటారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది.గంటా శ్రీనివాసరావు కూడా తాను పార్టీ మారట్లేదని చెప్పినప్పటికీ కుడా తెర వెనుక మాత్రం ఆయన బిజెపి నేతలతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిజెపి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా బిజెపి అగ్ర నేత రామ్ మాధవ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యే దుబాయిలో జరిగిన సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ లోను వీరు బిజెపి నేతలతో చర్చించినట్టుగా ప్రచారం జరిగింది. బిజెపి ఏపీలో పాగా వేసేందుకు మరియు పార్టీని బలోపేతం చేసేందుకు విపరీతమైన ప్రయత్నాలలో భాగంగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గంటా ఇంకో పార్టీలోకి చేరడానికి రాజీనామా చేసి రావాలనే కండిషన్ లేకుండా చూడాలని కోరుతున్నారట. ఒకవేళ రిజైన్ చేసి ఎన్నికలకు వెళితే మళ్లీ గెలుస్తామో లేదో అన్న డౌట్ తో జాగ్రత్త పడుతున్నారు.గంటాకి రూట్ క్లియర్ అయితే ఆయన టిడిపిలోని ఐదుగురు ఎమ్మెల్యేలను కమలం గూటికి చేరుస్తానని చెప్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా జరిగినా.... ఆయన టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మరియు ఏలూరి సాంబశివరావులతో కలిసి ఆలోచన మార్చుకున్నట్టుగా ప్రచారం జరగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపిలోకి వెళ్లే కన్నా బిజెపిలోకి వెళితేనే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.వైసిపిలో ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే వారికే ప్రయారిటీ ఉంటుంది తప్ప తమను పెద్దగా పట్టించుకోకపోవచ్చు అని అనుకుంటున్నారు. గ్రానైట్ క్వారీల మీద ఈ మధ్య విజిలెన్స్ దాడులు జరుగుతూండటంతో.... గొట్టిపాటి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన కూడా ఈ మధ్య పార్టీ లోని పరిస్థితులను చూసి మనసు మార్చుకున్నారు. కేవలం వ్యాపారం కోసమైతే బీజేపీలో చేరిన కూడా రక్షణ ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తన జోలికొచ్చే సాహసం బహుశా వైసిపి చెయ్యదని అనుకుంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కరణం బలరాం కూడా వైసిపిలో తాను ఇమడలేనని భావిస్తున్నారు. తనకు బిజెపి అయితే మంచి ప్రాధాన్యత ఉంటుంది అని సన్నిహితులతో చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ గంటా, గణబాబు చేరితే 2 బలమైన సామాజిక వర్గాలతో పార్టీ మరింత పటిష్టమవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అన్ని కుదిరితే అతి త్వరలోనే తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి కమలం కండువా కప్పుకోబోతున్నారు.

పౌరసత్వ బిల్లు.. మైనారిటీలకు భారత్ లోనే రక్షణ ఉందంటున్న అమిత్ షా

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.  ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందింది కనుక రాజ్యసభలో కూడా తప్పకుండా బిల్లుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు చారిత్రక బిల్లు అని దీనికి అందరూ మద్దతు పలకాలని కోరారు. పొరుగు దేశాల్లో మైనార్టీలకు రక్షణ లేదన్నారు. భారత్ లో మాత్రం మైనారిటీలకు పూర్తి రక్షణ ఉందన్నారు.  తృణమూల్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నాజీల నుంచి ప్రేరణ పొందిన అమిత్ షా ఈ బిల్లును తీసుకువచ్చారని విమర్శించారు తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్. ఈ బిల్లు బెంగాలీలను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చారని ఆరోపించారు. క్యాబ్ బిల్ తప్పుల తడక అని విమర్శించారు. దేశ భక్తి గురించి తమకు అమిత్ షా పాఠాలు అవసరం లేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లును బెంగాల్ లోనే కాదు దేశ వ్యాప్తంగా తృణమూల్ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు డెరిక్ ఒబ్రెయిన్.  ముస్లింలను టార్గెట్ చేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చినట్లు విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు అమిత్ షా. పౌరసత్వ సవరణ బిల్లు మానిఫెస్టోలో ఉందని స్పష్టం చేశారు. భారత్ లో ముస్లింలకు పూర్తి రక్షణ ఉందన్నారు. పొరుగు దేశాల్లో వివక్ష కారణంగా భారత్ కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్టు స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆనంద్ శర్మ. మతం ప్రాతిపదికన గత 70 ఏళ్ళలో ఎప్పుడూ భారత పౌరసత్వం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ఎప్పట్నుంచో శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇస్తోందని స్పష్టం చేశారు ఆనంద్ శర్మ.

రైతుల సమస్యలపై నిరాహారదీక్ష చేయనున్న జనసేనాని పవన్ కళ్యాణ్

మరో దీక్షకు సిద్ధమవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు ( డిసెంబర్ 12న ) కాకినాడలో చేపట్టనున్న దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా దీక్షకు సంబంధించిన పోస్టర్ ను పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో పవన్ ఈ దీక్షకు సిద్ధమవుతున్నారు. వరి పంట వేయటానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలున్నాయని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. గిట్టుబాటు ధర లేక ఖర్చుల రాబట్టుకోలేక రైతులు అప్పులపాలవుతున్నారని పవన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ నిరాహార దీక్ష తలపెట్టింది కేవలం జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతుల తాలూకు సమస్యలు మరియు బాధలను తెలియజేయటానికి " అని తెలిపారు. గత రబీ సీజన్ లోనూ ధాన్యం రైతులు తమ దుస్థితిని తన దృష్టికి తీసుకువచ్చారు అని తెలిజేసారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కదా!.... ఎందుకులే అని చెప్పి నేను ఒక లెటర్ తో సరిపెట్టాను. కాని ఇప్పుడు ఖచ్చితంగా వారికి గిట్టుబాటు ధర రావాలి..... కనీసం లాభసాటి ధర గురించి తరువాత చర్చించుకుందాం.. ముందు కనీస గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయని పవన్ కళ్యాన్ తెలియజేశారు. జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆయన ముఖ్యంగా పంట చేతికి రావడానికి నెల రోజుల ముందే కస్టమ్ మిల్లు రైస్ ను ప్రకటించి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. కాని ఇప్పుడు ధాన్యం తీసుకున్న 40 రోజుల తర్వాత హడావుడిగా అర్ధరాత్రి సిఎంఆర్ ప్రకటించి ఇంత వరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దీంతో రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మళ్లీ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి వచ్చిందని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు అని తెలిజేసారు. కౌలు రైతులకి కూడా రైతు భరోసా కల్పించడంలో కుల విభజన ఎందుకని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి ఉంది అని మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరారు.

అభినందన్ నెంబర్ వన్.. ఆయన తర్వాతే సినిమావాళ్లు, క్రికెటర్లు

గూగుల్‌లో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్-10 ప్రముఖుల జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ మొదటి స్థానంలో ఉన్నారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో పాక్‌కు చెందిన యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది. ఆ తర్వాత అభినందన్‌ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ఒత్తిడితో ఆయన్ను మూడు రోజుల తర్వాత భారత్‌కు పాక్ అప్పగించింది. పాక్ బలగాల అదుపులో ఉన్నా.. చెక్కుచెదరని స్థయిర్యంతో భారత రక్షణ రంగ రహస్యాలను ఎక్కడా వెల్లడించకపోవడం అభినందన్ ను ఓ సెలబ్రిటీగా మార్చేశాయి. తాజాగా, గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల జాబితా విడుదల చేయగా, అందులో అభినందన్ కు ప్రథమస్థానం లభించింది. రెండో స్థానంలో లతా మంగేష్కర్, మూడో స్తానంలో యువరాజ్ సింగ్ ఉన్నారు.  

నేను ఆ బ్యాచ్ కాదు.. రోజాకి లోకేష్ కౌంటర్

  టీడీపీ నేత నారా లోకేష్... వైసీపీ నేత రోజాకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నేత చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రోజా అయితే.. సొంత కొడుకుని గెలిపించుకోలేని.. చేతకాని, దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు మిగిలిపోయారు.. ఇప్పుడు ఆయనకు అసలు జగన్ గారిని అనే అర్హత లేదంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాగా రోజా వ్యాఖ్యలపై స్పందించిన నారా లోకేష్ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. మాట్లాడితే నా ఓటమిని ప్రస్తావిస్తూ చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. నేను గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలి అనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ వ్యాఖ్యానించారు.