సంబరాల్లో మునిగిన బీజేపీ...

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. బైపోల్స్ నిర్వహించిన 15 స్థానాలకు గాను 11 చోట్ల బిజెపి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ రెండు చోట్ల జేడీఎస్ ఒక్కచోట ఆధిక్యంలో ఉన్నాయి. ఒక్కచోట స్వతంత్ర అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. హస్ కోటలో బీజేపీ రెబల్ అభ్యర్థి శరద్ కుమార్ బచ్చే గౌడ తన సమీప ప్రత్యర్థి పై 1700 ల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. క్రిష్ణరాజపేటలో బిజెపి అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. అక్కడ జేడీఎస్ అభ్యర్థి 1000 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక హస్నూరు, శివాజినగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. 14 మంది కాంగ్రెస్ ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ జేడీఎస్ సర్కారు కూలిపోయింది. 2 స్థానాల మినహా 15 చోట్ల ఈ నెల 5 న ఉప ఎన్నికలు జరిగాయి. దాంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 112 కు చేరుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే బిజెపికి కనీసం 6 స్థానాల్లో గెలవటం తప్పనిసరి. ప్రస్తుతం ఆ పార్టీకి 105 మంది సభ్యులున్నారు. అయితే ఇప్పుడు ఫలితాల్లో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం ఆ పార్టీ శ్రేణులను ఉత్సాహంలో నింపుతోంది. కర్ణాటక వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

జగన్ ఇంటి పై తీవ్ర చర్చ...

  సీఎం నివాసాల ఆధునికీకరణకు సంబంధించి జారీ చేసిన మరి కొన్ని జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే 3 కోట్ల రూపాయల విలువ చేసే పనులు రద్దు చేయగా తాజా రద్దుతో ఆ మొత్తం 7 కోట్లకు చేరింది.మూడు రోజులుగా 7 కోట్ల రూపాయల పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇలా వరుస పెట్టి తన ఇంటి కోసం జారీ చేసిన జీవోలను సీఎం జగన్ రద్దు చేసుకుంటూ వెళ్లడం ఎంత వరకూ కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోసం ఆ మాత్రం ఖర్చులు పెట్టక తప్పదు అంటున్నాయి అధికార వర్గాలు. విమర్శలకూ వెరసి ఈ విధంగా రద్దు చేసుకోవడం సరి కాదని మరికొందరి వాదన. ప్రభుత్వ నిర్ణయం ప్రతిపక్షాలకు మరింత బలమిచ్చినట్టు అవుతుందని చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు ఎంతగా గగ్గోలు పెట్టినా పట్టించుకోకుండా తన పని చేసుకుని వెళ్తాడనే పేరు తెచ్చుకున్న సీఎం జగన్ ఈ స్థాయిలో రియాక్టయితే వీక్ అవుతారనే ఆందోళన కనిపిస్తోంది అసెంబ్లీ సమావేశాల ముందు జీవోల రద్దు వ్యవహారం తెరమీదకు రావడాన్ని పార్టీ వర్గాలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ విషయంలో ససేమిరా అన్నట్టు తెలిసింది. ప్రతిపక్షం ఈ వ్యవహారాన్ని లేవనెత్తితే ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలోననే అంశం తనకు తెలుసు అన్నట్టుగా ఉన్నారని సమాచారం. మొత్తానికి తన ఇంటి పనుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

మొన్న శ్రీదేవి.. నేడు శ్రీవాణి.. పదవులకు అడ్డుగా మారిన కుల సమస్య

  ఇటీవల తాడేపల్లి ఎమ్మెల్యే శ్రీదేవి తలనొప్పిగా మారిన కుల వివాదం ఇప్పుడు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి చుట్టుకొంది. అతి చిన్న వయస్సులోనే జరిగిన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం గా పుష్పశ్రీవాణికి కుల వివాదం పెద్ద తలనొప్పిగా తయారైంది. కోర్టు నుంచి సైతం నోటీసులు రావడంతో ఏం జరుగుతుందోనని ఆమె అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. పాముల పుష్పశ్రీవాణి 2014 ఎన్నికల్లో కురుపాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శత్రుచర్ల కుటుంబం పై కుల వివాదం పై పోరాడిన నిమ్మక జయరాజు ఇప్పుడు శ్రీవాణి పై సైతం కోర్టు మెట్లెక్కారు. శ్రీవాణి కొండదొర కాదంటూ ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు హైకోర్టు లో ఆధారాలు కూడా సమర్పించారు. దీంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. పుష్పశ్రీవాణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామం. ఇదే జిల్లాలో కోటసీతారాంపురం ఐటీడీఏ లో ఎస్టీ కోటాలో ఆమె సోదరి పాముల రామతులసి టీచర్ గా ఎంపికైన స్థానికుల ఫిర్యాదుతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు అధికారులు. ఈ విషయంలో కూడా కులమే పుష్పశ్రీవాణి సోదరికి అడ్డొచ్చింది. దీంతో పాటు పుష్పశ్రీవాణి పూర్వీకులు పాలకొండలో నివశించేవారిని వారి ఇంటిపేరు తమ కులాల్లో లేదని గిరిజన నేతలు వాదిస్తున్నారు. ఆమె సోదరి ఎస్టీ కాదని ఆధారాలు దొరకడంతో ఈ విషయం పై గిరిజన నేతలు కోర్టు మెట్లెక్కారు. విచారణ జరిపిన కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు ఆమె భవిష్యత్తు పై నీలి నీడలు కమ్ముకున్నాయి.మొత్తానికి కుల సమస్యతో అక్కడి వాతవరణం హీటెక్కింది.

ప్రాణాలు తీస్తున్న ఉల్లి

ఉల్లిపాయ తరిగితేనే కాదు,ఉల్లి కొనుగోలుకు వెళ్తే కూడా ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మార్కెట్ లో కిలో ఉల్లి 100 రూపాయలు దాటడంతో ఏపీ ప్రభుత్వం సబ్సిడీ మీద ఒక్కో కుటుంబానికి కేజీ ఉల్లిగడ్డలు 25 రూపాయలకు అందించే చర్యలు చేపట్టింది. దీంతో రైతు బజార్లలో ఉల్లి సరఫరా చేస్తున్నారు అధికారులు. కడప రైతు బజార్ లో జనం పడుతున్న ఉల్లి కష్టాలూ చెప్పాల్సిన పనిలేదు. కిలో ఉల్లి కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. స్టాక్ అయిపోయిందనగానే నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇది అక్కడి మహిళలు స్థానికులు నిత్యం ఎదుర్కొంటున్న పరిస్థితి. ఉల్లి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ప్రభుత్వం కిలో 25 రూపాయల సబ్సిడీ ధరకు రైతు బజార్లలో ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కిలో వంతున పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కడప రైతు బజార్ లో తగినన్ని ఉల్లి నిల్వలు అందుబాటులో లేకపోవటంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతు బజార్ వద్ద కిలో మీటర్ మేర క్యూలైన్ లలో వేచి ఉన్నారు మహిళలు. రోజూ గంటల తరబడి తాము మార్కెట్ లో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతి ఒక్కరికీ సబ్సిడీ ఉల్లిగడ్డలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉల్లి సరఫరా చేస్తున్నామన్నారు మార్కెట్ అధికారులు.చిత్తూరు జిల్లాలోని రైతు బజారులో ఉల్లి పాట్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఉదయం నుంచి ఉల్లి కోసం జనాలు బారులు తీరారు. క్యూలో నిల్చున్న వారి మధ్య తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట నేపధ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 4 సీఐలు 10 మంది ఎస్సైలతో భద్రత ఏర్పాటు చేశారు.

పవన్‌లో పెరిగిన జోరు... కాకినాడ లోనే నిరాహార దీక్ష

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. నిరంతరం జనంలో తిరుగుతూ అధికార పార్టీని టార్గెట్ గా విమర్శల దాడి పెంచారు. వైసీపీ నుంచి వచ్చే కౌంటర్లకు దీటుగా స్పందిస్తూ అంతకు మించిన మాటలతో దాడి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇంతకు జనసేనాని దూకుడుకు రీజన్ ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చిన పవన్ లో పొలిటికల్ స్పీడ్ పెరిగింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇసుక సమస్య ఏపీలో సమస్యల పై హస్తిన పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లిన ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన పర్యటన చాలా సీక్రెట్ గా సాగింది. హస్తినలో ఎవరిని కలిశారు, ఎందుకు కలిశారు, వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి అనేది ఇప్పటికీ గుట్టుగానే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచారు. ప్రతి రోజూ జనం లో తిరుగుతూ అన్ని ప్రాంతాల వారిని కలుస్తూ అధికార పార్టీ పై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల నుంచి వస్తున్న వాదన. మొన్న అనంతపురంలో రెడ్డి నేతల పై జనసేన కార్యకర్తలు చేసిన కామెంట్ పెద్ద దుమారమే రేపింది. దీని పై రెడ్డి సంఘాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ సాకీ పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టదని సూచించారు. తనకు అన్ని కులాలు ఒక్కటేనన్నారు. వైసీపీకి కులం ఉందేమో కానీ తమకు లేదన్నారు. అంతేకాదు 3 రోజులలోగా రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు పవన్ కల్యాణ్. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యల పై చర్చించి వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఈ నెల 12 లోగా అన్నదాతలకు గిట్టుబాటు ధర పై భరోసా ఇవ్వకపోతే కాకినాడ లోనే నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఇలా ప్రతి పర్యటనలో అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు జనసేనా. పవన్ దూకుడు పై పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఎలక్షన్స్ లో కూడా ఇంతటి దూకుడు ప్రదర్శించని ఈ జనసేనాని ఇప్పుడు సడెన్ గా రూటు మార్చడం వెనుకాల మతలబేంటని చర్చించుకుంటున్నాయి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో కేంద్రం కనుసన్నల్లో నడుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

దేశంలో పలు చోట్ల వణికిస్తున్న ఉష్ణోగ్రతలు

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు చూసుకుంటే జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మంచు కురుస్తోంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పొగ మంచు కురుస్తూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఛత్తీస్ గడ్, ఒడిశా, జార్ఖండ్ లో చలి మొదలైయ్యింది. తూర్పు భారతదేశంలో మధ్యాహ్నం వాతావరణం పొడిగా ఉంటూ సాయంత్రానికి ఉష్ణో గ్రతలు పడిపోతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లోనూ చలికాలం మొదలైయ్యింది.కర్ణాటక, కేరళలో పూర్తిగా వర్ష ప్రభావం తగ్గింది. తమిళనాడులో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో వాతావరణం చలిగా ఉంటూ రాత్రయితే మాత్రం చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటలలో ఆదిలాబాద్ లో 12 డిగ్రీల సెల్సియస్ గా రికార్డైంది. ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలలో నెల్లూరులో 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలలో కడపలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయ్యింది.

మరో ముఖ్య నిర్ణయానికి నాంది పలకనున్న బీజేపీ సర్కార్...

ఆరు దశాబ్దాల పౌరసత్వ చట్టంలో సవరణలకు రంగం సిద్ధమైంది. పౌరసత్వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేడు చర్చించి బిల్లుకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఆ 3 దేశాల నుంచి 2014 డిసెంబర్ 31 వ తేదిలోపు వచ్చినా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించి వారికి భారత పౌరసత్వం కూడా ఇవ్వనున్నారు. గతంలో 11 ఏళ్ల పాటు దేశంలో ఉంటేనే పౌరుసత్వం ఇచ్చేవారు. సవరణ చట్టంలో దానిని 5 ఏళ్లకు కుదించారు. అక్రమ వలసదారులుగా వారి పై నమోదైన కేసులను కూడా ఎత్తి వేయాలని బిల్లులో పేర్కొన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా పౌరసత్వాన్ని నిరాకరించడానికి లేదని స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. సవరణ చట్టం 1985 లో కుదిరిన అస్సాం ఒప్పందాన్ని నిర్వీర్యం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో శక్తిమంతమైన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రేపు 11 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. అక్రమంగా వచ్చిన శరణార్థులను శాశ్వత నివాసులుగా పరిగణిస్తే ఈ ప్రాంత జనాభా వివరాలలో మార్పులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనలకు భరోసా ఇచ్చేలా సవరణ చట్టంలో కేంద్రం నిబంధన విధించింది. ఈ సవరణ చట్టం అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర లోని గిరిజన ప్రాంతాలకు వర్తించదని అవి యిప్పటికే రాజ్యాంగంలోని 6 వ షెడ్యూల్ ఉన్నాయని తెలియజేసింది. అలాగే ఇన్నర్ లైన్ పర్మిట్ అమల్లో ఉన్న ప్రాంతాలకు కూడా ఈ చట్టం అమలు కాదని వివరించింది.

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు విడుదల....

కర్ణాటకలో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటక పైనే ఉంది. నేతలు టేన్షన్ తట్టుకోలేకపోతున్నారు. యడియూరప్ప ధర్మస్థలంలోని మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిరిడీ వెళ్లారు. సాయినాథుని దర్శించుకున్నారు. ఈ నెల 5 న 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల పై న్యాయ స్థానాల్లో కేసులు ఉండడంతో ఆ రెండు నియోజక వర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222 గానో మాజిక్ నెంబర్ 12 ప్రస్తుతం బీజేపీకి 105 ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్ తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకే మద్దతిస్తున్నారు. ఇవాళ వెల్లడై ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం 6 ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజారిటీ ఉంటుంది. లేదంటే యడ్యూరప్ప సర్కార్ మైనార్టీల పడబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 26, జేడీఎస్ కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. 14 మంది కాంగ్రెస్, 3 జేడీయస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్ జేడీఎస్ సర్కార్ కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసినా సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఈ ఫలితాలపై సర్వత్ర ఆశక్తి నెలకొన్నది.

ప్రభుత్వ నిర్మాణాలకు ఎటు చూసినా వైసీపీ రంగులేనట...

ఏపీలో ఇప్పుడంతా రంగుల రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం హయాంలో అక్కడక్కడా స్థానిక నేతల అత్యుత్సాహంతో వాటర్ ట్యాంక్ లు ఆధునీకరించిన స్మశానాల ప్రహరీలకు పసుపు రంగు పులిమి వేశారు. ఇక వైసీపీ వచ్చాక గ్రామ సచివాలయాలకు తమ పార్టీ పతాకం లోని రంగులైన ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలంటూ ఏకంగా అధికారిక ఉత్తర్వులే ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని కూడా ప్రదర్శించాలన్నారు. రంగుల ఖర్చు ఇతర లెక్కల సంగతి అటుంచితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటని అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటారు. జనవరి 10 న ప్రారంభించి మార్చి నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టుకు విన్నవించింది. ఈ సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ భవనాలు ఆస్తులపైనా పార్టీలకు చెందిన రంగులు నేతల చిత్రాల కనిపించవద్దు. మరి ఇప్పటికే రంగులు పూసేసినమ సచివాలయాలు ట్యాంకులను ఏం చేయాలి అనేది ప్రశ్నగా మారింది. పైగా పంచాయతీ భవనాల్లో పోలింగ్ బూతులు కూడా ఏర్పాటవుతాయి. విగ్రహాలు,జెండా దిమ్మెలు అయితే ముసుగులు కప్పేయవచ్చు. భవనాల చుట్టూ వేసినా ఆకుపచ్చ తెలుపు నీలం రంగులను మరి ట్యాంకులను మూసివేయడం ఎలా? ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలంటే ఆయా రంగులను చెరిపి వేసి మళ్లీ తెల్లరంగు వేయాల్సిందే, అలా వేయటానికి ఖర్చు తీసేయడానికి మరో ఖర్చు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ రంగులు వేయాలి,మళ్లీ మళ్లీ ఖర్చు పెరగనుంది. గ్రామీణ ప్రజలకు పలు రకాల సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 12,918 గ్రామ పంచాయతీల్లో 12,000 ల పై చిలుకు సచివాలయాలుగా మార్పు చేసింది. పంచాయతీ భవనాలను సచివాలయ భవనాలుగా మార్చే క్రమంలో ఆ భవనాలకు రంగులు వేస్తున్నారు. అది కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులో ఉండాలంటూ నమూనా ఫోటోలను కూడా ఉత్తర్వులతో పాటు జతచేశారు. ఈ రంగులు అచ్చంగా వైసీపీ జెండాను పోలి ఉన్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు వేయాలని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటి సారి.సర్కారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ నిధులతో ఆ భవనాలకు ఈ రంగులు వేయించారు. ఇది వాటికి భారంగా మారింది. దీంతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కూడా మరో మెమో జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అన్నింటినీ ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులోకి మార్చాలని అన్ని జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇలకు ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశాలను అమలు చేసే క్రమంలో గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వాటర్ ట్యాంకులను వైసీపీ జెండా రంగులోకి మార్చనున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ప్రభుత్వాస్తులన్నీ వైసీపీ జెండా రంగులోకి మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు ఒక పార్టీకి పోలిన రంగులు వేయడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు లెక్క చేయటం లేదు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చిన మెమో రద్దయ్యే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల నియమావళి వస్తే పరిస్థితి ఏమిటని అందరిలో తలెత్తనున్న ప్రశ్న.

కట్టు భద్రతతో ఉన్నావ్ భాదితురాలి అంత్యక్రియలు...

యూపీలోని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మరణం పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో 90% తొంభై శాతం కాలిపోయిన బాధితురాలు 40 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. సీఎం యోగి ఆదిత్య నాథ్ చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తన కుమార్తె ఇప్పటికే దహనమైపోయిందని అందుకే ఆమెను ఖననం చేస్తామని అది కూడా సీఎం వచ్చిన తరవాతే జరుగుతుందని బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. సీఎం యోగి తోనే తాము ప్రత్యక్షంగా మాట్లాడతామని పేర్కొంది. కుటుంబాన్ని లక్నోకు తీసుకువెళ్ళి సీఎంతో మాట్లాడిస్తామని జిల్లా అధికారులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు.`ఉన్నవ్ లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 500 మంది పోలీసులను రంగంలోకి దించారు. బాధితురాలి మృతదేహం అక్కడే ఉంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు బలవంతంగా మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఉన్నావ్ సమీపంలోని బాధితురాలి మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పలు పార్టీ లకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఉన్నవ్ బాధితురాలి మృతి పై ఇప్పటికే సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. ఆమె మృతి చాలా బాధాకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామ ని ప్రకటించారు. మరోవైపు లక్నో నుంచి ఇద్దరు మంత్రుల్ని అయిన ఉన్నావ్ కు పంపిచ్చారు. కానీ వారిని గ్రామస్తులు ఊర్లోకి అనుమతించలేదు. కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు.ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసును టేకప్ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు మాత్రం తమకు సత్వర న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నవ్ లో పరిస్థితి చేయిదాటుతోందని ఇంటెలిజెన్స్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల రాద్ధాంతం వల్లే సమస్య పెద్దదవుతున్నట్టు మండిపడుతోంది.మొత్తంగా ఉన్నవ్ నివురుగప్పిన నిప్పులా మారింది.  దేశ కేసులో హైదరాబాద్ పోలీసు లు ఏం చేశారో అచ్చంగా అటువంటి న్యాయమే కావాలంటున్నారు బాధితురాలి తల్లిదండ్రు లు నరరూప రాక్షసుల ను ఎన్ కౌంటర్ చేయడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తున్నారు. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

హీటెక్కనున్న ఏపీ అసంబ్లీ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ లో అధికార వైసిపిని ప్రజా సమస్యల పై ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంటే టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రతి పక్ష హోదా లేకుండా చేయాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది వస్తారని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు సవాల్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో వల్లభనేని వంశీ ఎక్కడ కూర్చుంటారు,స్పీకర్ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అధికారికంగా ఆయన పార్టీ మారలేదు కాబట్టి విపక్షా లకు కేటాయించిన సీటులోనే ఉంటారని టిడిపి వర్గాలంటున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటే వంశీ పై అనర్హత వేటు వేయాలని టిడిపి స్పీకర్ ను కోరే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వం పలు కీలక బిల్లులను సిద్ధం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భాషలో ఆయా రంగాల్లోని విధానాలను సమూలంగా మార్చింది. కొత్తగా మైనింగ్, మద్యం, ఇసుక పాలసీని తీసుకొచ్చింది. వీటికి అనుగుణంగా బిల్లులు పెట్టి అవకాశముంది. నూతన బార్ల పాలసీ కూడా చర్చకు రానుంది. పలు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం చర్చకు పెట్టి ఆస్కారముంది. అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టిడిపి వ్యూహాలు రచిస్తోంది. తొలి రోజే ఉల్లితో పాటు ఇతర నిత్యావసర ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇవ్వాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ గేటు నుంచి ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలపాలని టిడిపి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రాజధాని పోలవరం, ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం పైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, టిడిపి కార్యకర్తలు నాయకుల పై దాడులు కూడా అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని టిడిఎల్పీ తీర్మాణించింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. మరి ఎలా జరుగనున్నాయి అనేది వేచి చూడాలి.

వైసీపీలోకి గోకరాజు కుటుంబం... రఘురామరాజుకు చెక్ పెట్టేందుకేనా?

ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా బీజేపీనే నమ్ముకుని, నిబద్ధతతో కాషాయ పార్టీలో కొనసాగుతోన్న మాజీ ఎంపీ గోకరాజు కుటుంబం వైసీపీ గూటికి చేరుతోంది. గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు, తనయుడు రంగరాజులు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే, 2019 ఎన్నికల సమయంలోనే గోకరాజు కుటుంబాన్ని వైసీపీకిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో నరసాపురం ఎంపీ టికెట్ ను గోకరాజు తనయుడు రంగరాజుకే మొదట వైసీపీ ఆఫర్ చేసిందని, కానీ ఆసక్తి చూపించకపోవడం... ఈలోగా రఘురామకృష్ణంరాజు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో... సీన్ సడన్ గా మారిపోయింది. రంగరాజు కోసం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకుని రఘురామకృష్ణంరాజుకి వైసీపీ సీటు కేటాయించింది. అయితే, గెలిచిన తర్వాత రఘురామకృష్ణంరాజు వైఖరి తేడా ఉండటంతో...  అతనికి చెక్ పెట్టేందుకే మళ్లీ గోకరాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి మింగుడుపడటం లేదని, సీఎం జగన్ పదేపదే హెచ్చరించినప్పటికీ గీత దాటుతున్నారని, అందుకే గోకరాజు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా పార్టీలోకి తీసుకొస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో రఘురామకృష్ణంరాజు ప్రాధాన్యతను తగ్గించి... ఆ స్థానంలో గోకరాజు కుటుంబాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారట. ఇదిలాఉంటే, గోకరాజు కుటుంబ నిర్ణయంతో బీజేపీ షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఎంతోకాలంగా గోకరాజు కుటుంబం బీజేపీకి విధేయతతో పనిచేస్తోంది. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా, జాతీయ నేతలతోను, అలాగే ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో, ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులు పార్టీ మారినా, గోకరాజు మాత్రం బీజేపీలోనే ఉంటారని కాషాయ నేతలు అంటున్నారు.

మమ్మలి ఇబ్బంది పెట్టొద్దు... NHRCపై దిశ పేరెంట్స్ ఆగ్రహం

దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్ కౌంటర్ పై NHRC బృందం విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా దిశ పేరెంట్స్ ను, సోదరిని NHRC ప్రశ్నించింది. దిశ ఫోన్ కాల్... పోలీసుల రియాక్షన్... ఇలా ఆరోజు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దిశ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసింది. అయితే, NHRCపై దిశ పేరెంట్స్ మండిపడుతున్నారు. దిశపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసినప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ఎక్కడికిపోయిందని నిలదీశారు. అప్పుడు మానవ హక్కులు కనిపించలేదా? కేవలం ఎన్ కౌంటర్ తర్వాతే గుర్తుకొచ్చాయా? అంటూ NHRC బృందాన్ని దిశ పేరెంట్స్ ప్రశ్నించారు. అసలు, NHRC విచారణకు హాజరయ్యేందుకు దిశ కుటుంబ సభ్యులు మొదట నిరాకరించారు. దిశ... దశ దిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. NHRC విచారణకు హాజరయ్యేది లేదని దిశ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పడంతో స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు. అయితే, దిశ పేరెంట్స్ ను ఒప్పించిన పోలీసులు... ఎస్కార్ట్ మధ్య NHRC ముందు హాజరుపరిచారు. అయితే, ఎన్ కౌంటర్ గురించి తమను ఏమీ అడగలేదని... ఆరోజు ఘటన ఎలా జరిగిందో మాత్రమే అడిగారని దిశ తండ్రి తెలిపారు. అయితే, తన కుమార్తె కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని NHRC దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఆ నలుగురూ కాదేమో.! ప్రముఖుల హస్తం ఉందేమో? ప్రముఖ హీరో అనుమానాలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పలువురు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైనాసరే చట్ట ప్రకారమే చేయాలని... న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే శిక్షించాలని కోరుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను ఎన్ కౌంటర్లు చేయడం సరికాదంటోన్న మానవ హక్కుల సంఘాలు, పలువురు ప్రముఖులు... దిశ నిందితుల ఎన్ కౌంటర్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ నలుగురే దిశపై హత్యాచారానికి పాల్పడ్డారనడానికి రుజువు ఏమిటని ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ప్రశ్నించారు. దిశపై దారుణానికి పాల్పడింది ఆ నలుగురు కాదేమో? ప్రముఖుల హస్తం ఉందేమోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా, ప్రముఖులు అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో ఎన్ కౌంటర్లు ఎందుకు జరగడం లేదని ఉపేంద్ర ప్రశ్నించారు. దిశ కేసులో జరిగిన విధంగా ప్రముఖుల రేప్ కేసుల్లో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. గతంలో రౌడీయిజాన్ని తగ్గించేందుకు ఎన్ కౌంటర్లు జరిగేవని, ఇప్పుడు పోలీసులు మనసు పెడితే ఎన్ కౌంటర్ల ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చని అన్నారు. అయితే, ప్రముఖులు, శ్రీమంతులు, పేదలనే తేడా లేకుండా అందరికీ హెచ్చరికలా ఉండాలన్నారు. పోలీసులు నిజాయితీగా వ్యవహరించి అత్యాచారాలకు పాల్పడింది ఎవరైనాసరే ఎన్ కౌంటర్ చేస్తే సమాజంలో అఘాయిత్యాలు ఆగుతాయన్నారు. అయితే, దిశపై హత్యాచారానికి పాల్పడింది ఆ నలుగురో కాదోనంటూ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఉపేంద్ర... ఇలా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించడం సరికాదని హితవు పలుకుతున్నారు.

దిశ కేసులో మరో మలుపు... ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు...

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజాగ్రహం చల్లారినా... న్యాయ వ్యవస్థ నుంచి పోలీసులు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా వివిధ కోర్టుల్లో ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలు కాగా... జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి విచారణ జరుపుతోంది. అసలు దిశ హత్యాచార ఘటన ఎలా జరిగింది... పోలీసుల దర్యాప్తు... ఆ తర్వాత నిందితుల ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులు... ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది ఎన్ హెచ్ ఆర్సీ బృందం. చటాన్ పల్లిలోని ఎన్ కౌంటర్ స్పాట్ ని పరిశీలించిన ఎన్ హెచ్ ఆర్సీ టీమ్... ఆ తర్వాత నిందితుల డెడ్ బాడీస్ ను చెక్ చేసింది. అనంతరం దిశ పేరెంట్స్ అండ్ నిందితుల తల్లిదండ్రుల నుంచి స్టేట్ మెంట్స్ రికార్డు చేసుకున్నారు. అయితే, దిశ నిందితుల ఎన్ కౌంటర్ వివాదాస్పదమవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అసలు ఎన్ కౌంటర్ ఎలా జరిగిందో... కాల్పులకు దారి తీసిన పరిస్థితులేంటో తేల్చాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ను నియమించింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్ వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీసీఆర్బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. చటాన్ పల్లి ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఎదురుకాల్పుల్లో పాల్గొన్న పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది, ఆ సమయంలో అక్కడున్న అధికారులను సిట్ ప్రశ్నించనుంది. అలాగే, ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను సేకరించి నివేదిక ఇవ్వనుంది.  అయితే, ఒకవైపు NHRC విచారణ జరుపుతుండగానే... మరోవైపు ఆగమేఘాల తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్ వేయడం సంచలనంగా మారింది. సిట్ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే అయినప్పటికీ... ఎన్ కౌంటర్ జరిగిన మూడ్రోజుల తర్వాత దర్యాప్తునకు ఆదేశించడం కీలకంగా మారింది.

చంద్రబాబుకు బిగ్ షాక్... ఆ సీనియర్ లీడర్ వైసిపి లోకి జంప్

    టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుండి ముఖ్య నేతలు వలస పోతున్నారు. కారణాలేమైనప్పటికీ ముఖ్య నాయకులు అటు బీజేపీ లోకి లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు లో టీడీపీ ముఖ్య నేత బీద మస్తాన్ రావు బాబుకు ఝలక్ ఇస్తూ టీడీపీ కి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసిపి లో చేరారు. గత ఎన్నికల్లో బీద మస్తాన్ రావు టీడీపీ తరుఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మస్తాన్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్  అనతికాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేసారని ప్రశంసించారు. నెల్లూరు టీడీపీ లో కీలక నేతగా ఉన్న మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పడం తో జిల్లాలో పార్టీ బలహీన పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.    

ఎన్ కౌంటర్ల పై సుప్రీం చీఫ్ జస్టిస్ సెన్సేషనల్ కామెంట్స్..

    దిశ హత్యాచార ఘటన తో దేశం మొత్తం ఏకమై నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని నినదించిన విషయం తెలిసిందే. కారణమేదయినా కానీ దిశ కేసులో నిందితులను నిన్న తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో  కాల్చి చంపటం జరిగింది. ఐతే తాజాగా ఇదే విషయమై జోధాపూర్ లో జరిగిన రాజస్థాన్ హైకోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ సుప్రీం చీఫ్ జస్టిస్ మరియు ఇతర సీనియర్ న్యాయమూర్తులకు విజ్నప్తి చేస్తూ అత్యాచారం కేసులను త్వరగా పరిష్కరించాలని కోరారు. దేశంలోని మహళలు తమపై జరగుతున్న హత్యాచార  ఘటనలతో  ఆవేదనతోను,  నిస్పృహలో ఉన్నారని అందువల్ల ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరించే విధంగా న్యాయస్థానాలు పని చేయాలనీ అయన విజ్ఞప్తి చేసారు. ఐతే అదే కార్యక్రమం లో పాల్గొన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  దీని పై స్పందిస్తూ రేప్ కేసుల వెంటనే తీర్పులు చెప్పడం సరి కాదని అన్నారు. ఈ సందర్బంగా నిన్న జరిగిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను పరోక్షంగా  ప్రస్తావిస్తూ న్యాయం అనేది ప్రతీకారంగా మారితే న్యాయం యొక్క రూపు రేఖలు మారిపోతాయని అయన  వ్యాఖ్యానించారు. 

ఆనం వర్సెస్ అనిల్...! సింహపురి వైసీపీలో కలకలం...

  సింహపురి వైసీపీలో మరోసారి కలకలం రేగింది. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి వెంకట్ రెడ్డి... కాకాని గోవర్దన్ రెడ్డి మధ్య రగడతో నెల్లూరు వైసీపీలో ఆధిపత్య పోరు బయటపడగా, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన హాట్ కామెంట్స్ మరో వర్గం అంతుర్యుద్ధాన్ని బయటపెట్టింది. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి రండి... అదే మాఫియా కావాలంటే నెల్లూరు వెళ్లాలంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు.... మంత్రి అనిల్ అండ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించేనంటున్నారు. లిక్కర్ మాఫియా, బెట్టింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా... ఇలా ఒక్కటేమిటి... ఏ రకం మాఫియా కావాలన్నా... నెల్లూరులో దొరుకుతారంటూ ఆనం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మాఫియాల కారణంగా వేలాది కుటుంబాలు, లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోతున్నారని, ఈ మాఫియాల ఆగడాలను అడ్డుకోవాలంటే సమర్ధుడైన పోలీస్ ఆఫీసర్ రావాలంటూ ఆనం వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి అనిల్... ఎమ్మెల్యే ఆనం మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. సింహపురి రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ గా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకి మంత్రి అనిల్ చుక్కలు చూపిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఆనం పేరు వినిపించకుండా చేసేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే, జిల్లాలో ఆనం కుటుంబ పెత్తనం ఎక్కడుందో గుర్తించి కట్టడి చేస్తున్నారట. అందులో భాగంగా, దశబ్దాలుగా ఆనం కుటుంబ పెత్తనమున్న వీఆర్ విద్యాసంస్థల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని మంత్రి అనిల్ తెరపైకి తెచ్చారు. ఇదే ఆనం ఆగ్రహానికి కారణమనే టాక్ వినిబడుతోంది. అలాగే, తన నియోజకవర్గమైన వెంకటగిరి పరిధిలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం విషయంలోనూ మంత్రి అనిల్ జోక్యం చేసుకోవడం కూడా ఆనం ఆగ్రహానికి కారణమంటున్నారు. అయితే, ఆనం అండ్ కాకాని ఒక వర్గంగా.... అనిల్ అండ్ కోటంరెడ్డి మరో వర్గంగా... నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వర్గపోరు నడుస్తోందని జనం మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు కోటంరెడ్డి - కాకాని మధ్య రగడ రోడ్డునపడితే... ఇప్పుడు ఆనం - అనిల్ మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరు బయటపడిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ నలుగురు నేతల మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే పార్టీకి మంచిది కాదని, ఆదిలోనే దీన్ని అరికట్టాల్సిన అవసరముందని, సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించుకుని సరిచేయాలని సింహపురి వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. లేదంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ పరువు పోవడం ఖాయమంటున్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కేసిఆర్ సర్కార్ కు అసదుద్దీన్ షాక్..

తెలంగాణ లో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న బంధం అందరికి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సీక్రెట్ అండర్ స్టాండింగ్ కూడా  తెలిసిందే. తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ తో సహా దేశం మొత్తం హర్షం వ్యక్తం ఔతున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో టిఆర్ఎస్ సీక్రెట్ దోస్త్ ఐన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మాత్రం కెసిఆర్ కు షాక్ ఇచ్చారు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ కౌంటర్ అనేది ప్రభుత్వ విధానం కాకూడదని ట్విట్ చేసారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పై మెజెస్టిరియల్ ఎంక్వయిరీ వేసి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయట పెట్టాలని అయన డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ కు అలాగే కెసిఆర్ కు  మంచి మిత్రుడిగా ఉండే అసదుద్దీన్ ఇలా డిమాండ్ చేయడం తో అందరు షాక్ కు గురి అవుతున్నారు. ఐతే దిశ కేసు నిందితులలో ఒకరు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి  కావటమే ఈ ట్విస్ట్ కు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.