తెలంగాణలో లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకం
posted on Dec 20, 2019 @ 10:49AM
తెలంగాణలో కొన్ని స్థానాలను భర్తి చేయడం ప్రారంభించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా జస్టిస్ చింతంపంటి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్ రావు నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ గా జస్టిస్ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్ కోర్ట్ జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడిషియల్ సభ్యుడిగా మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవీకాలం ఐదేళ్ల పాటు ఉండగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ లను ఈ నెల ఇరవై కల్లా నియమించాలి అంటూ హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నియామక కమిటీలు ప్రగతి భవన్ లో భేటీ అయ్యాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఈ కమిటీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం శాసన సభాపక్ష ఉపనేత పాషా ఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రీ ఉన్నారు. హక్కుల కమిషన్ కు సంబంధించిన కమిటీలో అదనంగా హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు. లోకాయుక్త, ఉపలోకాయుక్త హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్ తమిళిసైకి పంపారు. ఆమె ఆమోదించటంతో ఉత్తర్వులను ఇచ్చారు.
జస్టిస్ సివి రాములు నిజామాబాద్ జిల్లా ఆచన్ పల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. 1978 లో మహారాష్ట్ర లోని యశ్వంత్ లా కాలేజిలో ఎల్ఎల్బి పూర్తి చేసుకున్నారు. ఇరవై నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఏపీ హై కోర్టు అడిషనల్ జడ్జిగా 2002లో, జడ్జిగా 2004 లో బాధ్యతలు స్వీకరించగా 2011 లో ఫిబ్రవరి 9 న పదవీ విరమణ చేశారు. ఉపలోకాయుక్తగా నియమితులైన నిరంజన్ రావు, న్యాయ శాఖ కార్యదర్శిగా పని చేశారు. జస్టిస్ జి చంద్రయ్య ఆదిలాబాద్ జిల్లా తిమ్మాపూర్ లో 1954 మే 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఎ చదివారు. ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా 1980లో పేరు నమోదు చేసుకున్నారు.హై కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఈయన పని చేశారు. 2005 లో హై కోర్టు అడిషనల్ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2006 ఫిబ్రవరి 20 న జడ్జీగా నియమితులైన ఆయన 2016 లో పదవీ విరమణ చేశారు.