న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది... దిశ నిందితుల ఎన్ కౌంటరే రుజువు

  దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, న్యాయ వ్యవస్థలోని లోపాలను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతమున్న న్యాయ వ్యవస్థతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నేర నిరూపణ జరిగినా దోషులకు శిక్షలు పడటం లేదని, వేగంగా బాధితులకు న్యాయం జరగడం లేదని, దాంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని అన్నారు. అందుకు దిశ నిందితుల ఎన్ కౌంటరే నిదర్శనమన్నారు. చట్ట ప్రకారమైతే న్యాయం జరగదని ప్రజలు భావిస్తున్నారని, అందుకే దోషులను తామే శిక్షిస్తామని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యంగా అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతుండటం అస్సలు మంచిది కాదన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. నేరస్థులకు వేగంగా శిక్ష పడకపోవడంతోనే సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి నేరస్థులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

దిశ ఎన్ కౌంటర్ కు ముందు రోజు... డీజీపీతో సజ్జనార్ కీలక చర్చలు... పెద్దల గ్రీన్ సిగ్నల్ తర్వాతే..!

దిశ ఘటన జరిగిన 24గంటల్లోనే నిందితులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు... ఆరోజే దాదాపు పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం ఒప్పుకోవడం... దారుణానికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించడం... టెక్నికల్ ఎవిడిన్స్ కూడా దొరకడంతో... అసలేం జరిగిందో... నిందితులు నేరం ఎలా చేశారో పూర్తి క్లారిటీకి వచ్చారు. దాంతో, నిందితులను పట్టుకున్న రోజే... ఎన్ కౌంటర్ చేస్తారని అంతా భావించారు. ఇక, సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఎన్ కౌంటర్లు చేసిన ట్రాక్ రికార్డు ఉండటం... వరంగల్ లో యాసిడ్ అటాక్ నిందితులను కాల్చిచంపిన చరిత్ర ఉండటంతో.... దిశ నిందితులకు కూడా అదే చివరి రోజు కావొచ్చని అనుకున్నారు. అయితే, దిశ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్... ఆరోజే డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రందించినట్లు తెలిసింది. నిందితులను ఎన్ కౌంటర్ చేద్దామంటూ అడిగినట్లు సమాచారం. అయితే, తొందరపడొద్దని, అలా నిర్ణయాలు వద్దంటూ డీజీపీ సూచించినట్లు తెలుస్తోంది. దాంతో, చట్టపరకంగా ముందుకెళ్లారు. అయితే, దిశ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు జరగడం... మరోవైపు తెలంగాణ పోలీసులపై విమర్శలు రావడం... ఢిల్లీ టూర్లో సీఎం కేసీఆర్ కు నేషనల్ మీడియా నుంచి చేదు అనుభవం ఎదురవడం... పార్లమెంట్లో తీవ్ర చర్చ జరగడంతో... అటు తెలంగాణ ప్రభుత్వం... ఇటు తెలంగాణ పోలీసులు... తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం(డిసెంబర్ 5) డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు... డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమై అత్యంత గోప్యంగా చర్చలు జరిపారు. డీజీపీతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమవడంపై కచ్చితమైన సమాచారమున్నా... అయితే, దేనిపై చర్చించారో తెలియనప్పటికీ... ఈ సమావేశం జరిగిన తర్వాతి రోజే దిశ నిందితులు ఎన్ కౌంటర్ కావడాన్ని బట్టి చూస్తుంటే.... పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే... పోలీసులు యాక్షన్ లోకి దిగి పని పూర్తిచేసినట్లు అంటున్నారు.  

పోలీసులే ఎన్ కౌంటర్ చేస్తే.. ఇక కోర్టులెందుకు..? మాజీ మంత్రి మేనకా గాంధీ

  షాద్‌నగర్ లో ఈ ఉదయం జరిగిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశం నలుమూలల నుండి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు జై కొట్టి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. దీని పై పలు పార్టీల నేతలు, సెలబ్రిటీలు సైతం తెలంగాణ పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకుంటేనే దేశంలో మహిళల పట్ల జరుగుతన్న  అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే కొందరు మాత్రం తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. కోర్టులు విచారించి విధించాల్సిన శిక్షలను పోలీసులే విధిస్తే ఎలా అనే వారు కూడా ఉన్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయంకరమైంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదు. నిందితులకు కోర్టుల ద్వారా మాత్రమే కఠిన శిక్షలు పడాలి. ఇలా న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు?''. అని మేనకా గాంధీ అన్నారు.  

నా బిడ్డ విషయంలో ఈ న్యాయం ఏమైంది?: అయేషా మీరా తల్లి షంషాద్ బేగం

  దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసు నిందితులు పది రోజుల్లోనే హతమవ్వడంపై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆనందం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని, నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఎన్ కౌంటర్ వల్ల దిశకు కొంత న్యాయం జరిగినట్లేనని ఆమె అన్నారు. అయేషా మీరా కేసులో సజ్జనార్ లాంటి అధికారి ఉంటే తమకు ఏనాడో న్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈజీగా వారిని కాల్చిచంపేశారని, అదే తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ప్రశ్నించారు.  విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తూ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న 19 ఏళ్ళ ఆయేషా మీరాను 27 డిసెంబరు 2007 న అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.  బాత్ రూంలో మృతదేహం పడివుండగా, 'తన ప్రేమను తిరస్కరించినందుకే ఆమెపై అత్యాచారంచేసి చంపేశాను' అని నిందితుడు లెటర్ రాసి మరీ ఆమె పక్కన పడేశాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు పలుకుబడి కలిగిన వారు కావడంతో ఆధారాలు దొరక్కుండ చేసి కేసును తారుమారు చేశారు. చివరకు ఓ చిల్లర దొంగ సత్యంబాబును కేసులో నిందితుడిగా చూపి శిక్ష పడేలా చేశారు పోలీసులు.  కేసు విచారణలో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అనేది ఇంకా తెలియని పరిస్థితి. 11 ఏళ్ల తర్వాత ఈకేసును ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.   

సీటు బెల్టు రాలేదు.. మంటల్లో చిక్కుకుని కారులోనే మహిళ సజీవ దహనం

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా కారులో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఉదయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మహారాష్ట్ర వెళ్లాడు. పని అయిన అనంతరం తిరిగి కారులో బయలుదేరగా, బీదర్ జిల్లాలోని మణి కెల్లీ చిరుకప్ప వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరు పిల్లల్ని రక్షించి భార్యను రక్షించే లోగా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. భార్య కల్యాణి కారులోనే సజీవ దహనమైంది.  హైదరాబాదుకు చెందిన ఉదయ్  తన భార్య కల్యాణి కొడుకులు గగన్, సంజీవ్ లతో కలసి మాహరాష్ట్రలో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లా మల్లేపల్లి  వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఇద్దరు కుమారులతో అతను బయటపడ్డపడ్డప్పటికీ అతని భార్యను మాత్రం కాపాడుకోలేకపోయాడు. కేవలం సీటు బెల్టు రాకపోవడం వల్ల ఆమె అక్కడే ఇరుక్కుపోయి సజీవ దహనమైంది. ఈ ప్రమాదానికి కారణం చలిగా ఉండటం వల్ల కారులో హీటర్ పెంచుకున్నారు. అందువల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కల్యాణి మృతదేహం మాత్రం బీదర్ లోని ప్రభుత్వాసుపత్రి తరలించారు. కల్యాణి మృతదేహాం పోస్టు మార్టం తర్వాత హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది.

సలామ్ సజ్జనార్... పోలీసోడు ఇలాగే ఉండాలి

  స్త్రీల మాన, ప్రాణాలకు విలువ ఇవ్వని మృగాళ్లకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదని.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఆగ్రహంతో గొంతెత్తి గర్జిస్తున్నారు. ఆ ఆగ్రహానికి కారణం దిశా ఘటన. అసలే స్త్రీలపై జరుగుతున్న వరుస ఘటనలు కలచివేస్తుంటే.. దిశా ఘటన ప్రజల్లో ఆవేశాన్ని రగిల్చింది. ఆమెని అత్యాచారం, హత్య చేసిన ఆ నలుగురు నిందితుల్ని చంపేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. నిన్నటి వరకు ఆవేశంగా అరిచిన గొంతులు.. ఈరోజు ఒక వార్త విని.. దిశా కుటుంబానికి న్యాయం జరిగిందని ఆనందపడుతున్నాయి. ఆ వార్తే దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్. అవును ప్రజలు ఇదే కోరుకున్నారు. నిందితుల్ని చంపేస్తేనే ఇలాంటి తప్పు చేయడానికి మిగతావాళ్ళు భయపడతారని పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. ప్రజలు కోరుకుందే జరిగింది. తెల్లవారు జామున దిశా ఘటన నిందితులు నలుగుర్నీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేసి మంచి పని చేసారంటూ ప్రజలు సెల్యూట్ కొడుతున్నారు. శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి దగ్గర నలుగురు  నిందితుల్ని పోలీసులు కాల్చి చంపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో.. పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులువారిపై  కాల్పులు జరిపారు.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. దిశా ఎక్కడైతే ప్రాణాలు విడిచిందో అదే ప్లేస్ లో ఆ దుర్మార్గులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఆడకూతురు అరుస్తున్నా ఏ చలనం లేకుండా కిరాతకంగా ఎక్కడ చంపారో.. అదే ప్లేస్ లో అరుస్తూ కుక్కచావు చచ్చారు. ఈ ఎన్కౌంటర్ ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సీపీ సజ్జనార్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. నాడు వైఎస్ హయాంలో వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు ఎన్‌కౌంటర్లు సజ్జనార్ నేతృత్వంలోనే జరగడంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో వరంగల్‌లో ఇద్దరి విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 48 గంటల్లోనే ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై నిందితులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, యాసిడ్ చల్లేందుకు ప్రయత్నించారని... అందువల్లే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ ముగ్గురిని కాల్చేశారని అప్పట్లో వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు దిశ ఘటన నిందితులను కూడా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్న సమయంలోనే ఎన్‌కౌంటర్ చేయడంతో.. సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు. ఏదిఏమైనా ఘటన జరిగిన కొద్దిరోజులకే ఎన్కౌంటర్ చేసి.. దిశా కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు.. ఆ నలుగురు నిందితుల లాంటి మిగతా మృగాళ్లలో భయం కలిగేలా చేసారంటూ.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎలా... ఎప్పుడు... జరిగిందంటే...

  దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం... ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో... తెలంగాణ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చెప్పినట్లుగానే... ఘటన జరిగిన 24గంటల్లోపే నిందితులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు... చట్ట ప్రకారం ముందుకెళ్తూనే... అత్యంత జాగ్రత్తగా, తెలివిగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్తారు. ఇక, తీవ్ర ఉద్రిక్తతలు, నిరసనల మధ్య నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు... ఆ తర్వాతే అసలు కథను నడిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసిన సైబరాబాద్ పోలీసులు... న్యాయస్థానం ఉత్తర్వులు కోసం ఎదురుచూశారు. డిసెంబర్ ఐదున చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు... దిశ హత్యాచారం జరిగిన ప్రాంతంలో సీన్ రీ-కన్ స్ట్రక్షన్  చేసేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి పన్నెండున్నర తర్వాత తొండుపల్లి టోల్ గేట్ దగ్గరకు నిందితులను తీసుకొచ్చారు. అక్కడ ఎలా దిశపై సామూహిక అత్యాచారం చేశారో... ఎలా దిశను ట్రాప్ చేశారో సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేశారు. ఇదంతా దాదాపు అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు జరిగింది. ఆ తర్వాత అంటే... శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో చటాన్ పల్లి ప్రాంతానికి దిశ నిందితులను తీసుకొచ్చిన పోలీసులు... అక్కడేం ఎలా జరిగిందో సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. దిశను ఎక్కడైతే కాల్చిచంపారో... ఆ ప్రాంతంలో... ఆరోజు ఏం చేశారో... చేసి చూపించాలని నిందితులకు పోలీసులు సూచించారు. అయితే, సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేస్తుండగా... నిందితులు తిరగబడ్డారని... రాళ్లు రువ్వడమే కాకుండా... ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్చిచంపినట్లు పోలసులు చెబుతున్నారు.  

అమిత్ షాతో జగన్ భేటీ... ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ఆహ్వానం

ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. కడప జిల్లాలో ఈ నెల 23న జరగనున్న ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ శంకుస్థాపనకు ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వనించాలని నిర్ణయించారు. అయితే అమిత్ షా అపాయింట్‌మెంట్పై గతంలో లాగే దోబూచులాట చోటు చేసుకుంది. షా పిలుపు కోసం అర్ధరాత్రి దాకా జగన్ వేచి చూసినా ఫలితం లభించలేదు.. మధ్యాహ్నం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లోక్ సభలో వైసీపీ పక్ష నేత మిథునరెడ్డి అమిత్ షాను కలిశారు. జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరగా.. రాత్రి 10 తర్వాత తన నివాసానికి రావలసిందిగా ఆయన సూచించినట్టు తెలిసింది. రాత్రి 10:30 గంటలకు అమిత్ షాను జగన్ కలుస్తున్నారని మీడియాకు సమాచారం అందింది. సాయంత్రమే జగన్ ఢిల్లీకి చేరుకున్నారు రాత్రి పది గంటల సమయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. ఆయన కార్యాలయ వర్గాలు జగన్ కు అపాయింట్ మెంట్ పై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిర్దిష్టమైన సమయం కూడా ఇవ్వలేదు, ప్రవీణ్ ప్రకాష్ నుంచి ఫోన్ రాగానే షా నివాసానికి బయలుదేరాలని జగన్ కూడా ఎదురు చూశారు. కానీ అర్ధ రాత్రి వరకు వేచి చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రవీణ్ ప్రకాష్ కూడా అమిత్ షా నివాసం నుంచి తిరిగి వచ్చిశారు. దీంతో అపాయింట్ మెంట్ లేనట్లేననీ బహుశా ఇవాళ సమయం ఇవ్వవచ్చుననే అంచనాకు వచ్చారు. జగనకు అక్టోబర్ 21వ తేదీన కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన ఆ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చినప్పటికీ అమిత్ షాను కలవలేకపోయారు. మరుసటిరోజున అది కూడా అమిత్ షా పుట్టిన రోజున ఆయనను కలిసి శుభాకాంక్షలు మాత్రమే చెప్పగలి గారు. ఇక శుక్రవారం ఉదయం జగన్ ప్రధానిని కలిసి ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు వచ్చే నెల ( డిసెంబర్ ) 9వ తేదీన అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభానికి రావాలని ఆహ్వానిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే అమీషా అపాయింట్ మెంట్ పైన స్పష్టత కోసం వేచి చూస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా ఖరారైంది. నిన్న అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా కార్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు ప్రధానిని హోంమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించి వారి అపాయింట్ మెంట్ కోరుతూ అభ్యర్థినులు పంపారు. అనంతరం జగన్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. అంతకుముందు కియా కార్ల పరిశ్రమ ప్రారంభోత్సవలో జగన్ కాస్త ముభావంగా కనిపించారు. తన ప్రసంగాన్ని కూడా 3 నిమిషాల్లో ముక్తసరిగా ముగించారు. అనంతపురం పర్యటనలో ఉండగానే తన ఢిల్లీ టూర్ ను ఖరారు చేసుకున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందా అనే చర్చ మొదలైంది. కాగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీకి తాను ఏనాడూ దూరం కాలేదని ఇటీవల వ్యాఖ్యానించారు. అమిత్ షా అంటే తనకిష్టమని వైసీపీ నాయకుడు మాత్రం భయమని ఎద్దేవా చేశారు. పవన్ ను తాము పట్టించుకోవడమే లేదని రాజకీయంగా గుర్తించడం లేదని మంత్రులు వైసీపీ నేతలు అంటూనే ఆయన పై విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ఇదే సమయంలో కడప ఉక్కు శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లడం ప్రాముఖ్యం సంతరించుకున్న విషయంగా చెప్పుకోవచ్చు.

ప్రత్యేక హోదా ఏపీ హక్కు.. మరిచిపోయారా జగన్ గారు

    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాక ముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తీవ్రంగా పోరాడింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అనే నినాదంతో కదం తొక్కింది. దీంతో ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజలకు సెంటిమెంటు అంశంగా మారింది. ఇదే అంశాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మలుచుకుని ఉద్యమించటం జరిగింది. ఈ క్రమంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ పార్టీ పట్టు సడలించడంతో ఆ అంశం కాస్త మరుగున పడిందనే భావన వ్యక్తమవుతోంది. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపికి ఇచ్చిన ప్రధాన హామీలలో ప్రత్యేక హోదా ఒకటి. అలాగే రాష్ర్టానికి పలు హామీలిచ్చిన వాలాలో ఇంకా చాలా నెరవేరలేదు. కేవలం కొన్ని మాత్రమే అమలు కావడం మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తుండడం పై విశాఖలో పలు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు ఇది వరకే తమ వైఖరిని కూడా ప్రకటించాయి. మరీ ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలని తీవ్రంగా పోరాడింది. ఈ అంశంలో ఆ పార్టీ నేతలు పాదయాత్రలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశంపై వరసలు మాట్లాడ్డం లేదని విశాఖలోని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏదో మొక్కుబడిగా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని కేంద్రానికి లేఖలు ఇవ్వడం తప్ప జగన్ చేసిందేమి లేదని వారు మండిపడుతున్నారు. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న రాష్ర్టానికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో ప్రయోజనాలు వస్తాయని అంటున్నారు. ఈ విషయంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా అంశంపై నాడు గట్టిగా గళమెత్తిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైలెంట్ గా మారడంపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది. జగన్మోహనరెడ్డి తనపైన కేసులకు భయపడి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేయడం లేదని అందుకే ఆ అంశాన్ని విస్మరిస్తున్నారని విశాఖలోని ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీల నేతలు అనుకుంటున్నారు. ఈ అంశాన్ని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటకెక్కించిందనే భావనకు వారు వచ్చారు. తమతో కలిసొచ్చే వారితో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ పోరు బాట పట్టాలని వారు నిర్ణయించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై అందరూ ఐక్యంగా పోరాడితేనే రాష్ర్టానికి ప్రయోజనం ఉంటుందని వారంటున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాడటానికి కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండగా మరికొన్ని వెనకడుగు వేస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధన సాధ్యం కాదని ఆ పేరు లేక పోయినా అన్ని ప్రయోజనాలూ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రం లోని ఆ పార్టీ నేతలు ప్రత్యేక హోదా కోసం పోరాటానికి కలిసి వస్తారని అనుకోవడం అత్యాశే అవుతుందని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాద యాత్ర బహిరంగ సభల్లోనూ ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని తాము అధికారం కొస్తే స్పెషల్ స్టేటస్ పోరాడి సాధిస్తామని ఎంతో ఆర్భాటంగా చెప్పారు. తీరా ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మౌనంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి పూర్తి మద్దతు పలికింది. టిడిపి జనసేన పార్టీలు కూడా హోదాపై తమ వైఖరిని స్పష్టం చేశాయి. కమ్యూనిస్టులతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలని బలంగా కోరుకుంటున్నాయి. ఇలా ఎవరికి వారు పోరాడితే ఫలితం ఉండదని అందరూ ఒక్క జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తేనే ప్రయోజనం ఉంటుందని మేధావులు అంటున్నారు. అందుకు అనుగుణంగా చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ చర్చలు కనుక ఫలప్రదమైతే ఎపికి ప్రత్యేక హోదా సాధనకు ఒక ఫ్లాట్ ఫామ్ ఏర్పడుతుందనీ అంటున్నారు. మరి ఆ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

తెలంగాణ పోలీసులకు సినీలోకం సాల్యూట్... దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం...

తెలంగాణ పోలీసులకు సినీలోకం సాల్యూట్... దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్షం... దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు సినీ పరిశ్రమ మొత్తం నీరాజనాలు పడుతోంది. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సినీలోకం స్వాగతిస్తోంది. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ స్పందిస్తున్నారు.  # తెలంగాణ పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నా, మనకు కష్టమొచ్చినా - కన్నీళ్లు వచ్చినా వచ్చేది పోలీసోడే - దర్శకుడు పూరీ జగన్నాథ్ # దిశకు న్యాయం జరిగింది... దిశ ఆత్మకు శాంతి చేకూరుతుంది - హీరో జూనియర్ ఎన్టీఆర్ # దిశ నిందితుల ఎన్ కౌంటర్ తోనే ఆగిపోవద్దు... దిశ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది - హీరో రవితేజ # ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది... నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కుందా... ఆ బుల్లెట్లను దాచుకోవాలని ఉంది... ఆ తుపాలకు దండం పెట్టాలని ఉంది - హీరో మంచు మనోజ్ # దిశ నిందితుల ఎన్ కౌంటర్ వార్త వింటూ నిద్ర లేచాను... దిశ ఆత్మ శాంతిస్తుంది - హీరో నాగార్జున # ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి... ఆ రౌడీ పోలీసోడై ఉండాలి - హీరో నాని # దిశకు న్యాయం జరిగింది - హీరో అల్లు అర్జున్ # మంచి వార్త వింటూ నిద్ర లేచాను... తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాప్ - హీరో మంచు విష్ణు # దిశ కుటుంబ సభ్యుల ఆవేదన తీరదు... కానీ కొంతలో కొంత న్యాయం జరిగింది... దిశ ఆత్మ శాంతిస్తుంది - హీరో కల్యాణ్ రామ్ # తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్ - హీరో విశాల్ # దిశ నిందితులకు సరైన శిక్ష పడింది... తెలంగాణ పోలీసులకు థ్యాంక్స్ - రకుల్ ప్రీత్ సింగ్ # ఈ భయం చాలా అవసరం - దర్శకుడు అనిల్ రావిపూడి # దిశ నిందితుల ఎన్ కౌంటర్ ట్రెండింగ్ కావాలి.... సీపీ సజ్జనార్ కు నా సెల్యూట్ - దర్శకుడు హరీష్ శంకర్ # దిశకు పోలీసులు సరైన న్యాయం చేశారు... తెలంగాణ పోలీసులకు నా సెల్యూట్ - హీరో నిఖిల్ # సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్... - మంచు లక్ష్మి

తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం... సాహో సజ్జనార్ అంటూ జేజేలు

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. జైహో తెలంగాణ పోలీస్... సాహో సజ్జనార్ అంటూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక పండగలా స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా పేల్చుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన చటాన్ పల్లి ప్రాంతానికి పెద్దఎత్తున చేరుకున్న ప్రజలు, స్థానికులు ...పోలీసులకు జిందాబాద్ లు కొడుతున్నారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తూ స్వీట్లు తినిపిస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వరంగల్ ఎన్ కౌంటర్ ను రిపీట్ చేసి సజ్జనార్ నిజమైన హీరోగా నిలిచారంటూ జేజేలు పలుకుతున్నారు.

సైలెంట్ గా ఎన్కౌంటర్.. కేసీఆర్ మాటల పొలిటీషియన్ కాదు, చేతల పొలిటీషియన్

  ఒకప్పుడు ఇండియాని చూసి ప్రపంచదేశాలు స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి అనేవారు. కానీ ఇప్పుడు.. స్త్రీలని గౌరవించలేని దేశంగా, స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశంగా.. ప్రపంచదేశాల ముందు తలదించుకునే స్థాయికి దిగజారుగుతోంది పరిస్థితి. దానికి కారణం కొందరు మృగాళ్లు. న్యూస్ ఛానెల్స్, న్యూస్ పేపర్స్ ఓపెన్ చేస్తే చాలు.. ముక్కుమొహం తెలియని వారిదగ్గర నుండి వావివరసలు మరిచినవారి వరకు.. ఇలా ఎందరో స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తున్న వార్తలే. అసలు స్త్రీ పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా, పట్టపగలు ఒంటరిగా రోడ్ మీద నడవాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆ భయమే అటు స్త్రీలలో, ఇటు స్త్రీలను గౌరవించే వారిలో ఆవేదన రగిల్చింది. కానీ ఆ ఆవేదన ఆవేశంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఆవేశంగా మారితే ఫలితం ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించిందే.. దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్. హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశా అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాత్రి సమయంలో.. స్కూటీ పంచర్ అయ్యింది, సాయం చేస్తామని ఓ ఆడకూతురికి మాయమాటలు చెప్పి.. మృగాళ్లా మీద పడి అత్యాచారం చేసిందే గాక, సజీవ దహనం చేసారు నలుగురు దుర్మార్గులు. ఈ వార్త దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రావేశాలకు కారణమైంది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లెక్కారు. పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు. ఆ నలుగుర్ని మీరైనా చంపండి లేదా మాకు అప్పగించండి.. మేమే నడిరోడ్డు మీద చంపేస్తాం అంటూ ప్రజలు హెచ్చరించారు. అసలు ప్రజల ఆవేశం చూస్తే జైలు గోడలు బద్దలు కొట్టుకొని వెళ్లైనా ఆ నలుగురు నిందితుల్ని చంపేస్తారేమో అనిపించింది. ఒకవైపు ప్రజల ఆవేశం ఈ స్థాయిలో ఉంటే.. మరోవైపు దిశా ఘటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పదించడం లేదంటూ విమర్శలు వచ్చాయి. మంత్రులు నోరుజారడం.. సీఎం కేసీఆర్ సరిగ్గా స్పందికపోవడం, దిశా కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో విమర్శలు వచ్చాయి. కానీ కేసీఆర్ ని నిన్నటి వరకు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆ నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసారు కాబట్టి. కేసీఆర్ దిశా కుటుంబాన్ని పరామర్శించలేదు కానీ దిశా కుటుంబానికి న్యాయం చేసారు. నిందితులకు ఉరిశిక్ష పడి కూతురు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్న తల్లితండ్రులకు.. నిందితుల ఎన్కౌంటర్ పేరుతో ముందే న్యాయం చేసారు. రాజకీయాల్లో ఒక నానుడి ఉంటుంది. పొలిటీషియన్ అనే వాడు ఎప్పుడూ తనకి నచ్చింది చేస్తూ పోకూడదు. ప్రజల మూడ్ ని బట్టి నడుచుకోవాలి అంటారు. ఇప్పుడు కేసీఆర్ అదే చేసారు. ప్రజల ఆవేశం, ఆవేదన అర్థం చేసుకొని సైలెంట్ ఏం చేయాలో అదే చేసారు. ఆయన సైలెంట్ గా ఉన్నాడని విమర్శించిన వారికి ఎన్కౌంటర్ తో సమాధానం చెప్పారు. ఏదిఏమైనా ఈ చర్య స్వాగతించతగ్గది. ఇంకోసారి ఎవడైనా ఆడవారి మీద చెయ్యి వేయాలంటే.. ఎన్కౌంటర్ పేరుతో కొద్దిరోజుల్లోనే కుక్కచావు చస్తామన్న భయం వాళ్ళకి కలగాలి.

ఒక కూతురికి న్యాయం జరిగింది.. నా కూతురి ఆత్మకు శాంతి ఎప్పుడు?: నిర్భయ తల్లి ఆవేదన

    హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు కామాంధులు మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడిందని, బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందించినట్టయిందని అంటున్నారు.  ఢిల్లీలో అత్యాచార బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి కూడా ఈ ఎన్ కౌంటర్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తనకు ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. 2012లో నిర్భయ ఘటన తర్వాత తనకు అయిన గాయాలకు ఈ ఎన్‌కౌంటర్ ఆయింట్‌మెంట్ రాసినట్లుగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దిశ కుటుంబానికి త్వరగా న్యాయం జరిగిందని ఆశా దేవి అన్నారు. ఈ విషయంలో పోలీసులు అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారిలో భయం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతించి ఉంటుందని చెప్పారు.  ఇప్పటికైనా ఒక కూతురికి న్యాయం జరిగిందని, తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురు నిర్భయ కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నానని నా కుమార్తెకు న్యాయం ఎప్పుడు చేస్తారు అని ఆశాదేవి ప్రశ్నించారు. తన కుమార్తె నిర్భయ విషయంలో కూడా పోలీసులు ఇదే తరహా చర్యలకు దిగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఏడేళ్లు ముగిసిపోయినప్పటికీ తనకు న్యాయం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాను ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారు ఇంకా జీవించే ఉన్నారనే విషయాన్ని తాను పదే, పదే గుర్తు చేయాల్సి వస్తోందని వాపోయారు.  తన కుమార్తెపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించినప్పుడే తన కుమార్తె ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశాదేవి చెప్పారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చాలామందిని కలిశానని, అందరూ హామీలు, భరోసాలు ఇచ్చిన వారేనని అన్నారు. నిర్భయ నిందితులకు సత్వరమే ఉరి శిక్షను విధించాలని తాను న్యాయ వ్యవస్థకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.  

అన్యాయంగా చంపేశారు... కోర్టులు చేయాల్సిన పని మీరెలా చేస్తారంటున్న నిందితుల తల్లిదండ్రులు

    దిశ హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు ఈ తెల్లవారు జామున 3న్నర గంటల సమయంలో...  ఎన్‍కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దేశం మొత్తం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూన్న నేపథ్యంలో ఈ ఎన్‍కౌంటర్ జరిగింది. ఐతే నిందితులు తమ దగ్గరున్న తుపాకులు లాక్కొని తమపై దాడి చెయ్యాలని యత్నిస్తూ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తాము ఎన్‌కౌంటర్ చెయ్యాల్సి వచ్చిందని పోలీసులు చెపుతున్నారు. ఐతే... నిందితుల తల్లిదండ్రులు మాత్రం పోలీసులు తమ కొడుకుల్ని కావాలనే చంపేసి, ఎన్‌కౌంటర్ జరిగిందని అబద్ధం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ కొడుకుల్ని అన్యాయంగా చంపేశారని నిందితుడు అరిఫ్ మరియు  చెన్నకేశవులు తల్లులు ఆరోపిస్తున్నారు.  అసలు కోర్టులు నిందితులకు  శిక్షలు విధించాలి కానీ  ఇలా పోలీసులే చంపేస్తే... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. దిశపై జరిగిన హత్యాచారం ఘటనపై తమకు కూడా ఆవేదన ఉందనీ, అలాగే తమ పిల్లల్ని కాపాడాలని కూడా తాము కోరట్లేదనీ,  శిక్షలనేవి చట్టప్రకారం కోర్టులు విధించాలే తప్ప ఇలా ఎన్‌కౌంటర్ పేరుతో పోలీసులే చంపేయడం ఎంతవరకూ సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వాళ్లను చంపే ఉద్దేశంతోనే తెల్లవారకముందే స్పాట్‌కి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో పోలీసులు నాటకం ఆడారని... దిశ హత్య జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి తమ కొడుకుల్ని కాల్చి చంపి... ఎన్‌కౌంటర్ డ్రామా ఆడుతున్నారని వారు  తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే  ఇలా నిందితల్ను చంపేటట్లైతే ఇక కోర్టులు, చట్టాలూ ఎందుకని నిందితుల తల్లితండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పొలిసు చర్య ద్వారా తమకు న్యాయం జరగలేదనీ, తమ కొడుకుల్ని చంపేయడం ఎంతవరకూ సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.   

 సెలవులు ఇవ్వటం లేదని.. ఐదుగురిని కాల్చేసి తనను తాను కాల్చుకున్న జవాను

  ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం.. జవాన్ల మధ్య ఘర్షణ చెలరేగింది. జవాన్ల మధ్య గొడవలో ఆరుగురు జవాన్ లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలోని కడెనార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఐటిబిపి 45 బెటాలియన్ జవాన్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఐటిబిపి క్యాంప్ అటవీ ప్రాంతంలో ఉండటంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గాయపడ్డ జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్ లో రాయపూర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.రెహమాన్ ఖాన్ అనే జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి జవాన్ల పైకి కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనలో రహమాన్ ఖాన్ సహా మరో ఐదుగురు జవాన్ లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సెలవు దొరకలేదనే కారణంతో తోటి జవాన్ల పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను రాయపూర్ ఆస్పత్రికి తరలించినట్టు అడిషినల్ ఐజీ దేబ్ నాథ్ వెల్లడించారు.ఈ విషయం పై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉందని ఉన్నత అధికారులు వెల్లడించారు.

ఆల్ఫాబెట్ హెడ్... ప్రపంచఖ్యాతి చెందిన తమిళ తంబి

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో అత్యున్నత బాధ్యతలను చేపడుతున్నారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెర్జీ బ్రిన్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సిఇఒగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 21 సంవత్సరాల కిందట గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ను స్థాపించిన పేజ్ బ్రిన్లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజంగా మారనున్నారు. టెక్నాలజీ పై వినియోగదారులు గూగుల్ ఉద్యోగుల్లో భాగస్వాముల్లో ఫ్యాషన్ ను సుందర్ పిచాయ్ తీసుకువచ్చాడని గూగుల్ ను అల్ఫాబెట్ ను భవిష్యత్తు వైపు నడిపించడానికి అంతకంటే సమర్థుడో మరొకరు లేరనే ఉద్దేశం తోనే సుందర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు లారీ పేజ్ సర్గీబ్రిన్ లు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆల్ఫాబెట్ ప్రస్తుతం ప్రపంచం లోనే అత్యంత విలువైన కంపెనీలోని ఒకటి. 2018 లో ఆల్ఫాబెట్ లాభం 30 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయం 136.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆల్ఫాబెట్ గ్రూపుల్ లో ఉన్న లైఫ్ సైన్సెస్ గ్రూప్ వైరల్ ఐ బయటకు అపరేషన్ సంస్థ కాలికో వంటివి ఇంకా నష్టాల్ లోనే ఉన్నాయి. గూగుల్ లాభాల్ని తెచ్చి పెట్టుబడులుగా పెట్టినప్పటికీ ఈ సంస్థలు ముందుకు కదలడం లేదన్నారు. మరి సుందర్ సిఇఒగా బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి సమస్యల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. పిచాయ్ ఇక పై సర్చ్ వ్యాపార ప్రకటనల్లో నాప్స్, స్మార్ట్ స్టాఫ్ వేర్, ఆన్ లైన్ వీడియో తదితర విభాగాలతో పాటు డ్రోన్ డెలివరీలు, ఇంటర్నెట్ బీమింగ్ బెలూన్స్ వంటి వాటికి ఏకైక అధిపతి కానున్నారు. రెండు దశాబ్దాల కిందట గూగుల్ ని ఏర్పాటు చేసిన పేజ్ బ్రిన్లు 2015 లో పిచాయ్ గూగుల్ సీఈవోగా చేసి వారు అల్ఫాబెట్ లోకి వెళ్లారు. ఇప్పుడు రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్రను మరింత పరిమితం చేసుకున్నారు. కాగా తాజా మార్పులతో అల్ఫాబెట్ నిర్మాణంలో ఎటువంటి మార్పు ఉండదని పిచాయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే కంపెనీలో పలు బాధ్యతలు నిర్వహించారు సుందర్ పిచాయ్. క్రోమ్ బాధ్యతలతో పాటు గూగుల్ ప్రొడక్ట్ చీఫ్, ఆండ్రాయిడ్ అధిపతిగా వ్యవహరించారు. గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక అంతా తానై నిర్వహించారు. ఆయన నాయకత్వంలో గూగుల్ వ్యాపార వృద్ధి కొనసాగింది. హార్డ్ వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ లోకి విస్తరించింది. తమిళనాడులోని మధురైలో పుట్టిన పిచాయ్ వార్టన్ బిజినెస్ స్కూల్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.

దిశా కేసుకు మరణ ముగింపు.. నిందితులను అదే స్థలంలో ఎన్ కౌంటర్

  దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను కాల్చి చంపేసిన స్థలంలోనే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద పోలీసుల నుండి తప్పించుకొని నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశప అత్యాచారం కేసుకు మరణ ముగింపు లభించింది. ఘటన అనంతరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ( డిసెంబర్ 6న ) అర్ధరాత్రి దాటాకా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి ఘటనా స్థలానికి రహస్యంగా తరలించారు పోలీసులు. తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో నిందితులు లారీ పక్కకి పెట్టిన స్థలాన్ని.. మద్యం తాగిన ప్రాంతన్ని..  పరిశీలించారు.  భూమిలో పాతిపెట్టిన దిశ ఫోన్ ను వారితోనే వెలికి తీయించారు. ఘటన రోజు ఏం జరిగిందో మొత్తం సీన్ అలానే చేసి చూపించమన్నారు. అలా వాళ్ళు చేసిన విధానాన్ని చూపిస్తూ అందులో ఇద్దరు ముందుగా పారిపోవడానికి ప్రయత్నించారు. ఆ తరువాత వీళ్ళని ఆపుతున్న తరుణంలో మరో ఇద్దరు కూడా అలానే చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని అంటున్నారు. ఇంకా మృతదేహాలను బయటకు ఇవ్వలేదు. బహుశా పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు లేదా సంబంధించిన కుటుంబీకులకు అప్పజెప్పవచ్చు.