కర్నూల్ కి హైకోర్టు.. లాయర్ల సంబరాలు!!
posted on Dec 20, 2019 @ 3:25PM
హైకోర్టు భవనాలు శివారు ప్రాంతంలో నిర్మించాలనుకుంటే కర్నూలకు సమీపంలోని ఓర్వకల్లు మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి అని న్యాయవాదులు తెలియజేశారు. ఇప్పటికే ఓర్వకల్లులో విమానాశ్రయం, ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్డీవో, సోలార్ పార్కు వంటి పెద్ద సంస్థలే కాక వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో కూడా ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హై కోర్టు నిర్మాణానికి ఎంత భూమినైనా కేటాయించవచ్చు. కర్నూలుకు పది కిలోమీటర్ల దూరములో హైదరాబాద్-బెంగుళూరు 44 వ జాతీయ రహదారి ఆనుకుని కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిసరాలల్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ మూతపడింది,దానిలో ఒక ఐటీ కంపెనీ కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. హై కోర్టు నిర్వహణకు అవసరమైన భవనాలు కూడా ఆ ప్రాంతంలో. స్వల్ప మార్పులతో కోర్టు హాల్స్ ఏర్పాటు చేయవచ్చు. ఈ భవన సముదాయాన్ని గతంలో పరిశీలించారని ప్రచారముంది. నలభై వ జాతీయ రహదారి పై మూత పడిన సఫా ఇంజనీరింగ్ కాలేజీ భవన సముదాయం కూడా అందుబాటులో ఉంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయంటున్నారు న్యాయవాదులు. వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర విభజన అంశం తెరపైకి రాగానే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు రాజధాని హై కోర్టు ఒకే దగ్గర ఉండాలంటూ అమరావతిలోనే రెండింటిని ఏర్పాటు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు వ్యాఖ్యల తర్వాత న్యాయవాదులు హై కోర్టు కోసం రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో 97 రోజులుగా విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులకు మద్దతుగా రాయలసీమలో రాజధాని హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ జిల్లా లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. చివరికి అమరావతి అసెంబ్లీను సైతం ముట్టడించారు. ఈ సమయంలోనే అసెంబ్లీలో రాజధానిపై చర్చ సందర్భంగా కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయొచ్చని సీఎం జగన్ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో న్యాయవాదులు సంబురాలు చేసుకుంటున్నారు. దశాబ్దాల కల నెరవేరిందని రాయలసీమకు న్యాయం చేశారంటూ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని ఎక్కడ ఉండబోతుందని అటు రైతులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్, న్యాయవాదుల సైతం అయోమయంతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.