దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై కేసిఆర్ సర్కార్ కు అసదుద్దీన్ షాక్..

తెలంగాణ లో టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఉన్న బంధం అందరికి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్య ఉన్న సీక్రెట్ అండర్ స్టాండింగ్ కూడా  తెలిసిందే. తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ తో సహా దేశం మొత్తం హర్షం వ్యక్తం ఔతున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంలో టిఆర్ఎస్ సీక్రెట్ దోస్త్ ఐన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మాత్రం కెసిఆర్ కు షాక్ ఇచ్చారు. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్ కౌంటర్ అనేది ప్రభుత్వ విధానం కాకూడదని ట్విట్ చేసారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పై మెజెస్టిరియల్ ఎంక్వయిరీ వేసి నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను బయట పెట్టాలని అయన డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ కు అలాగే కెసిఆర్ కు  మంచి మిత్రుడిగా ఉండే అసదుద్దీన్ ఇలా డిమాండ్ చేయడం తో అందరు షాక్ కు గురి అవుతున్నారు. ఐతే దిశ కేసు నిందితులలో ఒకరు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి  కావటమే ఈ ట్విస్ట్ కు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.   

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో కొత్త కోణం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పలువురు న్యాయ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దిశ కేసులో టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పినప్పటికీ... అది ఎంతవరకు నిజమో చెప్పలేమంటున్నారు. ఒకవైపు పోలీసుల తీరుపై దిశ కుటుంబ సభ్యుల ఆరోపణలు... మరోవైపు ప్రజాగ్రహం... ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రెజర్ తో ఉక్కిరిబిక్కిరైన సైబరాబాద్ సీపీ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చెప్పినట్లుగానే 24గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్ కి తరలించినా ప్రజాగ్రహం చల్లారకపోవడం.... మరోవైపు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలన కావడంతో తెలంగాణ పోలీసులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం జరగదని, నిందితులకు శిక్షపడదని, ఏదోరకంగా మళ్లీ బయటికొచ్చి మరోసారి ఇలాంటి దారుణాలకు పాల్పడే అవకాశముందని దేశమంతా నినదించింది. అనేక కేసుల్లో అది నిజం కావడంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సిందేనని, లేదంటే తమకు అప్పగించాలని, తామే శిక్షిస్తామని ప్రజలు డిమాండ్ చేయడంతో... మరో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఎన్ కౌంటర్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే, న్యాయ నిపుణులు ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఎన్ కౌంటర్ చేయకపోతే నిందితులకు శిక్ష పడటం అనుమానమేనని అభిప్రాయపడుతున్నారు. దిశ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం... అలాగే బలమైన ఆధారాలు లేకపోవడంతో... ఇది కోర్టులో నిలబడటం కష్టమని అంటున్నారు. టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికిందని పోలీసులు చెబుతున్నా... నిందితులే నేరం చేశారనేందుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు మాత్రం లేవనే మాట వినిపిస్తోంది. దిశ శరీరం పూర్తిగా కాలి బూడిదగా మారిన నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షతో సరిపోల్చడం కూడా సాధ్యంకాదని... అదే సమయంలో తామే నేరం చేశామని నిందితులు వాంగ్మూలం ఇచ్చినా అది చట్టం ముందు నిలవదని చెబుతున్నారు. చంపుతామని పోలీసులు బెదిరించడంతోనే తాము అలా వాంగ్మూలం ఇచ్చామని నిందితులు చెబితే కేసు వీగిపోయే అవకాశముందని అంటున్నారు. దిశపై అత్యాచారం జరిగినట్లు రుజువు చేయాలంటే ముందు నిందితులకు వైద్య పరీక్షలు చేయాలి. ఆ సమయంలో వాళ్లు ధరించిన వస్త్రాలు సేకరించాలి. వీర్యం, రక్తపు పరీక్షల కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాల్సి ఉంటుంది. కానీ, ఇవేమీ చేసినట్లు పోలీసులు ప్రకటించలేదు. దాంతో, ఈ కేసు చాలా బలహీనంగా మారిందని, కేవలం నిందితుల వాంగ్మూలంతోనే శిక్ష పడే అవకాశం తక్కువ ఉంటుందని అంటున్నారు. ఇలా, అనేక అడ్డంకుల కారణంగా సరైన ఆధారాలతో కేసును రుజువు చేసి నిందితులకు శిక్షలు పడేలా చేయడం అంత సులభం కాదని... అందుకే, ఎన్ కౌంటర్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఎన్ కౌంటర్ తర్వాత ఊపిరి పీల్చుకున్న సజ్జనార్... దిశ ఘటన తర్వాత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సీపీ...

దిశ రేప్ అండ్ మర్డర్ ఇన్సిడెంట్ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. సీపీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు ఎన్ కౌంటర్ అయ్యేవరకూ సజ్జనార్ తన జాబ్ కెరియర్ లోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొన్నారు. ఒకవైపు కేసు విచారణ, దర్యాప్తు... మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ఒత్తిడి... ఇంకోవైపు పౌర సమాజం నుంచి డిమాండ్లతో సజ్జనార్ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారని సన్నిహిత పోలీస్ వర్గాలు అంటున్నాయి. ఆనాటి వరంగల్ యాసిడ్ ఘటన కేవలం రాష్ట్రం వరకు పరిమితమైతే... దిశ సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం... పార్లమెంట్ ను సైతం కుదిపేయడంతో సజ్జనర్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు. అంతేకాదు సజ్జనార్ కు ఈ పది రోజుల్లో వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి నిమిషం సజ్జనార్ ఫోన్ కు ఎస్ ఎంఎస్ లు, వాట్సప్ మెసేజ్ లు వెల్లువెత్తాయి. సజ్జనార్ కే కాకుండా ఆయన సతీమణికి కూడా తెలిసినవారి నుంచి బంధువుల నుంచి వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ అండ్ మెసేజ్ లు వచ్చాయి.  సజ్జనార్, ఆయన సతీమణికి ఎస్ ఎంఎస్ లు, వాట్సప్ మెసేజ్ లు పంపినవాళ్లలో పలువురు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారట. ముఖ్యంగా నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ అందరూ కోరినట్లు తెలుస్తోంది. దాంతో, సజ్జనార్ తీవ్రమైన ఒత్తిడిని భరించారని పోలీస్ వర్గాలు సైతం అంటున్నాయి. సజ్జనార్ కు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరు ఉండటం... దిశ ఘటన కూడా ఆయన పరిధిలోనే జరగడంతో కచ్చితంగా నిందితుల ఎన్ కౌంటర్ జరుగుతుందని పోలీస్ వర్గాలతోపాటు ప్రజలు కూడా ఊహించారు. అయితే, నిందితులు పట్టుబడిన రోజే ఎన్ కౌంటర్ కావొచ్చని అంతా అనుకున్నారు. సజ్జనార్ కూడా డీజీపీని సంప్రదించారని, అయితే తొందరపడొద్దని సూచించారని ప్రచారం జరిగింది. అయితే, నిందితుల ఎన్ కౌంటర్ కు ముందు రోజు సజ్జనార్.... హోంమంత్రి, డీజీపీ, ఇతర ప్రభుత్వ పెద్దలతో సమావేశమై చర్చించారని, గ్రీన్ సిగ్నల్ రావడంతో పని పూర్తి చేశారని అనుకుంటున్నారు. నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురవడంతో ఆయనపై ఒత్తిడి తగ్గిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

జగన్‌కు మరోసారి షాకిచ్చిన షా..! ఢిల్లీ టూర్‌లో మళ్లీ చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ఢిల్లీలో చుక్కెదురైనట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్లినా... తీరా అక్కడికి వెళ్లాక... కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఝలక్ ఇచ్చారని అంటున్నారు. అమిత్ షాను కలిసేందుకు గురువారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన జగన్... రెండ్రోజులు వేచిచూసినా... కేంద్ర హోంమంత్రి సమయం ఇవ్వకపోవడంతో... తిరిగి అదే ఫ్లైట్ లో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. అయితే, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చినా... ఢిల్లీ వచ్చాక అమిత్ షా ఎందుకు ముఖం చాటేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ ఒకసారి ఇలాగే ప్రవర్తించారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీభవన్ వర్గాల సమాచారం మేరకు గురువారం రాత్రి పది గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.... చివరికి శుక్రవారం కూడా తనను కలవడానికి జగన్ కు టైమివ్వలేదు ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... తీరా వచ్చాక జగన్ కు అమిత్ షా సమయం ఇవ్వకపోవడం... వైసీపీ ఎంపీల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జగన్ పట్ల కేంద్రం ఎందుకిలా వ్యవహరిస్తుందో అంతుపట్టడం లేదని అంటున్నారు. అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే అసలు వచ్చేవారే కాదని, కానీ అపాయింట్ మెంట్ ఇచ్చాక కలవకపోవడం ముఖ్యమంత్రిని అవమానించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. గురువారం రోజు జగన్ కు సమయం ఇవ్వని అమిత్ షా.... వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎంపీ సీఎం రమేష్, జితేందర్ రెడ్డి లాంటి పలువురు నేతలకు మాత్రం సమయం ఇవ్వడంలో మర్మమేమిటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. గతంలో కూడా అమిత్ షా ఇలాగే చేశారని... అపాయింట్ మెంట్ తీసుకుని ఢిల్లీ వచ్చిన జగన్ కు సమయం ఇవ్వలేదని... రోజుల తరబడి నిరీక్షించేలా చేశారని గుర్తుచేస్తున్నారు.  అయితే, ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... తీరా ఢిల్లీ వచ్చాక కలవకపోవడం వెనుక ఏదో మతలబు ఉందని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు. జగన్ కు ఏదో మెసేజ్ పంపేందుకే అమిత్ షా ఇలా వ్యవహరిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. షా ఒక్కరే కాదు ఇతర కేంద్ర మంత్రులు కూడా గతంలో ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి... ఆ తర్వాత కలవలేదనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరి, అమిత్ షా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో... జగన్ ను ఢిల్లీకి పిలిచిమరీ ఎందుకు సమయం ఇవ్వడం లేదో... తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

రాహుల్‌కే మళ్లీ ఏఐసీసీ పగ్గాలు..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం... మరోవైపు దశబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో స్వయంగా తానే ఓడిపోవడంతో... అటు ప్రత్యర్ధుల నుంచి... ఇటు సొంత పార్టీ నేతల విమర్శల నుంచి తప్పించుకోవడానికి, రాజీనామా  హైడ్రామా నడిపి, చివరికి ఏఐసీసీ పీఠం నుంచి కిందకి దిగిన రాహుల్ గాంధీకే మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు రంగంసిద్ధమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతోన్న సోనియాగాంధీ మరోసారి తన తనయుడికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధిక వయసు, ఆరోగ్య సమస్యలతో గతంలోనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని రాహుల్ కి పార్టీ పగ్గాలు కట్టబెట్టిన సోనియా... ఇప్పుడు మరోసారి అవే కారణాలతో తప్పుకునేందుకు సిద్ధమైనట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా తర్వాత భారీ హైడ్రామానే నడిచింది. రాహుల్ రాజీనామా చేయొద్దంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. అంతేకాదు... రాహుల్ రాజీనామా చేస్తే... తమకూ ఈ పదవులు వద్దంటూ మద్దతుగా పార్టీ పోస్టులకు రాజీనామాలు సైతం చేశారు. అయితే, ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ లో భాగమేనని చర్చ జరిగింది. ఇక, ప్రత్యర్ధులైతే ఇదంతా పెద్ద హైడ్రామా అంటూ ఎద్దేవా కూడా చేశారు. అయితే, సోనియా వయోభారం, అనారోగ్య సమస్య కారణంగా అనివార్య పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మళ్లీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా తెలుస్తోంది. జనవరిలో జరిగే ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ ను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

దిశకు న్యాయం చేసారు సరే... మరి మా బిడ్డలకు న్యాయం చేయరా..

  దిశా కేసు నిందితులను నిన్న పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. దింతో దిశకు న్యాయం జరిగిందని దేశం మొత్తం పోలీసులను ప్రశంసిస్తున్నారు. ఐతే అదే సమయంలో గత కొంత కాలంగా హత్యాచారాలకు గురైన బాధితులు వారి కుటుంబాలు దీని పై హర్షం వ్యక్తం చేస్తూ మరి మా బిడ్డలకు న్యాయం ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా హజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివా్‌సరెడ్డి కొంత మంది  చిన్నారులపై అత్యాచారం జరిపి, హత్య చేసి, బావిలో పడేసిన విషయం తెలిసిందే. ఇపుడు దిశ నిందితుల్లాగా శ్రీనివాసరెడ్డినీ ఎన్ కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాలు , గ్రామస్థులతో కలిసి శుక్రవారం ధర్నా చేశారు. అలాగే దిశ హత్యకు ఒకరోజు ముందు హన్మకొండలో ఓ యువతిపై ఆమె పుట్టినరోజు నాడే అత్యాచారం జరిపి హత్య చేసిన నిందితుడిని కూడా వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని బాధిత యువతి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే 2018 లో ధర్మసాగర్‌ మండలం బంజరుపల్లిలో 62ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేసిన ముగ్గుఋ నిందితులను కూడా  వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని గ్రామస్థులు, బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. హన్మకొండలో ఆర్ నెలల క్రితం 9 నెలల పసిపాపను ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్యచేసిన నిందితుడు ప్రవీణ్‌ను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఆ చిన్నారి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇటువంటి హత్యాచార ఘటనలలో దిశ కేసు మాదిరిగానే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే డిమాండ్ లు వెల్లువెత్తుతున్న నేపధ్యం  లో పోలీసులు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.   

పదవులకు రెన్యూవల్ ఉంటుందో.. లేదో.. ఆ ముగ్గురు టీఆర్ఎస్ సీనియర్లలో అలజడి

2020 సంవత్సరంలో తమ పదవీ కాలం ముగియనుండడంతో గులాబీ పార్టీలో ఆ సీనియర్ నాయకులకు రెన్యువల్ ఉంటుందో లేదో అనే గుబులు పట్టుకుంది 2020 లో తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఎమ్మెల్సీ, మరో 2 రాజ్యసభ స్థానాలకు పదవీ కాలం ముగియనుంది. అయితే వాటిలో ఒక ఎమ్మెల్సీ ఒక రాజ్యసభ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వారికి ఈ సారి రెన్యువల్ కష్టం అని టాక్ పార్టీలో మొదలైంది. మాజీ హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2014 లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2020 తో ముగుస్తుంది. అయితే 2014 క్యాబినెట్ లో నాయనకీ చోటిచ్చిన కేసీఆర్, 2018 లో మాత్రం అవకాశమివ్వలేదు. అప్పట్నుంచీ నాయిని పార్టీ పై అసంతృప్తిగా ఉన్నారు. బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కిన నాయిని రీసెంట్ గా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిశాక కార్మిక సంఘాల విషయంలో కూడా ప్రభుత్వం లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయనకి ఈ సారి పదవి డౌట్ అనే చర్చ జరుగుతోంది. రాజ్యసభ సభ్యుడు కెకె పదవీ కాలం కూడా 2020 లోనే ముగుస్తుండటంతో కేకే పదవిపై కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయినితో పాటు కేకే కూడా గులాబీ పార్టీలో కీలక నాయకుడు. అయితే ఆర్టీసీ సమ్మె సమయంలో కేకే ప్రకటనలూ గులాబీ బాస్ ను నొప్పించాయని సమాచారం. దీనికి తోడు కేకే అన్ని పార్టీల నాయకులతో నిత్యం టచ్ లో ఉంటారు. కేకే వయసు కూడా ఎక్కువ ఉండడంతో ఆయన సీటు వేరెవరికీ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో మిగతా వారి సంగతి పక్కనబెడితే కేకే అండ్ నాయిని నరసింహరెడ్డికి మాత్రం పదవి టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకూ అంటే అటు విపక్షాలు కూడా ఇపుడు పదవులు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఉన్న పదవులన్నీ టీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. ఇక ఎమ్మెల్సీ రాములు నాయక్ పదవి కూడా 2020 తోనే ముగియనుంది. కాని ఆయన 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆయనకి కూడా పదవి లేదు. మరొక ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవి కూడా 2020 లోనే ముగుస్తుంది. కానీ ఈయనకు రెన్యువల్ పక్కా అని తెలుస్తోంది. కర్నెకు విప్ పదవి కూడా కేటాయించారు సీఎం. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయినట్టే. మొత్తానికి ఈ నేతలకు 2020 టెన్షన్ పట్టుకుంటే ఆశావహులు మాత్రం సంబరపడుతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్లకు రెన్యువల్ కాకుంటే తాము ట్రై చేయొచ్చు అని. మరి గులాబీ బాస్ కేసీఆర్ ఆ ఇద్దరు సీనియర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అన్నది 2020 సమాధానం చెప్పబోతోంది.

నెల్లూరు టిడిపిలో గందరగోళం.. వైసీపీ వైపు అడుగులు వేస్తున్న నేతలు

  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం వీచిన సమయంలో సైతం 10 నియోజకవర్గాల్లో 5 నియోజక వర్గాలను టిడిపి కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీకి 4 నియోజకవర్గాలే దక్కాయి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లోనే 10 కి 10 స్థానాలను టిడిపి చేజార్చుకుంది. ప్రతికూల ఫలితాలు రావటానికి కారణాలను పార్టీ ముఖ్యనేతలు అభ్యర్ధులు శోధిస్తే అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొందరు నేతలు చేసిన తప్పిదాలు.. లోపాయికారి ఒప్పందాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై ఆ పార్టీ ముఖ్య నేతలు దృష్టి సారించారు. ప్రస్తుతం టిడిపి నుంచి వలసలు సాగుతున్న నేపథ్యంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమావేశాలు నిర్వహించారు. టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ టికెట్లను 33 శాతం యువతకు, 33 శాతం మహిళలకూ ఇవ్వనున్నారు. కార్పొరేషన్ లో డివిజన్లు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కమిటీ వేసేందుకు పేర్ల పరిశీలన కూడా కొనసాగుతోంది. అలాగే నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇటీవల పరిష్కారం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమస్య మీది పరిష్కారం కోసం పోరాటం మాది అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ప్రతి శనివారం ప్రజలు టిడిపి కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకోవడం సోమవారం అధికారులను కలిసి ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటమే ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పరిష్కారం కార్యక్రమంలో అందిన సమస్యలను ఒకటికి రెండు సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, వారు స్పందించకుంటే పోరాటమైనా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి జోరుగానే చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అనుకుంటున్నారు. మరోవైపు టిడిపి హయాంలో పదవులు అనుభవించిన చోటమోటా నేతలు కొందరు ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీతో ప్రయాణం ఎలా ఉందని ప్రశ్నిస్తే వారు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చకచకా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు గానీ, ఆ తర్వాత తమను అస్సలు పట్టించుకోవడం లేదని ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేసి కార్యక్రమాలు చెప్పడం లేదని ఒకవేళ వాటికి వెళ్లిన వెనక సీట్లలోనే కూర్చోవల్సి వస్తుందని స్థానికంగానూ ఆ పార్టీలో ముందు నుంచి నాయకులతో విభేదాలు తలెత్తుతున్నాయని వారు బాధలను ఏకరువు పెడుతున్నారు. ఈ సంగతి తెలిసి టిడిపిలో పక్క చూపులు చూస్తున్న వారు అధికార పార్టీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిజానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో పార్టీలో చేరికలకు ప్రాధాన్యమిస్తూ వెళుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో టిడిపిలో అసలు లీడర్లే ఉండకూడదనే లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు సమాలోచనలు చేసిన దాఖలాలు లేవు. అందులోనూ జిల్లాలో పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు వర్గపోరు ఆరంభమైన చాయలు కనిపిస్తున్నాయి. మంత్రి అనిల్ కుమార్ ప్రధానంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజక వర్గాల మీదనే దృష్టి సారించగా, మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే జిల్లాకు ఇద్దరు ఇన్ చార్జి మంత్రులు మారారు. తొలుత సుచరితని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. వారు ఒకట్రెండు సార్లు జిల్లాకొచ్చి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయారని పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రం అస్సలు పట్టించుకోలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇక బిజెపి విషయానికొస్తే ఇటీవల నెల్లూరు జిల్లాకు ఆ పార్టీ ముఖ్య నేతలు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు టిడిపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారంతా తమ పార్టీలోకి వస్తారని లెక్కలు వేస్తున్నారు. ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తాయని వారు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పై ప్రతిపక్ష టిడిపి చకచకా పావులు కదుపుతుంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో వైపు బిజెపి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. మరి సింహపురిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరికి మేలు చేస్తాయో ఎవరికి కీడు తెచ్చిపెడతాయో చూడాలి.  

చటాన్ పల్లి ఎన్ కౌంటర్లో ఎస్సై... కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు

  శుక్రవారం(డిసెంబర్ 6) ఉదయం 5:45 నుంచి 6:15 మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కోర్టు అనుమతితో డిసెంబర్ 4న చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకుని కేసు విచారణ చేపట్టామని, అయితే... సీన్ రీ-కన్ స్ట్రక్చన్లో భాగంగా క్రైమ్ స్పాట్ కి నిందితులను తీసుకురాగా... ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పోలీసులపై దాడి చేశాడని... ఆ తర్వాత మరో నిందితుడు చెన్నకేశవులు కూడా అటాక్ కి దిగాడని సీపీ తెలిపారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడమే కాకుండా... గన్స్ లాక్కుని కాల్పులు జరిపారని... లొంగిపోవాలని కోరినా వినలేదని... దాంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని... ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నిందితుల వైపు నుంచి ఫైరింగ్ ఆగిపోయిందని... స్పాట్ ని పరిశీలిస్తే... నిందితులు నలుగురూ చనిపోయి కనిపించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే, నిందితుల దాడిలో ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని, వాళ్లిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు మొత్తం 10మంది పోలీసులు ఉన్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు ఎవరంటే...

  దేశం మొత్తాన్ని కదిలించిన దిశ లాంటి కేసుల్లోని నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే అది పోలీస్ కమిషనర్ స్థాయిలోనో... లేక పోలీస్ బాస్ డీజీపీ పరిధిలోనో తీసుకునే పరిస్థితి లేదనే చెప్పాలి... ఎందుకంటే... దిశ హత్యాచార ఘటన బయటికి వచ్చిన తర్వాత ముందు పోలీసులపైనా... ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి... ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా జాతీయ మీడియా నుంచి చేదు అనుభవం ఎదురైంది... ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే సాధారణ విషయం కాదు... ఏదైనా తేడా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది... అందుకే ఇలాంటి కేసుల్లో పోలీస్ బాస్ లు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సాహసం చేయనే చేయరు... వరంగల్ స్వప్నిక నిందితుల ఎన్ కౌంటరైనా... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటరైనా... ప్రభుత్వ అనుమతి లేనిదే చేయలేరు... ఎందుకంటే, సీన్ రీకన్ స్ట్రక్చన్.. నిందితుల తిరుగుబాటు పేరుతో.. పోలీసులు ఎన్ని మాటలు చెప్పినా... ఇలాంటి ఎన్ కౌంటర్లు ప్రీప్లాన్డ్ గానే ఉంటాయనేది మానవ హక్కుల నేతల ఆరోపణ... అందుకే, దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను అధిక శాతం స్వాగతిస్తుంటే... వ్యతిరేకిస్తున్నవాళ్లూ ఉన్నారు... పైగా నిందితులను ఎన్ కౌంటర్ ను వ్యతిరేకిస్తున్నవాళ్లు చిన్నవాళ్లేమీ లేదు... ఇక, రేపిస్టులను ఉరి తీయాల్సిందేనంటున్న మహిళా ప్రముఖులు కూడా అది చట్ట ప్రకారం... న్యాయ వ్యవస్థ జరగాలని అంటున్నారు.... అందుకే, ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ లాంటి కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటే కత్తి మీద సామే. అయితే, ఇలాంటి ఎన్ కౌంటర్ల తర్వాత పోలీసులపై ప్రజలకు అంతోఇంతో నమ్మకం కలుగుతుంది. పోలీసులను ప్రజలు హీరోలుగా కీర్తిస్తారు. దిశ ఎన్ కౌంటర్ తర్వాత అదే జరుగుతుంది. అయితే, ఈ ఎన్ కౌంటర్ లో మొత్తం ఏడుగురు పోలీసులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే, దిశ కేసును మొదట్నుంచీ డీసీపీ పర్యవేక్షిస్తున్నా... అతను ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారో లేదో తెలియదు.

దిశ హంతకుల ఎన్ కౌంటర్ పై సుమోటో కేసు.. ఎన్ హెచ్ ఆర్ సి నిజ నిర్ధారణ కమిటీ

  హైదరాబాద్ వెటర్నరి డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను సైబారాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును స్వీకరించినాట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై త్వరలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఎన్ కౌంటర్ పై ఒక సమగ్ర నివేదికను అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిశ అత్యాచారానికి, హత్యకు గురైన  స్థలాన్ని అలాగే ప్రస్తుతం ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఒక నివేదిక ఇస్తుందని సమాచారం. 

నాడు స్వప్నిక... నేడు దిశ... రెండు ఎన్ కౌంటర్లలోనూ సజ్జనారే... డిసెంబర్ లోనే...

  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో సజ్జనార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాంతో, దేశవ్యాప్తంగా సజ్జనార్ పేరు మారుమోగిపోతోంది. అయితే, తెలంగాణలో జరిగిన రెండు సెన్సేషనల్ ఎన్ కౌంటర్లూ సజ్జనార్ పోలీస్ బాస్ గా ఉన్న ప్రాంతాల్లోనే జరగడం విశేషం. 2008 డిసెంబర్ 10న వరంగల్ లో విద్యార్ధిని స్వప్నిక... తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా యాసిడ్ అటాక్ జరిగింది. ప్రేమోన్మాది శ్రీనివాస్... అతని స్నేహితులు సంజయ్, హరికృష్ణతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ యాసిడ్ అటాక్ లో తీవ్రంగా గాయపడిన స్వప్నిక చికిత్స పొందుతూ మరణించింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై ఆరోజు తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే, ఆనాడు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.... సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా కాల్చిచంపారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కూడా అలాగే జరిగింది. అయితే, ఆనాడు స్వప్నిక ఎన్ కౌంటర్ జరిగినప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉండటం కాకతాళీయమే. అంతేకాదు స్వప్నిక నిందితుల ఎన్ కౌంటర్ డిసెంబర్ నెలలోనే జరగ్గా... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కూడా డిసెంబర్ లోనే జరగడం విశేషం.  

పంచనామా పూర్తి... కాసేపట్లో పోస్టుమార్టం... ఈరోజే అంత్యక్రియలు

    ఎన్ కౌంటర్ లో హతమైన దిశ నిందితుల మృతదేహాలకు ఒక ఆర్డీవో, నలుగురు తహశీల్దార్ల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాతి రోజే ఎన్ కౌంటర్ జరగడంతో ...ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, పోలీసులకు ఇబ్బందులు లేకుండా పంచనామా పూర్తి చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరు... నిందితుల మృతదేహాల్లో ఎక్కడెక్కడ బుల్లెట్లు దిగాయో... ఎటువైపు కాల్పులు జరిగాయో... మృతదేహాలు పడివున్న తీరు... ఇలా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచనామా చేశారు. పంచనామా ప్రక్రియ తర్వాత నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించనున్నారు. ఐదుగురు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే, నిందితుల స్వగ్రామాల్లో ఇప్పటికే మోహరించిన పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు, ఎంత రాత్రయినాసరే ఈరోజే అంత్యక్రియలు ముగించాలని నిందితుల కుటుంబ సభ్యులను పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది... దిశ నిందితుల ఎన్ కౌంటరే రుజువు

  దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, న్యాయ వ్యవస్థలోని లోపాలను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతమున్న న్యాయ వ్యవస్థతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నేర నిరూపణ జరిగినా దోషులకు శిక్షలు పడటం లేదని, వేగంగా బాధితులకు న్యాయం జరగడం లేదని, దాంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని అన్నారు. అందుకు దిశ నిందితుల ఎన్ కౌంటరే నిదర్శనమన్నారు. చట్ట ప్రకారమైతే న్యాయం జరగదని ప్రజలు భావిస్తున్నారని, అందుకే దోషులను తామే శిక్షిస్తామని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యంగా అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతుండటం అస్సలు మంచిది కాదన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. నేరస్థులకు వేగంగా శిక్ష పడకపోవడంతోనే సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి నేరస్థులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

దిశ ఎన్ కౌంటర్ కు ముందు రోజు... డీజీపీతో సజ్జనార్ కీలక చర్చలు... పెద్దల గ్రీన్ సిగ్నల్ తర్వాతే..!

దిశ ఘటన జరిగిన 24గంటల్లోనే నిందితులను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు... ఆరోజే దాదాపు పూర్తి ఆధారాలు సేకరించారు. నిందితులు నేరం ఒప్పుకోవడం... దారుణానికి సంబంధించిన అన్ని ఆధారాలు లభించడం... టెక్నికల్ ఎవిడిన్స్ కూడా దొరకడంతో... అసలేం జరిగిందో... నిందితులు నేరం ఎలా చేశారో పూర్తి క్లారిటీకి వచ్చారు. దాంతో, నిందితులను పట్టుకున్న రోజే... ఎన్ కౌంటర్ చేస్తారని అంతా భావించారు. ఇక, సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఎన్ కౌంటర్లు చేసిన ట్రాక్ రికార్డు ఉండటం... వరంగల్ లో యాసిడ్ అటాక్ నిందితులను కాల్చిచంపిన చరిత్ర ఉండటంతో.... దిశ నిందితులకు కూడా అదే చివరి రోజు కావొచ్చని అనుకున్నారు. అయితే, దిశ కేసును సీరియస్ గా తీసుకున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్... ఆరోజే డీజీపీ మహేందర్ రెడ్డిని సంప్రందించినట్లు తెలిసింది. నిందితులను ఎన్ కౌంటర్ చేద్దామంటూ అడిగినట్లు సమాచారం. అయితే, తొందరపడొద్దని, అలా నిర్ణయాలు వద్దంటూ డీజీపీ సూచించినట్లు తెలుస్తోంది. దాంతో, చట్టపరకంగా ముందుకెళ్లారు. అయితే, దిశ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు జరగడం... మరోవైపు తెలంగాణ పోలీసులపై విమర్శలు రావడం... ఢిల్లీ టూర్లో సీఎం కేసీఆర్ కు నేషనల్ మీడియా నుంచి చేదు అనుభవం ఎదురవడం... పార్లమెంట్లో తీవ్ర చర్చ జరగడంతో... అటు తెలంగాణ ప్రభుత్వం... ఇటు తెలంగాణ పోలీసులు... తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గురువారం(డిసెంబర్ 5) డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు... డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశమై అత్యంత గోప్యంగా చర్చలు జరిపారు. డీజీపీతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమవడంపై కచ్చితమైన సమాచారమున్నా... అయితే, దేనిపై చర్చించారో తెలియనప్పటికీ... ఈ సమావేశం జరిగిన తర్వాతి రోజే దిశ నిందితులు ఎన్ కౌంటర్ కావడాన్ని బట్టి చూస్తుంటే.... పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే... పోలీసులు యాక్షన్ లోకి దిగి పని పూర్తిచేసినట్లు అంటున్నారు.  

పోలీసులే ఎన్ కౌంటర్ చేస్తే.. ఇక కోర్టులెందుకు..? మాజీ మంత్రి మేనకా గాంధీ

  షాద్‌నగర్ లో ఈ ఉదయం జరిగిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశం నలుమూలల నుండి హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు జై కొట్టి ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. దీని పై పలు పార్టీల నేతలు, సెలబ్రిటీలు సైతం తెలంగాణ పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకుంటేనే దేశంలో మహిళల పట్ల జరుగుతన్న  అఘయిత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే కొందరు మాత్రం తెలంగాణ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. కోర్టులు విచారించి విధించాల్సిన శిక్షలను పోలీసులే విధిస్తే ఎలా అనే వారు కూడా ఉన్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ హైదరాబాద్‌లో జరిగిన ఘటన చాలా భయంకరమైంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మీకు చంపాలనిపించిందని కాల్చి చంపడం కరెక్టు కాదు. నిందితులకు కోర్టుల ద్వారా మాత్రమే కఠిన శిక్షలు పడాలి. ఇలా న్యాయ ప్రక్రియ పూర్తి కాకముందే కాల్చి చంపితే.. ఇక కోర్టులు, న్యాయ, పోలీస్ వ్యవస్థలు ఎందుకు?''. అని మేనకా గాంధీ అన్నారు.  

నా బిడ్డ విషయంలో ఈ న్యాయం ఏమైంది?: అయేషా మీరా తల్లి షంషాద్ బేగం

  దిశ హత్యకేసు నిందితుల ఎన్ కౌంటర్ పై అయేషా మీరా తల్లి షంషాద్ బేగం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ హత్య కేసు నిందితులు పది రోజుల్లోనే హతమవ్వడంపై ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆనందం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని, నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని అన్నారు. ఎన్ కౌంటర్ వల్ల దిశకు కొంత న్యాయం జరిగినట్లేనని ఆమె అన్నారు. అయేషా మీరా కేసులో సజ్జనార్ లాంటి అధికారి ఉంటే తమకు ఏనాడో న్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశపై అఘాయిత్యానికి పాల్పడి అన్యాయం చేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టి ఈజీగా వారిని కాల్చిచంపేశారని, అదే తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు న్యాయం జరగడం లేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ప్రశ్నించారు.  విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తూ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న 19 ఏళ్ళ ఆయేషా మీరాను 27 డిసెంబరు 2007 న అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.  బాత్ రూంలో మృతదేహం పడివుండగా, 'తన ప్రేమను తిరస్కరించినందుకే ఆమెపై అత్యాచారంచేసి చంపేశాను' అని నిందితుడు లెటర్ రాసి మరీ ఆమె పక్కన పడేశాడు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు పలుకుబడి కలిగిన వారు కావడంతో ఆధారాలు దొరక్కుండ చేసి కేసును తారుమారు చేశారు. చివరకు ఓ చిల్లర దొంగ సత్యంబాబును కేసులో నిందితుడిగా చూపి శిక్ష పడేలా చేశారు పోలీసులు.  కేసు విచారణలో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఎవరు అనేది ఇంకా తెలియని పరిస్థితి. 11 ఏళ్ల తర్వాత ఈకేసును ప్రస్తుతం సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.