రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు... ఢిల్లీ విందు వెనుక రాజకీయం...!
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టినా... తన వైఖరి మారదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని మరోసారి చాటిచెప్పారు. మిగతా వైసీపీ ఎంపీల్లాగా తాను గిరితీసుకుని ఉండలేనని తేల్చిచెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీని, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాను రఘురామకృష్ణంరాజు కలవడం వైసీపీలో కలకలానికి దారి తీసింది. ఇక, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు భారీ విందే ఇచ్చారు రఘురామకృష్ణంరాజు.
సబార్డినేట్ లేజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇచ్చినప్పటికీ... ఇది కూడా వైసీపీ కలవరం పుట్టిస్తోంది. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు, వీవీఐపీలను ఆహ్వానించినా... కేంద్ర మంత్రుల్లో రాజ్ నాథ్ సింగ్ మాత్రమే హాజరయ్యారు. ఇక, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు... టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్రావు... వైసీపీ నుంచి మిథున్ రెడ్డి అటెండ్ అయ్యారు. అయితే, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు రఘురామకృష్ణంరాజు ఇచ్చిన విందుపై వైసీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అనుమతి లేకుండా మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను రఘురామకృష్ణంరాజు కలవడంపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో... ఈ విందుపై ఎలా స్పందిస్తారోనన్నది చర్చనీయాంశమైంది.
అయితే, కేంద్ర పెద్దలను బుట్టలో వేసుకునేందుకు, అలాగే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకే రఘురామకృష్ణంరాజు ఈ భారీ విందును ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, వైసీపీ ఎంపీల్లో తన దారి సెపరేట్ అని మరోసారి నిరూపించుకున్నారు రఘురామకృష్ణంరాజు.