జార్ఖండ్ ఎన్నికల ఫలితాల పై హర్షం వ్యక్తం చేస్తున్న జగన్..... 

  జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్ కొలువుదీరబోతోంది. 43 స్థానాల్లో కూటమికీ ఆధిక్యం లభించగా బీజేపీ 28 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు జేఎంఎం వర్కింగ్ ప్రసిడెంట్ హేమంత్ సోరెన్. బర్హెడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయాన్ని సాధించారు. దుంకాలలో కూడా ఆధిక్యంలోనే ఉన్నారు హేమంత్. తన తండ్రి శిబూ సొరేన్ కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు శిబూసోరెన్ కు చాలా ఊరటనిచ్చాయి. ఆయన ఒక విధంగా బీజేపీ పై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలియజేశారు. తనయుడు హేమంత్ సీఎం కాబోతున్నాడనే ఆనందం ఆయన ముఖంలో కన్పిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు పై హేమంత్ కు కీలక సూచనలు చేశారు శిబుసోరెన్. ఎన్నికల ఫలితాల పై చాలా రిలాక్స్ గా ఉన్నారు హేమంత్ సోరెన్. తన నివాసంలో సైకిల్ తొక్కుతూ రిలాక్స్ అయ్యారు. తన కుమారుడితో కలిసి సైకిల్ తొక్కారు హేమంత్ సోరెన్. పార్టీని విజయం వైపు నడిపించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జార్ఖండ్ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరిందన్నారు హేమంత్ సోరెన్. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు. జార్ఖండ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ఎన్నికల ఫలితాలతో జేఎంఎం కార్యకర్తల్లో జోష్ వచ్చిందని ఆయన తెలియజేశారు.బ్రాంచితో సహా పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, బాణసంచా పేల్చి వేడకలు చేసుకున్నారు. ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటించారు జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్. 5 ఏళ్ళలో జార్ఖండ్ అభివృద్ధికి తాము కృషి చేసినట్లుగా ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గుణపాఠం నేర్పనున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీ ఎన్నికలతో పాటు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి ఖాయమన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్. గత ఆరేళ్లుగా మోదీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చేయగలిగామన్నారు. మొత్తం మీద జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.  

ఉక్కు కార్మాగారంతో రాయలసీమకు మంచి రోజులు రాబోతున్నాయన్న జగన్.........

  3 ఏళ్ల లోనే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేశారు. చంద్రబాబు మాదిరిగా తాను ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొట్టలేదని అధికారం లోకి వచ్చాక 6 నెలలకే టెంకాయ కొట్టానని గుర్తు చేశారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ రావడం వల్ల ఈ ప్రాంత పరిస్థితి మారుతుందని ఆయన తెలియజేశారు.6 నెలల ముందు ఒక పెద్దమనిషి వచ్చి టెంకాయ కొట్టాడని ఆయన తెలియజేశారు. ఉన్న 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికే ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అని,ఇలాంటి పరిస్థితుల్లో నాలుగున్నర సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలలు ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దానిని మోసం అంటారు అని జగన్ తెలియజేశారు.కానీ అధికారం లోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు అని ఆయన స్పష్టం చేశారు.వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఈ ప్రాంతానికి మంచి జరగాలి అంటే నీళ్ళు కావాలి, పరిశ్రమలు కావాలి, ఊద్యోగాలు రావాలి ఇవి ఎంత అవసరమో తెలిసిన వ్యక్తిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని జగన్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే ఈ రోజు కడపలోనే రాయలసీమ ఆర్థిక చరిత్రను, ఉద్యోగాల చరిత్రను మార్చడం కోసం 30 లక్షల టన్నుల ఉక్కు కార్మాగారానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నట్లు సగర్వంగా వేదిక పై తెలియజేశారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాయలసీమలో 25,000 ల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లాల ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ తో సీమలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మన బ్రతుకులు మారుతాయని, పారిశ్రామిక రంగంలో రాయలసీమ ప్రాంతమంతా కూడా పరుగెడుతుందని ఆశాభావంతో తాను ఈ ఉక్కు ఫ్యాక్టరీకి పునాది రాయి వేయనున్నట్లు జగన్ తెలియజేశారు.  

విశాఖకు వైసీపీ ముప్పు... పెద్ద కుట్ర ఉందంటోన్న సబ్బం

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. జగన్ నిర్ణయంతో విశాఖకు పెనుముప్పు రాబోందని హెచ్చరించారు. సడన్‌గా విశాఖను రాజధానిగా చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు. విశాఖను నాశనం చేసేందుకే జగన్ ప్రభుత్వం ఇక్కడికి రాజధానిని మార్చుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఆరు నెలలుగా భీమిలిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న సబ్బం హరి... ఖాళీగా ఉన్న భూముల్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆధారాలతో సహా దోపిడీని బయటపెడతానని సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇప్పటికే రౌడీ మూకలు దిగాయని... ప్రభుత్వం నోటిఫై చేసిన భూముల్ని స్వాహాచేసే కుట్ర జరుగుతోందని సబ్బం ఆరోపించారు. అమరావతిలో భూముల్ని కబ్జా చేయలేరు కాబట్టే కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారని... కానీ, వైసీపీ నేతల ఆటలు విశాఖలో సాగవన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు ఎందుకు నిరూపించలేకపోయారని సబ్బం ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు వైసీపీ ప్రభుత్వం నిరూపించి ఉంటే జగన్ ను ప్రజలు నమ్మేవారని, కానీ కేవలం ఆరోపణలుచేసి బురద చల్లే ప్రయత్నం చేయడంతో విశ్వాసం కోల్పోయారన్నారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని... ఇప్పుడు రాజధానిగా ప్రకటించి చేసేదేమీ ఉండదన్నారు. విశాఖలో ఏవో రెండు భవనాలు కట్టడం మినహా ఏమీ చేయలేరని సబ్బం అన్నారు. విశాఖకు తనకున్న సహజ వనరులతో స్వతహాగా ఎదిగిందని, తమ స్వార్ధం కోసం వైజాగ్ ను నాశనం చేయొద్దని సూచించారు. అయితే, బీజేపీ నేతలు తలుచుకుంటే అమరావతిని మార్చడం జగన్ తరం కాదన్నారు. మోడీ-షాతో చెప్పిస్తే జగన్ ఏమీచేయలేరని సబ్బం వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే రాజధాని వివాదంలో కల్పించుకోవాలని, మోడీ-షాతో మాట్లాడి మూడు రాజధానుల ఆటలకు కళ్లెం వేయాలని సూచించారు. జగన్ కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్న సబ్బం హరి... రాజకీయ కక్షల కోసం రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఏమయ్యారు?

ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్న తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ ఫలితాలు ఊహించి వైసీపీ లోకి జంప్ చేశారు. ఇలా వచ్చారో లేదో అలా సీటు దక్కడం ఇలా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి పై గెలిచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఊహించని విధంగా ఎంపికైన దుర్గా ప్రసాద్ నియోజక వర్గ ప్రజలకు కనిపించకుండా పోయారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఈయన తిరుపతి ఎంపిగా గెలిచాక కూడా గూడూరుకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే సమావేశాలు, రిబ్బన్ కటింగులలో తప్ప ఎంపీ కనిపించడం లేదు. ఎంపీకి సమస్యలు చెప్పుకుందామనుకునే ప్రజల సంగతి దేవుడెరుగు, కనీసం కార్యకర్తలకు కూడా బల్లి అందుబాటులో లేకుండా పోయారు. ఏదైనా అందామా అంటే పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కు చెప్పుకుందామంటే అది ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు వైసిపి తిరుపతి నియోజక వర్గ కేడర్. కనీసం ఎంపీకి సంబంధించినవారైనా ఉన్నారా అంటే అది లేకుండా పోయింది. ఎంపీని కలవాలంటే ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి వచ్చిందని నగరవాసుల్లోనూ చర్చ నడుస్తోంది.  ఇక ఎంపీని కలవాలని నియోజక వర్గ ప్రజలు అడిగితే కుమ్మరోడికి కుండలు కరువ అన్న రీతిలో తమకే దర్శనభాగ్యానికి దిక్కులేదని సొంత పార్టీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు.  నెలకో రెండు నెలలకో ప్రెస్ మీట్ లో తప్ప మరెక్కడా కనిపించని ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ తీరు పై తిరుపతి ప్రజలు గుర్రుగా ఉన్నారని సమాచారం. గెలిచాకే కాదు ఎన్నికల ప్రచారంలో కొన్ని ప్రాంతాల వారికి కనీసం మొహం కూడా చూపించలేదు దుర్గా ప్రసాద్. పార్లమెంట్ నియోజక వర్గంలో కీలకమైన తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తిలో ఎక్కడ బల్లి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గెలిచాకైనా మారతారు అనుకుంటే బల్లి దుర్గా ప్రసాద్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రైల్వే స్టేషన్ తనిఖీలు, ఆసుపత్రి తనిఖీ అంటూ హడావుడి చేయడం తప్ప నగర వాసుల సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యే భూమనతో ఉన్న భేదాభిప్రాయాల కారణం గానే బల్లి తిరుపతి మొహం చూడటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలిచాక తిరుపతి వాసులకు వెంకన్న దర్శనం అయినా దొరుకుతుందేమో గానీ ఎంపీగారి దర్శనం అంతంత మాత్రమే అనే చర్చ జోరుగానే సాగుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే నియోజక వర్గం ప్రజల్లో అది తీవ్ర అసంతృప్తికి కారణమవుతుందని అంటున్నారు. ఇక ఆ ఎఫెక్ట్ పార్టీ పై పడుతుందని తిరుపతి వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఎంపీగారి దర్శనం ప్రజలకు ఏ మేరకు అందుతుందో చూడాలి.

ఆస్ట్రేలియా కెప్టెన్ గా ధోనీ... ఈ దశాబ్దంలో ఒకే ఒక్కడు

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా... ధోనీకి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. అలాగే, ఆ వన్డే టీమ్ లో ధోనీతోపాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్ కు తొలి టీ20 కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోనీని ఈ దశాబ్దపు కెప్టెన్‌‌గా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంచుకుంది. ధోనీతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు జట్టులో చోటు కల్పించింది. అంతేకాదు, ధోనీ సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కొనియాడింది. ధోని ఆడిన టైమ్ భారత్‌కు గోల్డెన్ పీరియడ్ అని, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత అతడి సొంతమని ఆకాశానికి ఎత్తేసింది.  భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్రసింగ్‌ ధోనీది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాను కొత్త పుంతలు తొక్కించిన మేటి ఆటగాడు. ఉత్కంఠ భరిత క్షణాల్లోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ విజయాలు అందుకున్న మిస్టర్‌ కూల్‌ కెప్టెన్. అలాంటి అరుదైన గుణగణాలు ఉన్నందుకే... మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.

మోడీ-షా దృష్టికి రాజధాని వివాదం... జగన్ పై కన్నా ఘాటు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారడం ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా జరగలేదని.... జగన్మోహన్ రెడ్డి తన అపరిపక్వతతో పిచ్చి పనికి పూనుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే... పెట్టుబడుదారులకు రాష్ట్రం మీద నమ్మకాలు పోతాయన్నారు. అమరావతి కేవలం రైతుల సమస్య కాదన్న కన్నా.... ఇది రాజధాని సమస్య అన్నారు. చంద్రబాబునో... జగన్మోహన్ రెడ్డినో చూసి రైతులు భూములివ్వలేదని... రాష్ట్ర భవిష్యత్ కోసం తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిస్తే ఇఫ్పుడు నట్టేట ముంచేయడం సరికాదన్నారు. బీజేపీ... అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటుందే కానీ... పరిపాలనా వికేంద్రీకరణను కాదని కన్నా స్పష్టంచేశారు. ఆరు నెలల పాలనలో శాంతిభద్రతల మాటేమో కానీ... ఎవ్వరికీ నిద్ర లేకుండా చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కక్ష సాధింపు చర్యలు, అనుభవ రాహిత్యం, అపరిపక్వత కలిసిన జగన్ పాలనలో రాష్ట్రానికి దశదిశ లేకుండా పోయిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం పదివేలకోట్లు ఖర్చు చేశారని, ఇఫ్పుడు మీ ఇష్టమొచ్చినట్లు మార్చుతామంటే ఇక్కడెవరూ చూస్తూ కూర్చోలేదని కన్నా హెచ్చరించారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్న కన్నా లక్ష్మీనారాయణ.... రాజధాని ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయినా, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలని ఎవరూ అడిగారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి జరిగిపోయినట్లేనా అన్నారు. హైకోర్టులున్న ప్రాంతాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నికర జలాలు, పరిశ్రమలను తీసుకురావాలన్నారు. రాయలసీమను ఉద్ధరించడానికి కర్నూలులో హైకోర్టు అంటున్నారని, కానీ అది సీమ నాలుక గోచుకోవడానికి కూడా పనికి రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యువకుడు ముఖ్యమంత్రి కావడంతో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానుకుంటే... ఇలా అమరావతిని అంధకారంలో ముంచుతాడని ఊహించలేదంటున్నారు.

విజయసాయి లేఖతో ఆ బీజేపీ ఎంపీపై విచారణ!!

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి పెద్ద షాక్ తగిలింది. సుజనా చౌదరిపై  ఉన్న ఆర్ధిక నేర ఆరోపణలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఫిర్యాదును పరిశీలించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖను ఆదేశించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేర ఆరోపణలపై, అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్‌ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి విజయసాయి రెడ్డికి బదులిస్తూ లేఖ వచ్చింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి, విచారణ జరుపుతామని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వలేని చిరుకి రైతుల త్యాగం విలువేం తెలుస్తుంది!!

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనను.. మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది. జగన్ నిర్ణయాన్ని చిరంజీవి సమర్ధించడం పట్ల ఎలా స్పందించాలో తెలియక మెగా అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి ప్రాంత రైతులు మాత్రం చిరంజీవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సాక్షిగానే రైతులు చిరంజీవి మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ‘చిరంజీవి ఏ రోజూ ప్రజా సమస్యలపై స్పందించింది లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు?. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌ ని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు’ అని ఓ రైతు వ్యాఖ్యానించాడు. ‘చిరంజీవికి వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు స్వాగతించారు.' అని ఓ రైతు ఆరోపించాడు. 'రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఏపీలో మీ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వం.’ అని మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా చిరంజీవిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్‌లో స్టూడియో కోసమే చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంకా కొందరైతే పాత విషయాలను తవ్వితీసి మరీ.. చిరంజీవి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి సొంత ఊళ్ళో నిరుపయోగంగా ఉన్న ఇంటిని గ్రంథాలయానికి ఇవ్వాలని ఆ ఊరి ప్రజలు కోరగా.. అప్పుడు చిరంజీవి ఇవ్వకుండా ఆ ఇంటిని డబ్బులకి అమ్ముకున్నారని అంటున్నారు. ప్రజాదరణతో సినిమాల్లో కోట్లు సంపాదించారు కానీ ఓ చిన్న ఇంటిని ఊరికోసం ఇవ్వలేకపోయారు. కానీ అమరావతి ప్రాంత రైతులు రాజధాని కోసం వేల ఎకరాల భూములు త్యాగం చేశారు. అలాంటి వారికి అండగా నిలవాల్సింది పోయి.. వారికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా నిలబడతారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  

ఆ ఘటనతో తనకు ఏ సంబంధం లేదన్న డాక్టర్ సుధారాణి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో శిశువు తలను మొండెం నుంచి వేరు చేసిన ఘటన ఇంకా ప్రజలను కలచివేస్తూనే ఉంది. దీనిపై లోతుగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మరోవైపు అసలు ఈ ఘటనలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని సీనియర్లు తనను బలి చేశారని ఆరోపిస్తోంది డ్యూటీ డాక్టర్ సుధారాణి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న ఒక మహిళ ప్రసవ సమయంలో శిశువు తలను కోశారు డాక్టర్లు. బాధ్యులైన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డ్యూటీ డాక్టర్ సుధారాణిని కూడా విధుల నుంచి తొలగించింది. సస్పెండైన డ్యూటీ డాక్టర్ సుధారాణి అసలు ఈ ఘటనతో తనకు సంబంధమే లేదని అంటుంటారు. ఆ రోజు గర్భిణీ మహిళా స్వాతి ప్రసవం కోసం వచ్చిన విషయం కూడా తనకు తెలియదని డ్యూటీలో ఉన్న డాక్టర్ తారాసింగ్ మరో డాక్టర్ సిరాజ్ లు ప్రసవం చేశారని చెప్పారు. వారిద్దరి నిర్వాకం వల్లే శిశువు తల తెగిపోయిందని తర్వాత వారు పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని తన ప్రమేయం లేకుండానే డాక్టర్ సిరాజ్ రెఫర్ లెటర్ రాసి హుటాహుటిన హైదరాబాద్ కు తరలించాడని అంటున్నారు. సీనియర్లు కావాలనే తనను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా విధుల నుంచి తొలగింపుకు కారణమైన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ తారాసింగ్ డాక్టర్ సిరాజ్ లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు.  

రుషికొండలో సచివాలయం..! నెలరోజుల్లోనే తరలింపు

ఇంకా, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానే లేదు... కానీ అప్పుడే ఏపీ రాజధాని తరలింపు ప్రక్రియ మొదలైపోయింది. సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటనకు ముందే విశాఖలో పరిపాలనా రాజధాని కోసం భవనాల అన్వేషణ జరిగిపోతోంది. అధికారిక ప్రకటక చేశాక నెలరోజుల్లో వీలైనన్ని కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ చేపట్టాలంటూ ఉన్నతాధికారుల నుంచి విశాఖ స్థానిక అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దాంతో, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు అవసరమైన భవనాల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే, రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో సచివాలయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుషికొండ ఐటీ పార్కు మిలీనియం టవర్ వన్ లో ప్రస్తుతం నాలుగు అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. మరో నాలుగు అంతస్తుల్లో ఒక ఐటీ కంపెనీ నడుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. ఇక, దీని పక్కనే మిలీనియం టవర్-2 శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల క్యాంపస్ అందుబాటులోకి వస్తుంది. మిలీనియం టవర్స్ కి పక్కనే వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సోదరుడు నిర్మిస్తోన్న ఐదు అంతస్తుల భవనం కూడా ఉంది. ప్రభుత్వం కోరితే దీన్ని ఇచ్చే అవకాశముంది. అలాగే, మిలీనియం టవర్స్ కి సమీపంలోనే నాలుగు ఎకరాల్లో నిర్మించిన ఐబీఎం క్యాంపస్ ఉంది. అయితే, ఐబీఎంతో చర్చించి ఆ క్యాంపస్ ను తీసుకుంటారని అంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంపెనీకి చెందిన 70వేల చదరపు అడుగుల క్యాంపస్ ప్లగ్ అండ్ ప్లేతో రెడీ ఉంది. దీని పక్కనే మిరాకిల్ కంపెనీ భవనం ఖాళీగా ఉంది. అలాగే, రుషికొండ ఐటీ పార్కుకు సమీపంలోనే ఆదిత్య కంపెనీ నిర్మిస్తోన్న భారీ అపార్ట్ మెంట్ దాదాపు సిద్ధమైంది. ఇందులో వందకు పైగా ప్లాట్లు ఉన్నాయి. ఆ పక్కనే విల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, విశాఖ నడిబొడ్డున్న ఉన్న ఏడెకరాల విప్రో క్యాంపస్ ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉద్యోగుల నివాసాల కోసం మధురవాడ దగ్గర సుమారు 20 ఎకరాల్లో భారీ రహదారులు, పార్కింగ్, వాకింగ్ ట్రాక్, హాస్పిటల్, కమ్యూనిటీ బిల్డింగ్స్ ... ఇలా సకల సౌకర్యాలతో నిర్మించిన హరిత ప్రాజెక్టు ఫ్లాట్లను తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే, సిరిపురం ప్రాంతంలో ఐటీ కేటాయించిన పలు భారీ భవంతులు ఖాళీగా ఉండటంతో వాటిని కూడా వినియోగించుకునేందుకు పరిశీలిస్తున్నారు. ఇన్ని భవనాలు, సదుపాయాలు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండటంతో....ఇక్కడే సచివాలయం ఏర్పాటు చేస్తారని అంటున్నారు.  మొత్తానికి, అధికారిక ప్రకటన రాకముందే విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు చకచకా పనులు జరిగిపోతున్నాయి. మంత్రివర్గం అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే ముందస్తు ప్రకాళిక ప్రకారం అన్నీ నడిచిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో.... ప్రస్తుతం ఉన్నవాటినే తీసుకుని నెలరోజుల్లో కార్యాలయాలను తరలించాలని భావిస్తోంది.

దమ్ముంటే నిరూపించు... జగన్ కు బాబు సవాల్

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే న్యాయ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సవాలు విసిరారు. కేవలం ఆరోపణలు చేసి రాజధానిని తరలించడం సరికాదన్న చంద్రబాబు... నిజంగా ఇన్ సైడర్ జరిగిందని వైసీపీ భావిస్తే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు నిస్వార్ధంగా భూములిస్తే... ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని భావించానని... కానీ ఇలా చంపేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉంటే అమరావతి అభివృద్ధి జరగదన్న చంద్రబాబు... జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందామని... కానీ తనపై కోపంతో అమరావతిని తరలించి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సూచించారు. మరోవైపు, అమరావతిని తరలించొద్దంటూ రాజధాని రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. రాష్ట్రాభివృద్ధి, రాజధాని కోసం తమ భూములను త్యాగం చేస్తే తమను నట్టేట ముంచారని జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 29 రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు చేపడుతుతోన్న రైతులు, ప్రజలు... మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల తొలగింపు పై తల పట్టుకుంటున్నఆర్టీసీ అధికారులు.....

నగరంలో వెయ్యి ఆర్టీసీ బస్సుల తొలగించాలనీ నిర్ణయించింది సర్కారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 29 డిపోలకు చెందిన 3,500ల బస్సులు సిటీలో తిరుగుతున్నాయి. వీటి వల్ల ఆర్టీసీకి ప్రతి నెలా 44 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. నష్టాలను తగ్గించుకోవడానికి 1000 బస్సులు తొలగించాలని ఆదేశించింది సర్కార్. తొలగించిన బస్సులను కార్గో సేవలను వినియోగించుకోవాలని చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కార్గో బస్సులను తయారు చేసే పనిలో ఉన్నారు. జనవరి ఒకటి నుంచి సిటీలో కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. ఆర్టీసీ అధికారులకు బస్సుల తొలగింపు అధికారులకు సవాల్ గా మారింది. ఇప్పటి వరకు నగరం లోని అన్ని డిపోల నుంచి 600 ల బస్సులను క్యాన్సిల్ చేశారు. ప్రాధాన్యత లేని రూట్లు అదనపు సర్వీసులను రద్దు చేశారు. ఆదాయం రాని మార్గాల్లో బస్సులను తిప్పడం మానేశారు. ఇంత చేసినా వెయ్యి బస్సులు తొలగించడం సాధ్యం కావడం లేదంటున్నారు అధికారులు. సిటీలో ఒక కిలో మీటరు బస్సు నడిపేందుకు ఆర్టీసీకి 52 రూపాయల ఖర్చవుతుంది. వచ్చే ఆదాయం మాత్రం 44 రూపాయలే ఉంటోంది. కొన్ని రూట్లలో 18 రూపాయలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో డీజిల్, బస్సు మెయింటెనెన్స్ కూడా సరి తూగడం లేదు. లాభాలు రాని మార్గాల్లో ముందుగా బస్సులను తొలగించారు అధికారులు. ప్రస్తుతం కిలోమీటరుకు 25 నుంచి 30 రూపాయలు వచ్చే బస్సులను తొలగిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీవీఎంలు, డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ప్రధాన రోడ్ల పై నిఘా పెట్టారు. కోటి, పటాన్ చెరువు, సికింద్రాబాద్ పటాన్ చెరువు, ఉప్పల్ మెహిదీపట్నం, ఉప్పల్ కొండాపూర్, ఉప్పల్ మెహిదీపట్నం వయా కోటి, కుషాయిగూడ ఉప్పల్, లింగంపల్లి ఉప్పల్, ఆరాంఘార్ సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్ ఈసీఐఎల్, రాంనగర్ కాళిమందిర్, సికింద్రాబాద్ జియాగూడ వయా కోటి, కుషాయిగూడ అఫ్జల్ గంజ్, ఈసీఐఎల్ సుచిత్ర, చర్లపల్లి సికింద్రాబాద్ వయా సీతాఫల్ మండీ, ఈసీఐఎల్ మల్కాజ్ గిరి, పటాన్ చెరువు కోటి, లింగపల్లి ఎల్బీనగర్, పటాన్ చెరు సికింద్రాబాద్ మార్గాల్లోని సర్వీసులను తగ్గించారు. వీటితో పాటు నగర శివారు ప్రాంతాల్లో తిరిగే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. బస్సుల తొలగింపుతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రాధాన్యత ఉండే రూట్లలో కూడా బసులను తొలగించడమేంటని మండిపడుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆర్టీసీ అధికారులు.ఇప్పుడు ఈ అధికారులు బస్సులు తొలగింపు అంశం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.

గజం లక్షన్నర... చుక్కల్లో విశాఖ భూములు

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం... ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇవ్వడంతో.... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయమైపోయింది. అంతేకాదు, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్వయంగా భీమిలి ప్రాంతంలోనే రాజధాని మహానగరం రాబోతోందంటూ ప్రకటించడంతో... విశాఖలో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. విశాఖతోపాటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్దఎత్తున ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతోంది. అయితే, పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందన్న ప్రకటనతో విశాఖ భూములు హాట్ కేకుల్లా మారడమే కాదు... ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. సాగర నగరం విశాఖలో భూములకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అనే అదనపు హంగు చేరడంతో ఆ డిమాండ్ మరింత రెట్టింపు అయ్యింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలోని ద్వారకానగర్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, సీతమ్మధరా, ఎంవీపీకాలనీ, దసపల్లా హిల్స్, డాబా గార్డెన్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర అక్షరాలా లక్షన్నర రూపాయలు పలుకుతోంది. అదే విశాఖ శివారు ప్రాంతాలైన కొమ్మాది, మధురవాడ, సింహాచలం, పెందుర్తి, రుషికొండ, భీమిలి తదితర ఏరియాల్లో గజం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. ఇక, కాపులుప్పాడ, రుషికొండ ప్రాంతాల్లో కూడా భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి. మరోవైపు, ఏపీ రాజధాని నగరంగా విశాఖ మారనుండటంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, స్థలాలు కొనుగోలు చేయడానికి రియల్టర్లు, ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో, భూముల ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ల్యాండ్ ట్రేడింగ్ లో 12.5శాతం వృద్ధిరేటు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రాజధాని వార్తలతో అది మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకోనుంది. మొత్తంగా విశాఖలో భూములు హాట్ కేకుల్లాగానూ.... ధరలు చుక్కలను తలపిస్తున్నాయి.

యుగాంతం కాబోతోందా? కొన్ని గంటలే బతుకుతామా? ఆరు గ్రహాల కలయిక ప్రళయమేనా?

డిసెంబర్ 25... సాయంత్రం 4గంటల 41నిమిషాలకు ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయ్‌. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయ్‌. ఇది డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 రాత్రి 11గంటల 40 నిమిషాల వరకు కొనసాగనుంది. షష్టి గ్రహ కూటమిగా దీన్ని పిలుస్తున్నారు. అయితే, ఇలాంటి అద్భుతం వందేళ్ల క్రితం ఏర్పడిందని కొందరు చెబుతుంటే, కాదుకాదు 297ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ ఏర్పడలేదని మరికొందరు చెబుతున్నారు. అయితే, ఏదో జరగబోతున్నదనే ప్రచారం మాత్రం పెద్దఎత్తున జరుగుతోంది. ఎందుకంటే, ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుండటంతో అరుదైన విశేషమే అయినా... ఏవైనా దుష్పరిణామాలు జరుగుతాయేమోనని భయపడుతున్నారు. వాస్తవానికి గోచారంలో పంచ గ్రహకూటమి కానీ... షష్టగ్రహ కూటమి కానీ... లేదా సప్త గ్రహ, అష్ట గ్రహకూటమి జరిగినప్పుడు ఫలితం ఏవిధంగా ఉంటుదో కచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయని, దాంతో అంచనా వేయడం కష్టమంటున్నారు. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20 శాతం వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయని చెబుతున్నారు‌. ఆయా రాశుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుందే తప్ప అన్ని రాశుల వారికి చెడు ఫలితం ఇస్తుందనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు పది రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనుస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినందున... ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గానీ, మంచిగానీ ఏదైనా నామమాత్రంగానే ఉంటుందని అంటున్నారు. ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నామని ఖగోళ శాస్త్రవేత్తలు అంటుంటే... పండితులు మాత్రం ప్రళయం తప్పదని అంటున్నారు. మరికొందరైతే యుగాంతం ఖాయమంటున్నారు. కొన్ని గంటలే మన బతుకుతామనే మాటలు చెబుతున్నారు. షష్టగ్రహ కూటమి ప్రకృతి ఒడిలో చిచ్చు పెట్టబోతోందని అంచనా వేస్తున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం కూడా ఉండటంతో డిసెంబర్ 25న అసలేం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.

మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం..!

విజయనగరం కలెక్టరేట్‌ సాక్షిగా మంత్రి బొత్స సోదరుడి భూకబ్జా భాగోతం బయటపడింది. మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు... స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన బాధితులు... మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ ఆగడాలపై ఏకరువు పెట్టారు. మంత్రి బొత్స అండదండలు ఉన్నాయనే భరోసాతో తమ భూముల్లో బొత్స ఆదినారాయణ దౌర్జన్యంగా గోడలు కట్టారంటూ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. విజయనగరం జిల్లా జేసీ, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. తాము మధ్యతరగతి కుటుంబాల వారమని, దాదాపు 40ఏళ్లు కష్టపడి విజయనగరం సత్యసాయినగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 53/4, 53/5లో స్థలాలను కొనుగోలు చేశామని... అయితే ఇఫ్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు బొత్స ఆదిబాబు ప్రయత్నిస్తున్నారంట కిరణ్, బి.రాజేష్, టీఏ సూర్యనారాయణ, అశోక్ కుమార్, వాసవి, పద్మావతి, గోవిందమ్మ తదితరులు దాదాపు 40మంది బాధితులు వాపోయారు.  సొంతిళ్లు కట్టుకోవాలని రూపాయి రూపాయి కూడబెట్టి స్థలం కొనుక్కుంటే ఇఫ్పుడు ఇలా కబ్జా చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా అధికార వైసీపీ నేతలే భూకబ్జాలకు పాల్పడుతుంటే తమ గోడు ఇంకా ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను దౌర్జన్యంగా ఆక్రమించి భూములు కట్టేశారని... అయితే, భూములకు సంబంధించిన అన్ని పత్రాలు, అనుమతులు తమ దగ్గర ఉన్నాయని అధికారులకు ఆధారాలు సమర్పించారు. తాము ఇల్లు కట్టుకోవడంలో ఆలస్యం కావడంతో ... తన అంగబలంతో మంత్రి బొత్స సోదరుడు ఆదినారాయణ... ఆ స్థలం చుట్టూ గోడను నిర్మించారని బాధితులు వాపోతున్నారు. తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.  

వైజాగే ఏపీ రాజధాని... రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన..!

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే యథాతథంగా జీఎన్ రావు కమిటీ నివేదిక రూపంలో ఇవ్వడంతో ఇక ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్... వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కేపిటల్... అంటూ సింపుల్ స్టేట్-మెంట్ గా చెప్పుకున్నా... ఏదో ఒకటి మాత్రమే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందనేది వాస్తవం. కర్నూలు, అమరావతి, విశాఖల్లో ఏది ఏపీ రాజధాని అంటూ జీఎన్ రావు కమిటీని మీడియా ప్రతినిధులు అడిగితే మాట దాటవేసినా... ఎక్కడ సచివాలయం ఉంటుందో అదే రాజధానిగా చెలామణి అవుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఈ లెక్కన చూస్తే విశాఖపట్టణమే... ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నది తేలిపోతుంది. అంతేకాదు భీమిలి దగ్గరే రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహానగరంగా మారబోతోందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇది, పార్టీపరంగా దాదాపు అధికారిక ప్రకటనే అయినా... ప్రభుత్వపరంగా మరో మూడ్రోజుల్లో జగన్ సర్కారు నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.   జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించనున్న జగన్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే మీడియా ముందుకొచ్చి ప్రకటన చేసే అవకాశముంది. కేబినెట్ మీటింగ్ తర్వాత రోజు అంటే డిసెంబర్ 28న విశాఖలో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువచేసే పనులకు సీఎం ఫౌండేషన్ స్టోన్ వేయనున్నారు. అదేవిధంగా త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు... భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స తెలిపారు. ముంబై తర్వాత విశాఖే అభివృద్ధి చెందే నగరమని జీఎన్ రావు కమిటీ గుర్తించిందన్న బొత్స... రాజధాని నగరంగా మారేందుకు వైజాగ్ కు అన్ని హంగులూ ఉన్నాయన్నారు.    అయితే, మూడు రాజధానులపైనా... అలాగే... విశాఖే ...ఏపీ కేపిటల్ అంటూ... రెండు మూడ్రోజుల్లో అధికారిక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో... అమరావతిలో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశముందని ముందుజాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఇప్పటికే అదనపు బలగాలను అమరావతికి తరలించారు. మరి, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పెద్దఎత్తున ఉద్యమిస్తోన్న రైతులు.... ఒకవేళ విశాఖే ఏపీ రాజధాని అని అధికారికంగా ప్రకటిస్తే ఏవిధంగా రియాక్టవుతారో... ఏస్థాయిలో పోరాటం చేస్తారో చూడాలి.  

రాజధాని ఏమైనా జగన్ సొంతిల్లా...ఇష్టమొచ్చినట్లు మార్చడానికి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని మందకృష్ణ మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పుబట్టిన మందకృష్ణ.... సొంత ఇంటి నిర్మాణంలా ఏపీ రాజధానిని మార్చేస్తే కుదరదని అన్నారు. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు, భద్రతకు సంబంధించినదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని జగన్‌కు సూచించారు. అయినా, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇవ్వక ముందే సీఎం జగన్మోహన్‌రెడ్డి... మూడు రాజధానులు ఉండొచ్చేమోనని ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. జగన్ మాటలనే జీఎన్ రావు కమిటీ తన నివేదికగా ఇచ్చిందనేది స్పష్టంగా అర్ధమవుతోందని అన్నారు. అంటే, తాము అనుకున్నట్లుగా జీఎన్‌ రావు కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారని మందకృష్ణ ఆరోపించారు. అయినా, నిర్మాణ దశలో ఉన్న అమరావతిని వదిలేసి మూడు రాజధానుల ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిని ఇలా మార్చుకుంటూ పోవడం మంచిది కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని మందకృష్ణ సూచించారు. రాజధాని పేరుతో కాకుండా.... పరిపాలనా సౌలభ్యం, శ్రీభాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తే అందరూ మద్దతిస్తారని అన్నారు. అయితే, ప్రకాశం జిల్లా దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేసుంటే మూడు ప్రాంతాల మధ్య సమతుల్యత వచ్చేదన్న మందకృష్ణ..... జగన్, చంద్రబాబు తీరుతో ఆంధ్రులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు.

కర్నూలు జిల్లా టీడీపీ నేత హత్య కేసును చేదించిన పోలీసులు

కర్నూలు జిల్లా టీడీపీ నేత మంజుల సుబ్బారావు హత్య కేసును చేధిందించారు పోలీసులు. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకొడవళ్లు, రెండు స్కార్పియో వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. కొలిమిగుండ్ల మండలం చింతలాయి పల్లెకు చెందిన టీడీపీ నేత మంజుల సుబ్బారావు ఈ నెల 17 న హత్యకు గురయ్యారు. బెలూం గుహల దగ్గర టీ తాగుతుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా నరికి చంపేశారు. కత్తులతో నరికినా కసితీరని దుండగులు నిస్సహాయస్థతిలో ఉన్న సుబ్బారావు పై బండరాళ్లతో కొట్టి దాడి చేసి చంపేశారు. టిడిపి నేత మర్డర్ జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పోలీసులు రంగం లోకి దిగి నిందితుల కోసం వేట కొనసాగించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట క్రాస్ రోడ్ దగ్గర నిందితులు కనిపించటంతో వారిని అదుపు లోకి తీసుకున్నారు. సుబ్బారావు హత్య కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడు గతంలో నిందితులతో సన్నిహితంగా ఉండేవాడని ఆర్థికంగా కాస్త బలోపేతమైన తరువాత వీరికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండడంతో తట్టుకోలేకే 11 మంది కలిసి అతన్ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. తమ గ్రామ ఆధిపత్యానికి అడ్డొస్తున్నాడనే కారణం గానే హత్య చేసినట్లుగా నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

సింగరేణి 131 వ వార్షికోత్సవం... లాభాల్లో కార్మికులకు సైతం వాటా పంచుతూ రికార్డ్

బొగ్గు వెలికితీతలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది సింగరేణి సంస్థ. ఒకప్పుడు తట్ట చెమ్మస్ తో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బొగ్గు ఉత్పత్తి మొదలైన 1889 లో ఏటా 59,671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ ప్రస్తుతం 20 మంది అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల పరిధిలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతోంది. 2013 లో 50 మిలియన్ టన్నులుగా ఉన్న సంస్థ లక్ష్యం ఏటా 10 శాతం వృద్ధితో పరుగులు పెడుతోంది. బొగ్గు ఉత్పత్తిలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి సంస్థ 131 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.  సంస్థ ప్రారంభంలో ఓపెన్ కాస్టు ప్రాజెక్టులోని భారీ యంత్రాలను వినియోగించారు అధికారులు. ఇప్పుడు భూగర్భ గనుల్లోనూ ఎస్డీఎల్, ఎల్హెచ్డీ, కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్, హైవాల్ టెక్నాలజీతో బొగ్గు తవ్వుతున్నారు. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుతో సమానంగా ఆసియా ఖండంలోనే మొదటిసారిగా సింగరేణిలో అడ్రియాల ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓసిపిల్లో బొగ్గు తీసేందుకు గతంలో 35,60,85 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లను వాడగా, ఇప్పుడు 100 టన్నుల కెపాసిటీ డంపర్లు ఉపయోగిస్తున్నారు. వచ్చే పదేళ్లలో కొత్తగా 14 ఓపెన్ కాస్టు ప్రాజెక్టులు, 8 భూగర్భ గనులను ప్రారంభించేందుకు 7,429 కోట్ల అంచనాతో ప్లాన్ రెడీ చేసింది సింగరేణి. దీనితో పాటు రాబోయే 5 ఏళ్లలో ఏటా వంద టన్నుల బొగ్గు వెలికితీయాలనే టార్గెట్ తో ఉంది.  బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాలపై దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 2016 లో మంచిర్యాల జిల్లా జైపూర్ లో 1200 ల మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు విద్యుత్ ప్లాంట్లను స్టార్ట్ చేసి విద్యుత్ ఉత్పత్తి లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ లో మరో ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ కరెంటు ప్లాంట్ ఏర్పాటుకు ఈ మధ్యే పర్యావరణ అనుమతులొచ్చాయి. ఇక సోలార్ పవర్ ఉత్పత్తిపైనా దృష్టి పెట్టింది సింగరేణి సంస్థ. 1,350 కోట్లతో 300 ల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మొదటి దశలో 600 ల కోట్ల రూపాయలతో 129 మెగావాట్ల కెపాసిటీ గల ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. గతంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేయగా ప్రస్తుతం సొంతంగా రెండు ఎక్స్ ప్లోజివ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. జీతాలు చెల్లించలేని పరిస్థితి నుంచి కార్మికులు ఉద్యోగులకు లాభాల్లో వాటా పంచే స్థాయికి చేరుకుంది సింగరేణి.  వరుస సమ్మెలతో 1991 నాటికి సింగరేణి ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. 1997 నాటికి జీతాలు చెల్లించలేని పరిస్థితి వచ్చింది. కానీ సంస్థను బతికించుకోవాలని కార్మికులు అధికారుల కృషితో 2000 నుంచి సంస్థ లాభాల్లోకి వచ్చింది. 2018,19 లో సంస్థ 1766 కోట్ల రూపాయల లాభం ఘటించగా అందులో వాటా కింద 493 కోట్లను కార్మికులు ఉద్యోగులకు పంచారు. కేంద్ర రాష్ట్రాలకు ఫైనాన్స్ సపోర్టు చేస్తోంది సింగరేణి. పన్నుల కింద రాష్ట్రానికి 13,105 కోట్లు, కేంద్రానికి 14,362 కోట్లు చెల్లించింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో అభివృద్ధికీ డిస్ట్రిక్ మిల్డ్రన్ ఫండ్ ట్రస్ట్ కింద 1844 కోట్లు చెల్లించింది. ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశంలోనే ఎక్కడా లేనట్లుగా లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తున్న సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది సింగరేణి.