జనవరి 1 నుండి టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం
posted on Dec 20, 2019 @ 1:04PM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధి కోసం సంస్కరణల బాటపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1 నుంచి సరుకు రవాణాకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డిపో గూడ్స్ ట్రాన్స్ పోర్టు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతగా 1209 మంది సిబ్బందిని.. 822 ఆర్టీసీ డిజీటీ సర్వీసులను ఆర్టీసీ తెస్తోంది. ఒక్కో డిపోకు 2 డీజీటీ వెహికల్స్ ను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాదులోని 29 డిపోలో సుమారు 60 టీజీటీలు అందుబాటులోకి రానున్నాయి. మిగతా వాటిని జిల్లాలోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1 న ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాల మేరకు టీఆర్ఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సరుకు రవాణా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందుకు ముహూర్తం విధివిధానాలను ఖరారు చేసింది. జనవరి 1 నుంచి సరుకు రవాణా రంగంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది, ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక కిలోమీటర్లు తిరిగి కండిషన్ లో ఉన్న వెయ్యి బస్సులను సరుకు రవాణాకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. వాటిని బస్ బాడీ బిల్డింగ్ లకు పంపిస్తున్నారు, బస్సుల రద్దుతో అదనంగా ఉండే ఉద్యోగులను కార్గో సర్వీసులను వినియోగించుకోనున్నారు.
ఆర్టీసీ సంస్కరణలపై ఉన్నతాధికారులతో రవాణశాఖామంత్రి పువ్వాడ అజయ్ సమీక్షించారు, ఆర్టీసీ అభివృద్దిపై చర్చించారు. సరుకు రవాణాకు వసూలు చేసే చార్జీలపై వేర్వేరు డిపోల పరిధిలో అధ్యయనం చేసి ఆయా డిపో మేనేజర్ లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. సరుకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వేయాలని నిర్ణయించారు. సరుకు రవాణా కోసం పని చేసే డ్రైవర్ లు సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆపరేటర్ లకు దీటుగా పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తమకున్న విస్తృతమైన నెట్ వర్క్ ఆధారంగా సరుకు రవాణా రంగంలో విజయం సాధిస్తామని ఆర్టీసీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఆర్టీసీలో కార్గో సేవలను దశల వారీగా విస్తరించనున్నారు. మొదటి దశలో వివిధ ప్రాంతాలు జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్ స్వీకరిస్తారు, తరువాత ప్రభుత్వానికి సంబంధించి వస్తు రవాణా చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో మొదట వ్యవసాయ పౌరసరఫరాల శాఖ రవాణాపై దృష్టి సారించనున్నారు. పీడీఎస్ బియ్యం, వ్యవసాయోత్పత్తులు తదితరాలను ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తారు. తదుపరి విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ శాఖలకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రైవేట్ కార్గో సర్వీసులకు ధీటుగా ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తామని అధికారులు విశ్వాసంగా చెప్తున్నారు. మరోవైపు ప్రజాప్రతి నిధులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని లేఖలు రాసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ నెల 24 న గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వనభోజనాలు చేయాలని నిర్ణయించారు.