రాజధాని పై కలవరపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు!!
posted on Dec 19, 2019 @ 1:42PM
అసలు రాజధాని ఏంటి అనేది అందరిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. 3 రాజధానులే నిజమైతే కనుక మళ్లీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా అని కొందరిలో ఆందోళన ఇప్పటికే మొదలైయింది. కుటుంబ సభ్యులను చూసేది రెండుమూడు వారాలకొక్కసారేనా ఇప్పటి నుంచి ఆ అదృష్టాన్ని కూడా దూరం చేస్తారా అని కుటుంబాలను హైదరాబాద్ లోనే పెట్టిన వారి ఆవేదన. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు 2016,17లో తరలి వచ్చేశాయి. పిల్లల చదువులు సొంత ఇళ్లు ఇతర అవసరాల రిత్యా హైదరాబాద్ విడిచి వచ్చేందుకు ఉద్యోగులు అయిష్టత చూపారు. దీంతో అమరావతి నుంచి పనిచేయ్యండి, తమకు ఏం కావాలో చెప్పండి అంటూ చంద్రబాబు వారికి అనేక వసతులు కల్పించారు. సచివాలయం హెచ్ఓడీల సిబ్బందికీ వారానికి ఐదు రోజుల పని దినాలు నిర్ణయించారు. కుటుంబాలను వదిలిపెట్టి ఒంటరిగా వచ్చిన వారికి విజయవాడలో ఉచితంగా వసతి కల్పించారు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు సులువుగా ఉండేందుకు కేంద్రాన్ని ఒప్పించి కొత్త రైలు వేయించారు. ఉద్యోగులు కూడా ఇబ్బందులున్నప్పటికీ అమరావతికి వచ్చి పని చేస్తామంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడే ఉద్యోగులు ఇక్కడే ఎన్నాళ్లని హైదరాబాద్ చుట్టూ తిరుగుతాము అనుకొని చాలా మంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరుల్లో స్ధిరపడిపోయారు. కొందరు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. పిల్లల చదువులు జీవిత భాగస్వామి ఉద్యోగం వంటి కారణాలు ఉన్నవారు మాత్రం కుటుంబాలనూ అక్కడే ఉంచి ప్రతి వారం హైదరాబాద్ కు వెళ్లొస్తున్నారు. ఇప్పుడు రాజధాని విశాఖపట్నం మారితే మళ్లీ ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి ప్రకటన పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రత్యక్ష ప్రభావం పడే ఉద్యోగుల్లో దీని పై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశంపై స్పందించక పోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగాలకు చిన్న ఇబ్బంది కలిగించే ప్రకటన వచ్చినా ప్రభుత్వం పై విరుచుకుపడే ఉద్యోగ సంఘాలు ఇప్పుడెందుకు మౌనంగా వున్నాయని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో అన్ని సిద్ధం అయిన తరువాత ఇప్పుడు ఎందుకు చెడగొడుతున్నారు అని, రాజధాని నిర్ణయం ఒకసారే జరుగుతుందని అక్కడి ఉద్యోగులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చటం ఎక్కడైనా ఉందా, వచ్చే ఎన్నికల్లో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ రాజధానిని మారుస్తారా, మళ్లీ తాము తట్టా బుట్టా సర్దుకొని వచ్చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు అమరావతి పరిధిలో అనర్హులకు ప్లాట్ల కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. భూమి లేని నిరుపేదలు సాగు చేసుకొని జీవనం సాగించేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అసైన్డ్ భూములు కేటాయించింది. వీటిని ఇతరులు కొనడం నిషిద్ధమైనప్పటికీ రాజధానిగా అమరావతి ప్రకటన అనంతరం అసైన్డ్ రైతుల నుంచి పలువురు కొనుగోళ్లు చేశారు. ఆ తర్వాత వాటిని పూలింగ్ కింద ఏపీసీఆర్డీయేకు ఇచ్చి బదులుగా రిటర్నబుల్ ప్లాట్లను పొందారు. దీనిపై పలు ఫిర్యాదులు అందటంతో అమరావతిలోని అసైన్డ్ భూముల అనధికారిక క్రయ విక్రయాలపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 300 ఎకరాల అసైన్డ్ భూములను అనర్హులైన పలువురు సాగుదార్ల నుంచి కొని సీఆర్డీఏకు పోలింగ్ లో ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్లు పొందినట్లు తేలింది. వీరందరూ పొందిన రిటర్నబుల్ ప్లాట్లన్నింటి విస్తీర్ణం దాదాపు 34 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. ఆ ప్లాట్ల కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరి ఈ రాజధాని రగడ ఎప్పటికి తీరేనో వేచి చూడాలి.