నామినేటెడ్ పదవులను సీఎం ఎప్పటికి భర్తి చేయనున్నారు...
posted on Dec 19, 2019 @ 1:58PM
రెండవసారి అధికారంలోకి వచ్చాక గులాబీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల్ని ఇంకా భర్తీ చేయలేదు. ఈ ఏడాదిలో కేవలం 3,4 పదవులు మాత్రమే ఇచ్చారు. అందులో రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఒక్కటే కీలకమైనది. ఈ పదవికి కూడా చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. చివరికి ఈ పదవిని పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు. కీలకమైన పలు పదవుల భర్తీలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పదవులను భర్తీ చేస్తాం అంటూ హామీయిచ్చారు కేసీఆర్. చెప్పిన మాట ప్రకారమే పదవుల భర్తీకి ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చారు.ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా పదవులు జాతర మొదలవుతుంది అనుకున్నారు ఆశావహులు. కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా పదవుల పై ప్రగతి భవన్ నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ లో చోటు దక్కని సీనియర్ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాజిరెడ్డి గోవర్దన్, నాయిని నర్సింహరెడ్డి, దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రెడ్యా నాయక్ లాంటి సీనియర్ లతోపాటు పలువురు ఎంపీలు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దల వద్ద తమకు తగిన పోస్టులు గురించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కొందరు అభ్యర్ధులు. రైతు సమన్వయ సమితి పదవి భర్తీ కావడంతో ఇప్పుడు అందరి కన్ను ఆర్టీసీ ఛైర్మన్, మూసీ రివర్ బోర్డు, హుడా లాంటి పదవులపై పడింది. వీటి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నేతలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే పార్టీలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న నాయకుల పరిస్థితి గందరగోళంగా మారింది. 2014 లో అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులని పార్టీలోని సీనియర్ నాయకులకు కట్టబెట్టారు కేసీఆర్. అయితే దాదాపుగా అన్ని కార్పొరేషన్ ల పదవీ కాలం ముగిసి నెలలు కావస్తున్నా వారికి రెన్యువల్ మాత్రం జరగలేదు. రెన్యువల్ కోసం గులాబీ పెద్దల చుట్టూ తిరిగినా ఒకరిద్దరికి మాత్రమే పదవులను కొనసాగించగలిగే అదృష్టం దొరికింది. మెజార్టీ నేతలు మాత్రం రెన్యువల్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. గతంలో పార్టీ కోసం పని చేసే వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేవారు. ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ,ఎంపిలకు కూడా పదవులు ఇస్తామంటున్నారు. దీంతో తమకు రెన్యూవల్ ఉంటుందా లేదా అని కొందరు పదవులు ఉంటాయా ఊడతాయా అని మరికొందరు బెంగ పడుతున్నట్టు సమాచారం. సీఎం నామినేటెడ్ పదవులను ఎప్పటికి భర్తీ చేస్తారా అని నేతలంతా ఎదురుచూస్తున్నారు.