పవన్ ఢిల్లీ దెబ్బ... విశాఖ వైసీపీలో గుబులు!!
posted on Dec 20, 2019 @ 10:29AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలను తూటాళ్లా వాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ గురించి జనసేన గురించి చులకనగా మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకూ మెల్లమెల్లగా తత్వం బోధపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారని ఆ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే మిగిలాడని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు తమ నోరు అదుపులో పెట్టుకుంటున్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ తరువాత పవన్ కళ్యాణ్ తన రూటు మార్చుకున్నారు. విమర్శల దాడితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పరిణామంతో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ జోరు పెంచడంతో అధికార పక్షం పై మాటల తూటాలు పేల్చుతూ వుండడంతో విశాఖ జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇటీవల తిరుమలలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు షాకిచ్చాయి. బిజెపితో తనకేమీ తగాదా లేదని జనసేనాని ప్రకటించడం గమనార్హం. లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను జనసైనికులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ నేతలను ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసు అని ప్రజాసమస్యల పై ఢిల్లీ పెద్దల్ని కలుస్తాను అని పవన్ స్పష్టం చేశారు. పరిధి దాటితే తాట తీస్తా అని కూడా గట్టిగా హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయిన సంగతి తెలిసిందే, బిజెపి చీఫ్ అమిత్ షా అంటే తనకెంతో గౌరవం అని కూడా ఆయన ప్రకటించారు.ఈ ఘటనల తర్వాత విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. బిజెపికి జనసేన దగ్గరవుతోందన్న అభిప్రాయాన్ని కొందరు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పవన్ పరపతి రోజురోజుకి పెరుగుతూ ఉంటే సీఎం జగన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి కూడా అందరికి తెలిసిందే, ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా ఆయన కలుస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్భాటంగా ప్రచారం చేశారు.కానీ ఏపీ సీఎం జగన్ వారిద్దరినీ కలవకుండానే అమరావతికి తిరిగొచ్చారు. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బిజెపి పెద్దలు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అంటూ జనసేన నాయకులు ఎద్దేవా చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. టిడిపి, బిజెపి వామపక్షాల జోరు పెంచడం విశాఖ రాజకీయ చిత్రాన్ని మార్చక తప్పదని వారు విశ్లేషిస్తున్నారు.జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడ్ కు బ్రేక్ వేయాలంటే విశాఖలో సీఎం జగన్ పర్యటించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చాల్సిన అవసరం ఎంతయిన ఉంది. మరి జగన్ దీనికి ఏ ఎత్తు గడలు వేస్తారో వేచి చూడాలి.