మహిళలకు ఓటు హక్కు కల్పించాలని..
posted on Sep 1, 2020 @ 7:21PM
హ్యారియెట్ షా వీవర్ (1 సెప్టెంబర్ 1876 - 14 అక్టోబర్ 1961)
తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెడతారు కొందరు. తాను నమ్మి, ఆచరిస్తున్న వాటిని ఇతరుల కూడా ఆచరించేలా అవగాహన కల్పిస్తారు మరికొందరు. వీరు కార్యకర్తలుగా, నాయకులుగా సమాజంలో మార్పునకు దోహదపడతారు. ఈ కోవలోనే వస్తారు హ్యారియెట్. ఆమె ఒకవైపు రాజకీయ, సాహిత్య కార్యకర్తగా పనిచేస్తూ మరోవైపు పత్రికాసంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
హ్యారియెట్ ఫ్రోడెషమ్ లో ధనిక కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ వీవర్, డాక్టర్ ఫ్రెడెరికి వీవర్. హ్యారియెట్ బడికి వెళ్ళకుండా ప్రైవేటుగా చదువుకున్నారు. సామాజిక రాజకీయ అంశాలపై అపారమైన అవగాహన పెంచుకుంటూ సామాజిక కార్యకర్తగా మారారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని జరిగిన పోరాటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ లో సభ్యురాలిగా చేరారు. డోరా మార్క్ డెన్, మేరీ గౌత్రోవే ఆధ్వర్యంలో వెలువడుతున్న ఫెమినిస్ట్ వీక్లీ ది ఫ్రీ ఉమెన్ లో చేరారు. ఆ తర్వాత ఆమె ఈ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని పత్రిక పేరును ది న్యూ ఫ్రీ ఉమెన్ గా మార్చారు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటూ సాహిత్య పత్రిక సంపాదకుడు ఎజ్రా పౌండ్ సలహా మేరకు పత్రిక పేరును ది ఎగోయిస్ట్ గా మార్చారు. కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ పత్రికలను పాఠకులకు చేరువ చేస్తూ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారు. మహిళలకు ఓటు హక్కు సాధించడంలో ఆమె పత్రిక కూడా ఉపయోగపడింది.
మహిళా హక్కులను కాపాడే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సేకరించిన సాహిత్యం బ్రిటిష్ లైబ్రరీకి, నేషనల్ బుక్ లీగ్ కు అందించారు.