చంద్రబాబును ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వని వైసిపి.. కేసులు నోటీసులతో రచ్చ
posted on Sep 2, 2020 @ 12:37PM
గత శాసన సభ ఎన్నికలలో టీడీపీ కేవలం 23 స్థానాలకు పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు పని ఇక అయిపోయిందని వైసీపీతో సహా టీడీపీ వ్యతిరేకులు అందరు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల తరువాత చంద్రబాబు అమరావతి నివాసం పై వైసిపి నేతలు కొంతకాలం రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దాని తరువాత బాబు విశాఖ పర్యటనలో కూడా రచ్చ జరగడంతో విషయం హైకోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి చంద్రబాబు హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని తన నివాసం లోనే ఉంటూ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పార్టీ కేడర్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే దీనిపై వైసిపి నాయకులు రెచ్చిపోయి బాబు పక్క రాష్ట్రం లో దాక్కొని జూమ్ ద్వారా కథ నడిపిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఏ అధికారపక్షమైనా తమ ప్రత్యర్ధులు ప్రజలలో కనపడకూడదు.. వినపడకూడదు అని కోరుకుంటాయి. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్ లు కూడా అయితే అటు ట్విట్టర్ లో లేదంటే జూమ్ లో కాన్ఫరెన్సులతో కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క రాష్ట్ర ప్రజలు పలు రకాల సమస్యలతో సతమతమవుతుండగా బాబు, లోకేష్ లు మాత్రం ఇంటికే పరిమితమవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని అటు పార్టీ నేతలు కూడా మొత్తుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా అధికారంలో ఉన్న వైసిపి మాత్రం అటు టీడీపీని ఇటు బాబును నిత్యం విమర్శిస్తూ ప్రజల లో ఆ పార్టీ పట్ల సానుభూతి పెరిగేలా తమవంతు కృషి చేస్తున్నారు. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించి ఆ పార్టీని జనంలో ఎండగట్టే ప్రయత్నం చేయకుండా నిత్యం ఏదో ఒక సాకుతో బాబును విమర్శిస్తూ మరోపక్క ఇటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏదో ఒక సాకుతో అరెస్టులు చేయడంతో టీడీపీకి ప్రజలలో మరింత సానుభూతి పెరుగుతోంది. తాజాగా చిత్తూరులో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడి ఆత్మహత్య పై టీడీపీ అధినేత చంద్రబాబు డిజిపికి లేఖ రాసారు. సోషల్ మీడియాలో అతడు చేసిన కామెంట్లపై కొంత మంది వైసిపి నేతలు, పోలీసులు బెదిరింపులకు పాల్పడడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు చేసారు. దీని పై వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు బాబు స్వయంగా చితూర్ జిల్లా లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు. ఇప్పటికైనా వైసిపి మేల్కొని బాబుగారికి మైలేజి ఇచ్చే ఇటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిదని.. లేదంటే తనకు తానే ప్రత్యర్థికి అస్త్రాలు ఇచ్చి మరీ ఆ పార్టీని బలోపేతం చేసి ఇటువంటి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికలలో వైసిపికి గడ్డు పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.