తెలంగాణ టూ శ్రీనగర్.. ఐపిఎస్ అధికారి చారుసిహ్హ
posted on Sep 2, 2020 @ 2:53PM
శ్రీనగర్ సెక్టార్ సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) ఇన్ స్పెక్టర్ జనరల్‌గా తెలంగాణ క్యాడర్ మహిళా ఐపిఎస్ అధికారి చారు సిన్హా నియమితులయ్యారు. వివాదస్పద, తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే శ్రీనగర్ సెక్టార్ కు మహిళా అధికారి ఐజీగా రావడం ఇదే మొదటిసారి.
శ్రీనగర్ సెక్టార్ 2005లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇక్కడ ఐజీ స్థాయిలో మహిళాపోలీసు అధికారి ఎవరూ నియమించబడలేదు. మూడు జిల్లాలు ముద్గాం, గండర్ బల్, శ్రీనగర్ లు, లడఖ్ యూనియన్ భూభాగం ఈ సెక్టార్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడి సీఆర్పీఎఫ్ సెక్టార్ పరిధిలో రెండు రేంజ్‌లు, 22 ఎగ్జిక్యూటివ్ యూనిట్లు, మూడు మహిళా పోలీసు కంపెనీలు, పారామిలటరీ బలగాలు ఉన్నాయి. వాటన్నింటికీ చారు సిన్హా హెడ్‌గా వ్యవహించనున్నారు. ఇక్కడ పనిచేసే అధికారి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో పాటు ఇండియన్ ఆర్మీతోనూ, జమ్మూ కాశ్మీర్ పోలీసులతోనూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న ప్రస్తుత తరుణంలో అక్కడ మహిళా అధికారిని నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలో బీహార్ సెక్టార్ లో నక్సల్స్ కార్యకలాపాలు అణిచివేయడంలోనూ, తెలంగాణలో నక్సల్స్ ప్రాభల్యం ఉన్న జిల్లాల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఆమెకు ఉంది.
చారుసిహ్హ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని బరేలీ. ఆమె తండ్రి ఎస్.ఎస్. సిహ్హ ఇక్రిశాట్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తూ హైదరాబాద్ కు బదిలీ పై వచ్చారు. అమ్మ మధుసిహ్హ ఆర్టిస్ట్. చారుసిహ్హకు ఇద్దరు చెల్లాలు ఉన్నారు. చారు సిహ్హ ఆబిడ్స్ లోని రోజరీ కాన్వెంట్ లో చదువుకున్నారు. సివిల్స్ లో చేరాలని ఎనిమిదో తరగతిలోనే ఆమె నిర్ణయించుకున్నారు. సెయింట్ ఫ్రాన్సెస్స్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ గోల్ట్ మెడల్ అందుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ లో పిజీ పూర్తి చేసి తర్వాత ఐపిఎస్ లక్ష్యంతోనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి విజయం సాధించారు. 1996 బ్యాచ్ లో సివిల్ సర్వెంట్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఫస్ట్ పోస్టింగ్ కడప జిల్లా పులివెందుల. కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యాక్షనిస్టులను, నక్సలైట్స్ ను అదుపులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో సింహస్వప్నంగా ఉండేవారు. అందుకు నిదర్శనంగా ఆమె సర్వీస్ కన్నా ఎక్కువ సంఖ్యలో బదీలీలు ఉంటాయి. రాజీలేని తత్త్వం, చట్టానికి కట్టుబడి పనిచేసే మనస్తత్వం ఆమెను నిజాయితీ గల అధికారిలో ప్రజల మన్ననలు అందుకునేలా చేశాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిఐడి ఐజీగా ఆమె పనిచేశారు. చిన్నారుల బాల్యం భయం లేకుండా ఉండాలన్న ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చైల్డ్ అబ్యూస్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటుచేశారు. వివక్షలేని బాల్యం ద్వారానే భారత్ భవిష్యత్ ను బంగారుమయం చేయవచ్చని ఎన్నో వేదికలపై ఆమె చెప్పేవారు. కేంద్ర సర్వీస్ కు వెళ్ళిన తర్వాత బీహార్ లోనూ ఆమె పనిచేశారు. ఇప్పుడు శ్రీనగర్ సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందడం ఆమె అంకితభావానికి సరైన గుర్తింపు గా భావించవచ్చు.
దేశసరిహద్దుల్లో చారుసిహ్హ లాంటి అధికారులు ఉండటం మన దేశంలోని మహిళలందరికీ గర్వకారణం.