ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పూజల పై సుప్రీం కోర్టు సెన్సేషనల్ తీర్పు
posted on Sep 1, 2020 @ 6:17PM
మన దేశంలో గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఉజైన్ కు చెందిన మహాకాళేశ్వర ఆలయం కూడా ఎంతో విశిష్టమైంది. ఎంతో పురాతనమైన ఘన చరిత్ర కలిగిన ఈ మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో పూజల పై మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక్కడ శివలింగం క్షీణిస్తున్నందున గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ ప్రముఖ జ్యోతిర్లింగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈరోజే ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా అయన పదవీ విరమణ కూడా చేయబోతున్నారు. దాదాపు మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో కేవలం శివుడి అనుగ్రహం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
సుప్రీం కోర్టు తాజాగా మహాకాలేశ్వర్ ఆలయంలో పూజల విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలు ఇవే:
ఆలయంలోని శివలింగాన్ని ఎవరూ చేతులతో రుద్దకూడదు.
శివలింగంపై పెరుగు, నెయ్యి, తేనె పోసి మర్దన చేయకూడదు.
శివాలయం గర్భ గుడిలోకి భక్తులెవరినీ అనుమతించకూడదు
కేవలం స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నీటిని మాత్రమే శివలింగం పై పడేలా పోయాలి.
ఇప్పటి నుండి నిబంధనలను ఉల్లంఘించిన పూజారులపై ఆలయ కమిటీ చర్యలు తీసుకుంటుంది.
అయితే ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్షీణిస్తోందని కాబట్టి భక్తులను లోపలికి అనుమతించకూడదని, అభిషేకాలు కూడా చేయకూడదని కోరుతూ 2017లో సారికా గురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆలయాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆలయాన్ని సందర్శించి తాజాగా పలు సూచనలు చేసింది. వీలైనంత తక్కువ పూజా ద్రవ్యాలతో మాత్రమే పూజలు చేయాలని.. ఆర్‌వో నీటితోనే అభిషేకం చేయాలని తెలిపింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈరోజు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.