చీరాల వైసీపీలో వర్గ విభేదాలు.. జగన్ కాళ్లు పట్టుకుని బతికిపోయారు!!
posted on Sep 2, 2020 @ 6:06PM
ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ విగ్రహం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు పోటాపోటీగా సాగడంతో పాటు.. ఆమంచి, కరణం వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, నాయకులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కరణం వెంకటేష్.. ఆమంచిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీరాల ప్రజలకు స్వేచ్ఛను ఇస్తామని ప్రమాణం చేశామని, స్వేచ్ఛను ఇచ్చేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గతంలో మాదిరిగా ఇక్కడ అరాచకాలు, బెదిరింపులు సాగవని స్పష్టం చేశారు. "బెదిరింపులను ఎవరూ చూస్తూ కూర్చోరు, జాగ్రత్త" అంటూ హెచ్చరించారు.
దీనిపై ఆమంచి కృష్ణమోహన్ గట్టిగా స్పందించారు. నా పేరు ఉచ్చరించడానికి భయపడేవాడు కూడా నాకు వార్నింగ్ ఇస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికిపోయారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు నా గురించి మాట్లాడతారా? అంటూ ఆమంచి మండిపడ్డారు.
అధికార పార్టీ నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడం తీవ్ర చర్చనీయంశమైంది. బాధ్యతగా ఉండాల్సిన నాయకులు ఇలా పబ్లిక్ గా ఒకరిపై ఒకరు బెదిరింపులకు దిగడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, 2019 ఎన్నికల్లో చీరాలలో టీడీపీ తరఫున కరణం బలరాం బరిలోకి దిగగా, వైసీపీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం.. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్టుగా.. రాజకీయ ప్రత్యర్థులు ఒకే పార్టీలో ఇమడలేకపోతున్నారు. అందుకే వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అధికార పార్టీకి తీవ్ర నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.