ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆద్యురాలు
posted on Sep 2, 2020 @ 10:32AM
లిల్లీ పౌలెట్ హారిస్ (2 సెప్టెంబర్ 1873 - 15 ఆగస్టు 1897)
మహిళలంటే వంటింటికే పరిమితం అనుకునే రోజుల్లోనే క్రీడారంగంలోనూ రాణించిన మహిళ లిల్లీ పౌలెట్ హారిస్. 18వ శతాబ్దంలోనే ఆస్ట్రేలియాలో మహిళా క్రికెట్ జట్టును ఆమె స్థాపించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.
2 సెప్టెంబర్ 1873 న లిల్లీ పౌలెట్, వైలెట్ కవలలుగా జన్మించారు. ఆమె తండ్రి రిచర్డ్ డియోడాటస్ పౌలెట్-హారిస్, తల్లి ఎలిజబెత్ ఎలియనోర్. తండ్రి హోబర్ట్ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, టాస్మానియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు. విద్యలోనూ రాణించిన లిల్లీ వయోలిన్, పియానో వాయిస్తూ సంగీతంలో ప్రతిభ కనపరిచారు. దాంతో పాటు బ్యాట్ పట్టుకుని గ్రాండ్ లో ఆడడం చిన్నప్పటి నుంచి ఆమెకు ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ, సైక్లింగ్ లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. క్రమంగా క్రికెట్ వైపు ఆమె ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె అభిరుచిని తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించారు. 1894లో స్థానిక మహిళల కోసం ఓయిస్టర్ కోవ్ లేడీస్ క్రికెట్ క్లబ్ ను ఆమె ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా కాలనీల్లో మొదటి క్రికెట్ క్లబ్ గా పేరుగాంచింది. ఆ తర్వాత ఆమె క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తన జట్టును విజయాల దిశగా పరుగులు తీయించారు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అయితే క్షయవ్యాధి కారణంగా లిల్లీ క్రికెట్ ఎక్కువ రోజులు ఆడలేకపోయారు. అతి చిన్నవయసులోనే 15 ఆగస్టు 1897లో లిల్లీ మరణించినప్పటికీ క్రికెట్ రంగంలో ఆమె సేవలు చిరస్మరణీయం.
ఓయిస్టర్ క్లబ్ ఆస్ట్రేలియాలో జాతీయస్థాయిలో మహిళా క్రికెట్ టీమ్ ఏర్పడడానికి పునాదులు వేసింది. మహిళల క్రికెట్ ను ఆమే ప్రారంభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ అంతర్జాతీయ పోటీల్లోనూ విజేతగా నిలుస్తోంది. 1978లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించారు. ఆ తర్వాత 1982, 1988, 1997, 2005 , 2013 లో మరో ఐదు సందర్భాలలో టైటిల్‌ను సాధించారు. 1973 ప్రపంచ కప్‌లో వారి మొదటి మ్యాచ్ నుండి ఇప్పటివరకు 254 వన్డేలు (వన్డే ఇంటర్నేషనల్స్) ఆడారు. ఇప్పటివరకు వన్డే జట్టులో 122 మంది మహిళలు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడా జట్టుగా నిలిచింది. ఒక మహిళకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి ఈ రోజు ఇన్ని విజయాలకు కారణం అయ్యింది.