వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ తీరుపై మోహన్ బాబు అసంతృప్తి!!
posted on Sep 2, 2020 @ 12:37PM
సీనియర్ నటుడు మోహన్ బాబుకు వైసీపీతో గ్యాప్ పెరిగిందా! వైఎస్ కుటుంబానికి ఆయన సన్నిహితంగానే ఉంటున్నారా!. ఈ ప్రశ్నలకు కొంత కాలంగా సరైన సమాధానం దొరకడం లేదు. ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ తో మోహన్ బాబు కలిసిన సందర్భాలు లేవు. వైసీపీ ప్రభుత్వం పని తీరుపై ఆయన ఎక్కడా స్పందించడం లేదు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన మోహన్ బాబు.. జగన్ పాలనపై మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. వైసీపీతోనూ, జగన్ తోనూ మోహన్ బాబు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో జగన్ పాలనపై ఆయన విమర్శలు కూడా చేయలేదు . దీంతో మోహన్ బాబుకు జగన్ మధ్య గ్యాప్ లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు.
వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా మోహన్ బాబు ఆయనకు నివాళి అర్పించారు. వైఎస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా అభివర్ణించారు. రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రాజకీయవేత్త అని నివాళి అర్పించారు. మా బావగారు అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. దీంతో మోహన్ బాబు వైఎస్ కుటుంబానికి సన్నిహితంగానే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ తో మోహన్ బాబుకు ఎంతో అనుబంధం ఉందని, అందుకే ఆయనకు నివాళి అర్పించారని మరికొందరు చెబుతున్నారు. వైఎస్ కు నివాళి అర్పించినంత మాత్రానా జగన్ తో గ్యాప్ లేదని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే మోహన్ బాబు... సీఎంగా జగన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్ కు నివాళి అర్పించిన మోహన్ బాబు.. జగన్ ఏడాది పాలనపై ఎందుకు విషెష్ చెప్పలేదని అంటున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని మోహన్ బాబు కామెంట్ చేశారు. తన కుమారుడు మనోజ్ రాజకీయాల్లో వస్తానంటే వద్దని చెబుతానని చెప్పారు. దీంతో వైసీపీ రాజకీయాలు, జగన్ తీరుపై అసంతృప్తితోనే మోహన్ బాబు ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంతా భావించారు.
వైఎస్ కుటుంబానికి మోహన్ బాబుకు మధ్య బంధుత్వం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. జగన్ ను సీఎం చేయాలని ఓటర్లకు పిలుపిచ్చారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మోహన్ బాబు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు మంచి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సీఎం జగన్. తాను పదవులు కోరనని మోహన్ బాబు చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆ మధ్య కుమారులు, కూతురుతో కలిసి ప్రధాని మోడీని కలిసి మోహన్ బాబు.. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే తాను కేవలం మర్యాదపూర్వకంగానే ప్రధానిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అయితే మోహన్ బాబు కొంతకాలంగా సీఎం జగన్ గురించి ప్రస్తావించకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ పై అభిమానం చూపుతూనే.. జగన్ పై మెహన్ బాబు ఆగ్రహంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది.