మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా.. ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా?
posted on Sep 7, 2020 @ 5:58PM
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయాలు. ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది జగన్ సర్కార్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకున్నామని గొప్పగా ప్రకటించుకుంది. దశల వారీగా షాపులను కూడా తగ్గిస్తూ.. పూర్తి మద్యపాన నిషేదం దిశగా వెళతామని సీఎం జగన్ తో పాటు మంత్రులు చెప్పారు. అయితే సిన్ రివర్స్ కావడంతో మద్యం ధరలను తగ్గించింది జగన్ సర్కార్. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. మద్యం తాగేవారిని తగ్గించేందుకు ధరలు పెంచామని చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెందుకు పెంచిందనే ప్రశ్న వస్తోంది. దశల వారీగా మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా... ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని పలువురు నిలదీస్తున్నారు.
లిక్కర్ ధరలు పెంచుతూ జగన్ సర్కార్ తీసుకున్న తొందర పాటు నిర్ణయంతో కొత్త సమస్యలు వచ్చాయి. ధరలు పెరగడం మందుబాబులకు ప్రాణాలమీదకు వచ్చింది. మత్తుకు బానిసలుగా మారిన కొందరు.. ఎక్కువ ధర లిక్కర్ కొనలేక.. శానిటైజర్ కు అలవాటుపడ్డారు. మత్తుగా ఉండటంతో దాన్నే లిక్కర్ గా ఊహించుకుని తాగారు. శానిటైజర్ మోతాదు మించడంతో పలు జిల్లాలో మరణాలు సంభవించాయి. ప్రకాశం జిల్లా కురిచేడులోనే 13 మంది ప్రాణాలు కోల్ఫోయారు. తిరుపతిలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు శానిటైజర్ తాగి చనిపోయారు. అన్ని జిల్లాల్లోనూ శానిటైజర్ తాగే వారున్నారనే సమాచారంతో .. ఆలస్యంగా మేల్కొన్న జగన్ సర్కార్ ఎస్ఈబీని విచారణకు ఆదేశించింది. ధరలు ఎక్కువగా ఉండటం వల్లే శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి ప్రాణాలు కోల్పోతున్నారని, ధరలు సవరించాలని ప్రభుత్వానికి ఎస్ఈబీ నివేదిక ఇచ్చింది.
2019 అక్టోబర్ లో తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోనే లిక్కర్ ధరలు పెంచింది జగన్ సర్కార్. కరోనా ప్రభావంతో మార్చి చివరలో మద్యం దుకాణాలు బందయ్యాయి. అన్ లాక్ లో షాపులు తెరవగా మందు కోసం జనాలు పోటెత్తారు. ఏ షాపు దగ్గర చూసినా కిలోమీటర్ల క్యూలైన్లు కనిపించాయి. దీంతో తాగేవారి సంఖ్యను తగ్గించాలనే సాకుతో మద్యం ధరలను మరో 75 శాతం పెంచింది ఏపీ సర్కార్. మద్యం ధరలు పెరగడంతో సామాన్యులు, పేదలు కొనలేకపోయారు. అదే సమయంలో మత్తును మరిచిపోలేక శానిటైజర్లకు అలవాటు పడ్డారు. ఇంకొందరు నాటుసారా తాగారు. చీప్ లిక్కర్ ధర పెరిగేకొద్దీ నాటుసారా సాధారణంగానే పెరుగుతూ ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలున్నాయి. అయినా ఆ సంగతి ఊహించకుండా... వరుసగా షాక్ కొట్టేలా ధరలు ఎందుకు పెంచారనే ప్రశ్న వినిపిస్తోంది.
జరగాల్సిన నష్టం జరిగాకా మేల్కొన్న జగన్ సర్కార్.. పేదలు తాగే చీప్ లిక్కర్ ధరలను తగ్గించింది. మీడియం, ప్రీమియం మద్యం ధరలను మాత్రం భారీగా పెంచింది. అత్యంత చీప్ అయిన రెండు కేటగిరీల మద్యం ధరలను తగ్గించింది. కనిష్ఠంగా 90 ఎంఎల్‌కు రూ.10 తగ్గింది. అదే... క్వార్టర్ రూ.600పైన ధర ఉన్న రకం మద్యంపై 90 ఎంఎల్‌పై రూ.140 పెంచారు. క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరల్లో మార్పు చేయలేదు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్‌పై రూ.30 తగ్గించారు.
రాష్ట్రంలో ఇప్పటికే 30కిపైగా కొత్త బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. అత్యంత చీప్ నుంచి బాగా ఖరీదైన మద్యం వరకు అన్నీ కొత్త బ్రాండ్లే. ఎప్పటినుంచో ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్ల స్థానాన్ని ఇవి ఆక్రమించేశాయి. వచ్చిందే తడవుగా ఎక్సైజ్‌శాఖ కూడా కొత్త బ్రాండ్లకు చకచకా అనుమతులు ఇచ్చేసింది. వీటి వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నట్లు బలమైన ఆరోపణలున్నాయి. తాజాగా మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను బాగా పెంచి... జేబులు నింపుకొనే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. చీప్ లిక్కర్ ధర తగ్గి సేల్స్ పెరిగినా, ఆపై రకం మద్యం ధరలు పెరిగినా... సొమ్ములన్నీ సొంత పార్టీ నేతలకే వెళ్లేలా స్కెచ్ వేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ధరలు తగ్గించిన తర్వాత కూడా రాష్ట్రంలో చీప్ లిక్కర్ ధర పొరుగు రాష్ట్రాలతో పోల్చితే 30 నుంచి 40 శాతం అధికంగానే ఉంది. ఇక రాష్ట్రంలో దొరికేదంత కొత్త, నాసిరకం మద్యమే. మీడియం, ప్రీమియం కేటగిరీలో పాపులర్ బ్రాండ్లు రాష్ట్రంలో దొరకడం లేదు. దీంతో వాటినీ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అడ్డదారిలో లక్షలు సంపాదించుకోవచ్చన్న దుర్భుద్దితో కొందరు దళారి వ్యాపారులు.. అక్రమంగా భారీగా మద్యం బాటిళ్ల ను ఏపీకి తరలిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ నాటినుంచి కోట్లాది రూపాయల మద్యాన్ని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. ప్రీమియం బాండ్ల ధరలు పెంచిన నేపథ్యంలో ఈ అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశముంది. ధరల సవరణతో కొత్తగా ప్రయోజనమేంటో తెలియడం లేదని ఎక్సైజ్ అధికారులే అభిప్రాయపడుతున్నారు.