తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర
posted on Sep 7, 2020 @ 4:01PM
ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ ఘననివాళి
తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల మొదటిరోజు మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డిలకు నివాళులు అర్పించారు. శాసనసభలో ప్రణబ్ ముఖర్జీపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశం శిఖర సమానమైన నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికవేత్తగా ప్రణబ్ పేరు తెచ్చుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్ర మరవలేదని, రాష్ట్రపతి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై సంతకం చేసిన మహానుభావుడని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్ లో చిన్న గ్రామంలో పుట్టిన ఆయన రాష్ట్రపతి వరకు ఎదిగారని, చిన్నతనంలో స్కూలుకు వెళ్లాలంటే చిన్నవాగు ఈదుకుంటూ వెళ్లేవారని, గొప్ప నేతగా ఎదిగిన ఆయన రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత అని సిఎం కొనియాడారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కరోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోకి మాస్క్ధరించడంతో పాటు కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. సభా ప్రాంగణాల్లో శానిటైజర్, థర్మల్ స్కానర్లు, ఆక్సీమీటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను, వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచారు.
రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాప తీర్మానం చేసిన తర్వాత ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. ఇటీవల మరణించిన మాజీ సభ్యులు సున్నం రాజయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, పి రామస్వామి, కావేటి సమ్మయ్య, జువ్వాడి రత్నాకర్ రావు, పోచయ్య, మస్కు నర్సింహ, బి కృష్ణ, మాతంగి నర్సయ్య మృతి పట్ల సభ నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.