వీఆర్వో వ్యవస్థ కు రాంరాం
posted on Sep 7, 2020 @ 6:08PM
కొత్త రెవెన్యూ యాక్ట్ ల్యాండ్ మేనేజ్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ గా పేరు
అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదం
శతాబ్దాల నాడు రూపొందించిన రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలని గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రెవెన్యూ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు 1999లో ఆంధ్రప్రదేశ్ భూమి రెవెన్యూ కోడ్–1999 పేరుతో కొత్త నిబంధనలను ఫ్రేం చేశారు. అందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. అయితే ఈ కోడ్ లో ఉన్న విషయాలపై కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో అట్టకెక్కింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు సమాయత్తం అయ్యింది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రెవెన్యూ చట్టంగా తీసుకువస్తూ ‘ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ’గా పేరు మార్చారు. రెవెన్యూ శాఖలో మార్పుపై, పేరుకుపోతున్న అవినీతిపై కొన్నాళ్లుగా తరుచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కొత్త చట్టానికి రూపకల్పన చేశారు.
నిజాం కాలం నుంచి..
నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని భూచట్టాలకు 113 ఏండ్ల చరిత్ర ఉంది. అప్పటి పాలకులు 1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని భూచట్టాలకు ఇదే కేంద్రబింధువుగా ఉంది. భూ పరిపాలనకు సంబంధించింనంత వరకు ఇదే సమగ్ర రెవెన్యూ చట్టం. ఆ తర్వాత ఎన్నో మార్పులుచేర్పులతో ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది. ఇందులో భూపరిపాలన, భూసేకరణ, కౌలుదారులు, రైతుల హక్కులు ఇలా అనేక అంశాలుగా విడిపోయి కొత్తకొత్త చట్టాలు పుట్టుకువచ్చాయి. నియమ నిబంధనలు మారాయి. ఇందులోని అనేక సెక్షన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, అవినీతికి ఆస్కరం కల్పిస్తున్నాయని అనేక సార్లు ముఖ్యమంత్రి అన్నారు. వీటన్నింటిని కలిపి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావాలన్న కసరత్తు గత కొద్దినెలలుగా జరుగుతోంది. ఈ కొత్త చట్టానికి ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ గా పేరు పెట్టారని తెలిసింది. రెవెన్యూ శాఖలో ఇప్పటివరకు ఉన్న వీఆర్వోల వ్యవస్థ రద్దు కావడంతో పాటు వారిని వివిధ శాఖల్లో భర్తీ చేస్తారని వినికిడి. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం మొదలైన అనేక సంస్కరణలు తీసుకురానున్నారు.