కరోనా మందు.. ఎవరికి ముందు
posted on Sep 7, 2020 @ 11:45AM
ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చల తీరు గమనిస్తుంటే ఈ నానుడిని మరోసారు గుర్తుకు చేసుకోవల్సిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వందకు మించి ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్నాయి. అవి విజయవంతమై ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. ఇంతలోనే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సి న్ విజయవంతమైతే ముందుగా ఎవరికీ ఆ వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న అంశంపై అంతర్జాతీయంగా చర్చజరుగుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించింది.
ఈ వైరస్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాల రేటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 19 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సూచనలు చేశారు. ఈ బృందానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్ జే ఎమ్మన్యూల్ నేతృత్వం వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మూడు దశల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటూ కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్నింటి పరిశీలిస్తే.. కోవిద్ 19 వైరస్ కారణంగా అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని సూచించారు. కరోనా తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.
అయితే అక్టోబర్ చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఓ లేఖలో పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇప్పటికే అమెరికాలో నవంబర్ 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామంటున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (AstraZeneca) ఆమోదానికి చేరువలో ఉందని ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగాలని ఆయన భావిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రయోగశాలను దాటి క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమై మార్కెట్ లోకి వస్తే తప్ప కరోనా మందు ఎవరికీ ముందు అన్న విషయంపై స్పష్టత రాదు. అప్పటివరకు ప్రయోగాలతో పోటీ పడి అంతర్జాతీయ వేదికలపై ఇలా చర్చలు జరగడం మాములే..! ఎందుకుంటే కరోనా చేసిన నష్టం, కలిగించిన కష్టం ఇంతంత కాదు కదా..!