వలసలతో కాషాయ జోరు.. కారుకు కష్టమేనా!
posted on Sep 7, 2020 @ 3:38PM
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. అధికార పార్టీగా ఉండటం, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ తో టీఆర్ఎస్ గెలుపు ఈజీగానే ఉంటుందని మొదట అందరూ భావించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. ఇలా అన్నిఅనుకూలంగా ఉండటంతో దుబ్బాకలో వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. విపక్షాలు సవాల్ గా తీసుకోవడంతో కారు పార్టీకి టఫ్ ఫైట్ ఉండే సూచనలు కన్పిస్తున్నాయి.
బీజేపీ నుంచి సీనియర్ నేత రఘునందన్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు సోలిపేట కుటుంబంపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా అన్ని అంశాలు కలిసి వస్తుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు రఘునందన్ రావు. ఇప్పటికే ఆయన సగానికి పైగా గ్రామాలు చుట్టేశారు. యువత టార్గెట్ గా ఆయన ముందుకు పోతున్నారు. బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. యువకులు, యూత్ సంఘాలు రఘునందన్ రావుకు మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో రోజు రోజుకు దుబ్బాకలో బీజేపీ బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ కూడా దుబ్బాక ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
2019 మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉద్యోగులు, యువకుల్లో టీఆర్ఎస్ పట్ల పెరిగిన వ్యతిరేకత ఆ ఎన్నికల్లో కన్పించింది. ఇప్పుడు అంతకు మించి కేసీఆర్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు షాకిచ్చేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో సానుకూలంగా లేవని గ్రహించిన సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావును ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయినా దుబ్బాక రాజకీయాలను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హరీష్ డైరెక్షన్ లో మెదక్ ఎంపీతో పాటు జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గతంలో చాలా ఉప ఎన్నికలను ఈజీగా గెలుచుకున్న టీఆర్ఎస్ కు... దుబ్బాక సవాల్ గా మారిందనే ప్రచారం గులాబీ వర్గాల్లోనూ జరుగుతోంది.