రాములమ్మ హ్యాండ్! జంపింగేనా..? ఆపరేషన్ కమల్
posted on Sep 7, 2020 @ 8:01PM
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోటికి విజయశాంతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దుబ్బాక బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. రాములమ్మ ఇమేజ్ తో లబ్ది పొందాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు, పోటీకి ఫైర్ బ్రాండ్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉపఎన్నికలో పోటీపై కాంగ్రెస్ కు రాములమ్మ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. పోటీ చేసే అంశంపై తెలంగాణ పీసీసీ నేతలు సంప్రదించినపుడు ఆమె నిరాసక్తత తెలిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డీనే ఈ విషయాన్ని పార్టీ నేతలకు తెలిపినట్లు సమాచారం. విజయశాంతి నో చెప్పడంతో అభ్యర్థిత్వం కోసం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహ ఇతర పేర్లను పీసీపీ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి విజయశాంతి నిరాకరించడం వెనక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. గతంలో బీజేపీలో పనిచేసిన విజయశాంతి.. మళ్లీ కమలం గూటి వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆమె టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఆమె కేంద్ర సర్కార్ నిర్ణయాలను సమర్ధిస్తూ ట్వీట్లు కూడా చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక లోపే రాములమ్మ కాషాయ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బండి సంజయ్ కు బాధ్యతలు ఇచ్చాకా పార్టీ కార్యక్రమాల్లో స్పీడ్ పెరిగింది. టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ గా బీజేపీ జనంలోకి వెళుతోంది. కేసీఆర్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది సంజయ్ టీమ్. హైకమాండ్ డైరెక్షన్ లో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలకు గాలం వేస్తున్నారు కమలనాధులు. అందులో భాగంగానే తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రాములమ్మ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చాలా గ్యాప్ తర్వాత మేకప్ వేసుకుని మహేష్ బాబు సినిమాలో కీ రోల్ పోషించారు. అయితే ఇటీవలే ఆమె రాజకీయాల్లో కొంత యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ట్వీట్లు చేస్తున్నారు. రాములమ్మ యాక్టివ్ కావడంతో దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని భావించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. అయితే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ కు పెద్ద షాకే. బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చినా హస్తానికి ఇబ్బందే. అందుకే రాములమ్మను పోటీ చేయించాలని పీసీసీ నేతలు భావించారు. రాములమ్మ బీజేపీ ఓట్లు చీలుస్తుందని,.. దాంతో కాంగ్రెస్ గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో అయినా ఉంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ వ్యూహాన్ని ముందే పసిగట్టిన బీజేపీ నేతలు.. రాములమ్మను తమ వైపు లాగేశారనే ప్రచారం జరుగుతోంది. విజయశాంతిని రాజ్యసభకు పంపాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి రాములమ్మ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది.