హత్య చేసి డబ్బుల కోసం డ్రామా! ఇంత కిరాతకమా?
posted on Oct 22, 2020 @ 3:31PM
దారుణం.. అమానుషం.. కిరాతకం. మహబూబా బాద్ లో కిడ్నాపై దారుణహత్యకు గురైన బాలుడి ఘటనపై చెప్పడానికి ఈ పదాలు కూడా తక్కువే. డబ్బుల కోసం ఆశపడి అభం శుభం తెలియని తొమ్మిదేండ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన అందరిని కలిచివేస్తోంది. మానవత్వానికి మచ్చగా , పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలుస్తోంది. బాలుడి తండ్రికి తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడటం మరింత ఆందోళన కల్గిస్తోంది. మహబూబాబాద్ ఘటనతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదోనన్న భయాందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.
మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో ఆదివారం అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని కిడ్నాపర్ దారుణంగా హత్య చేశాడని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బాలుడి కిడ్నాప్ జరిగినప్పటి నుంచి మృతదేహం లభ్యంతో పాటు కిడ్నాపర్ ను పట్టుకున్న వివరాలను ఆయన వివరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు దీక్షిత్ ను మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి.. రెండు గంటల్లోనే హత్య చేశాడని తెలిపారు.
నాలుగో తరగతి చదువుతున్న దీక్షిత్ రెడ్డిని తొందరగా డబ్బులు సంపాదించాలన్న దురాశతోనే మందసాగర్ కిడ్నాప్ చేశాడని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. కిడ్నాపర్ తెలిసిన వ్యక్తి కావడం వల్లే బాలుడు పిలవగానే వెళ్లాడని, ముందస్తు ప్రణాళిక ప్రకారం సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచే బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. దానవయ్య గుట్టకు బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్‌కు అతడిని అక్కడ ఉంచడం కష్టంగా మారిందని, దీంతో తనకు పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పవని భావించి, వదిలేసినా బాలుడు తన వివరాలు బయటపెడతాడని భావించి, అతడిని కిడ్నాప్ చేసిన గంట, గంటన్నరలోనే బాలుడిని గొంతునులిమి చంపేశాడని వివరించారు.
తమకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం అతడు ఒక్కడే బాలుడి ఇంటి సమీపంలోకి వచ్చి దీక్షిత్ ను తీసుకెళ్లాడని మదబూబా బాద్ ఎస్పీ తెలిపారు. మంద సాగర్ కు ఓ బైక్ ఉందని, దానికి ఫేక్ నంబరు తగిలించి బాలుడిని కిడ్నాప్ చేశాడన్నారు. కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా ఒకటి తమకు లభించిందని వివరించారు. ఆదివారం సాయంత్రం మహబూబాబాద్ శివారులోని గుట్టలపైకి బాలుడిని తీసుకెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత బాలుడిని విడిచి పెట్టేందుకు రూ.45 లక్షలు డిమాండ్ చేశాడని వివరించారు.
బాలుడిని చంపేసిన రెండు రోజుల తర్వాత కూడా డబ్బు కోసం మందసాగర్ ఫోన్లు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుపుతున్నామని సాయంత్రంలోపు పూర్తి స్పష్టత వస్తుందని కోటిరెడ్డి అన్నారు. ఈ కేసులో ఇతర నిందితుల గురించి కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత సాయంతోనే తాము నిందితుడిని పట్టుకుననమని ఎస్పీ చెప్పారు. నిందితుడు ఇంటర్నెట్ కాల్స్ చేసినప్పటికీ తాము హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ సాయంతో పట్టుకున్నామని చెప్పారు.
ఆదివారం కిడ్నాపై దారుణ హత్యకు గురైన బాలుడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ కుమారుడు క్షేమంగా వస్తాడని నాలుగు రోజులుగా ఎదురుచూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బాలుడి కోసం మొత్తం ఆస్తిని ఇవ్వడానికి సిద్ధమైనా చంపేశారంటూ వారు విలపిస్తుండటం అందరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. డబ్బుల కోసం బాలుడిని ఇంత కిరాతకంగా హత్య చేస్తారా అంటూ స్థానికులు బోరుమంటున్నారు. అభం శుభం తెలియని బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్లను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.