ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ లో అపశృతి.. వాలంటీర్ మృతి..
posted on Oct 22, 2020 @ 11:45AM
కరోనా వైసర్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి నుండి ప్రపంచాన్ని బయట పడేయడం కోసం పలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తీసుకురావడానికి కాలంతో పోటీ పడుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి సిద్ధం చేసిన వ్యాక్సిన్ పై ప్రపంచంలోని పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మొదటి, రెండోదశ ట్రయల్స్ లో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ఈ టీకాను తీసుకున్న ఓ వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసి మళ్లీ పరీక్షలను ప్రారంభించారు. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఒక అపశృతి చోటుచేసుకుంది. బ్రెజిల్ లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు మృతిచెందాడు.
వ్యాక్సిన్ మొదటి, రెండో దశ పరీక్షల సందర్భగా అనారోగ్యానికి గురై అతను మరణించినట్టుగా బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన డేటా అందిందని.. దీనిపై దర్యాప్తు చేపట్టామని చెప్పింది. అయితే వాలంటీర్ మృతిచెందిన తర్వాత కూడా వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. బ్రెజిల్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిచింది. అయితే ట్రయల్స్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి అని తెలిపింది. అయితే చనిపోయిన వాలంటీర్.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణించాడా?, లేక మరేదైనా అనారోగ్య కారణలతో మృతిచెందాడా? అనేదానిపై ఇంకా స్ఫష్టత రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ భద్రతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆక్స్‌ఫర్డ్ తాజాగా స్పష్టం చేసింది.