వైద్యశాఖను వదలరా! వైసీపీ నేతల తీరుతో జనాల్లో ఆందోళన
posted on Oct 21, 2020 @ 7:02PM
వైద్య వృత్తిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. డాక్టర్లను దేవుళ్లుగా కొలుస్తుంటారు. అలాంటి వైద్య వృత్తిలో చీడ పరుగులు చేరితే సమాజానికే అనర్థం. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు వైద్యశాఖకు కళంకం తెచ్చే పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అన్ని రంగాలు, శాఖలను భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలు.. పవిత్రంగా భావించే వైద్యశాఖను వదలడం లేదని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పీజీ వైద్య పరీక్షలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు బ్లూటూత్ తో కాపీయింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా.. ఆ విద్యార్థిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకురావడం కలకలం రేపుతోంది. విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని.. అధికార పార్టీ నేతల కోసం హెల్త్ వర్శిటీ ఉన్నతాధికారులు హెచ్చరించడం, ఎమ్మెల్యే కొడుక్కి క్లీన్ చిట్ ఇవ్వాలని ఆదేశించడం ఆందోళన కల్గిస్తోంది. వైసీపీ నేతల తీరు, వర్శిటీ అధికారుల చర్యలపై వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో హెల్త్ వర్సిటీ గతనెలలో మెడికల్ పీజీ వార్షిక పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 24న జరిగిన పరీక్షలో ఓ విద్యార్థి దర్జాగా చెవిలో బ్లూటూత్ పెట్టుకొని సమాధానాలు వింటూ పరీక్ష రాస్తున్నాడు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్ ఆ విద్యార్థిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, జవాబు పత్రాలు తీసుకొన్నారు. కాపీయింగ్ చేస్తున్నట్లు కేసు బుక్ చేశారు. అదేరోజు హెల్త్ వర్సిటీకి ఈ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు.సాధారణంగా ఇలాంటివి జరిగితే ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారు. కానీ పట్టుబడిన విద్యార్థి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుత్రరత్నం కావడంతో హెల్త్ వర్సిటీకి ఫోన్ల మీద ఫోన్లు వెళ్లాయి. ఆ మెడికల్ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి కూడా ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వరే పట్టుకున్నారని... విద్యార్థి బ్లూటూత్ పెట్టుకున్న వైనం అంతా సీసీ టీవీలో రికార్డయిందని యాజమాన్యం చెప్పినా సదరు అధికారి శాంతించలేదు. వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లకు లొంగిపోయిన వర్సిటీ ఉన్నతాధికారులు కాపీయింగ్ చేసిన విద్యార్థికి క్లీన్‌చిట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే కొడుకు మాస్ కాపీయింగ్ ఘటన వివాదాస్పదం కావడంతో హెల్త్ వర్శిటీ వీసీ నలుగురితో కమిటి వేశారు. ఆ కమిటి ఈ నెల 22న సదరు విద్యార్థిని విచారించనుంది. అయితే ఆ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడలేదని, క్లీన్‌చిట్ ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. విద్యార్థిని పట్టుకున్న మహిళా వైద్యురాలు సిద్ధార్థ కళాశాలకు చెందిన ఆప్తమాలజిస్ట్. ఆమె భర్త వర్సిటీ రిజిస్ర్టార్‌గా పని చేస్తున్నారు. స్వయంగా వర్సిటీ అబ్జర్వర్ పట్టుకున్న కేసును నీరుగార్చి కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థికి క్లీన్‌చిట్ ఇస్తే భవిష్యత్తులో ఇది ఎటువంటి చెడు సంప్రదాయాలకు తెర తీస్తుందో అని వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వైద్యశాఖను భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల తీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్ కాపీయింగ్ తో పాసై డాక్టర్లుగా వైద్య వృత్తిలోకి వస్తే సమాజానికే నష్టమని చెబుతున్నారు. అయినా వైద్య పరీక్షలో కాపీయింగ్ చేసిన వ్యక్తిని శిక్షించాలని కోరకుండా.. క్లీన్ చిట్ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో మళ్లీ జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే వైద్యశాఖ ప్రతిష్టకే భంగం కలిగే అవకాశం ఉందని, ఇది తీవ్ర పరిమాణాలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. చిల్లర పనులకు దిగుతున్న వైసీపీ నేతలపై ఆ పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.