ఉచితంగా కరోనా వ్యాక్సిన్! బీహార్ బీజేపీ మేనిఫెస్టో
posted on Oct 22, 2020 @ 1:09PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజల జీవన విధానమే మారిపోయింది. అన్ని రంగాల్లో సమూల మార్పులు వచ్చాయి. రాజకీయాలపైనా కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. పార్టీల మెనిఫెస్టోల్లోనూ ఇప్పుడు కరోనానే కీలకంగా మారుతోంది. ఎన్నికల సమయంలో నేతలు ప్రజలకిచ్చే హామీల్లో వైరస్ చేరిపోయింది. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ.. కరోనానే కీలక అంశంగా ప్రస్తావించింది. తమకు అధికారం ఇస్తే రాష్ట్రంలోని ప్రజలందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్నే ప్రముఖంగా చెప్పారు. బీహార్‌లో ప్రతి ఒక ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అన్నారు నిర్మలా సీతారామన్.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఇచ్చిన హామీల కంటే అధిక హామీలను గుప్పిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఎన్డీఏను రాష్ట్ర ప్రజలు గెలిపించాలని కోరింది. బీహార్‌లో మరో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటారని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాలనలోనే బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు. బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం, 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారమన్ తెలిపారు.
బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. బీహార్ లో అధికారం కోసం ఎన్డీఏ, యూపీఏ కూటములు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా నితీశ్ కుమార్ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. యూపీఏ విజయం కోసం తేజస్వి యాదవ్ శ్రమిస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ కూడా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.