ఆయన చీర అమ్మకు ఇష్టం లేదా? కొండచరియల సంకేతం అదేనా?
posted on Oct 21, 2020 @ 7:35PM
విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మకు జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడంపై కొన్ని హిందూ సంఘాలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్రిస్టియన్ అయిన జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం మంచిది కాదని కొందరు స్వామిజీలు కూడా హెచ్చరించారు. అయినా అవేమి పట్టించుకోకుండా ఇంద్రకీలాద్రికి వెళ్లాలని జగన్ నిర్ణయించారు. సీఎం కోసం దుర్గగుడి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం జగన్ కొండపైకి మరో అర గంటలో వస్తారనగా.. ఒక్కసారిగా కొండపై నుంచి కొండ చరియలు విరిగిపడటం ఇప్పుడు చర్చగా మారింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి రావడానికి కొన్ని నిమిషాల ముందు కొండ చరియలు విరిగిపడటం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి బెజవాడ దుర్గమ్మ భక్తులు భయపడుతున్నట్లే జరిగిందా? ఇంద్రకీలాద్రిపై సాంప్రదాయాలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయా? జగన్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆ అమ్మకు కూడా ఇష్టం లేదా? అన్న ప్రచారం మొదలైంది. విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనాల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ వస్తారనగా కొండ చరియలు విరిగిపడటం వైసీపీని కలవరానికి గురి చేసింది. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రతినిధులు కొండపై కంగారు పడుతూ కనిపించారు. విరిగిపడిన కొండ చరియలను తొలగించడంతో పాటు సీఎం జగన్ రాక ఏర్పాట్లలో హడావుడి చేశారు. ఇక జగన్ దుర్గగుడి పర్యటనను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసిన వైసీపీ నేతలను ఈ ఘటన నిరాశకు గురి చేసింది. మరోవైపు జగన్ ఇంద్రకీలాద్రికి రావడం దుర్గమ్మకు ఇష్టం లేదోమోనని కొందరు భక్తులు లేవనెత్తుతున్న అనుమానాలు ప్రజల్లోకి వెళితే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. అందుకే కొండ చరియలు విరిగిపడిన ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారు. వర్షాకాలంలో ఇలాంటివి మామూలేనని, తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు.
ప్రమాదాన్ని చిన్నది చూపే ప్రయత్నాల్లో భాగంగానే స్పాట్ దగ్గరకు ఎవరిని వెళ్లనీయలేదని చెబుతున్నారు. పెద్ద బండరాళ్లు పడిపోవడంతో చాలా మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనపడుతోంది. కొండచరియలు విరిగిపడటంపై మీడియా ప్రతినిధులు హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఆస్కారముందని దుర్గ గుడి అధికారులను మీడియా ప్రతినిధులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం దసరా తర్వాత చూస్తామని నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు సమాచారం.