నిమ్మగడ్డ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈసీకి సహకరించాలని ప్రభుత్వానికి సూచన
posted on Oct 21, 2020 @ 5:27PM
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.
స్ధానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది.
విచారణలో ఎన్నికల సంఘం వాదనలు తప్పుబట్టిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. ఇప్పటికే 39 లక్షల నిధులకు ప్రభుత్వం విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు. ఇక, ఎన్నికల నిర్వహణకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించలేదని అన్నారు. అయితే, ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యలను.. హైకోర్టు ఆక్షేపించింది. ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా? అని ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.