'సైకిల్'.. ఏ పార్టీ గాలి తీస్తుంది?
దుబ్బాకలో టీడీపీ పోటీ లేకపోవడంతో బయపడిన బీజేపీ
అందరి చూపూ.. సెటిలర్ల ప్రాంతాల వైపే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు? గతంలో రెండవ స్థానంలో నిలిచిన టీడీపీ సైకిల్, ఇప్పడు ఏ పార్టీ గాలి తీయనుంది?.. ఇదీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న చర్చ.
గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ సహా ఏపీ సీనియర్ నేతలంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినా ఆ పార్టీకి వచ్చింది ఒక్కటే సీటు. సంఖ్యాపరంగా ఒక్క సీటు మాత్రమే వచ్చినప్పటికీ.. టీడీపీ 4,39,047 ఓట్లతో 13.11 శాతం ఓట్లు సాధించడాన్ని విస్మరించకూడదు. విడిగా పోటీచేసిన బీజేపీ 3,46,253 ఓట్లతో 10.34 శాతం సాధించింది. కాంగ్రెస్ 3,48,388 ఓట్లతో 10.4 శాతం సాధించింది. ఇక గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్‌ఎస్ 14,68,618 ఓట్లతో 43.35 శాతం సాధించింది. తెరాసకు పరోక్ష మిత్రపక్షమైన ఎంఐఎం 5,30,812 ఓట్లతో 15.85 శాతం సాధించింది. ఇవీ గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు, ఓట్ల శాతం వివరాలు.
తెరాస, మజ్లిస్ తర్వాత మూడోస్థానంలో నిలిచిన టీడీపీ.. ఇప్పుడు అత్యంత బలహీనంగా మారింది. చంద్రబాబు చేతులెత్తేయడంతో, 90 స్థానాలకే ఆ పార్టీ పోటీ పడుతోంది. అంటే కేవలం ఉనికి కోసమే టీడీపీ పోటీ చేస్తుందన్నది సుస్పష్టం. పైగా ఆ పార్టీ నాయకత్వం, అభ్యర్ధులకు నయాపైసా నిధులిచ్చే పరిస్థితిలో లేదు. అయితే, సీమాంధ్రులున్న అన్ని డివిజన్లలోనూ అది పోటీ పడుతోంది. గత ఎన్నికల ప్రచారంతో పోలిస్తే, ఇప్పటి ఆ పార్టీ ప్రచారం నామమాత్రమే. ఇప్పటి ప్రచారసరళి పరిశీలిస్తే టీడీపీ 2-5 శాతం ఓట్లు తెచ్చుకునే అవకాశం మాత్రమే కనిపిస్తోంది. కమ్మ సామాజికవర్గం దాదాపు 25 డివిజన్లలో ప్రభావం చూపుతోంది.
వారు కాకుండా సెటిలర్లు మొత్తం నగరంలోని 35 నుంచి 40 డివిజన్లలో ప్రభావితం చూపించే అవకాశాలున్నాయి. ఇప్పటి పరిస్థితి ప్రకారం, కమ్మవర్గం గంపగుత్తగా తెరాసకే జైకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కాకుండా మిగిలిన సెటిలర్లు ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు? గతంలో టీడీపీకి పోలైన ఆ ఓట్లు ఇప్పుడు ఏ పార్టీ ఖాతాలోకి వెళతాయి? అసలు సైకిల్ గుర్తు, ఏ పార్టీ గాలి తీయనుందన్న చర్చ జరుగుతోంది.
దీనికి సంబంధించి రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఆసక్తికరంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ గత ఆరున్నరేళ్ల నుంచి సీమాంధ్రులతో సఖ్యతగానే ఉంటోంది. ఎక్కడా ఒక్క హింసాకాండ జరిగిన దాఖలాలు లేవు. పైగా ఆ పార్టీ కూడా నలుగురు కమ్మవారికి సీట్లిచ్చింది. ఈ కోణంలో చూస్తే, కమ్మ-సీమాంధ్రుల మొగ్గు తెరాస వైపేనని విశ్లేషిస్తున్నారు. కానీ, బీజేపీ కూడా కమ్మ వర్గం నేతలు, ఏపీ నేతలను ప్రచారంలోకి దింపింది. హిందూ-ముస్లిం భావోద్వేగ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా బీజేపీ చీఫ్ సంజయ్ యమా స్పీడుతో వెళుతున్నారు. సెటిలర్లు ఉన్న డివిజన్లలో, టీడీపీ వైపు మొగ్గుచూపే సెటిలర్లంతా తమకే ఓటు వేస్తారన్న అంచనా బీజేపీలో కనిపిస్తోంది. అయితే సెటిలర్లకు చెందిన యూత్ మాత్రం బీజేపీ వైపు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు కొన్ని డివిజన్లలో కనిపించింది.
కానీ, టీడీపీ ఓటర్లు బీజేపీ కంటే.. టీఆర్‌ఎస్‌తో పాటు, స్థానికంగా కొంతమేరకు కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలే, ఎక్కువ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. కారణం.. అమరావతి అంశంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందన్న భావన, గ్రేటర్‌లో నివసించే సీమాంధ్రులలో బలపడటమేనని వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం వల్ల తమకు వచ్చే నష్టం లేకున్నా, బీజేపీకి ఓటు వేయడం వల్ల అమరావతికి ద్రోహం చేసిన ఆ పార్టీని, మరింత ప్రోత్సహించినట్లవుతుందన్న భావన కనిపిస్తోంది. ప్రధానంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేట, మల్కాజిగిరిలో కొన్ని డివిజన్ల పరిశీలన సందర్భంగా, ఈ భావన స్పష్టంగా కనిపించింది.
అమీర్‌పేటలో టీఆర్‌ఎస్ అభ్యర్ధినిపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ, బీజేపీకి ఓటు వేయకూడదన్న భావనతో, ఆమెకే ఓటు వేయకతప్పడం లేదని పలువురు సెటిలర్లు చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలు సెటిలర్లు ఉన్న డివిజన్లలో వినిపిస్తున్నాయి. అయితే వీరంతా గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసే వారే కావడం ప్రస్తావనార్హం. ఈసారి టీడీపీ పోటీలోఉన్నప్పటికీ, తాము టీడీపీ బదులు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని చెబుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.
ప్రధానంగా... బీజేపీ-మజ్లిస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా, సెటిలర్లను టీఆర్‌ఎస్ వైపు చూసేలా చేస్తున్నట్లు.. వారి ఆందోళన బట్టి స్పష్టమవుతోంది. ఈ పరిస్థితి నగరంలో మతకలహాలు-ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉన్నందున, మళ్లీ టీఆర్‌ఎస్‌నే గెలిపిస్తే ఏ గొడవా ఉండదన్న భావనకు కారణమవుతున్నట్లు కనిపిస్తోంది. ‘ప్రశాంతతను కోరుకునే తమలాంటి వారికి ఈ యుద్ధం మాటలు భయపెట్టేలా ఉన్నాయ’ని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన మాధవి అనే 60 ఏళ్ల మహిళ వ్యాఖ్యానిందంటే.. బీజేపీ-మజ్లిస్ మాటల తీవ్రత, సెటిలర్లపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇక సీమాంధ్రులు నివసించే ప్రాంతాల్లో.. అమరావతికి మద్దతునిస్తున్నందుకు, కాంగ్రెస్‌పై కొంత సానుకూలత కనిపించింది. అమరావతి కోసం కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటం చే స్తుండటాన్ని, సెటిలర్లు మెచ్చుకుంటున్నారు. అయితే, ఈ పరిస్థితి మల్కాజ్‌గిరి, మలక్‌పేట, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, అంబర్‌పేట నియోజకవర్గాల్లో కనిపించింది. ఆ ప్రకారం చూస్తే.. గతంలో టీడీపీకి పోలయిన ఓట్లలో సింహభాగం టీఆర్‌ఎస్‌కు, కొంతభాగం కాంగ్రెస్‌కు పోలయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇప్పటి పరిస్థితి. అమిత్‌షా, నద్దా వంటి అగ్రనేతలు వచ్చినందున, మరి పోలింగ్ నాటికి పరిస్థితి మారుతుందేమో చూడాలి.
నిజానికి ఇప్పటి పరిస్థితి-పోటీని పరిశీలిస్తే బీజేపీ-టీడీపీ కలసి పోటీ చేసి ఉంటే.. ఎన్నికలు రసవత్తరంగా ఉండేవని, రాజకీయ విశ్లేషకులు చె బుతున్నారు. బీజేపీకి టానిక్‌లా మారిన దుబ్బాక ఉప ఎన్నికలో, టీడీపీ పోటీకి దూరంగా ఉంది. ఫలితంగా బీజేపీ కష్టంగానయినా 1100 ఓట్ల మెజారిటీతో బయటపడగలిగింది. ఒకవేళ టీడీపీ కూడా పోటీ చేస్తే, ఓట్లు చీలిపోయి టీఆర్‌ఎస్ సులభంగా గెలిచేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ విడిగా బరిలో దిగినందున, అది బీజేపీకి నష్టదాయకమేనని విశ్లేషిస్తున్నారు. అయితే కేవలం మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ తన విధానాన్ని మార్చుకోవడం అసాధ్యం. పైగా గ్రేటర్‌లో పొత్తు ప్రభావం ఏపీ రాజకీయాల్లో కూడా చూపే అవకాశం ఉన్నందుకే, పొత్తుల జోలికి వెళ్లనట్లు కనిపిస్తోందని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
-మార్తి సుబ్రహ్మణ్యం