గ్రేటర్ లో స్వింగ్ ఓటర్లే కీలకం! ఈసారి ఎటువైపో?
posted on Nov 27, 2020 @ 11:48AM
ఎన్నికల్లో స్వింగ్ అనే పదం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నికల్లో విజయానికి కీలకంగా ఉండే వాటిని స్వింగ్ అంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఏడు రాష్ట్రాలు కీలకంగా ఉంటాయి. అక్కడ ఎవరికి మెజార్టీ వస్తే వారే యూఎస్ ప్రెసిడెంట్ అవుతుంటారు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఆ ఏడు రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలు అంటారు. 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో స్వీప్ చేసి ట్రంప్ గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలు జోబిడెన్ కు జై కొట్టడంతో ఆయనే ప్రెసిడెంట్ పీఠం అధిష్టించారు.
అమెరికా తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ స్వింగ్ ఓటర్లున్నారని, వారే పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సమీకరణాలను అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకునే స్వింగ్ ఓటర్లు డివిజన్ లో 18 శాతం వరకు ఉంటారని చెబుతున్నారు. గ్రేటర్ లోని దాదాపు 60 నుంచి 70 డివిజన్లలో స్వింగ్ ఓటర్లే కీలకం. విద్యావంతులు, రాజకీయాలు, అభివృద్ధి అంచనా వేసేవారు, సమీకరణాలను చూసి గెలుపోటములు నిర్ధారించుకునే వారంతా స్వింగ్ ఓటర్ల జాబితాలో ఉంటారు. ప్రస్తుతం గ్రేటర్ లో ఈసారి రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల అభ్యర్థులకు స్వింగ్ ఓటర్లు ఎవరి పక్షాన ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటున్నాయి. ప్రలోభాలతో పోలయ్యే ఓట్లు కొన్నింటిని ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఆ తర్వాత సామాజిక వర్గాలు, కుల ప్రాతిపదికన, పథకాలకు ఆకర్షుతులు, ఏండ్ల తరబడి ఒకే పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్ల వారీగా వివరాలు సేకరించుకుంటూ గెలుపోటములను అంచనా వేసుకుంటారు. అయితే స్వింగ్ ఓటర్లను మాత్రం అభ్యర్థులు, పార్టీలు అంచనా వేయలేకపోతున్నాయి.
2016 గ్రేటర్ ఎన్నికల్లో స్వింగ్ ఓటర్లు మొత్తం అధికార పార్టీకి అండగా నిలిచారు. అందుకే కారు పార్టీ ఏకపక్ష విజయాలు సాధించి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకంగా 99 డివిజన్లు గెలుచుకుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రభావం గ్రేటర్ లో కనిపిస్తుందని, స్వింగ్ ఓటర్ల మైండ్ సెట్ లోనూ మార్పు వస్తుందని తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ వంటి స్కీంలు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను పెంచాయని చెబుతున్నారు. కార్పొరేటర్ల అవినీతి, అక్రమ వ్యవహారాలపై చాలా అయిష్టతతో ఉన్నారట స్వింగ్ ఓటర్లు. దీంతో స్వింగ్ ఓటర్లతో అధికార పార్టీకి కొంత ముప్పు ఉందని ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల వైపు స్వింగ్ ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. దీంతో వీరి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది సందేహంగానే మారింది. సికింద్రాబాద్ పరిధిలో స్వింగ్ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువుండే శేరిలింగం పల్లి ఏరియాలో కారుకు సపోర్ట్ చేయవచ్చంటున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్వింగ్ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీకి సమాన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.సెటిలర్ ఓటర్లు ఎక్కువుండే కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో స్వింగ్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికి ఫలితాలు వారికి అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.