గ్రేటర్ ఓటర్లకు భారీగా వరాలు! నిధులపై క్లారిటీ ఇవ్వని లీడర్లు
posted on Nov 27, 2020 @ 12:02PM
జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఓట్ల కోసం గ్రేటర్ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే హామీలు ఇవ్వడంలో పార్టీలు హద్దులు దాటుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు సాధ్యం కాని హామీలు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లోని హామీలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సిందే. దీంతో పార్టీల మేనిఫెస్టోలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ రద్దు ... చలాన్లు కట్టాల్సిన పనిలేదు.. విద్యుత్, నల్లా నీళ్లు బిల్లులు ఉండవు... ఉచితంగా ఇళ్లు కట్టిస్తాం... సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు టికెట్ ఉండదు.. కులాలవారీగా లబ్ధి కలిగిస్తాం... వరద బాధితులకు రూ. వేలల్లో పరిహారం. ఇవీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు. ఒక పార్టీ నెలకు 20 వేల లీటర్లు ఉచితం అంటే మరో పార్టీ 30 వేల లీటర్లు ఉచితమని ప్రకటించింది. ఇంకో పార్టీ నల్లా బిల్లే కట్టాల్సిన పనిలేదని చెబుతోంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనులను కూడా తామే చేస్తామంటూ పోటీలు పడి వరాలు కురిపిస్తున్నాయి పార్టీలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను బల్దియా ఎలా చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎప్పుడు లేనంతగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి హీట్ పుట్టిస్తున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రధాన పార్టీలు ఎడాపెడా హామీలిచ్చేస్తున్నాయి. అయితే చలాన్ల రద్దు, మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు, వరద సాయం రూ. 50 వేలు లాంటి హామీలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా వరద సాయం కింద బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఇస్తామని, రూ. 25 వేలు ఇస్తామని పార్టీలు చెబుతున్న మాటలు ప్రజల్లో ఆశలు రేపుతున్నా అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. గ్రేటర్ బడ్జెట్ పరిధి ఎంత, ఈ ఉచిత హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెచ్చి నెరవేరుస్తారనే ప్రశ్నలకు రాజకీయ పార్టీల దగ్గరే సమాధానమే ఉండటం లేదు.
గ్రేటర్ లో రూ. 10 వేల కోట్ల ప్రత్యేక నిధి, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత విద్యుత్, ఆస్తిపన్ను రద్దు, ఎల్‌ఆర్‌ఎస్ రద్దు లాంటివి అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే జీహెచ్‌ఎంసీ తరఫున ఎలా చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర సర్కార్ పరిధిలో ఉంటాయి. అయితే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామనే హామీలు కూడా కొన్ని పార్టీలు ఇస్తున్నాయి. కేంద్ర సర్కార్ పరిధిలోకి వచ్చే అంశాలు, అక్కడి నుంచి వచ్చే నిధులు కూడా నేరుగా జీహెచ్‌ఎంసీకి వచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో హామీలు ఎలా అమలు చేస్తారన్న అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. హామీలు ఇవ్వడంలో తప్పు లేదు కాని.. ఇలా తమ పరిధిలో లేని అంశాలు, సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేయడం సరికాదనే అభిప్రాయం మేధావులు, ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.