ఒవైసీ చెబితేనే వారిని వెళ్లగొడరాతా?

రోహింగ్యాలను తరిమే బాధ్యత కేంద్రానికి లేదా?   అమిత్‌షా కొత్త షరతు   ఆయన భారతదేశ హోం శాఖామంత్రి. అయినా ఆయన కూడా ఒక పార్టీకి నాయకుడే. అందుకే రోహింగ్యాలపై, ఒవైసీని అడ్డుపెట్టి చేసిన వ్యాఖ్య సగటు భారతీయుడికి నచ్చలేదు. ‘బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని ఒవైసీని లిఖితపూర్వకంగా రాసివ్వమనండి. కేంద్రప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూపిస్తా’మన్నది  హోంమంత్రి అమిత్‌షా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్య. ఇది ఆయన కేంద్ర హోంమంత్రిగా విధించిన షరతా? లేక సవాలో అర్ధం కాలేదు.   అమిత్‌షా బీజేపీ నేతగా, ఆ పార్టీ ప్రచారకర్తగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు. కానీ, ఆయన బాధ్యతాయుతమైన హోంమంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నారు. కాబట్టి, ఆయన నుంచి అలాంటి వ్యాఖ్యలు ఏ భారతీయుడూ ఆశించలేడు. అలా  ఒవైసీ లేఖ రాస్తేనే పరాయిదేశస్తుల సంగతి తేలుస్తామని చెప్పడాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. చివరకు బీజేపీకి ఓటేయాలని పిలుపునిస్తున్న కరుడుకట్టిన హిందుత్వవాదుల సహా!   పాతబస్తీలో ఇటీవలి కాలంలో అయితే రోహింగ్యాల కదలిక, ఆవాసం పెరిగింది. కానీ బంగ్లా, పాకిస్తానీలు దశాబ్దాల నుంచి పాతబస్తీలో నివసిస్తున్నారు. వారికి వీసాలు ముగిసి దశాబ్దాలయిపోయింది. ఇదే బీజేపీ అగ్రనేత నల్లు ఇంద్రసేనారెడ్డి, బీజేవైఎం జాతీయ నేతగా ఉన్న ఇప్పటి కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఆ అంశంపై అనేక ఆందోళనలు నిర్వహించిన విషయం, అప్పట్లో గుజరాత్ నేతగా ఉన్న  అమిత్‌షాకు గుర్తుందో లేదో తెలియదు. 1989-2000 మధ్యకాలంలో  , ప్రధానంగా ఇంద్రసేన్-కిషన్,  కాంగ్రెస్-టీడీపీ హయాంలో ఆ అంశంపై భారీ ఆందోళనలు నిర్వహించారు. ఆ సంద ర్భంలో వారు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని దునుమాడారు. అసెంబ్లీలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో తిష్టవేసిన 25 వేలమంది చొరబాటుదారులను తరిమివేయాలని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు వాళ్లంతా పెద్ద నాయకులపోయి.. మర్చిపోయినా, అప్పట్లో వారి కార్యక్రమాలకు హాజరయిన మాలాంటి జర్నలిస్టులకు  మాత్రం ఇంకా గుర్తుంది. అదీ..      నగరంలో బంగ్లా, పాక్ దేశీయుల అడ్డాకు సంబంధించిన పాత కథ.   ఇప్పుడు అమిత్‌షా కేంద్ర హోంమంత్రిగా రోహింగ్యాలు, బంగ్లాల గురించి చేసిన వ్యాఖ్యలు మరి... భాజపేయులు సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? అన్నది వారికి సంబంధించిన వ్యవహారం. కానీ సగటు భారతీయుడిగా.. ఒవైసీ లేఖ ఇస్తేనే, రోహింగ్యా-బంగ్లాదేశీయుల పనిపడతామనడాన్ని ఎవరూ స్వాగతించరు. ఇది మనం మనుషులం అన్నంత నిజం! ఎందుకంటే విదేశీయులు దేశంలో ఏ మూల అక్రమంగా చొరబడినా వారిని ఏరివేసే బాధ్యత కేంద్రానిదే. అందుకు ఏ ఎంపీ-ఏ ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అలాగైతే కాశ్మీర్‌లో ముఫ్తీ అండ్ కో లేఖ తీసుకుని, వారి అనుమతి మేరకే తీవ్రవాదులను ఏరివేస్తున్నారా? ఏ లేఖ రాశారని అమెరికా బిన్‌లాడెన్‌ను వెంటాడి చంపింది? ఏ లేఖ రాశారని పాక్ ముష్కరులను మన జవాన్లు మట్టుపెడుతున్నారు?   అమిత్జీ చెప్పినట్లు.. లోక్‌సభలో ఒవైసీ అనే ‘దేశభక్తుడు’ రోహింగ్యాలు-బంగ్లాదే శీయులకు దన్నుగా అరచిగోలచేయవచ్చు. అంతమాత్రాన కేంద్రం, తనకు కావలసిన బిల్లులు అలాంటి అరుపుల మధ్యనే ఆమోదించుకోవడం లేదా? విపక్షాలు అడ్డుకున్నాయని చెప్పి బిల్లులను వెనక్కి తీసుకోవడం లేదు కదా? అసలు హైదరాబాద్ పాతబస్తీలో అనుమతిలేకుండా కొందరు, గడువుతీరిన మరికొందరు ఏళ్ల తరబడి తిష్టవేస్తుంటే, కేంద్రం ఎందుకు చోద్యం చూస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం విఫలమయితే,  కేంద్ర నిఘా దళాలు ఏమయ్యాయి? వారిని ఏరివేయకుండా కేంద్రాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఇవన్నీ  మెడపై తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహాలే.   మళ్లీ రోహింగ్యాల వద్దకు వెళదాం. పాతబస్తీలో రోహింగ్యాలపై  తెలంగాణ పాలకులు దయతలచి, ఉండటానికి గూడు కూడా ఇచ్చి పెద్దమనసుచాటుకున్నారు. బాలాపూర్ వద్ద 108 మంది రోహింగ్యాలకు.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ తాత్కాలిక షెల్టర్లు నిర్మించి, ఆ తాళాలు ఒక శుభముహుర్తం రోజున వారికి  చిరుకానుకగా అందించారు. ఆ చూడముచ్చటయిన లోకోత్తర దృశ్యాలు మీడియాలో చూసి దేశప్రజలు పులకించిపోయారు.ఇప్పుడు అదే రోహింగ్యాలు భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న కథనాలు మీడియాలో చూస్తున్నాం. మరి ఇట్టెట్రా అంటే ఇల్లంతా నాదే అన్న సామెత ఊరకనే వచ్చిందా? తొండముదిరితే ఊసరవెల్లి అవడం సహజమే కదా!   వీరంతా మయన్మార్‌లో జరిగిన ఘటనల తర్వాత, హైదరాబాద్‌కు చేరుకుని కష్టాలు పడుతుంటే, జమాతే ఇస్లామే హింద్ సంస్థ  చలించిపోయిందట. ఆ సంస్థ అభ్యర్ధనతో హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ 108 రోహింగ్యా  కుటుంబాలకు తాత్కాలిక షెల్టర్లు నిర్మించింది.  సరే ఆ తర్వాత వారికి రేషన్‌కార్డులు, అవీ కూడా ఇచ్చారనుకోండి. అది వేరే విషయం. దానితోవారు ఇప్పుడు యూట్యూబ్ చానల్ కూడా నడుపుతున్నారండోయ్. అదీ మయన్మార్ నుంచి పాతబస్తీకి వచ్చిన రోహింగ్యాల కథ! సరే.. నగరంలో ఉన్న 62 మంది రోహింగ్యాలపై కేసులు నమోదుచేశామని డీజీపీ కూడా ప్రకటించారు.   అంటే.. బీజేపీ దళపతి బండి సంజయ్ చెప్పినట్లు.. పాతబస్తీలో రోహింగ్యాలు తిష్టవేసినట్లు, దానికి పాతబస్తీలో సర్కారీమిత్రపార్టీలు సహకరిస్తున్నట్లు,  మెడమీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది. అమిత్‌షా చెప్పినట్లు.. సంజయ్ ఆరోపించినట్లు, పాతబస్తీలో రోహింగ్యాలు-బంగ్లాదేశీయులు తిష్టవేస్తే, ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారిమీద సర్జికల్‌స్టైక్ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే గుర్తుకురావడం ఏమిటి?   అమిత్జీ అంటే ఏదో ఎన్నికల కోసం వచ్చారు. మరి ఇక్కడే ఉండే కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగానే ఉన్నారు కదా? ఆయనెందుకు వారిని తరిమికొట్టేందుకు తన అధికారాలు వినియోగించలేదు? మజ్లిస్ ఎమ్మెల్యే చెప్పినట్లు.. పాతబస్తీకి ఒవైసీ సీఎం, అది మజ్లిస్ సామ్రాజ్యమే కావచ్చు. వారి అనుమతి లేకుండా ఎవరూ అటు వైపు వెళ్లలేకపోవచ్చు. కానీ కిషన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కదా? ఆయన తన అధికారాలు ఎందుకు వినియోగించడంలేదు? అన్నట్లు.. తాజా ఎన్నికల ప్రచారంలో.. ‘ మీరు లోక్‌సభకు బీజేపీకి వేసుకుని, లోకల్‌గా మాకు ఓట్లేయమని’ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఉత్తరాది ఓటర్లను కోరారు. శుభం!  ఏదైనా.. ఎవరికయినా,   అంతిమంగా కావలసింది అధికారమే కదా?  హమ్ సబ్ ఏక్ హై! భారత్‌మాతాకీ జై!! అంతేగా... అంతేగా!!! -మార్తి సుబ్రహ్మణ్యం

కొమరం భీం జిల్లాలో మరోసారి పులి పంజా.. తల్లి కళ్లెదుటే బాలికను కబళించింది.. 

తెలంగాణలోని కుమురంభీం జిల్లాలో ఈనెల 11న విఘ్నేశ్ అనే 19 ఏళ్ల యువకుడిని పులి పొట్టనపెట్టుకున్న సంగతి తెల్సిందే. తాజాగా నిన్న మరోసారి పులి తన తల్లి కళ్లెదుటే మరో బాలిక ప్రాణాలు తీసింది. పొలంలో పత్తిని ఏరుతున్న బాలికను ఆమె తల్లి, సోదరుడు, ఇతర కూలీలు చూస్తుండగానే దాడి చేసి ఈడ్చుకెళ్లింది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది.   కొండపల్లి శివారులోని అన్నెం సత్తెయ్య అనే రైతు పొలంలో పత్తి ఏరేందుకు నిర్మల (16), ఆమె తల్లి లక్ష్మక్క, సోదరుడు రాజేశ్, మరో ఏడుగురు కూలీలు వెళ్లారు. అయితే మధ్యాహ్నం వరకు పత్తి ఏరిన తరువాత వారిలో కొంతమంది భోజనానికి వెళ్లగా, నిర్మల, మరో స్నేహితురాలితో కలిసి చేనుకు మరో వైపున పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా వారిపై దాడిచేసిన పులి నిర్మలను నోట కరుచుకుని వెళ్లిపోయింది. దీంతో నిర్మల అరుపులు విని తోటి వారు అప్రమత్తమై కర్రలతో వెంట పడడంతో కొంతదూరం వెళ్లాక నిర్మలను వదిలిపెట్టి వెళ్లిపోయింది. అయితే తీవ్ర గాయాలపాలైన నిర్మల అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న డీఎఫ్ఓ శాంతారాం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదం గురించి అయన ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక ఎన్నికలకు కసరత్తు! జగన్ సర్కార్ దిగొచ్చినట్టేనా? 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వివాదానికి తెర పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై కొంత కాలంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో ఢీ అంటే ఢీ అంటున్న జగన్ సర్కార్... మెల్లగా  దిగొస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించకపోవడం.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కోర్టుల్లోనూ ఎదురు దెబ్బలు తగులుతుండటంతో చేసిది లేక ఎన్నికలకు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సంస్థ నిర్ణయాన్ని ధిక్కరించడం ఎక్కువ కాలం సాధ్యం కాదన్న అభిప్రాయానికి వచ్చిన జగన్ సర్కార్.. ఎన్నికలు పెట్టాలని నిర్ణయించిందని చెబుతున్నారు.    ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించిన ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధమని క్లారిటీగా చెప్పనప్పటికి.. ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకోవాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసినట్లే.. రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని  జగన్ సర్కార్  తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం  పంచాయతీ ఎన్నికలు  రెండు వారాల్లో నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు పూర్తవుతాయి. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. వాటిని అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంది. ఏపీలో చివరి సారిగా 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలను 21 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సారి రెండు వారాలకు కుదిస్తున్నారు. 14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీరాజ్‌ చట్టంలో చేసిన సవరణలపై ఆగస్టులో గవర్నర్‌ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బిల్లు పెట్టి ఆమోదించుకోవాలని నిర్ణయించారు.    ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ఆయన ప్రభుత్వానికి  లేఖలు రాస్తున్నారు. కాని సీఎస్ మాత్రం ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో సాధ్యం కాదని చెబుతూ వస్తోంది. ప్రభుత్వం సహకరించకపోవడంతో  నిమ్మగడ్డ  రమేశ్ కుమార్.. కలెక్టర్లతో నిర్వహించాల్సిన సదస్సులు రెండు సార్లు వాయిదా పడ్డాయి. సీఎస్ అనుమతి ఇవ్వకపోవడంతో ఎస్ఈసీ సమావేశానికి వచ్చేందుకు కలెక్టర్లు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు కూడా వెళ్లారు నిమ్మగడ్డ. ఈ వివాదం కొనసాగుతుండగానే.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు  జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.    మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు చేస్తూనే..  వాయిదా కోసం చేస్తున్న న్యాయపోరాటం కొనసాగించాలని జగన్ సర్కార్ భావిస్తుందట. హైకోర్టు తీర్పు మరోసారి తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందంటున్నారు. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు అవకాశం లేకుండా ఉండే విధంగా వీలైనంత కాలం సాగ దీసి.. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని అనుకుంటున్నారట. అక్కడ సానుకూల ఫలితం వస్తే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని,  లేకపోతే ఫిబ్రవరిలోనే నిర్వహించడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

కరోనా పుట్టింది భారత్ లోనట.. చైనా శాస్త్రవేత్తల వితండ వాదన.. నమ్మేదెవరు

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో పుట్టి దాదాపుగా ఒక సంవత్సరం పూర్తవుతోంది. ఇది అక్కడి జంతువుల నుండి మనుషులకు వ్యాపించిందని.. చైనా ప్రభుత్వం ఆ విషయాన్ని దాచి పెట్టడంతో అక్కడి నుండి ప్రపంచం మొత్తం వ్యాపించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే దీని పై మరో వాదన కూడా ఉంది. వూహాన్ లోని ఒక ల్యాబ్ లో ఈ ప్రాణాంతక వైరస్ ను తయారు చేసి ప్రపంచం మీదికి వదిలారని చైనా నుండి పారిపోయి వచ్చిన మరి కొంత మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వైరస్ మాత్రం చైనాలోనే పుట్టిందని అమెరికా తో సహా ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి.   అయితే తాజాగా చైనా శాస్త్రవేత్తలు మాత్రం కరోనా మహమ్మారి పుట్టుక మూలాలు భారత్ లో ఉండొచ్చంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. భారత్, బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ ఉత్పన్నమై ఉంటుందని వారు చెబుతున్నారు. 2019 డిసెంబరులో వుహాన్ లో కరోనా వ్యాప్తి మొదలు కాగా, అంతకుముందే భారత్, బంగ్లాదేశ్ లో ఈ వైరస్ ఉనికి వెల్లడైందని చైనాలోని షాంఘై ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు చెపుతున్నారు.   అంతేకాకుండా కొవిడ్-19 పుట్టింది తమ దేశంలో కాదనడానికి ఆధారాలు ఉన్నాయని.. 2019 వేసవిలోనే ఈ వైరస్.. జంతువుల నుంచి కలుషితమై నీటి ద్వారా మానవులకు సోకడం ద్వారా భారత గడ్డపైనే పుట్టిందని, చైనా పరిశోధకుల వాదన. వుహాన్ లో పుట్టిందే నిజమైన కరోనా వైరస్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వారి వితండ వాదన.   వైరస్ మూలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా వివిధ రకాల జన్యు ఉత్పరివర్తనాలను పరిశోధించడం ద్వారా ఫైలోజెనెటిక్ విశ్లేషణ కూడా చేపట్టామని వెల్లడించారు. 2019 వేసవిలో పాకిస్థాన్ వైపు నుంచి వీచిన వేడిగాలులతో భారత్ లో తీవ్రమైన నీటి సంక్షోభం ఏర్పడిందని, తత్ఫలితంగా జంతువులు, మానవులు ఒకే నీటిని తాగడంతో ఉద్భవించిన కరోనా వైరస్ రక్కసి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని షాంఘై ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు విశ్లేషించారు.   ఇది ఇలా ఉండగా ఈ చైనా పరిశోధకుల వాదనను భారత్ సహా ఇతర దేశాల్లోని పరిశోధకులు ఎవరూ ఏమాత్రం విశ్వసించడంలేదు. భారత ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేశ్ ఠాకూర్ షాంఘై ఇన్ స్టిట్యూట్ అధ్యయనంలోనివన్నీ తప్పుడు వాదనలేనని ఖండించారు. అంతర్జాతీయ నిపుణుడు డేవిడ్ రాబర్ట్ సన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు.   అయితే ఇంత ప్రాణాంతకమైన వైరస్ భారత్ లోనే కనుక పుడితే 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో దాని వ్యాప్తి చాలా తీవ్రంగా ఉండేది. దీంతో వూహాన్ కంటే ముందే భారత్ బలి అయ్యేది. అయితే 2019 డిసెంబర్ లో వూహాన్ లో ఈ వైరస్ వ్యాప్తి ప్రభావంతో అక్కడ తీవ్ర అలజడి రేగిన సంగతిని అంతర్జాతీయ సంస్థలు  కూడా గుర్తించాయి. ఇదే సమయంలో భారత్ లోని మొదటి కేసు 2020 జనవరిలో నమోదైంది. కరోనా సోకిన ఒక విద్యార్థిని వూహాన్ నుండి కేరళకు తిరిగి రావడంతో తొలి కేసు నమోదైంది.    దీనికి తోడు చైనా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చైనీయులు మొన్న జనవరిలో తమ దేశానికీ వెళ్లి మళ్ళీ తిరిగి రావడంతో ఇటలీ వంటి దేశాలలో ఈ వైరస్ విలయతాండవం సృష్టించడంతో వేలాది మంది చనిపోయిన సంగతి ప్రపంచం మొత్తం చూసింది. అంతేకాకుండా ఈ వైరస్ గురించి చైనా ప్రపంచాన్ని ఏమాత్రం అప్రమత్తం చేయలేదని మొన్నటి వరకు దాని మిత్ర దేశం గా ఉన్న ఆస్ట్రేలియా తో సహా ప్రపంచ దేశాలన్నీ గట్టిగా నమ్ముతున్నాయి. దీంతో ఈ చిక్కుల నుండి బయట పడేందుకు చైనా ఆ పాపాన్ని భారత్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ పుట్టుక గురించి ప్రపంచ దేశాల వద్ద ఇంత స్పష్టమైన సమాచారం ఉండగా చైనా చేస్తున్న ఈ జిమ్మిక్కులను నమ్మేదెవరు.. 

బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలా? గ్రేటర్ సభలో కేసీఆర్ 

హైదరాబాద్ అభివృద్ధి కోసం మరోసారి టీఆర్ఎస్ ను గెలిపించాలని గ్రేటర్ ఓటర్లను కోరారు సీఎం కేసీఆర్. వంచకులు, మోసగాళ్ల జిమ్మిక్కులకు మోసపోవద్దని సూచించారు. రెచ్చగొట్టే మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు కేసీఆర్. ఏదైనా తేడా జరిగితే భూముల విలువలు పడిపోతాయని, వ్యాపారాలు పోతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. గతం కంటే ఐదారు సీట్లు ఎక్కువ గెలిపించాలని, కేంద్రం మెడలు వంచి డబ్బులు తెచ్చి హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.   వరదలతో నష్టపోయిన హైదరాబాద్ కు సాయం చేయాలని అడిగితే కేంద్రం పైసా కూడా ఇవ్వలేదని కేసఆర్ ఆరోపించారు. ఇప్పుడు ఓట్ల కోసం కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వరదల్లా వస్తున్నారని విమర్శించారు. ఒక బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంత మంది వస్తారా?, దేశం కోసం, ప్రజల మంచి కోసం మాట్లాడటం తప్పా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 30 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు?. బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను, బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఎందుకు అమ్ముతున్నారు?. యూపీలోనే సక్కగ లేదు, ఆ రాష్ట్ర సీఎం వచ్చి మనకు చెప్తాడా?. 28వ ర్యాంకర్‌ వచ్చి 5వ ర్యాంకర్‌కు చెబుతాడా?. బీపాస్‌ కావాలా?.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించండని కేసీఆర్ చెప్పారు.     ఎన్నికల్లో ఓటేసే ముందు నేతల పనితీరును ప్రజలు ఆలోచించుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరమని చెప్పారు. ఎన్నో మంచిచెడులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభిస్తే సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం అంధకారమవుతుందని కొంతమంది, నీళ్లు రావని మరికొంతమంది శాపాలు పెట్టారని ఆక్షేపించారు. ఇన్ని అనుమానాలు, అపోహల మధ్య తెరాస పార్టీని నమ్మి దీవించి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజల సహకారం ఉంటే రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 24 గంటలూ నీరిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. పేదలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా నీరు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా చేస్తుందని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ సూపర్‌హిట్‌ పథకమని, రైతుబంధు దేశంలో ఎక్కడా లేదన్నారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా.. సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఏటా రూ.42వేల కోట్లకు పైగా సంక్షేమానికి కేటాయిస్తున్నామని తెలిపారు.

గ్రేటర్ ఎన్నికల్లో అమరావతి ప్రభావం! కొన్ని పార్టీలకు టెన్షన్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కీలకంగా మారిందా? అమరావతి అంశమే గెలుపోటములను ప్రభావితం చేయబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణలో పెద్దగా చర్చ జరగకపోయినా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రచారాస్త్రాలుగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అమరావతి అంశం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతి అంశం ఇప్పుడు కొన్ని పార్టీలను షేక్ చేస్తుందని చెబుతున్నారు.    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాజధాని అమరావతి అంశమే ప్రభావితం చూపిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు అమరావతి అంశం ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, ఏఎస్ రావు నగర్, సనత్ నగర్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో.. ఓట్ల కోసం తమ దగ్గరకు వస్తున్న బీజేపీ నేతలను అమరావతి పై ప్రశ్నిస్తున్నారట ఆంధ్రా ఓటర్లు. అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలనే విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని కోరుతున్నారట. అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రధాని మోడీ చేతుల మీదుగానే జరిగింది.  కాని ఇప్పుడు అమరావతిని మార్చే  ప్రయత్నాలు జరుగుతున్నా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు. ఏపీ బీజేపీ నేతలు అమరావతికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నా... కేంద్ర సర్కార్ మాత్రం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందంటూ కోర్టుల్లో అఫిడవిట్లు వేస్తోంది. దీనిపై ఆంధ్రా ఓటర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.    తమ దగ్గరకు ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను అమరావతి పై సూటిగానే ప్రశ్నిస్తున్నారు సీమాంధ్ర  ఓటర్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే  ఉంటుందని ప్రధాని మోడీ ప్రకటన చేస్తే తామంతా గంప గుత్తగా ఓట్లు వేస్తామని బీజేపీ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఓటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కమలనాధులు ముఖం చాటేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ లో ప్రచారానికి వచ్చిన ఏపీ బీజేపీ నేతలను కొందరు ఓటర్లు అమరావతిపై గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాము కూడా అమరావతికి మద్దతుగానే ఉన్నామని, కేంద్ర సర్కార్ నిర్ణయానికి తమకు సంబంధం లేదని కొందరు బీజేపీ నేతలు నచ్చచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే అమరావతి మద్దతుగా కేంద్రం నుంచి  ప్రకటన వస్తేనే తాము సపోర్ట్ చేస్తామని కొందరు సెటిలర్ ఓటర్లు కమలం నేతల ముఖాల మీదనే నేరుగా చెప్పేసినట్లు చెబుతన్నారు.   నిజానికి గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లో  సెటిలర్లు తమకు మద్దతుగా నిలుస్తారని బీజేపీ భావించింది. అయితే ప్రచారంలో తమకు ఎదురవుతున్న అనుభవాలతో వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. సీమాంధ్ర ఓటర్ల నుంచి వస్తున్న స్పందనను కొందరు అభ్యర్థులు పార్టీ ముఖ్య నేతలకు చెప్పారట. అమరావతికి అనుకూలంగా పోలింగ్ లోపు ప్రకటన చేస్తే పార్టీకి భారీగా ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారట. కాని అది కేంద్రం పరిధిలోని అంశం కావడంతో తాము ఏమి చేయలేకపోతున్నామని తెలంగాణ బీజేపీ నేతలు అభ్యర్థులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి అంశం తమ కొంప ముంచేటట్టు ఉందనే ఆందోళన సెటిలర్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లో పెరుగుతుందని తెలుస్తోంది.   అమరావతి అంశం కీలకంగా మారడంతో టీఆర్ఎస్ కూడా దానిపై ఫోకస్ చేసింది. ఎన్నికల ప్రచారంలో, ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడుతున్న మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.. కేంద్రాన్నివిమర్శిస్తూ ఏపీ అంశాలను ప్రస్తావిస్తున్నారు. గత ఏరేండ్లుగా మోడీ సర్కార్ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని ఆరోపిస్తూ.. అమరావతి నిర్మాణానికి కూడా చిల్ల గవ్వ ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ తట్టెడు మట్టి.. చెంబెడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. సీమాంధ్రుల ఓట్ల కోసమే కేటీఆర్ ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి ఏపీ రాజధాని అమరావతి అంశంపై గుర్రుగా ఉన్న సెటిలర్లు.. గ్రేటర్ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సెటిలర్ల ఓట్ల ప్రభావం దాదాపు 40 డివిజన్లలో ఉండటంతో.. వారి స్టాండ్ ఏంటో తెలియక పార్టీలు కూడా కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  సెటిలర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరీ..

భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనల తీరుతెన్నులను పరిశీలిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇవాళ హైదరాబాదులోని భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ హకీంపేట వాయుసేన విమానాశ్రయం నుంచి నేరుగా భారత్ బయోటెక్ క్యాంపస్ కు వెళ్లారు. అక్కడ ప్రధాని పరిశోధనలపై సమీక్ష నిర్వహించారు. అలాగే, భారత్ బయోటెక్ యాజమాన్యాన్ని, శాస్త్రవేత్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.   భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి పని చేస్తోందన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.   ఇప్పటికే ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. హైదరాబాద్ పర్యటన అనంతరం మోదీ పూణే బయల్దేరారు. పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను మోదీ సందర్శించనున్నారు.

హైదరాబాద్ రావాలంటే టీఆర్ఎస్ పర్మిషన్ కావాలా? బీజేపీదే గ్రేటర్ పీఠమన్న గరికపాటి

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు బీజేపీ సీనియర్ నేత గరికపాటి మోహన్‌రావు. బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ తీసుకుని హైదరాబాద్ రావాలా? అని ప్రశ్నించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకే అనుకూలంగా వస్తున్నాయన్నారు. గ్రేటర్ ఫలితం తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దృష్టి మరింత పెరుగుతుందని , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఖాయమని చెప్పారు గరికపాటి మోహన్‌రావు. ఆరేండ్లలో కేసీఆర్ చేసిన అవినీతితో తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు గరిక పాటి మోహన్ రావు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ముందు టీఆర్ఎస్ ప్రణాళిక తేలిపోయిందని కామెంట్ చేశారు. ఎంఐఎంకు ధీటైన జవాబు చెప్పగలిగేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లపై చేయి వేస్తే ఏమవుతుందో ఎంఐఎంకు అర్థం కావట్లేదని గరికపాటి మోహన్‌రావు హెచ్చరించారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్రలు నివేదికలు పంపలేదని విమర్శించారు.

జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నట్టా.. లేనట్టా! పవన్ ఎందుకు ప్రచారం చేయడం లేదు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తుపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. బీజేపీ నేతల కామెంట్లు, తెలంగాణ జనసేన నేతల కౌంటర్లతో రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. గ్రేటర్ లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని బీజేపీ నేతలు ప్రచారంలో చెబుతుండటంపై జనసేన సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీల మధ్య జరుగుతున్న తాజా పరిణామాలతో పొత్తు కొనసాగుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన వ్యవహారం మొదటి నుంచి గందరగోళంగానే ఉంది. సొంతంగానే పోటీ చేస్తామని ముందు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ చర్చలు జరపడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జనసేన నుంచి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా బీజేపీ అభ్యర్థులకు పడాలని చెప్పిన పవన్ కల్యాణ్.. బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే గ్రేటర్ ప్రచారం ముగుస్తున్నా ఎక్కడా ఆయన ప్రచారం చేయలేదు. గ్రేటర్ బరి నుంచి తప్పుకుని బీజేపీకి మద్దతు ఇచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కొందరు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలిశారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికతో బీజేపీ పెద్దలతో పవన్ కల్యాణ్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే జీహెచ్ఎంసీలో ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాని జనసేన చీఫ్ ప్రచారానికి దిగలేదు. గ్రేటర్ లో పవన్ ప్రచారం చేయకపోవడంతో ఢిల్లీలో బీజేపీతో జరిగిన చర్చలు సానుకూలంగా జరగలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సపోర్ట్ చేస్తున్నందున తిరుపతి సీటును తమకు కేటాయించాలని పవన్ కోరగా.. బీజేపీ అంగీకరించలేదని చెబుతున్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ప్రచారానికి రాకపోవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలే ఆయన ప్రచారానికి ఇష్టపడలేదని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటుపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తెరపైకి తెస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఫలితం చూపించవచ్చని కొందరు కమలం నేతలు అభిప్రాయపడ్డారట. జనసేన పొత్తుపైనే విమర్శలు వస్తున్నాయని, పవన్ ను ప్రచారానికి కూడా తీసుకువస్తే ప్రమాదమని మరికొందరు సూచించారని తెలుస్తోంది. అందుకే పవన్ ప్రచారానికి చేయడానికి సిద్ధమైనా.. తెలంగాణ బీజేపీ నేతలు వద్దని చెప్పారనే చర్చ జరుగుతోంది. జనసేన పొత్తు విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. ఎన్నికల రోడ్ షోలో మాట్లాడిన అర్వింద్.. తమకు ఎవరితోనూ పొత్తు లేదని ప్రకటించారు. జనసేన పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుని పోటీ నుంచి తప్పుకుందని చెప్పారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై జనసేనలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అర్వింద్ ప్రకటనపై అభ్యంతరాలు తెలుపుతూ జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ అగ్ర నేతలు, తెలంగాణ రాష్ట్ర నేతలు కోరితేనే ఎన్నికల్లో పోటీ నుంచి జనసేన పార్టీ తప్పుకుందని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు. జనసేన పార్టీపై అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండని అర్వింద్ కు సూచించారు. జనసైనికులను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు శంకర్ గౌడ్. ఎంపీ అర్వింద్ ప్రకటన తర్వాత జరుగుతున్న తాజా పరిణామాలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారని, బీజేపీకి మద్దతు విషయంలో వారంతా పునరాలోచించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. జనసేన ప్రకటన విడుదల చేసిన తర్వాత బీజేపీ ముఖ్య నేతలు అప్రమత్తమయ్యారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడి.. బీజేపీకి మద్దతుపై మరోసారి ప్రకటన చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

జాగ్రత్తగా మాట్లాడితే మంచిది! ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్

జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసిన ప్రకాశ్ రాజ్ కు కౌంటరిచ్చారు మెగా బ్రదర్ నాగేంద్రబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఏమి చేసినా తప్పు అనడం సరికాదన్నారు. దేశానికి అభివృద్ధి బీజేపీ, జనసేనతోనే సాధ్యమవుతోందన్నారు నాగబాబు . ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్లు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరని.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నాగబాబు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూటకు ఓ మాట మారుస్తున్నారని.. ఆయన ఓ ఊసరవెల్లి అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. పవన్ సోదరుడు నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ను బాగా చూసుకోండి.. మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో? రాములమ్మ ట్వీట్

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై దాడి పెంచింది ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి. రోజూ ఏదో ఒక అంశంతో గులాబీ నేతలను టార్గెట్ చేస్తున్న రాములమ్మ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సభపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ను ఎల్బీ స్టేడియం సభలోనే బాగా చూసుకోవాలని జనాలకు సూచిస్తూ ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో అంటూ సెటైర్లు విసిరారు. ‘నేటి సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒకసారి చూసుకోండి. మళ్లీ... ఎప్పుడు కనిపిస్తారో? ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యమే. సీఎం కేసీఆర్ ఇచ్చే కామెడీ వాగ్దానాల ద్వారా ప్రజలకు ఏదో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే... ఎప్పటిలాగే హామీల అమలు ఏమీ ఉండదని మనకు తెలిసిందే’ అంటూ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిపై కామెంట్ చేస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు.

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు!!

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంనగర్‌లో శనివారం జరిగిన  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఅర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలు తప్పవని అన్నారు.   మరోవైపు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, ఆ తరువాత ఆరు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల చూస్తోంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొని, నిజంగానే కేసీఅర్ ప్రభుత్వం కూలిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

ప్రధాని హైదరాబాద్ పర్యటన.. తనను అవమానిస్తున్నారన్న ఎంపీ రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్ర‌ధాని హకీంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకొని… అక్క‌డ నుండి నేరుగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ రూపొందించిన క‌రోనా వ్యాక్సిన్ "కోవాక్జిన్" పై సమీక్షకు వెళతారు. అయితే ఇది అధికారిక పర్యటన అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి రానవసరం లేదని ప్రధాని కార్యాలయం తెలియ చేసిన సంగతి తెల్సిందే.   అయితే తాజాగా ప్రధాని పర్యటించే ప్రాంత స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డి తనకు ఆహ్వానం లేకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌ధాని రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో స్థానిక ఎంపీ అయిన త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌టం స‌రైంది కాద‌న్నారు. స్థానిక ఎంపీకి తెలియ‌కుండా ఇటువంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టడం స‌రైంది కాద‌ని అయన లోక్ స‌భ స్పీక‌ర్ కు, కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రికి ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు. హాకీంపేట ఎయిర్ పోర్టుతో పాటు భార‌త్ బ‌యోటెక్ సంస్థ ఉన్న ప్ర‌దేశం అంతా మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వస్తుంది. వచ్చే లోక్ సభ సమావేశాల్లో తాను ఈ అంశాన్ని లేవనుత్తుతానని రేవంత్ స్పష్టం చేసారు.

సహనం కోల్పోయిన మిస్టర్ కూల్ సీఎం నితీష్.. తేజస్వి యాదవ్ పై ఫైర్ 

కొద్ది రోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికలలో ఎన్డీయే కూటమి బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో యువకుడైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎన్డీయే కూటమికి చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌.. సీఎం నితీష్ కుమార్ పై ఆరోపణలు చేయడంతో మిస్టర్ కూల్ సీఎం గా పేరున్న నితీష్ కుమార్ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాకుండా తేజస్వి యాదవ్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత ఏకంగా అబద్ధాలు ఆడుతున్నాడని నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో సీఎం నితీశ్ కుమార్‌పై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పదేపదే నిలదీశారు. దీంతో నితీష్ ఒక్కసారిగా తేజస్వియాదవ్‌పై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహంతో విరుచుకు పడ్డారు .   ‘‘ప్రతిపక్ష నాయకుడు నాకు సోదరుడి లాంటి స్నేహితుడి కుమారుడు కావడం వల్లే ఇప్పటి వరకు ఆయన చెప్పినదంతా ఓపికతో విన్నాను. తేజస్వి చెప్పినదంతా శుద్ధ అబద్ధం. నేను ఇంతకుమించి ఇంకేమీ మాట్లాడను. ఆయన తండ్రిని లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ను చేసిందెవరో తేజస్వికి తెలుసా? కనీసం ఆయనను డిప్యూటీ సీఎంను చేసిందెవరో తెలుసా? నాపై ఆరోపణలు చేస్తున్న ఆయన మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సమాధానం చెప్పలేరు కాబట్టి ఆయన సభ నుంచి బయటకు వెళ్లడమే మంచిది’’ అని తేజస్విపై విరుచుకుపడ్డారు. తనపై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తేజస్వి యాదవ్ పదే పదే లేవనెత్తడంతో ఊగిపోయిన నితిశ్ కుమార్.. తేజస్వికి ఈ విధంగా బదులిచ్చారు.

గ్రేటర్ లో కనిపించని కాంగ్రెస్ బడా నేతల హడావిడి.. కారణం అదేనా 

జీహెచ్ ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్, బీజేపీ, మ‌జ్లిస్ పార్టీలు సవాళ్ల మీద స‌వాళ్లు విసురుకుంటూ తీవ్రంగా వణికిస్తున్న చలిలో కూడా వాతారవరణాన్ని హీటెక్కిస్తున్నాయి. రాష్ట్రంలోని ఆయా పార్టీల ముఖ్యనేతలతో పాటు జిల్లాలలోని కేడర్ కూడా తరలి వచ్చి హైదరాబాద్ ఎన్నికలలో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ముఖ్య నాయకుల హడావిడి మాత్రం ఈ ఎన్నికలలో ఎక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా క‌నీసం న‌గ‌రానికి చెందిన కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా యాక్టీవ్‌గా క‌నిపించ‌క‌పోవ‌డం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా చెప్పుకునే చాలా మంది నేత‌లు ఈ ఎన్నిక‌ల్లో మొహం చాటేయడానికి చాలా కార‌ణాలే ఉన్నాయని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షా పదవి ఇస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన చర్చ సాగుతుండడంతో పార్టీలోని ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ర్వాత పీసీసీ ప‌ద‌వి క‌చ్చితంగా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ఆశ‌తో ఉన్న వారు.. ఇటు తాము ప్ర‌చారానికి రాక‌పోగా, అటు తమ అనుయాయులను కూడా ప్రచారంలో పాల్గొన‌కుండా చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని సమర్ధించేవాళ్లు కూడా ఈ ఎన్నిక‌ల్లో స‌హాయ నిరాక‌ర‌ణకు దిగార‌ని కాంగ్రెస్ వర్గాలలో ప్ర‌చారం జ‌రుగుతోంది.   ఇంకోవైపు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సరైన ఫ‌లితాలు రాక‌పోతే.. దాన్ని కూడా త‌మ‌కు అనుకూలంగా మలచుకునేందుకు ఇప్ప‌టి నుండే ఆయా నేత‌లు ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలలో ఏదైనా తేడా కొడితే.. అపుడు తాము గ్రేట‌ర్ బాధ్య‌తలు తీసుకొని ఉంటే క‌చ్చితంగా గెలిచేవాళ్ల‌మ‌ని… తమను కలుపుకు పోకపోవడంతో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా తయారైందని చెప్పుకునేందుకు పెద్ద తలాకాయలు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నార‌ట‌. గ్రేట‌ర్ ఎన్నిక‌లలో ఈ సోకాల్డ్ సీనియ‌ర్ నాయకులు అందుకే ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఎంతైనా పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్ మనకు తెలియనివా అని గొణుక్కుంటూనే పార్టీ కేడర్ మాత్రం తమ పని చేసుకుపోతున్నారు.

బండి, అక్భర్ పై కేసులు! హాట్ కామెంట్లపై పోలీసుల యాక్షన్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలపై పోలీసులు  కేసులు నమోదు చేశారు. సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజిక ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.    గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. ఇత పాతబస్తిలో జరిగిన ఓ  సభలో మాట్లాడిన ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ..   హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను నిర్మించారని, వాటిని కూల్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. అదే జరిగితే రెండు గంటల్లో దారుస్సలాం కూలిపోతుందని తీవ్రంగా స్పందించారు. వీరి సవాళ్లతో సామాజికంగా ఘర్షణలు రేకెత్తే ప్రమాదం ఉందంటూ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.

రాజకీయ గందరగోళంలో గబ్బర్ సింగ్! తమిళ పత్రిక సెటైర్లు

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ను గందరగోళ నేతగా అభివర్ణించింది తమిళనాడుకు చెందిన ఓ సాయంకాల దినపత్రిక.  ఆయనపై సెటైర్లు వేస్తూ తమిళ మురసులో ప్రత్యేక కథనం వచ్చింది. రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న అయోమయ నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు  ఆయనను ఇలానే అనుకుంటున్నారని ఆ పత్రిక రాసుకొచ్చింది. జనసేన పార్టీ ఆవిర్బావం నుంచి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పార్టీలతో పొత్తుల అంశాలను వివరిస్తూ.. పవన్ కల్యాణ్ ను గందరగోళవాదిగా చూపించే ప్రయత్నం చేసింది తమిళ మురసు సాయంకాల పత్రిక.  జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళంగా ఉంటున్నాయనే ప్రచారం జరుగుతోంది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. 50 డివిజన్లకు అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పారు. పార్టీ ఆఫీసులో గ్రేటర్ ఎన్నికల కోసం  హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ఈ వివరాలను కూడా తమిళ పత్రిక తమ కథనంలో పొందు పరిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ పార్టీ తొలుత నిర్ణయించిందని, అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్‌లను కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్నారని విమర్శించింది. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీకి జనసేన మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారని వివరించింది. అంతేకాకుండా, అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్టు పవన్ చెప్పారని ఆ పత్రిక తమ కథనంలో పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ కూటమిలో చేరిన పవన్ పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, ఆ తర్వాత మాయవతి నేతృత్వంలోని ఆ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చిందని, అనంతరం బీజేపీతో పవన్ సంబంధాలు పెట్టుకున్నారని కథనంలో పేర్కొంది. దీంతో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియని పవన్‌ను గందరగోళ రాజకీయ నేతగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారని తమిళ మురసు తన కథనంలో పేర్కొంది.  ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ కూడా తాజాగా పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ఫవన్‌ను.. ఫ్రకాష్‌రాజ్ ఫొగిడారా? తిట్టారా?

కన్నడిగుడయినా, విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ అచ్చ తెలుగులో ఊసరవెల్లి పదాన్ని బాగానే వాడారు. ఇంతకూ ఆయన ఆ పదప్రయోగం చేసింది ఎవరిపైనో తెలుసా? జనసేనాధిపతి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడికిందపడేసిన మన పవన్‌కల్యాణ్ గురించి! అవునా ప్రకాష్‌రాజ్ మన జనసేనాని గురించి అంతేసిమాటలన్నారా అని వెంటనే ఉడుక్కోకండి. కొద్దిగా పొడిగే ప్రయత్నం కూడా చేశారండీ! ఒక నాయకుడయి ఉండీ, ఆయనకో పార్టీకూడా ఉండీ, మరో పార్టీకి మద్దతునివ్వడం తనకు నచ్చలేదని కూడా చెప్పారు. అంటే ఆ లెక్కన కల్యాణ్‌బాబును నాయకుడిగా ప్రకాష్‌రాజ్ గుర్తించినందుకు, అన్నదమ్ములిద్దరితోపాటు, జనసైనికులు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం, తనను నిరుత్సాహపరిచిందని కూడా మనసులో మాట చెప్పారు. అంటే.. జనసైనికుల లెక్క ప్రకారం.. ప్రకాష్‌రాజ్, పవనన్నయ్యను పొగిడినట్లుగానే భావించాలి. గత ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ఎంతో తెలిసి కూడా, పవన్ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ప్రకాష్‌రాజ్‌కు సుతరామూ నచ్చలేదట. ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి. పవన్ కష్టాలు పవన్‌బాబువి మరి! అప్పటికీ రెండురోజులు ఢిల్లీలో అంతచలిలో కూడా, నద్దా గారి దర్శనభాగ్యం కోసం ఎదురుచూస్తే, రెండోరోజు ఆ భాగ్యం కలిగింది. ఆ భేటీలో పవన్ విశ్వరూపం ప్రదర్శించారని జనసైనికుల కథనం. ఏపీలో బీజీపీ బలం ‘పాయింట్ ఎయిట’న్న విషయాన్ని పవన్‌కు, ప్రకాష్‌రాజ్జ్ నొక్కివక్కాణించి మరీ గుర్తుచేయడమే ఏమీ బాగోలేదు. సరే.. పవన్‌కూ వేరే దిక్కులేదు. ఇప్పటికే అన్ని పార్టీలతో దోస్తానా అయిపోయింది. ఇక మిగిలింది బీజీపీనే. ఈ వయసులో ఆయన మాత్రం ఇంకా ఎన్నిపార్టీల చుట్టూ తిరుగుతారు చెప్పండి? అమరావతి, గ్రేటర్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక యవ్వారంలో, ‘కమలం’ తనను ‘పులుసులోముక్క’ను చేసి ఆడిస్తున్నా.. చేగువేరా టైపులో తిరగబడకుండా, చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితిపై ఎవరికీ చెప్పుకోలేని దైన్యం. అసలింతకూ ప్రకాష్‌రాజ్ బాధేమిటో అర్ధం కావడం లేదు. మా పవన్ ఎవరికి సపోర్టు చేస్తే ఆయనకెందుకు? గ్రేటర్ ఎన్నిక ల్లో పోటీ చేయాలని ఏదో తెలియక ఆవేశపడ్డారనుకోండి. తొందపడి ముందే కూసినట్లు, అభ్యర్ధుల పేర్లు కూడా ఎంపిక చేసే హడావిడి కూడా చేశారనుకోండి. అయినా జనసేనతో పొత్తు జాన్తానై అని, కమలదళపతి సంజయ్ చెప్పిన తర్వాత, సరే మీ ఇష్టమని గౌరవప్రదంగా చేతులెత్తేశారే అనుకోండి. అంతమాత్రాన.. ఒకప్పుడు టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు వచ్చేందుకు పోరాడిన, మా ‘ఆంధ్రా చేగువేరా’ను ప్రకాష్‌రాజ్ అంత అవమానిస్తారా? అయినా.. గ్రేటర్‌లో పోటీ చేయనందుకు పవనన్నయ్య ఫీలవ్వాలి గానీ, మధ్యలో ఈ ప్రకాష్‌రాజ్‌కెందుకు? అని జనసైనికులు తెగ ఫీలవుతున్నారట. పోనీలెండి.. పాపం పవన్ ప్రతాపం తెలియక, ఏదేదో మాట్లాడిన ప్రకాష్‌రాజ్‌ను క్షమించేద్దాం. ఓకేనా? -మార్తి సుబ్రహ్మణ్యం  

మీరు రానవసరం లేదు.. సీఎం కేసీఆర్ కు పీఎంవో ఝలక్

ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ కు ఆకస్మిక పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న మూడు ప్రముఖ సంస్థల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించి వ్యాక్సిన్ ట్రయల్స్ పురోగతి, అలాగే ఉత్పత్తి పై చర్చించనున్నారు. అయితే అయన హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ కు వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒకపక్క జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టిఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు కావడంతో ప్రధాని పర్యటన పై ఉత్కంఠ నెలకొంది   అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం నేడు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వస్తున్న ప్రధానికి స్వాగ‌తం ప‌లికేందుకు సీఎం కేసీఆర్ రాన‌స‌వ‌రం లేద‌ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) స‌మాచారం ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌ధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. అంతేకాకుండా హకీమ్ పేట విమానాశ్రయంలో ప్ర‌ధానికి స్వాగతం చెప్పడానికి ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చింది. వీరిలో హకీంపేట ఎయిర్‌ ఫోర్స్ ఆఫీస్‌ కమాండెంట్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతి మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది. పీఎంవో తాజా నిర్ణ‌యంపై ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాలు, అటు టీఆర్ఎస్ నేత‌లు అవాక్క‌య్యారు.   సాధార‌ణంగా ప్రధాని రాష్ట్రాల్లో అధికారిక పర్యటనకు వస్తే ఆ రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం ప‌లుకుతారు. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ స్వాగతం చెప్తార‌ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాని కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ అనూహ్యంగా సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయమే స్వ‌యంగా సందేశం పంపడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.