ఎంఐఎం బీజేపీ కలిసి టీఆర్ఎస్ ను ముంచేస్తాయా..!
posted on Nov 27, 2020 @ 4:53PM
గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే ఎంఐఎం, బీజేపీ పార్టీలు తమ ప్రచారంలో తీవ్ర భావోద్వేగాలు రేపుతున్నాయి. ఈ భావోద్వేగాల మధ్య ఓటర్లకు అయితే ఎంఐఎం లేదంటే బీజేపీ మాత్రమే కనిపించేటట్లుగా ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్, అటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ల నుండి ప్రజల దృష్టి మరల్చేలా రెండు పార్టీలు కూడబలుక్కుని వ్యవహరిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనికి బలమైన కారణం లేకపోలేదు. గతంలో హైదరాబాద్, తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఎంఐఎం గడచిన కొంత కాలంగా తెలంగాణ పక్క రాష్ట్రాలలోను, అలాగే నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాలలో పోటీ చేస్తూ అక్కడి ప్రతిపక్షాల ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ కి మేలు చేస్తోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్ ఎన్నికలలో ఎంఐఎం పోటీ చేసి 5 సీట్లు సాధించినప్పటికీ ఓట్లను చీల్చి ఆర్జేడీ కూటమికి అధికారాన్ని దూరం చేసి.. బీజేపీ కూటమి (ఎన్డీయే) కు లాభం చేకూర్చేలా వ్యవహరించింది.
తాజాగా పశ్చిమ బెంగాల్ లో కూడా ఇలాగే తమ రహస్య దోస్తీని కొనసాగించి తృణమూల్ ను దెబ్బ తీయాలని చూసిన బీజేపీ-ఎంఐఎం లకు ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అన్వర్ హుస్సేన్ పాషా రాజీనామా చేసి పెద్ద షాక్ ఇచ్చారు. అంతేకాకుండా అయన వెళ్తూ.. వెళ్తూ చేసిన ఆరోపణలు వింటే ఈ రెండు పార్టీల రహస్య స్నేహం గుట్టు బయటపడిపోయింది. "హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఎంఐఎం దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తోంది. మొన్న బీహార్ ఎన్నికలలో ఇదే జరిగింది. బెంగాల్ లో ఎంఐఎంకు ఆ అవకాశం ఇవ్వదల్చుకోలేదు. బెంగాల్ కు ఓవైసీ రావడానికి వీల్లేదు. రాజకీయాలను కేవలం మతం కోసం వాడుకునే ఒవైసి వంటి కొందరికి బెంగాల్లో ఎంత మాత్రం చోటు లేదు. అది కాషాయమైనా.. ఆకుపచ్చ అయినా ఒకటే" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల అసలు రంగును బయట పెట్టాయి.
ఇంతవరకు బీజేపీ ఎంఐఎం అంటే కేవలం మతతత్వ పార్టీలని... ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పు లాంటిదని సామాన్య జనం అనుకున్నారు. అయితే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికలతో పాటు ఇప్పటి జీహెచ్ఎంసీ ప్రచారంలో కూడా నువ్వెంత.. అంటే నువ్వెంత అని తీవ్ర విమర్శలు చేసుకుంటున్న బీజేపీ ఎంఐఎం ల అసలు లోగుట్టు ఇదనీ.. అంతేకాకుండా రేపు బెంగాల్లో కూడా జరగబోయేదీ ఇదేనని హుస్సేన్ నిరూపించారు. మతం పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెల్చి అధికారం చేపడుతున్న ఈ పార్టీల అసలు రంగు బయటపడడంతో ఇపుడు ప్రజలకు ఏ సాకులు చెపుతారో వేచి చూడాలి.