ycp leaders street fight

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. నడిరోడ్డుపై కొట్లాట.. 8 మందికి గాయాలు

అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మాటల యుద్ధం మరువక ముందే.. నేడు ద్వితీయ శ్రేణి నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చూస్తుండగానే ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి. కడప జిల్లా బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామానికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఓ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పిలవలేదంటూ గొడవ చెలరేగింది. ఆ వర్గం వారు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామకృష్ణారెడ్డి, యోగానంద్‌రెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపించారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

chandrababu slams jagan govt

బ్లీచింగ్‌, పారాసిటమాల్ అంటూ నిర్లక్ష్యం.. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం

టీడీపీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బ్లీచింగ్‌ చల్లి, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందంటూ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని.. చివరికి బ్లీచింగ్‌ పౌడర్‌లోనూ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో భూమాఫియా రెచ్చిపోతోందన్నారు. తిరుమల, సింహాచలం, విజయవాడ ఆలయాల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయల ఆస్తులు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, భవిష్యత్‌లో తగ్గిస్తామని చెప్పామని గుర్తుచేశారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం వంతపాడుతోందని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ తరుపున ప్రభుత్వం పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. అధికార అహంకారంతో ఎన్నికల అధికారిని తొలగించారన్నారు. రాజధాని తరలింపు విషయంలో సెలక్ట్‌ కమిటీపై మండలి చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ప్రశ్నించినవారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పీపీఈ కిట్లు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను హింసిస్తున్నారన్నారు. మీడియాపై చీకటి జీవో ఇచ్చారని, సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Chandrababu Speech in TDP Mahanadu 2020

కార్యకర్తలే టీడీపీకి బలం.. వారికి పాదాభివందనం

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం  కొనసాగనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు అధినేత చంద్రబాబు, నేతలు నివాళులర్పించారు.  టీడీపీ మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందన్నారు. 'సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు' అనే బాటలో నడిచాం. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి అన్నారు. టీడీపీ హయాంలో పేద, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషిచేశామని చెప్పారు. కరోనా కాలంలోనూ ఐటీరంగం వృద్ధి రేటు సాధిస్తోందంటే.. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. టీడీపీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి శ్రీకారం జరిగిందని చంద్రబాబు తెలిపారు.  కరోనా ఉధృతి కాలంలో ప్రజలు, టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో సహాయం అందించిన టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలం.. కార్యకర్తలకు రుణపడి ఉంటామని తెలిపారు. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు.. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి అని కొనియాడారు. ఈ ఏడాది టీడీపీకి గడ్డుకాలమని, టీడీపీని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు.  శారీరంకగా, మాససికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

upasana grandfather passed away

మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాస‌న తాతయ్య క‌న్నుమూత

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.  ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమ‌కొండ‌లో జ‌న్మించిన ఉమాప‌తి రావు ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా పని చేశారు. ఆయన మృతికి ఉపాసన ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత‌య్య కె.ఉమాపతి రావు(జూన్‌ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవత్వం గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత‌య్య‌’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్‌ చేశారు.

IndiGo Flier Who Landed in Coimbatore Tests Positive For Covid 19

ఇండిగో విమానంలో కరోనా రోగి.. 130 మంది క్వారంటైన్!

దాదాపు రెండు నెలల తరువాత దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కాగా, కరోనా పాజిటివ్ వ్యక్తి ప్రయాణం సాగించడం కలకలం రేపింది. ఈ ఘటన చెన్నై-కోయంబత్తూర్ ఇండిగో విమానంలో వెలుగుచూసింది. చెన్నై నుంచి కోయంబత్తూర్ నగరానికి వచ్చిన 6ఈ 381 ఇండిగో విమానం నుంచి దిగిన ప్రయాణికులను పరీక్షిస్తుండగా.. చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని కోయంబత్తూర్ లోని వినాయక్ హోటల్ కు తరలించి నిర్బంధంలో ఉంచారు. అనంతరం అతన్ని ఈఎస్ఐ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతనితో కలిసి ప్రయాణించిన 129 మందికి వైద్యపరీక్షలు చేయగా వారికి నెగిటివ్ వచ్చినప్పటికీ, వారందరినీ 14రోజుల పాటు హోం క్వారంటైన్ కు తరలించారు.  విమానంలో ప్రయాణికులంతా ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డు లు, గ్లౌజులు ధరించి అన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నారని, కరోనా బాధితుడికి సమీపంలో ఎవరూ కూర్చోలేదని ఇండిగో అధికారులు చెప్పారు. సేవలందిస్తున్న విమానాలను తాము క్రమం తప్పకుండా శానిటైజ్ చేస్తున్నామని, విమాన క్యాబిన్ సిబ్బందిని కూడా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ చేశామని ఇండిగో వెల్లడించింది.

Karnataka to open temples from June 1

జూన్ 1 నుంచి ఆల‌యాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్న‌ల్‌

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. భక్తులతో కళకళలాడే దేవాలయాలు రెండు నెలల నుంచి వెలవెలబోతున్నాయి. లాక్‌డౌన్‌ నుండి ఇప్పటికే చాలావాటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వాలు.. దేవాలయాలకు కూడా ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో, భ‌క్తుల‌కు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపింది. జూన్ 1 నుంచి ఆల‌యాలు తెర‌వ‌నున్న‌ట్లు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్రకటించింది. దీంతో, లాక్‌డౌన్‌ తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఆలయాలు తెరిచే విషయమై కర్ణాటక సీఎం యడియూరప్ప ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర మంత్రి కోటా శ్రీనివాస్‌ పూజారి మాట్లాడుతూ.. జూన్‌ 1 నుంచి ఆలయాలను తెరుస్తున్నట్లు ప్రకటించారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. బుధ‌వారం నుంచి 52 దేవాలయాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.

Dead bats create panic in Uttar Pradesh

యూపీలో తీవ్ర కలకలం.. కుప్పలు తెప్పలుగా చచ్చిపడిన గబ్బిలాలు

కరోనా వైరస్ గబ్బిలాల నుంచి వచ్చిందన్న వార్తలతో.. గబ్బిలాల పేరు వింటేనే ప్రజల్లో భయం పుడుతుంది. ఇక ఉత్తర్ ప్రదేశ్ ప్రజలైతే మరింత వణికిపోతున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి వుండటాన్ని చూసిన ప్రజలు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోరఖ్ పూర్ సమీపంలోని బేల్ గాట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు పడివుండటాన్ని చూసిన స్థానికులు.. కరోనా కారణంగానే అవి మరణించాయని భావించారు. ఈ వార్త ఆనోటా, ఈనోటా దావానలంలా వ్యాపించింది.  ఈసమచారం వెటర్నరీ అధికారులకు తెలియటంతో, వారు సైతం హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎండలు సగటుతో పోలిస్తే, చాలా ఎక్కువగా వున్న కారణంగానే గబ్బిలాలు చనిపోయాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు డివిజనల్‌ ఫారెస్ట్‌ హెడ్‌ అవినాష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉష్ణోగ్రత 46 డిగ్రీల వరకూ ఉందని, తాగేందుకు నీరు లేకనే అవి చనిపోయి వుండవచ్చని తెలిపారు. స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. చనిపోయిన గబ్బిలాలను తదుపరి పరీక్షల నిమిత్తం వెటర్నరీ రీసెర్చ్‌ ఇని‌స్టిట్యూట్ కు‌ పంపించామని తెలియజేశారు.

Locusts attack India

తెలంగాణ వైపు దూసుకొస్తున్న మిడతల దండు.. పొంచి ఉన్న భారీ ముప్పు

ఓ వైపు కరోనా వైరస్‌ తో పోరాడుతోన్న భారత్ కి మరో కష్టం వచ్చిపడింది. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తోంది. ఆ మిడతల దండు చాలా ప్రమాదకరమైంది. మిడతల దండు పొలంలో పడిందంటే ఇక ఆ పొలంలో ఏదీ మిగలదు. కొన్ని గంటల్లోనే పంటనంతా శుభ్రంగా ఆరగించేస్తాయి. లక్షలాది మిడతల దండు.. 30-40 వేలమందికి సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయి. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు అవి ఎంత ప్రమాదకరమైనవో. పాకిస్థాన్ నుంచి భారత్ కి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు, లక్షలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలపై వీటి ప్రభావం విపరీతంగా ఉంది. అయితే ఈ మిడతల ముప్పు తెలంగాణకూ పొంచి ఉంది. మిడతల దండు తెలంగాణ సమీపానికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఈ రాకాసి మిడతల దండు రాజస్థాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోకి ప్రవేశించింది. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తున్నాయని జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచి, చైతన్యవంతం చేయాలని అన్నారు. మరోవైపు, జూన్ లోగా దేశంలోకి వచ్చిన మిడతల సంఖ్య 400 రెట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, భారీ ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా మీద పోరాడోతోన్న ప్రభుత్వాలు.. ఇప్పుడు మిడతల దండుపై కూడా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి. 

High Court Notices to Nandigam Suresh and Amanchi Krishna Mohan

వైసీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

న్యాయమూర్తులపై ఇటీవల కొందరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు.. న్యాయమూర్తులను కించపరుస్తూ.. వారికి కులాలను, పార్టీలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. న్యాయమూర్తులపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది.  న్యాయమూర్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పై ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలోనూ, మీడియాలోనూ కోర్టు తీర్పులపై వివాదాస్పద వ్యాఖ్యల్ని క్షుణ్ణంగా పరిశీలించిన హైకోర్టు.. మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేసింది. వారిలో వైసీపీ నేతలు బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దీనిపై ఎంపీ నందిగామ సురేష్, ఆమంచి కృష్ణమోహన్ న్యాయమూర్తుల పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వారికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

telangana high court on corona tests

తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై హైకోర్టు అసంతృప్తి

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను  హైకోర్టు కొట్టివేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరీక్షలు ఎందుకు తక్కువ చేస్తున్నారని ప్రశ్నించింది. లక్షణాలు లేని హైరిస్క్ వ్యక్తులకు ఎందుకు పరీక్షలు చేయడంలేదని ప్రశ్నించింది.  ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చినవారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారో కోర్టుకు వెంటనే తెలియజేయాలని ఆదేశించింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను జూన్ 4 లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలు, అలాగే కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో, ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో కూడా జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

AP High Court Serious on Jagan Govt

జగన్ సర్కార్ పై  హైకోర్టు సీరియస్.. ప్రభుత్వం దివాళా తీసిందా?

ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని, దానిని అడ్డుకోవాలని కోరుతూ గుంటూరు కి చెందిన సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం దివాళా తీసిందా అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్తులు అమ్ముకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లాక్‌డౌన్ సమయంలో ఇంత అర్జెంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏంటని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

Cold war between MLA Roja and Deputy CM NarayanaSwamy

డిప్యూటీ సీఎంపై రోజా ఫైర్.. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారు?

ఎప్పుడూ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. ఈసారి సొంత పార్టీ నేతపైనే విరుచుకుపడ్డారు. అది కూడా ఏకంగా డిప్యూటీ సీఎం పైనే మండిపడ్డారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో పర్యటించారు. అంబేద్కర్ సంఘం తరపున దళితులకు కల్యాణ మంటప స్థల సేకరణ కోసం.. పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఈ కార్యక్రమానికి రోజాను పిలవకపోవడంతో.. తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో ఎలా పర్యటిస్తారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలిసికూడా.. తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని రోజా ఫైర్ అయ్యారు. తనను పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని రోజా ఆరోపించారు. గత కొంతకాలంగా నారాయణస్వామి, రోజాల మధ్య విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో నారాయణస్వామి స్వయంగా వెళ్లి రోజాతో మాట్లాడారట. అయినా, విభేదాలు ముదురుతూనే ఉన్నాయి. దానికి ప్రస్తుత ఘటనే సాక్ష్యమని అంటున్నారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో పర్యటించడం పై.. ఇప్పటికే రోజా.. డిప్యూటీ సీఎంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Supreme Court shock to LG Polymers Company

సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో ఎల్జీ పాలిమర్స్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించరాదంటూ ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్లాంట్ ని సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఎల్జీ పాలిమర్స్ విజ్ఞప్తి చేసింది.  అయితే, హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని ఆదేశించింది. ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాయని, ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీం కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై తాము తదుపరి విచారణ చేపట్టలేమంటూ ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.

జగన్‌ను క్రిస్టియన్ సీఎం అంటూ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను క్రిస్టియన్ సీఎంగా అభివర్ణిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.  తిరుమల శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని చూసిన టీటీడీ.. తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో తాత్కాలింకగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంపై సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉండకూడదని చాలాకాలంగా వాదిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. ఏపీ సీఎం జగన్‌ను క్రిస్టియన్ సీఎంగా అభివర్ణిస్తూనే.. ఒకరకంగా జగన్‌కు మద్దతుగానే ట్వీట్ చేశారు. "టీటీడీ భూముల వేలంపై ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ హిందువులు డిమాండ్ చేస్తున్నారు సరే. అయితే ఓ హిందూ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్రంలోని ఆలయాలన్నిటినీ ఆధీనంలోకి తీసుకుని, తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు కదా. మరి దాని సంగతి ఏమిటి? హిందూత్వ పట్టాలు తప్పిందా?" అని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు.

మంత్రి బాలినేని ఇంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు!.. ఆట మొదలైందా?

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరుతున్నారన్న వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి. తాజాగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంత్రి బాలినేని ఇంటికి వెళ్లి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీని వీడి అధికార పార్టీ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలు తుది చర్చల్లో భాగంగానే మంత్రి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్.. ఈరోజు సాయంత్రం లేదా రేపు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. వీరిబాటలోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పయనించనున్నారని సమాచారం.

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీ గూటికి కీలక నేత!!

దాదాపు రెండు నెలల‌ తరువాత ఏపీ గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ కీలక నేత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అతి త్వరలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా జిల్లాకు చెందిన మంత్రితో టచ్‌లో ఉన్న ఆయన.. పార్టీ మారడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు  వార్తలొస్తున్నాయి. టీడీపీ మహానాడును 27, 28 తేదీలలో నిర్వహించనుంది. మరోవైపు, వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మే 30 కి కరెక్ట్ గా ఏడాది పూర్తవుతుంది. కావున, అదే రోజున వైసీపీ లో చేరాలని లేదా అంతకంటే ముందే మహానాడు సమయంలో పార్టీని వీడి చంద్రబాబుకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారట. 2019 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీచినా, ప్రకాశం జిల్లాలో మాత్రం నాలుగు సీట్లు దక్కాయి. ముఖ్యంగా పర్చూరులో సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏలూరి గెలిచి సంచల‌నం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా, బరిలో దగ్గుబాటి ఉన్నా.. పర్చూరులో ఏలూరి గెలుపు జెండా ఎగురవేశారు. అలాంటి ఏలూరి ఇప్పుడు టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని వార్తలు రావడం.. టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. ఏలూరి అధికార పార్టీ వైపు చూడటానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వ్యాపారాలలో తీవ్ర నష్టాలు వచ్చాయని, చేసిన అప్పులు ఆయనను వెంటాడుతున్నాయని అంటున్నారు. ఆ అప్పుల తిప్పలు‌ పడలేకే ఆయన పార్టీ మారాల‌ని భావిస్తున్నారని సమాచారం. కాగా, ఏలూరి పార్టీ మారాలన్న ఆలోచన వెనుక మరో కారణం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న రామనాథంను త్వరలో తొల‌గించబోతున్నారని, ఆయన స్థానంలో చీరాల‌ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు స్వాముల‌ ను ఇన్‌ఛార్జిగా నియమించబోతున్నారని అంటున్నారు. స్వాములు ఇప్పటికే నియోజకవర్గంలో పట్టుసాధిస్తున్నారు. ఆయనను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తే.. వచ్చే ఎన్నికల‌ నాటికి తనకు తీవ్రమైన పోటీ అవుతారనే భావనలో ఉన్న ఏలూరి.. పార్టీ మారడమే మేల‌నే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల వరకు కేడర్ ని నిలుపుకొని, మళ్లీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడమంటే తలకు మించిన భారం. అదే ఇప్పుడే అధికారపార్టీలో చేరితే.. ఇప్పుడు వ్యాపారాలకు, అప్పుడు ఎన్నికల ఖర్చుకు డోకా ఉండదన్న భావనలో ఏలూరి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏలూరితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా వైసీపీ గూటికి చేరుతారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అతి త్వరలో తేలనుంది.